వారేవ్వా..! పృథ్వీషా..!

వారేవ్వా..! పృథ్వీషా..!

భారత టెస్ట్‌ క్రికెట్లో నవతరం గాలి వీస్తోంది. మెరికల్లాంటి పలువురు యువక్రికెటర్లు దూసు కొస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ సీనియ ర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఇంగ్లండ్‌ టూర్‌ ద్వారా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ సత్తా చాటితే, వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌ ద్వారానే పథ్వీషా సెంచరీతో తానేమిటో నిరూపించుకున్నాడు.

ముంబై కుర్రాడు..

ముంబై అనగానే సునీల్‌ గవాస్కర్‌, దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌, రవిశాస్త్రి, సచిన్‌ టెండుల్కర్‌, రోహిత్‌ శర్మ, అజింక్యా రహానే వంటి ఎందరో అసాధారణ క్రికెటర్లు మనకు గుర్తొస్తారు. అలాంటి ముంబై క్రికెట్‌ స్కూల్‌ నుంచి వచ్చిన ఆటగాడే ఈ 18 ఏళ్ల పథ్వీషా.

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌కు నాయకత్వం వహించిన షా ఇప్పటి వరకూ ఆడిన 14 ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచుల్లో ఏడు సెంచరీలు, ఐదు హాఫ్‌ సెంచరీలు సాధించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదుమ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో పాల్గొన్న భారతజట్టులో సైతం షా చోటు సంపాదించాడు.

18 ఏళ్ల వయసులోనే..

వెస్టిండీస్‌తో ప్రారంభమైన రెండుమ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో పాల్గొనే భారతజట్టులో చోటు సంపాదించ డమే కాదు, రాజ్‌కోట్‌ టెస్ట్‌ ద్వారా టెస్ట్‌క్యాప్‌ సైతం అందుకున్నాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే అంచనాలకు తగ్గట్టుగా ఆడిన పథ్వీషా ఏకంగా సెంచరీ సాధించి వారేవ్వా అనిపించుకున్నాడు.

రాహుల్‌తో కలసి ఇన్నింగ్స్‌ ప్రారంభించి కరీబియన్‌ ఫాస్ట్‌ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ కేవలం 99 బాల్స్‌లోనే తొలి టెస్ట్‌ శతకం పూర్తి చేశాడు.

భారత తొలి ఓపెనర్‌

56 బాల్స్‌లో ఏడు బౌండ్రీలతో మొదటి యాభై పరుగులు సాధించడంతోనే పృథ్వీషా పేరుతో ఓ అరుదైన రికార్డు నమోదయ్యింది. భారత్‌ తరపున టెస్ట్‌ క్రికెట్లో తొలి బంతి ఎదుర్కొన్న అత్యంత పిన్నవయస్కుడైన ఓపెనర్‌గా షా చరిత్ర సష్టించాడు.

1959 సిరీస్‌లో అబ్బాస్‌ అలీబేగ్‌ 20 సంవత్సరాల 131 రోజుల వయసులో టెస్ట్‌ క్రికెట్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన భారత ఓపెనర్‌ కాగా, ఆ రికార్డును పథ్వీషా 18 ఏళ్ల 329 రోజుల వయసులో సాధించడం ద్వారా తెరమరుగు చేశాడు.

99 బాల్స్‌లోనే శతకం

ఆ తర్వాత తన బ్యాటింగ్‌ జోరును కొన సాగించిన పథ్వీ 99 బాల్స్‌ ఎదుర్కొని 15 బౌండ్రీలతో తొలిటెస్ట్‌ శతకం, 8వ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ సెంచరీ సాధించాడు. భారత క్రికెట్‌ చరిత్రలోనే అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 15వ టెస్ట్‌ క్రికెటర్‌గా రికార్డుల్లో చేరాడు.

అత్యంత పిన్నవయసులో సెంచరీ సాధించిన భారత రెండో క్రికెటర్‌గా పథ్వీషా గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ 17 సంవత్సరాల 107 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.

ఏడో క్రికెటర్‌

అత్యంత పిన్నవయసులోనే సెంచరీలు సాధించిన క్రికెటర్లలో బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అష్రఫుల్‌, ముస్తాక్‌ అహ్మద్‌, సచిన్‌ టెండుల్కర్‌, హామిల్టన్‌ మసకడ్జా, ఇమ్రాన్‌ నజీర్‌, సలీం మాలిక్‌ తర్వాతి స్థానంలో పథ్వీషా నిలిచాడు.

పథ్వీషా తన మొట్టమొదటి టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో 154 బాల్స్‌ ఎదుర్కొని 19 బౌండ్రీలతో 134 పరుగుల స్కోరు సాధించాడు. దీన్ని బట్టి చూస్తే రానున్న కాలంలో భారత స్టార్‌ ఓపెనర్‌ తానేనని చెప్పకనే చెప్పాడు.

మయాంక్‌ అగర్వాల్‌ , సంజు శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఖలీల్‌ అహ్మద్‌ లాంటి పలువురు ప్రతిభావంతులైన యువక్రికెటర్లు తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *