సిద్ధార్థ – 1

సిద్ధార్థ – 1

1. బ్రాహ్మణ కుమారులు

బ్రాహ్మణ కుమారులు సిద్ధార్థుడు గోవిందుడు కూడా పెరుగుతున్నారు. ఇంటిపట్టున, ఏటివొడ్డున, అడవులలో, అశ్వద్ధవృక్షం కింద ఎక్కడవున్నా ఇద్దరు మైత్రితో కలసి మెలసి తిరిగేవారు. నదీస్నానాల వల్లనూ, అనుష్ఠానాలవల్లనూ, అగ్ని¬త్రాది కర్మల వల్లనూ సిద్ధార్థుని సుకుమార శరీరం కొంచెం నల్లపడింది.

ఇంటిలో తల్లి పాటలు పాడుతూ ఉండేది. తండ్రి పండితులతో తర్కవాదాలు జరుపుతూ ఉండేవాడు. మామిడితోటలో ఆడుకొంటూ ఉన్న సిద్ధార్థుని కళ్లముందు నీడలు మసలుతూ ఉండేవి. సిద్ధార్థుడు పండిత గోష్ఠులలో పాల్గొన్నాడు. గోవిందునితో వాద ప్రతివాదాలు జరిపాడు. అతనితో కలిసి ధ్యాన ధారణలు అభ్యసించాడు. మౌనంగా ఓంకారోచ్చారణ చేయడం అతనికి తెలుసు. ప్రణవాన్ని ప్రాణా యామంతో అనుసంధానం చేసినప్పుడు ముఖంలో ఆధ్యాత్మిక తేజస్సు తాండవించేది. అనశ్వరమైన విశ్వవ్యాప్తమైన ఆత్మను తన హృదయంలో దర్శించడం ఎలాగో అతనికి తెలుసు.

కుమారుడు తెలివిగలవాడనీ, జ్ఞానతృష్ణ గలవాడనీ తండ్రి ఆనందించేవాడు. గొప్ప పండితుడు, యాజ్ఞికుడు, బ్రాహ్మణులలో శ్రేష్ఠుడు కాగలడని ఆయన ఆశ. సిద్ధార్థుడు కూర్చున్నా లేచినా అతని శరీర సౌష్ఠవాన్ని, సౌకుమారాన్ని చూచి తల్లి గర్వించేది. సిద్ధార్థుడు నగరవీధులలో తిరుగుతూ ఉండగా అతని విశాలఫాలంలోనూ వెడదకన్నుల లోనూ రాచఠీవిని చూచిన బ్రాహ్మణ కన్యలు లోలోపల ప్రణయస్పందన పొందేవారు.

గోవిందునికి సిద్ధార్థుని యెడల అనన్యమైన ప్రేమ. అతని చూపులను, స్వచ్ఛోచ్చారణను, నడకలోని ఒయ్యారాన్ని మరీ ప్రేమించేవాడు. సిద్ధార్థుడు ఏమిచేసినా, చెప్పినా అతని బుద్ధిబలానికి, భావనైశిత్యానికి, దృఢ సంకల్పానికి, ఉదాత్త ప్రవృత్తికి గోవిందుడు మిక్కిలి మురుసుకొనేవాడు. సిద్ధార్థుడు సామాన్య బ్రాహ్మణుని వలె యాజ్ఞికవృత్తితో మాంద్యంగా కాలం గడుపుతూ, మంత్ర తంత్రాలతో ధనార్జన చేసుకుంటూ, పనికిమాలిన మాటల పసతో గర్విస్తూ, ఒక కపట పురోహితునిలాగా, మందలోని గొర్రెలమాదిరి కాబోడని గోవిందుడు గ్రహించాడు. తానైనా ఆ మూకలో ఒకడుగా ఉండడం గోవిందునికి సమ్మతం కాదు. తనకిష్టుడు పరమోత్తముడు అయిన సిద్ధార్థుని అనుసరించి ఉండాలని అతని వాంఛ. ఏనాటికైనా సిద్ధార్థునికి దివ్యత్వం సిద్ధించినప్పుడు అతని అనుచరుడు గాను, సేవకుడుగాను, అతని నీడగాను వెన్నంటి ఉండాలని గోవిందుని సంకల్పం. అందరూ సిద్ధార్థుని ఈ విధంగానే ప్రేమించేవారు. అందరికీ అతడు ఆనందాన్ని కల్పించేవాడు.

కాని సిద్ధార్థునికి మాత్రం సుఖమంటూ లేదు. వృక్షచ్ఛాయలలో సంచరించేవాడు. ధ్యాననిమగ్నుడై, తోటలో కూర్చునేవాడు. స్నానజపాగ్ని¬త్ర కర్మలను యథావిధిగా నిర్వర్తించేవాడు. అందరికి అతనిని చూస్తే మహా ప్రీతిగా ఉండేది. కాని, అతని మనస్సుకు ఆనందం లేదు. ఆ యేటితరగలవెంట, మినుకు మినుకుమనే నక్షత్రాల నుంచి, సూర్యుని కిరణాలతోను ఏవో కలలు, కలవరపెట్టే భావాలు అతనిలోకి అవతరిస్తూ ఉండేవి. యజ్ఞ వేదికలలోని పొగలనుంచి, ఋగ్వేద మంత్రాల నుంచి, వృద్ధ బ్రాహ్మణుల బోధల నుంచి వెడలివచ్చి, ఈ కలలు ఈ కలవరము అతని ఆత్మను ఆవరించేవి.

తనలోని అసంతృప్తి బీజాలను సిద్ధార్థుడు గ్రహించనారంభించాడు. పితరుల ప్రేమ కాని, స్నేహితుడైన గోవిందుని కూరిమి కాని తనకు సర్వదా సౌఖ్యప్రదములు కావనీ, శాంతిని సంతృప్తిని కూర్చజాలవనీ అతనికి తెలిసి వస్తున్నది. తనతండ్రి, తన గురువులు బ్రాహ్మణులు తామెరిగిన జ్ఞానసారాన్ని యావత్తు అదివరకే తనకు అందజేశారనీ దానితో తన ఆత్మకు శాంతి సంతృప్తి కలుగలేదనీ సందేహం అతనిని పీడిస్తున్నది. స్నానాదులు మంచివే. కాని, అవి పాపాలను కడిగివేయడానికి, మనోవ్యధను మాన్చడానికీ ఉపకరించడం లేదు. అగ్ని¬త్రాలు, దేవపూజలు మంచివే. కాని అవే పరమార్థములా? యజ్ఞయాగాల వల్ల సుఖం కలుగుతున్నదా? ఇక దేవతల విషయమో! యథార్థంగా ప్రపంచాన్ని సృష్టించింది ప్రజాపతియేనా? పరమాత్మ కాదా? నీవలెను నావలెను ఈ దేవతలు కూడా సృష్టించబడినవారు.. నశించిపోయేవారు కారా? కాగా, ఈ దేవతలకోసం యజ్ఞాలు చేయడం వివేకమా? పూజార్హుడు పరమాత్మ ఒక్కడేకదా!

అయితే ఆత్మవస్తువు ఎక్కడ దొరుకుతుంది? అది ఎక్కడ ఉంటుంది? ప్రతి జీవిలోనూ నాశనం లేని ఆత్మ పదార్థం ఉన్నది కదా? జీవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఇవి జీవుడు కాదంటారు పెద్దలు. అయితే జీవుడు ఎక్కడ ఉన్నట్టు! జీవునిలో ఆత్మను తెలుసుకోవడానికి అన్వేషించ తగినమార్గం వేరొకటి ఉన్నదా? ఆ మార్గాన్ని చూపగలవాడు తెలిసినవాడు ఒక్కడూ లేడే!. తన తండ్రి, గురువులు, పెద్దలు, మంత్రతంత్రాలు, ఎవ్వరూ ఏవీ అందుకు పనికిరావడం లేదు. ప్రపంచ సృష్టిక్రమమూ, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వ్యాపారములూ, ఉచ్ఛ్వాస నిశ్వాసగతులూ, దేవతలూ ఇవన్నీ ఇంకా ఎన్నో విషయాలు బ్రాహ్మణులకు తెలుసు. ఇవన్నీ వారి పవిత్ర గ్రంథాలలో ఉన్నవి. అసలు ముఖ్యవిషయం తెలియకుండా ఎన్ని విషయాలు తెలిసి ఏమి ప్రయోజనం?

ఈ పవిత్ర గ్రంథాలలో ఎన్నో మంత్రాలు – ముఖ్యంగా సామవేదానికి చెందిన ఉపనిషత్తులు – ఈ లోపలి వస్తువును గూర్చి ప్రతిపాదిస్తున్నవి. ”ఈ ప్రపంచమంతా నీ ఆత్మ” అని ఉన్నది. సుషుప్తిలో జీవుడు ఆత్మనిష్ఠుడై ఉంటాడని ఉన్నది. ఆ మంత్రాలలో ఆశ్చర్యకరమైన విజ్ఞానం ఉన్నది. ఋషులు తమ విజ్ఞానాన్ని యావత్తు మధుమధురమైన మనోహర భాషలో వర్ణించారు. ఈ బ్రాహ్మణ విద్వాంసులు యుగయుగాల నుంచి సేకరిస్తూ కాపాడుకొని వచ్చిన మహనీయ విజ్ఞానసంచయం ఉపేక్షించ తగింది కాదు. కాని, ఈ విజ్ఞానాన్ని కూడబెట్టడంతో పాటు అనుభవంలోకి తెచ్చుకొన్న బ్రాహ్మణులు, గురువులు, పండితులు ఎక్కడ ఉన్నారు? సుషుప్తిలో ఆత్మానుభవం కలదని చెపుతూ తమ చైతన్యములోనూ, జీవితంలోనూ వాక్కాయము లందునూ దానిని నిలుపుకోగలిగిన సిద్ధు లెక్కడ?

సిద్ధార్థుడు బ్రాహ్మణ శ్రేష్ఠులను ఎందరినో చూచాడు. అందులో తన తండ్రి మహావిజ్ఞాని. ఉత్తమోత్తముడు- ప్రశంసనీయుడు – అతని జీవితం పవిత్రమైనది – అతని వాక్కు వివేకపూరితమైంది – అతని భావాలు ఉదార గంభీరములైనవి. ఇంత తెలిసిన అతనికైనా ఆనందమూ శాంతీ కలిగినవా? ఇంకా జిజ్ఞాసువుగానే వ్యవహరిస్తున్నాడే! తెంపు లేకుండా పుణ్యతీర్థములలో మునుగుతున్నాడు. యజ్ఞాలు చేస్తున్నాడు. బ్రాహ్మణుల ప్రవచనాలను వింటున్నాడు. అంతటి నిష్కల్మషునికి ఆ నిత్య స్నానాలెందుకు? ఆత్మవస్తువు అతని హృదయ కోశంలో లేదా? కాబట్టి అసలు మూలం లోపల ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలి. దానిని నిత్య సిద్ధంగా నిలుపుకోవాలి. తక్కిన అన్వేషణ అంతా వృధా! సిద్ధార్థుని భావాలు ఈ పంథాలో ఉన్నవి. అదే అతని తృష్ణ. అదే అతని విచారం.

సిద్ధార్థుడు పెక్కు తడవలు ఛాందోగ్యోపనిషత్తును అధ్యయనం చేశాడు. ”సత్యమే బ్రహ్మ- దానిని ఎరిగినవాడు ప్రతి దినము పరమపదంలో ప్రవేశిస్తాడు” అని అందులో ఉన్నది. అతనికి ఆ పరమపదం ఎన్నిసార్లో అందినట్టే తోస్తుంది కాని అందదు. ఏ నాటికీ ఆ చరమతృష్ణ తీరింది కాదు. అతనికి తెలిసిన పండితుల వల్ల గాని, అతడు విన్న బోధల వల్ల గాని పరమపదార్థాన్ని గూర్చిన నిత్యతృష్ణ తీరకుండానే నిలిచి ఉంది.

”గోవిందా! నా వెంట వటవృక్షం వద్దకు రా – ధ్యానం చేసుకుందాము” అని సిద్ధార్థుడు పిలిచాడు- ఇద్దరు వెళ్లి వటవృక్షం కింద కూర్చున్నారు. సిద్ధార్థుడు ఓంకారోచ్చారణకు ముందు ఒక మంత్రం పఠించాడు. దాని భావం ఇది –

”ఓంకారము ధనువు – ఆత్మ బాణము

లక్ష్యము బ్రాహ్మము – నిస్సంకోచముగా లక్ష్యముపై బాణమును ప్రయోగించాలి” –

గోవిందుడు ధ్యానాన్ని ముగించి లేచాడు. అస్తమయం కావస్తున్నది. అది సంధ్యావందనం చేయవలసిన కాలం. సిద్ధార్థుని పిలిచాడు. జవాబు లేదు. సిద్ధార్థుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. అతని చూపులు ఏదో దూర లక్ష్యాన్ని చూస్తున్నట్టుగా ఉన్నవి. ఊపిరి కదలిక కూడా కనబడడం లేదు. ప్రణవం ధనుస్సు గాను తన ఆత్మ బాణం గాను, బ్రహ్మము లక్ష్యంగాను భావిస్తూ ధ్యానపరవశుడై ఆ విధంగానే కూర్చున్నాడు.

ఒకప్పుడు ముగ్గురు శ్రమణులు ఆ నగరానికి వచ్చారు. వారు దేశాల వెంట తిరిగే సన్యాసులు – చిక్కిపోయి శల్య మాత్రంగా ఉన్నాడు. నడి వయసులో ఉన్నారు. దేహాలు దుమ్ము కమ్ముకొని ఉన్నవి. దాదాపు దిగంబరులనవచ్చు – ఎండ వేడిమికి దేహాలు కమిలిపోయినవి. వారికి ఒకరితో సంబంధం లేదు. స్వంతసుఖాన్ని దుఃఖాన్ని పాటించని నిర్దాక్షిణ్య వైరాగ్యం వారిది.

ఆ సాయంత్రం ధ్యానం ముగించిన తర్వాత సిద్ధార్థుడు గోవిందునితో అన్నాడు: ‘రేపు ప్రొద్దున సిద్ధార్థుడు శ్రమణులలో కలవబోతున్నాడు. అతడు కూడా శ్రమణుడు కాబోతున్నాడు’ అని.

ఆ మాటలు విని గోవిందుడు వెలవెల బోయినాడు. ధనుర్ముక్త బాణం వలె ఏకలక్ష్యలగ్నమైన సిద్ధార్థుని నిశ్చిత సంకల్పం అతని ముఖంలో గోచరిస్తున్నది. సిద్ధార్థుని జీవిత లక్ష్యసాధనకు ప్రారంభసమయం వచ్చినట్టు అతని ముఖ వైఖరిని బట్టి గోవిందుడు నిర్ణయించుకున్నాడు – సిద్ధార్థుడు ఆత్మ పథంలో అడుగుపెట్టాడు – అతని భవితవ్యమున్నూ, దానితోబాటు తన భవితవ్యమున్నూ రూపొందే కాలం వచ్చింది.

‘సిద్ధార్థా! నీ తండ్రి దీనికి ఒప్పుకుంటాడా?’ అన్నాడు గోవిందుడు. సిద్ధార్థుడు అప్పుడే మేలుకున్నట్టు గోవిందుని వైపు చూచాడు – అతని మనసులో ఆందోళనను, ఓర్మిని వెంటనే గ్రహించాడు.

‘గోవిందా! మనకు మాటలతో పనిలేదు. తెల్లవారగానే నేను శ్రమణ జీవితాన్ని ప్రారంభిస్తాను. ఆ విషయమై మనము తిరిగి చర్చించవద్దు.’ అన్నాడు సిద్ధార్థుడు.

సిద్ధార్థుడు తన తండ్రి గదిలోకి వెళ్లాడు. ఆయన చాపమీద కూర్చొని ఉన్నాడు. ఆయన తిరిగి చూచే వరకు వెనక నిల్చున్నాడు. తిరిగి చూచి : ‘నీవా! సిద్ధార్థా! నీ ఆలోచన ఏమో చెప్పు’ అన్నాడు ఆ బ్రాహ్మణుడు.

‘నాన్నా! మీ అనుమతితో రేపు ఈ గృహాన్ని వదిలి, సన్యాసులలో చేరదలచాను. ఆ సంగతి మీతో చెప్పడానికి వచ్చాను. శ్రమణుడను కావాలని ఉంది నాకు. మీరు అభ్యంతర పెట్టరని నా నమ్మకం.’

చిన్న గవాక్షము గుండా తొంగిచూస్తున్న నక్షత్రాలు దాటిపోయేవరకు ఆ బ్రాహ్మణుడు మౌనంగా కూర్చున్నాడు. కొడుకు కూడా చేతులు కట్టుకొని, చలనం లేకుండా నిల్చున్నాడు. నక్షత్రాలు దాటిపోయినవి. ‘తీవ్రతను కోపాన్ని ప్రకటించడం బ్రాహ్మణుడైనవానికి ఉచితం కాదు. కాని, నా మనస్సుకు సంతోషం కలిగించేది కాదు నీ కోరిక. ఈ మాట నీ నోటినుంచి ఇంకొకసారి వినడం నాకు సమ్మతం కాదు.’ అన్నాడు తండ్రి.

బ్రాహ్మణుడు నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. సిద్ధార్థుడు చేతులు కట్టుకొని అలాగే ఉన్నాడు.

‘దేనికి నిల్చున్నావు?’ అన్నాడు తండ్రి.

‘మీకే తెలుసు’ అన్నాడు సిద్ధార్థుడు.

ఆ బ్రాహ్మణుడు అసంతుష్టితో గదిలోనుంచి వెళ్లిపోయి, పక్కమీద పండుకున్నాడు.

ఒకగంట గడిచింది. ఆయనకు కన్నుమూతపడలేదు. పక్కమీది నుంచి లేచి అటూ ఇటూ తిరిగి బైటకి వెళ్లాడు. గవాక్షంలో గుండా గదిలోకి చూచాడు. సిద్ధార్థుడు అలాగే చేతులు కట్టుకొని చలనం లేకుండా నిలబడి ఉన్నాడు. ఆయన మనసుకు కష్టంవేసి మళ్లా పక్కమీద పండుకున్నాడు.

ఇంకొకగంట గడిచింది. బ్రాహ్మణునికి నిద్రపట్టలేదు. తిరిగి లేచాడు. అటూ ఇటూ తిరిగాడు. బైటికి వెళ్లాడు. చంద్రోదయమైంది. తిరిగి గవాక్షంలో నుంచి చూచాడు. చలించకుండా చేతులు కట్టుకొని అలాగే ఉన్నాడు సిద్ధార్థుడు. చంద్రకిరణాలు అతనిమీద పడుతున్నవి. బ్రాహ్మణుడు మనసులో బాధపడుతూ మళ్లా వెళ్లి పక్కమీద పండుకున్నాడు.

మళ్లా ఒక గంట దాటగానే బైటికి వచ్చాడు. మళ్లా రెండు గంటలు గడచిన తరువాత గవాక్షంలో గుండా చూచాడు. కొంతవెన్నెల వెలుగూ, కొంత నక్షత్రాల కాంతి, కొంత చీకటీ మీద పడుతూ సిద్ధార్థుడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ విధంగానే గంటగంటకు గదిలోకి తొంగి చూచాడు. కొడుకు అలాగే కదలకుండా ఉన్నాడు. తండ్రికి కోపము విచారము భయము దుఃఖము మనసులో నిండుకున్నవి.

తెల్లవార వస్తున్నది. బ్రాహ్మణుడు గదిలోకి వెళ్లాడు. కొడుకు అలాగే నిల్చుని ఉన్నాడు. పొడుగు పెరిగినట్టుగా, కొత్తవానిగా కనిపించాడు తండ్రి కన్నులకు.

”సిద్ధార్థా! దేనికి నిలబడి ఉన్నావు?” అన్నాడు తండ్రి.

”మీకే తెలుసు”

”ప్రొద్దుగూకులు అలాగే నిలబడి ఉంటావా?”

”ఈలాగే ప్రతీక్షిస్తూ నిల్చుంటాను”

”సిద్ధార్థా! నీవు అలసిపోతావు”

”అవును. అలసిపోతాను”

”సిద్ధార్థా! నీకు నిద్ర వస్తుంది”

”నాకు నిద్రరాదు”

”సిద్ధార్థా! నీవు చచ్చిపోతావు”

”అవును, చచ్చిపోతాను”

”నీ తండ్రికి విధేయత చూపడం కన్నా మరణమే సమ్మతమా?”

”ఎప్పుడూ తండ్రికి విధేయుడుగానే ఉన్నాడు సిద్ధార్థుడు”

”అయితే నీ ప్రయత్నం మానుకుంటావన్న మాట”

”తండ్రి ఏమి చెప్పితే అది చేస్తాడు సిద్ధార్థుడు”

ఉదయ కిరణాలు గదిలోకి ప్రవేశించినవి. సిద్ధార్థుని పాదాలు స్వల్పంగా కంపిస్తున్నవి. కాని, అతని ముఖంలో కంపం కలగలేదు. అతని కన్నులు ఎక్కడనో దూర లక్ష్యాన్ని చూస్తున్నవి. సిద్ధార్థుడు తనతోపాటు గృహంలో ఉండనేరడని తండ్రి గ్రహించాడు. అతడు అదివరకే తనను వదలి పెట్టాడనికూడా గ్రహించాడు.

తండ్రి సిద్ధార్థుని వీపు తట్టాడు.

”సిద్ధార్థా! అలాగే అడవికి వెళ్లు. శ్రమణులలో చేరు. అడవిలో నీకు ఆనందం లభిస్తే తిరిగి నాకు బోధించు. నీ అన్వేషణ విఫలమైనా తిరిగి రా. ఇద్దరము కలిసి దేవతలకు యజ్ఞ హవిస్సులు సమర్పింతాము. వెళ్లు. ఎక్కడికి వెళ్లేది మీ అమ్మతో చెప్పి వెళ్లు. నదికివెళ్లి అనుష్ఠానం చేసుకోవలసిన సమయమైంది నాకు” అన్నాడు.

కొడుకు భుజము మీది నుంచి చేయితీసి, తండ్రి నదివైపు వెళ్లాడు, సిద్ధార్థుడు నడవబోతూ వణికాడు. నిగ్రహించుకున్నాడు. తండ్రికి నమస్కరించాడు. తల్లితో తన నిష్క్రమణం చెప్పడానికి వెళ్లాడు.

తిమ్మిరిపట్టిన కాళ్లను ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. ఇంకా నగరం మేలుకోలేదు. చివరి గుడిసె నుంచి నక్కి ఉన్న మనిషి నీడ వెలుపలికి వచ్చింది. అతడు గోవిందుడు.

”వచ్చావా” అని సిద్ధార్థుడు చిరునవ్వు నవ్వాడు.

”వచ్చాను” అన్నాడు గోవిందుడు.

(ఇంకా ఉంది)

మూలం: హర్మన్‌ హెస్‌

తెలుగు అనువాదం : బెల్లంకొండ రాఘవరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *