‘సింహాచలం’ పుణ్యక్షేత్రం భక్తులకిది దివ్యక్షేత్రం

‘సింహాచలం’ పుణ్యక్షేత్రం భక్తులకిది దివ్యక్షేత్రం

‘సింహాచలం’ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి సమీపంలో ఉంది. ఇది అతి ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీ మన్నారాయణుని పది అవతారాల్లో నాలుగోది నృసింహావతారం. బాల భక్తుల్లో ప్రథమ గణ్యుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడేందుకు భవ్యమైన ఆవేశంతో ఆవిర్భవించిన అత్యంత విశిష్టమైన అవతారమిది. ఇక్కడ సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో సింహగిరిపై లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.

శ్రీమన్నారాయణుని పది అవతారాల్లో నాలుగోది నృసింహావతారం. బాలభక్తుల్లో ప్రథమ గణ్యుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడేందుకు భవ్యమైన ఆవేశంతో ఆవిర్భవించిన అత్యంత విశిష్టమైన అవతారమిది. ‘దుష్ట శిక్షణ శిష్ట భ్త రక్షణ’ అనంతరం ఆదిలక్ష్మీదేవీ వచ్చి ఆయనను చేరడంతో స్వామి లక్ష్మీనరసింహుడిడై, భక్తులకు కోరుకున్న వరాలందించే భక్తవత్సలుడై విలసిల్లినాడు.

ఆ దివ్య దేహంలో నాభి వరకు బ్రహ్మతత్వం, గళం వరకు విష్ణుతత్వం, అక్కడి నుండి శీర్షం వరకు శివతత్త్వం.. ఇలా అంతా కలిస్తేనే నరసింహ రూపం అని నారసింహ తత్వాన్ని మహర్షులు ఆవిష్కరించారు.

అష్టాదశ పురాణాలలో నృసింహ పురాణం విశిష్ఠమైనది. అన్నమాచార్యులు నృసింహస్వామి మీద అనేక కీర్తనలు రచించారు. శంకరాచార్యులు ‘లక్ష్మీనృసింహ కరావలంబమ్‌’ అనే స్తోత్రాన్ని రాశారు.

నరసింహస్వామి కరుణకు పాత్రులై ప్రహ్లాదుడు, పద్మపాదుడు, తరిగొండ వెంగమాంబ, యాదవ మహర్షి మొదలైనవారు సిద్ధినొందారు.

‘సింహాచలం’ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి దగ్గరలో ఉంది. అతి ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలలో ఇదీ ఒకటి.

సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో సింహగిరిపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి మహత్యం, ఈ స్థల ప్రాశస్త్యం గురించి మనం తెలుసుకుందాం.

రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధ శత్రువు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడైనాడు. తనకు బద్ధశత్రువైన విష్ణువుకు ప్రహ్లాదుడు భక్తుడు కావడాన్ని తట్టుకోలే హిరణ్యకశిపుడు తన సొంత కుమారుడినే చంపాలని నిర్ణయించుకొని ఈ పర్వతం పైనుండే సముద్రంలోనికి విసిరేశాడు. అప్పుడు ప్రహ్లాదుడు తన హృదయాంతరాల నుండి ‘నారాయణా’ అని గట్టిగా పిలిచాడు. ఆ ఆర్తనాదం వినగానే శ్రీహరి వరాహ అవతారంలో ప్రస్తుతం ఈ దేవాలయంలోని గర్భగుడి ఉన్న ప్రదేశంలోనే ప్రహ్లాదుణ్ణి రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి.

అప్పటి నుండి ప్రహ్లాదుడు సింహగిరి మీద వరాహనరసింహస్వామి విగ్రహాన్ని నెలకొల్పి ఆరాధించాడట. ఆ తరువాత కాలంలో చంద్ర వంశానికి చెందిన పృరూరవుడు ఈ వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని బయటికి తీయించి, దేవాలయం కట్టించాడని ప్రతీతి. ఇక్కడ వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే చందనం లేకుండా స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కలుగుతుంది.

ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ. 9వ శతాబ్దంలో జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే 11వ శతాబ్దంలో ఈ క్షేత్రం ప్రాచుర్యంలోనికి వచ్చింది. దీనిని 13వ శతాబ్దంలో తూర్పు గంగరాజులు పునరుద్ధరించారు.

గర్భగుడిలో స్వామి సంవత్సరమంతా లింగాకారంలో చందనంతో కప్పి ఉంటాడు. అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) నాడు మాత్రమే ఆ చందనాన్ని తొలగించి కొన్ని గంటల పాటు స్వామి నిజ రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. మరలా 120 కేజీల చందనంతో స్వామిని కప్పి ఉంచుతారు. ఈ పూతను తొలగించడాన్నే ‘చందనోత్సవం’ అని పిలుస్తారు.

నిజరూపంలో కనిపించే స్వామికి ముఖం వరాహరూపంలో, శరీరం మానవరూపంలో, వెనక సింహం తోక ఉండటం విచిత్రం. పాదాలు భూమిలో కప్పి ఉంటాయి.

శ్రీకృష్ణదేవరాయలు రెండు పర్యాయాలు సింహాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి సేవల నిమిత్తం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశారని, స్వామికి విలువైన ఆభరణాలు సమర్పించారని ఈ ఆలయంలోని శాసనాలు తెలియజేస్తున్నాయి. వారు సమర్పించిన ఒక పచ్చలహారం ఇప్పటికి ఈ ఆలయంలో ఉంది.

ఇక్కడ మూడంకెలతో స్వామికి ఏదో సంబంధం ఉందేమో అనిపిస్తుంది. ఎందుంటే స్వామివారికి చందనత్సోవం మూడవ తిథి నాడు నిర్వహిస్తారు; ఈ స్వామివారి పేరు 3 అక్షరాలు-అప్పన్న; పర్వతం పేరు 3 అక్షరాలు- సింహాద్రి; ఈ ఆలయంలో మూడు మండపాలున్నాయి. (భోగ, ఆస్థాన, నాట్య); ఈ పురాణ గాథ ముగ్గిరికి సంబంధించినది; మూల విరాట్టులో మూర్తులు ముగ్గురు- స్వామి వారి ముఖం వరాహరూపం, శరీరం నరరూపం, వెనక ఉన్న తోక సింహం జాతికి చెందినది.

సింహాచలంలో అర్చనా విధానాలు వైదిక విధానంలో ‘రత్నత్రయం’ మాదిరిగానే జరుగుతాయి. ఈ కొండ సింహం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం మిగిలిన అన్ని దేవాలయాల మాదిరి తూర్పు ముఖంగా కాకుండా పడమర ముఖంగా ఉంటుంది.

దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా ప్రాకారంలో కప్ప స్తంభం ఉంటుంది. దీన్ని సంతాన గోపాల యంత్రం మీద ప్రతిష్ఠించారు. ఇది అత్యంత శక్తిమంతమైనది. సంతానం లేని వారు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతాన ప్రాప్తి కల్గుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సింహాచలం కొండలలో గంగధార, ఆకాశ ధార, చక్రధార, మాధవధార అనే సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి. ఈ ధారలలోనే భక్తులు స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు. తలనీలాలు సమర్పించుకోవాలనుకున్న భక్తులు గంగ ధారలో స్నానం చేసి దైవదర్శనం చేసుకుంటారు.

ఇక్కడ స్వామివారికి కల్యాణం, రథోత్సవం, చందనోత్తరణం, చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, కరాళ చందనం, పవిత్రోత్సవం, డోలోత్సవం, నరసింహ జయంతి లాంటి పండగలు ఘనంగా జరుపుతారు.

ఎలా వెళ్లాలి ?

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల నుండి విశాఖపట్నం వెళ్లడానికి బస్సు, రైలు సదుపాయాలున్నాయి. హైదరాబాద్‌ నుండి విశాఖపట్నం వెళ్లేందుకు విమాన సౌకర్యం కూడా ఉంది. అక్కడి నుంచి సింహాచలం 15 కిలోమీటర్లు మాత్రమే. విశాఖపట్నంలో బస చేసేందుకు లాడ్జీలు, ¬టళ్లు చాలా ఉన్నాయి.

– ఎసవిఎస్ భగవానులు, విశ్రాంత డివిజనల్‌ ఇంజనీరు, ఎ.పి. ట్రాన్స్‌కో, ఒంగోలు, 9441010622

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *