తెలుగు చిత్రసీమలోని యువ కథానాయకులు, నాయికలు ఇప్పుడు రీమేక్స్‌పై దృష్టిపెట్టారు. వివిధ భాషల్లో తెరకెక్కిన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. కొత్త కథను ఎంపిక చేసుకునే కంటే అప్పటికే విజయం సాధించిన చిత్రాలను రీమేక్ చేస్తే విజయం ఖాయమనే నమ్మకం ఒకటి కాగా, ఇలాంటి రీమేక్స్‌కు సహజంగానే క్రేజ్ ఉండటం వల్ల బిజినెస్ సజావుగా సాగుతుందానే ధీమా మరొకటి. ప్రస్తుతం విజయం కోసం తహతహలాడుతున్న యువ కథానాయకులు ఈ బాట పట్టడానికి ఈ రెండు కారణాలు ప్రధానం అనుకోవచ్చు.
ప్రముఖ కథానాయిక సమంత రీమేక్ చిత్రాలపై ఆసక్తి కనబరుస్తోంది. గతంలో ఆమె నటించిన ‘రాజుగారి గది 2’ ఓ మలయాళ చిత్రానికి రీమేక్ కాగా, కన్నడ చిత్రం ‘యూ టర్న్’ను అదే పేరుతో తెలుగులో ఆమె రీమేక్ చేసింది. ఈ లేడీ ఓరియంటెండ్ సినిమా సమంతకు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందించకపోయినా, పేరు మాత్రం తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు రీమేక్ చిత్రాలకు త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ‘మిస్ గ్రానీ’ అనే సౌత్ కొరియన్ మూవీ రీమేక్‌లో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ‘ఓ బేబీ – ఎంత సక్కగున్నావే’ పేరుతో ఈ సినిమాను పీపుల్స్ మీడియా, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు లక్ష్మీ, నాగశౌర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే తమిళంలో ఘన విజయం సాధించిన ’96’ చిత్రం తెలుగు రీమేక్‌లోనూ సమంత నటిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష కీలకపాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ ఫీల్‌గుడ్ మూవీ తెలుగు వర్షన్లో సమంతతోపాటు శర్వానంద్ నటిస్తున్నాడు. ‘దిల్’ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు సి. ప్రేమ్‌కుమారే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తుండటం విశేషం.
ఇక సమంత బాటలోనూ తమన్నా సైతం నడుస్తోంది. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు ‘దటీజ్ మహాలక్ష్మీ’ అనే పేరు పెట్టారు. నిజానికి ‘క్వీన్’ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రీమేక్ అవుతోంది. తెలుగు వర్షన్‌కు ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా, తమిళ వర్షన్‌ను తెలుగు దర్శకుడు నీలకంఠ తెరకెక్కించారు.
అలానే తమిళంలోనే రెండేళ్ల క్రితం వచ్చి విజయం సాధించిన ‘కనిదన్’ చిత్రం తెలుగులో ‘ముద్ర’ పేరుతో రీమేక్ అవుతోంది. ఇందులో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. మాతృకకు దర్శకత్వం వహించిన టి.ఎన్. సంతోష్ తెలుగు సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నాడు. అతి త్వరలో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే… సిద్ధార్థ్, బాబీసింహా కీలక పాత్రలు పోషించగా కార్తీక్ సుబ్బరాజు రూపొందించిన ‘జిగర్తాండ’ సినిమాను తెలుగులో ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ‘వాల్మీకి’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. వరుణ్‌తేజ్ హీరోగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.
తమిళ, హిందీ చిత్రాల రీమేక్స్ సంగతి ఇలా ఉంటే… యువ కథానాయకుడు అల్లు శిరీష్ సైతం ఓ మలయాళ రీమేక్‌తో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఎబిసిడి’ అనే సినిమాను అదే పేరుతో అల్లు శిరీష్ రీమేక్ చేస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంజీవ్‌రెడ్డి దర్శకుడు. ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని ఈ సినిమాను నిర్మిస్తు న్నారు. సెట్స్‌పై ఉన్న సినిమాల సంగతి ఇలా ఉంటే… బాలకృష్ణ సైతం కన్నడ సినిమా ‘మఫ్టీ’ రీమేక్‌పై ఆసక్తి చూపుతున్నారు. దాదాపు యేడాది క్రితం వి.వి. వినాయక్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మాతగా ఈ సినిమా చేయాలని అనుకున్నారు. అలానే మరో సీనియర్ హీరో రవితేజ సైతం తమిళ సినిమా ‘తేరి’ని సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో రీమేక్ చేస్తానని ప్రకటించారు. మరి ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో వేచిచూడాల్సిందే. ఓ మంచి విజయం కోసం రీమేక్స్ను ఆశ్రయించిన ఈ యువ తారలకు ఎలాంటి విజయం దక్కుతుందో చూద్దాం!
– చంద్రం