నిర్వీర్యమవుతున్న పునరావాసాలు

నిర్వీర్యమవుతున్న పునరావాసాలు

ఏ దిక్కూ లేని మహిళలకు అన్నీ తానై సకల సౌకర్యాలు కల్పించేవే ‘పునరావాస కేంద్రాలు’. కాని నేటి సమాజంలో మహిళలకు అక్కడా రక్షణ కరువైంది. ప్రస్తుతం పునరావాస కేంద్రాల నిర్వహణ సజావుగా సాగడం లేదు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో వనిత టీవీ ‘వాయిస్‌ ఆఫ్‌ వనిత’లో ఆగస్టు 12 ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ‘పునరావాసం’ శీర్షికన ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఆ వివరాలు ఓసారి పరిశీలిద్దాం!

సాధారణంగా ఒంటరి ఆడవాళ్లకు తక్షణ నెలవులుగా పునరావాస కేంద్రాలను గుర్తించి వాటిలో చేర్పిస్తారు. వీటిలో కొన్ని ప్రభుత్వం, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తాయి. అయితే నేటి సమాజంలో పునరావాస కేంద్రాల్లో తాండవిస్తున్న భయంకర పరిస్థితుల్ని ఈ కార్యక్రమం కళ్లకు కట్టినట్లుగా చూపింది.

అనారోగ్యాలకు నిలయాలు

పునరావాస కేంద్రాల్లో వారెలా చేరారో ? కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల మాటల్లోనే చెప్పించారు. గాలి, వెలుతురు సైతం సరిగా రాని ఇరుకు గదుల్లో తాముంటున్నామని, తినే ఆహారం సైతం లోపభూయిష్టంగా ఉంటుందని విశ్లేషించారు. ఇది అక్షరాల నిజమని వాటిని పరిశీలించిన బాధ్యతాయుత వ్యక్తులు చెప్పినమాట. ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని భరించలేక వివిధ సంరక్షణ గృహాలకు చెందిన మహిళలు 2011లో 30 మంది; 2014లో 300 మంది నిర్వాహకులపై తిరుగుబాటు చేశారని తెలిపారు. ఎందుకంటే వీటి మౌలిక లక్ష్యం అక్కడున్న మహిళలందరికీ ఉపాధి చూపించడం, కనీస వసతుల్ని కల్పించడం.. కాని నేడు దేశ వ్యాప్తంగా చాలా పునరావాస కేంద్రాలు అసౌకర్యా లతో కొట్టుమిట్టాడుతున్నాయి.

పర్యవేక్షణ ఏది?

పునరావాస కేంద్రాల్లో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం అక్కడి అంశాలపై కొరవడిన పర్యవేక్షణ అని చెప్పారు. అది కొంతవరకు వాస్తవమే. అయితే వాటికి కారణాలను కూడా ఈ ప్రోగ్రాంలో విశ్లేషిస్తే బాగుండేది.

ఓ స్వచ్ఛంద సంస్థ అధినేత్రి మాట్లాడుతూ ఆ మధ్య అదృశ్యమైపోయిన యాభై వేల మంది మహిళల్లో కేవలం పన్నెండు వేల మంది మాత్రమే దొరికారు. మరి ఆచూకీ దొరకని 38,000 మంది సంగతేంటి? అని ప్రశ్నించారు. వీరి ఆచూకీ లభ్యం కాకపోవడానికి కారణం దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న మానవ అక్రమ రవాణ. ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలియజేశారు.

ఈ విశ్లేషణలోనే విన్నవించినట్లు అమలులో ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు సంస్థలు నిర్దేశిత మొత్తాన్ని అలాంటి పరిస్థితుల్లో కనుగొన్న వారికివ్వడం జరుగుతోంది. అయితే ఇది ఎంత మాత్రం వారి తదుపరి జీవితాన్ని సరిదిద్దలేదు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి పథకాలు శాశ్వత స్థాయిలో కల్పించాలి అని చెప్పడం బాగుంది. అయితే దాంతో పాటు పునారావాసం కల్పించే వ్యవస్థల్లో సమన్వయం లోపించడం గురించి మాట్లాడి ఉండాల్సింది.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని పునరావాస కేంద్రాల గురించి ఇంకా వివరంగా తెలియజేస్తే వాటి నిర్మూలనకు అవకాశముండేది. పునరావాసాల నిర్వహణకు ఎన్ని చట్టాలు చేశారో, అవి ఎలా నిర్వీర్యం అవుతున్నాయో వివరించారు. కానీ అవి విఫలం కాకుండా ఏం చేయాలో అన్నదానిపై ఫోకస్‌ చేస్తే ఇంకా బాగుండేది.

కార్యక్రమానికి అవసరమైన గణాంక వివరాలు అందివ్వడానికి చేసిన కృషి సమస్య పరిష్కార సూత్రాలు వివరించేందకు చేయలేదు.ఇలాంటి ఉపయోగకర కార్యక్రమాల ప్రసార వ్యవధి అరగంట నుంచి నిరభ్యంతరంగా గంటకు పెంచొచ్చు.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *