ఇద్దరూ ఇద్దరే !

ఇద్దరూ ఇద్దరే !

భారత మహిళా బ్యాడ్మింటన్‌కు రెండు కళ్ల లాంటి సింధు, సైనాలలో ఎవరు గొప్ప? సైనా ప్రత్యర్థిగా సింధు వరుసగా ఎందుకు ఓడిపోతూ వస్తోంది? అన్న ప్రశ్నలపై ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే వారిద్దరిని పోల్చడం ఏమాత్రం తగదని బ్యాడ్మింటన్‌ దిగ్గజాలు, విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్‌లో నిన్నటి వరకూ చైనా మాత్రమే సూపర్‌ పవర్‌. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌, జపాన్‌, తైవాన్‌ వంటి దేశాలు సైతం చైనా ఆధిపత్యానికి గండికొట్టి ప్రపంచ మేటిజట్లుగా గుర్తింపు తెచ్చుకొన్నాయి.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ తాజా ర్యాంకింగ్స్‌ ప్రకారం మొదటి పది మంది అత్యుత్తమ ప్లేయర్లలో భారత్‌కు చెందిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ఉన్నారు. సింధుకు ఆరో ర్యాంక్‌ లభిస్తే, సైనా నెహ్వాల్‌ తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతోంది.

ఇటీవల గౌహతీ వేదికగా ముగిసిన 83వ జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సైనా వరుస గేమ్‌ల్లో సింధును చిత్తు చేసి తన కెరియర్‌లో నాలుగోసారి జాతీయ టైటిల్‌ అందుకొంది. అంతేకాదు ఫేస్‌ టు ఫేస్‌ రికార్డుల్లో సైతం సింధు పైన సైనాదే పైచేయిగా కనిపించడంతో ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న అంశంపై మరోసారి చర్చకు తెరలేచింది. గోల్డ్‌కోస్ట్‌ వేదికగా ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్లో సైతం సింధుపైన సైనా విజయం సాధించడం, సింధు ప్రత్యర్థిగా సైనాకు 3-1 రికార్డు ఉండటంతో ఇది మరింత ఆసక్తికరంగా మారింది.

వీరిలో ఎవరు గొప్ప? అన్న విషయం పక్కనపెడితే ఈ ఇద్దరు స్టార్‌ షట్లర్లు భారత్‌కు సంపాదించిపెట్టిన అపురూప విజయాలు, సాధించిన పతకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్‌లో చైనా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సమయంలో సైనా తన సంచలన విజయాలతో ప్రపంచానికి భారత్‌ సత్తా ఏపాటిదో చాటి చెప్పింది. లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌లో రజత పతకంతోపాటు రెండుసార్లు కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన భారత తొలి ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ మాత్రమే. గత దశాబ్దకాలంగా భారత బ్యాడ్మింటన్‌కు అలుపెరుగని సేవలు అందించిన సైనా మరింత రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆడుతూ వస్తోంది. ఇటీవలే ముగిసిన ఇండోనీషియన్‌ మాస్టర్స్‌ టైటిల్‌తో పాటు జాతీయ సీనియర్‌ ట్రోఫీని అందుకొని సత్తా చాటింది.

మరోవైపు సైనాకు జూనియర్‌గా ఉన్న సింధు సైతం గొప్ప విజయాలే సాధించింది. రియో ఒలింపిక్స్‌, ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీలలో రజత పతకాలు సాధించిన సింధు కామన్వెల్త్‌ గేమ్స్‌లో సైతం రజత పతకం సంపాదించింది. చైనా ప్లేయర్లను ఓడించడంలో సింధు సైతం సైనాకు తీసిపోని విధంగా నిలిచింది.

బ్యాడ్మింటన్‌ టోర్నీలకే ఎవరెస్టు లాంటి ఆల్‌ ఇంగ్లండ్‌ టైటిల్‌ భారత జోడీ సైనా, సింధులను గత కొద్ది సంవత్సరాలుగా ఊరిస్తూ, ఉడికిస్తూ వస్తోంది. బర్మింగ్‌హోమ్‌ వేదికగా త్వరలో ప్రారంభ మయ్యే 2019 ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టోర్నీలో మాజీ రన్నరప్‌ సైనాతో పాటు క్వార్టర్‌ ఫైనలిస్ట్‌ సింధుకు సైతం క్లిష్టమైన డ్రానే వచ్చింది.

చైనీస్‌ తైపీ ప్లేయర్‌, ప్రపంచ టాప్‌ ర్యాంకర్‌ తాయ్‌ జు ఇంగ్‌, జపాన్‌ జోడీ నజోమీ ఒకుహర, యమగుచి, చైనా, థాయ్‌లాండ్‌, దక్షిణకొరియా స్టార్‌ ప్లేయర్ల నుంచి సింధు, సైనాలకు అసలు పరీక్ష ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు భారత బ్యాడ్మింటన్‌ ప్రధాన సలహాదారు, ప్రపంచ మాజీ చాంపియన్‌ డేనిష్‌; బ్యాడ్మింటన్‌ దిగ్గజం మార్టిన్‌ ఫ్రాస్ట్‌ మాటల్లో చెప్పాలంటే సైనా, సింధు ఇద్దరూ భారత బ్యాడ్మిం టన్‌కే గర్వకారణం.. ప్రపంచ బ్యాడ్మింటన్‌కు భారత్‌ అందించిన ఆణిముత్యాలు సైనా, సింధు. ఈ ఇద్దరూ సాధించిన విజయాలు చూసి మురిసిపో వాలే కానీ ఒకరితో ఒకరిని పోల్చిచూడటం అంటే సమయాన్ని వృధా చేయటమే తప్ప మరేదీ కాదు!

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *