పరిచయుడు

పరిచయుడు

ఆనాడు నేను చాలా పెందలాడే ఇంటిదగ్గరనుంచి బయలుదేరి కాఫీ హోటలుకు వెళ్లాను. ఇంకా నేను ఏమీ పుచ్చుకోలేదు. ఇంతలోకే ‘ఏమోయ్‌, ఇక్కడున్నావా? చాలా మారిపోయినావే!’ అంటూ ఎవరో ఒకాయన నన్ను పలుకరించాడు.

నేను ఆయన ముఖం వంక తేరిపార జూశాను. ఎవరో పోల్చుకోలేక పోయినాను. ఖద్దరు బట్టలు కట్టుకొన్నాడు. చామన చాయ. దృఢంగా ఉన్నాడు. మీసం మటుకు కాస్త నెరిసింది. చూడటంతోటే ఆయన చదువుకొన్నవాడనీ, చాలా పెద్దమనిషి అనీ అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా.

ఆయన ఎవరైంది నాకు జ్ఞాపకంగా రాలేదు ఎంత ప్రయత్నించినా, ఎవరో చిన్ననాటి స్నేహితుడు అయి ఉంటాడు అనుకొన్నాను. బహుశః నా సహాధ్యాయి అయి ఉంటాడు. లేకపోతే అంత చనువుగా ‘ఏమోయ్‌’ అని సంబోధిస్తాడా? మరచి పోయి ఉంటాను. నేను కాలేజీ వదలి ఇప్పటికి ఇరవై అయిదేండ్లు అయిందాయె!

అయితే ఆయనను చిన్నప్పుడు చూచినట్లు అయినా లేదు. బొత్తిగా కొత్త ముఖంలా ఉంది. అయినా తెలివి తక్కువగా ఎవరండి మీరు? అని అడగటం నాకు ఇష్టం లేక పోయింది. ఆయన ఎవరైంది మెల్లగా, నేర్పుగా ఆయన నోటి వెంటనే రాబట్టాలేనని నిశ్చయించాను. ఉపాధ్యాయుడైన వాడికి ఈ నేర్పు కాస్త ఉంటుంది. ప్రశ్నలు వేసి కావలసిన జవాబు రాబట్టడం.

కాసేపు ఏదో జ్ఞాపకం తెచ్చుకొంటున్నట్లు నటించి చివరకు ఈ ప్రశ్న వేశాను. ‘మనం క్రిందటి దఫా ఎక్కడ కలుసుకొన్నామోయ్‌?’

ఆయన విరగబడి నవ్వి ‘ఆరి! నీకు ఇంతమాత్రం జ్ఞాపకం లేదురా?!’ అన్నాడు.

‘ఆమాత్రం ఏమిటి, అసలు ఏమాత్రం జ్ఞాపకం లేదాయె నాకు!’ అందుకని నేను ఏదో పెద్దతప్పు చేసిన వాడిలాగ బిక్కముఖం పెట్టి చూశాను.

ఆ పెద్దమనిషికి నా మీద చాలా జాలి కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆయన వెంటనే నా వీపుపైన తట్టి మధురమైన కంఠంతో అడిగాడు మళ్లీ ‘ఒరే, బాబూ నేనెవరో అసలు నీకు జ్ఞాపకం ఉందా!’ అని.

నిజానికి ఏమీ జ్ఞాపకం లేదు. అయినా నేను వెకిలిగా నవ్వి ‘ఎంతమాటా ! అసలు జ్ఞాపకం లేకపోవడం ఏమి కర్మం గాని..’ అని, ఇంకా యేమో అనబోయి ఊరుకొని సందేహంగా ఆయన వంక చూశాను నవ్వుతూ..

బాబూ నీవు ఎవరో నాకు జ్ఞాపకం లేదు అని ఒక్క మాట అంటే ఏ బాధ ఉండదు. కాని అలా అనటం అవినయమని మన అభిప్రాయం. అందుకని మనము వినయాన్ని ప్రకటించటానికి పడే బాధలు ఇన్నీ అన్నీ కావు.

నా మరుపూ, నా అనుమానమూ అన్నీ నా ముఖంలో ఆయనకు కనపడే ఉంటవి. నా అవస్థ అంతా అయన గ్రహించాడు. గ్రహించి నేను రామారావునురా అని స్పష్టంగా చెప్పేశాడు.

కాని ఆయన ఏ రామారావో ఏమిటో నాకు జ్ఞాపకం రాలేదు. నా చూపుల్లో ఆ సంగతి కూడా ఆయన పట్టేసి, వెంటనే తన ఇంటి పేరు చెప్పాడు. అప్పటికీ నాకు జ్ఞాపకం రాలేదు. చివరకు ఆయన ముఖం చిట్లించి విసుగ్గా అన్నాడు ‘నేను సుబ్బారావు తమ్ముణ్ణిరా!’ అని. అప్పటికీ నాకు గుర్తుకు రాలేదు.

కాని ఇంకా నేను జ్ఞాపకం లేనట్లే చూస్తునా, నేను వట్టి తెలివి తక్కువ వాణ్నే కాక ఒక విధంగా సామాన్య మనస్తత్వాన్ని పోగొట్టుకొన్న వాడిని అవుతానని తోచింది.

అందుకని ఇక లాభం లేదని అప్పటికే చటుక్కున జ్ఞాపకం వచ్చిన వాడిలాగ వెర్రిగా చూచి, ఇంత సేపూ ఇంతచిన్న విషయం స్ఫురణకు రానందుకు సిగ్గుపడ్డట్టు నటించి, అప్పటి కైనా దాని ధర్మమా అంటూ జ్ఞాపకం వచ్చినందుకు అపరిమితమైన సంతోషాన్ని పైకి ఆర్భాటంగా చూపిస్తూ చివరకు తెముల్చుకొని ఇల్లాగ అన్నాను. ‘అరె! నీవురా! నేను ఎవరో అనుకొంటున్నాను! ‘సుబ్బారావు తమ్ముణ్ణి అని మొదట్లో చెప్పినట్టు అయితే ఎంత బాగుండేది! ఎంత అల్లరి పెట్టావురా! కూర్చో, కూర్చో.’

ఈ మాటలు విని ఆయన బాగా తృప్తి పడ్డట్లు మృదువుగా నవ్వాడు. ఏదో విధంగా ఈ విచిత్ర సంఘటనలో నుంచి బైట పడ్డందుకు నేనూ సంతో షించి ఆయనను స్నేహపురస్పరంగా రెక్కుచ్చుకొని కూర్చోబెట్టి కాఫీ తెప్పించి ఇచ్చాను. ఆయన నా ముఖం వంక చూస్తూ తన హృదయంలోని ప్రేమకు వెచ్చ వెచ్చని కాఫీతో దోహదం చేయటం సాగించాడు.

పెద్ద గాలి దుమారంలో చిక్కుకొని నానా అవస్థా పడి బైట పడ్డంత పని అయింది. ఎదుట కనపడు తున్న ఈ మనిషి ఎవరైందీ తెలియక నేను సతమతం అవుతూ ఉంటే పైగా ఆ సుబ్బారావు ఒకడు తయారైనాడు.

సుబ్బారావు నాకు ఏదో మహా ఆప్త మిత్రుడైనట్లు నటించి, ఇప్పుడు అతని క్షేమ సమాచారం అడగ కుండా ఎల్లాగ ఉంటాను. అందుకని ‘సుబ్బారాపు కులాసాగా ఉన్నాడా?’ అని అడిగాను.

ఆయనగారు బిక్కముఖం పెట్టి ‘బాగానే ఉన్నాడు, కాని ఈ మధ్యనే వాడి భార్య పోయింది’ అన్నాడు.

ఇప్పుడొక కొత్తచిక్కు వచ్చిపడ్డది. ఆ సుబ్బారావు భార్య మరణం కోసం నేను విచారం నటించాలి. స్నేహితుడి భార్య పోయిన సంగతి హఠాత్తుగా విన్న ప్పుడు ఎంత గాబరాపడి, బిక్కముఖం పెట్టి విచారపడాలో అంతాపడ్డాను. మరి తప్పింది కాదు.

కాని ఆ సుబ్బారావు ఎవరో నాకు అప్పటికీ జ్ఞాపకం రాలేదు. ఊహా మాత్రంచేత ఆప్తమిత్రుడైన ఆ వ్యక్తికోసం, అంతకంటే తెలియని ఆయన భార్య మరణం కోసం చచ్చినట్లు విధిగా ఆవేదనపడ్డాను.

కాని ఇదొకవిధంగా లాభించింది. ఎందుకంటే ఆ తరువాత నేను ఏమీ మాట్లాడకపోయినా ఆయన ఏమీ అనుకోడు. ఆవిచారకరమైన వార్త విన్న మీదట దుఃఖభారంతో మౌనం వహించానని ఆయన అను కొంటాడు. నేను తదనుగుణంగానే ప్రవర్తించాను. దిగులు ముఖం పెట్టి కప్పులో కాఫీ కొద్ది కొద్దిగా తాగుతూ మధ్యమధ్య ఆయన వంక చూస్తూ కూర్చు న్నాను. ఆయన నా లాగే చూస్తూ కూర్చున్నాడు.

ఈ యుగిత క్షణాలు గడపటం చాలా కష్టమైనది. ఆయనను కూడా ఒక కుశల ప్రశ్న వేయాలె. వేయ్యకపోతే మర్యాదగా ఉండదు. అందుకని ఆయన వంక తిరిగి ‘నీ పిల్లలు కులాసాగా ఉన్నారా?’ అన్నాను.

ఈ ప్రశ్న విని ఆయనొక చూపుచూశాడు. గుండెల్లోకి దూసుకుపోయింది ఆ చూపు. గుండె దడదడ లాడింది. మళ్లీ ఇంకో దుఃఖ వార్త చెప్పేలా గున్నాడు. చెప్పాడో.. నేనొక నాటకం ఆడాలె. ఏమిరా కర్మం అని దిగులుపడ్డాను.

కాని ఆయన ధర్మమా అంటూ నాకేమీ దుఃఖవార్త చెప్పలేదు కాని, ఒక నీచమైన వస్తువును, నికృష్టమైన జీవిని, ఉన్మత్తుని, చూస్తున్నట్లు జాలిగా చూశాడు.

‘నిజమేరా బాబూ, జ్ఞాపకశక్తి బొత్తుగా నశించింది. వృద్ధాప్యం వల్ల కావచ్చు. లేక జీవితంలో పడ్డ కష్టాల వల్ల కావచ్చు’ అన్నాను నేను.

”నీ ముఖం’.. అయితే మటుకు ఇంత అన్యాయమా! మనం నాలుగేండ్ల క్రితం మద్రాసులో తిరువళ్లిక్కేణిలో కలిశాము’ అని నా ముఖంలో మార్పును గమనించటానికి కాస్త ఆగాడు.

నేను ముఖంలో ఏ విధమైన మార్పు చూపించ లేకపోయిన మాట నిజం. సంవత్సరానికి ఒకటి రెండుసార్లు ఏదో పని మీద మద్రాసు వెడుతూ ఉంటాను. అల్లాంటి సమయంలో ఆయనను కలిస్తే కలిసే ఉండవచ్చు కాని ఏమీ జ్ఞాపకం వచ్చి చావందే! కళ్ళు ఒప్పజెప్పి ఊరుకొన్నాను.

ఆయనకు నాపై జాలి కలిగి మళ్లీ ఇల్లా అన్నాడు ‘మనం అప్పుడు బీచ్‌ దగ్గర కలుసుకొన్నాం. అప్పుడే చెప్పాను. నేను పెండ్లి చేసుకోలేదని ఈ జన్మకు బ్రహ్మ చారిగానే ఉండిపోవాలని నిశ్చయించుకొన్నాను’.

నేను అప్పుడు- ‘ఓహో అవును. నిజమే ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది’ అని అనాలె నిజానికి, కానీ ఏమీ అనక ఊరుకొన్నాను. నేను నా బలహీనతకూ జ్ఞాపకశక్తి పోగొట్టుకొన్నందుకూ సిగ్గుపడి ఆయనను క్షమించమని ప్రాధేయపడ్డాను.

ఇంతకూ నాకు జ్ఞాపకశక్తి పోయిన మాట నిజం. ఆయన బ్రహ్మచర్య వ్రత నిష్టాగరిష్టుడు కాబట్టి, ఆయన జ్ఞాపకశక్తి అంత పటుత్వంగా ఉంది అని అనుకొని నాకు నేను సమాధానం చెప్పుకొని, ఆయనను లోలోపల మెచ్చుకున్నాను.

అప్పటికి మేము ఇద్దరం కూడా వేడి కాఫీని గుటకలు గుటకులుగా త్రాగేశాం. చెరో సిగరెట్టు వెలిగించాం. ధూమఖండాలు మేఘదూతలై మా ఇద్దరి మధ్యా, రాయబారాలు జరిపినై. నన్ను అతడు మనఃపూర్వకంగా క్షమించాడు. అతని చిరునవ్వు మెలికల్లో మా సంధి షరతులు గొలుసు కట్టు అక్షరాలతో లిఖిత రూపాన్ని పొందినవి. ఆ తరువాత నిశ్శబ్దత బరువైంది.

కొంచెంసేపు అయిన తరువాత ఆయన నా క్షేమ సమాచారాన్ని గురించి అడగటం మొదలు పెట్టాడు. నాకు అపుడు ఒకటి తోచింది. ఏమిటి అంటే- మద్రాసులో మేము ఇద్దరము కలిశాం అంటున్నాడు. ఆ సందర్భంలో నా సంగతి అంతా ఆయనకు చెప్పే ఉంటాను గదా చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం ఉంచుకొన్నాడో లేదో ఇప్పుడు తెలుస్తుంది. ఆయన జ్ఞాపకశక్తి అంతంత మాత్రమేనని తెలిసింది కదా! నీకు మటుకు ఏమి జ్ఞాపకం ఉండి ఏడ్చింది. అని ముఖం వాచేటట్లు చీవాట్లు వేద్దామని సంకల్పించు కొని కూర్చున్నాను

‘నీకు క్రాఫింగు పూర్వం ఇంతకంటే పెద్దదిగా ఉండేది కదూ?’

ఇది ఆయనగారి మొదటి ప్రశ్న! ‘చాల్లే, నా క్రాఫింగు ఎప్పుడూ ఇల్లాగే ఉంది’ అని అంటానికి వీలు లేదు. పట్టుకొని ఝూడించటానికి అవకాశం ఇచ్చే ప్రశ్నకాదు అది. ఎందుకంటే క్రాఫింగ్‌ కాస్త పెరిగి ఉన్నదేమో ఆయనగారు చూచినపుడు! ఈ సిల్లీ ప్రశ్న వేశాడేమ్మా అని మనస్సులో కించపడి ‘అవును’ అని ఊరుకొన్నాను.

నేను ‘అవును’ అనే సరికి ఆయన ఫక్కున నవ్వాడు.

‘నువ్వు అంతా మారిపోయినావు. చిన్నప్పుడు నీవు దృడంగా ఆరోగ్యంగా, ఉండేవాడివి’ అన్నాడు.

ఇదికూడా కాదంటానికి వీలు లేని ప్రశ్న. ప్రతివాడూ చిన్నతనంలో దృఢంగా ఉంటాడు. ఆ ఏడు కాయేడు పైన బడ్డకొద్దీ బలహీనుడు కావటం సహజం.

అందుకని అవునన్నట్లు తలఊపి ఊరుకొన్నాను నేను. ఆయన మళ్ళీ ఫెళ్ళున నవ్వాడు.

ఒక్క నిమిషం ఆగి ‘నీవు పూర్వం కంటే చాలా నల్లబడ్డావు’ అన్నాడు. ఈ మాటలు అన్న పద్ధతిలో, ‘నీవు నన్ను కాదన లేవు. నేను ఏమన్నా నీవు చచ్చినట్లు అంగీకరించాల్సిందే’ అన్న ధ్వని ఉన్నది.

అయినా నేను ‘నేను ఒకప్పుడు తెల్లగా ఉన్నానా?’ అన్నాను నవ్వుతూ.

ఆయన గట్టిగా నవ్వి, అన్నాడు.

‘అల్లాగ కాదు, పూర్వం నీ దేహం చామన చాయలో మెరుస్తూ ఉండేది. ఇప్పుడు బాగా నల్లబడ్డావు’.

సత్యమో అసత్యమో ప్రియమైన మాట అన్నాడు. నేను ఒకప్పుడైనా అందంగా ఉండేవాడినని అనుకోడం నాకు ఇష్టమే కాబట్టి గట్టిగా కాదని అనలేకపోయినాను.

వీడి తెలివితేటలకు సంతోషించి, తెల్లపోయి చూస్తూ ఊరుకొన్నాను.

వాడువేసిన ప్రశ్నలలో ఒక్కటీ వాడి స్మతి దౌర్భల్యాన్ని పట్టి ఇచ్చింది లేదు. ఎదురు తిరిగి అనటానికి ఎక్కడా అవకాశం చిక్కలేదు. అందుకని, యుద్ధంలో పరాజయం పొందిన పధ్వీపతిలాగ, శత్రువును సమయం చూచి దెబ్బ కొట్టాలన్న నిశ్చయంతో మౌనం వహించి ఉరుకొన్నాను.

ఆయనకు నాపై జాలి కలిగింది. ప్రేమతో, జాలితో, నా వీపు పైన తట్టి ఆయన ఇల్లాగ అన్నాడు ఆఖరకు.

‘ఒరేయ్‌, నీ జుట్టు మారిపోయినది. కట్టు మారిపోయినది. రంగు మారిపోయినది. ఇంకొక్క మాట చెప్పనా! నీ మాటకూడా మారిపోయినదిరా, రంగారావూ!’ అన్నాడు.

రంగారావూ అన్న సంభోదన విని తెల్ల పోయినాను.

వీడి దుంపతెగా! వీడెవడో నన్ను రంగారావు అని పిలుస్తున్నాడు! నన్ను ఎవరో అనుకొంటున్నాడు.

వీడికేందో జ్ఞాపకశక్తి ఉందనీ, నాకు లేకపోయిం దనీ సిగ్గుపడి చచ్చాను.

ఇందాకటీ నుంచి, వెధవ ప్రశ్నలు వేసి చిక్కకుండా మాట్లాడాడు. సన్యాసి! చివరకు చిక్కాడురా మిడతంబొట్లూ! చచ్చేట్లు దెబ్బకొట్టాలి. తీవ్రమైన ఎదురుదాడి సాగించాలి అని నిశ్చయించు కొని ‘నా పేరు రంగారావు కాదు!’ అని గట్టిగా అని పకపక నవ్వాను.

రామారావుకు ఇది ఎలక్ట్రిక్‌ షాక్‌ లాగ తగిలి, ఆయన ‘ఢాం’ అని చావాలిసింది.

తనకేమో, అపూర్వమైన మేధాశక్తి ఉన్నదని అనుకొన్న ఆ వ్యక్తికి ఇది ఆశనిపాతము కాక ఏంచేస్తుంది.

నేను అనుకొన్నట్లు వాడు విరిగి క్రిందపడనూ లేదూ, చావనూ లేదు. ఒక్కసారి క్షణమాత్రం తెల్లపోయి, నా మాటలు వీని ఎంతో ఆశ్చర్యపోయిన వాడిలాగ నటిస్తూ అన్నాడు.

‘అరె! అన్నీ మార్చుకున్నావు సరే పేరు కూడా ఎప్పుడు మార్చుకొన్నావురా?’ అని వీపు పైన గట్టిగా చరిచి ‘నేను పేరు మార్చుకొన్న మాట సత్యమే అయినట్లు నేను చేసిన ఆ వెధవ దొంగపని తాను ఉదారభావంతో క్షమిస్తున్నట్లు చూపుల వల్ల తెలియజెప్పి, ‘అదుగో బస్‌ వస్తున్నది వెడతాను’ అని చెప్పి పెద్ద పెద్ద అడుగులు వేసుకొంటూ నడిచిపోయి నాడు రామారావు.

రామారావు ఎవరైనది నాకు అప్పటికి తెలియ లేదు. ఆయన అన్న మాట నన్ను నిశ్చేష్టుణ్ణి చేసింది. ఆయన ఎటు వెళ్లింది కూడా నేను చూడ లేదు. తలొంచుకొని ఊరుకొన్నాను. ఎవరా ఈ చిత్రవ్యక్తి అని ఆలోచిస్తూ అల్లాగే కూర్చున్నాను.

అతడు నాకు చిరపరిచితుడూ, ప్రాణమిత్రుడూ అని నేను అనుకొన్నాను కదూ, అందుకని నేనూ అతడూ కలిసి ఏవేవో తీపి వస్తువులు అన్నీ తినేశాం. బిల్‌ ఎంత అయి ఉంటుందా? అని ఆలోచించి అడిగాను ఆ కుర్రవాడిని. వాడు రూపాయి అని చెప్పి వెళ్లిపోయినాడు.

రూపాయి అయింది అనే సరికి గుండెకొట్టు కొంది. అందులో అధమం అర్ధ రూపాయి అయినా ఆయన తినేసి ఉంటాడు, ఆ మిత్రుడు!

రామారావు టిఫిన్‌ కోసం తయారైన మిత్రుడన్న మాట! ఆ విచిత్ర వ్యక్తి చాలా తెలివిగా ప్రవర్తించినా చివరకు మోసం చేసిపోయినాడు. ఛీ ఎంత నీచమైన పని చేశాడా అర్ధ రూపాయి డబ్బులకోసమని అను కొన్నాను. తన తెలివినంతా నీచమైన పనికై వెచ్చించిన ఆ వ్యక్తిపై నాకు పరమ అసహ్యం కలిగింది.

అప్పటికి చాలా సేపు అయింది ఆయన వెళ్లిపోయి. నేను లేచి మెల్లగా మేనేజర్‌ ఉన్న బల్ల దగ్గరకు వెళ్లి జేబులో నుంచి రూపాయి నోటుతీసి, ఆయనకిచ్చాను. రూపాయి అయిందే అని విచారపడుతూ..

ఆయన ఆనోటు తిరిగి నా చేతికిచ్చి మీ మిత్రుడు చెల్లించి పోయినాడండి అన్నాడు.

మళ్లీ నిర్ఘాంతపోయినాను. ఇదీ మరీచిత్రంగా ఉంది !

– ‘తెలుగు హాస్యం’ పుస్తకం నుండి

– మునిమాణిక్యం నరసింహారావు

తెలుగువారు హాస్యప్రియులు కారు అన్న నింద నుంచి కాస్తయినా కాపాడినవారు మునిమాణిక్యం నరసింహారావు (1898-1973). ‘కాంతం కథలు’ ద్వారా తెలుగువారిని చక్కిలిగింతలు పెట్టిన అద్భుత రచయిత. సంగం జాగర్లమూడి (గుంటూరు జిల్లా)లో పుట్టిన మునిమాణిక్యం గారు కొండా వెంకటప్పయ్యగారి ఆర్థిక సాయంతో బీఏ చదివి, ఉపాధ్యాయులయ్యారు. ఆకాశవాణిలో పనిచేశారు. కాంతం వృద్ధాప్యం, కాంతం కైఫియతు, దాంపత్యోపనిషత్‌, హాస్య కుసుమావళి వంటి రచనలు ఎన్నో రచనలు చేశారు. ‘మన హాస్యం’ ఆధునిక తెలుగు రచయితల హాస్యం గురించి ఆయన రాసిన పుస్తకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *