ఒకే ఒక్కడు

ఒకే ఒక్కడు

ఇన్‌డోర్‌ గేమ్స్‌లోనే రాయల్‌ గేమ్‌గా పేరొందిన బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌లో భారత ఆటగాడు పంకజ్‌ అద్వానీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రపంచ టైటిల్స్‌ సాధించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. చిన్న వయసులోనే 20వ ప్రపంచ టైటిల్‌ సాధించి ‘వారేవ్వా’ అనిపించాడు.

గత 22 సంవత్సరాలుగా క్యూస్పోర్టే జీవితంగా చేసుకొన్న పంకజ్‌ ఇటు బిలియర్డ్స్‌లో మాత్రమే కాదు, అటు స్నూకర్‌ గేమ్‌లోనూ ప్రపంచ విజేతగా చరిత్ర సృష్టించాడు.

బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌కు ప్రపంచ ప్రధాన క్రీడల్లో ఒకటిగా గుర్తింపు ఉంది. ఇంగ్లండ్‌, భారత్‌, సింగపూర్‌, చైనా, మాల్టా, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, కెనడా, మయన్మార్‌, థాయ్‌లాండ్‌ లాంటి దేశాలలో విశేష ఆదరణ పొందుతున్న ఈ ఆటలో అత్యధిక ప్రపంచ టైటిల్స్‌ సొంతం చేసుకున్న దేశం భారత్‌ మాత్రమే.

స్వాతంత్య్రానికి పూర్వం నుంచే మనదేశంలో బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ తన ఉనికిని చాటుకొంటూ అత్యధిక ప్రపంచ టైటిల్స్‌ను, విశ్వవిజేతలను అందించిన క్రీడగా గుర్తింపు తెచ్చుకొంది.

1920లో భారత క్రీడారంగంలోకి దూసుకొచ్చిన ఈ ఆట విల్సన్‌ జోన్స్‌, మైకేల్‌ పెరెరా, గీత్‌ సేథీ, అశోక్‌ శాండిల్యా, సుభాష్‌ అగర్వాల్‌ లాంటి పలువురు దిగ్గజ ఆటగాళ్లను మనకు అందించింది.

పది సంవత్సరాల చిరుప్రాయంలోనే క్యూ స్పోర్ట్‌లో ప్రవేశించిన పంకజ్‌ అద్వానీ 12 ఏళ్ల వయసు నుంచే జాతీయ టైటిల్స్‌ సాధించడం ఓ ఆలవాటుగా మార్చుకొన్నాడు. ఇప్పటి వరకూ జాతీయ సీనియర్‌, జూనియర్‌ స్థాయిల్లో 31 టైటిల్స్‌ సాధించాడు. జూనియర్‌ స్థాయిలో ఏడు బిలియర్డ్స్‌, నాలుగు స్నూకర్‌; సీనియర్‌ విభాగంలో 9 బిలియర్డ్స్‌, 11 స్నూకర్‌ ట్రోఫీలు అందుకొన్నాడు. భారత బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ చరిత్రలోనే అత్యధిక జాతీయ టైటిల్స్‌ సాధించిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

మొదటి ప్రపంచ టైటిల్‌

చిన్నవయసు నుంచే బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ క్రీడల్లో పాల్గొంటూ వచ్చిన పంకజ్‌ అద్వానీ 2003లో ప్రపంచ స్నూకర్‌ టైటిల్‌ సాధించడం ద్వారా తన జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాడు. 2003 నుంచి 2018 మధ్య … 14 సంవత్సరాల కాలంలో మొత్తం 18 ప్రపంచ టైటిల్స్‌ సాధించి తనకు తానే సాటిగా నిలిచాడు. భారత క్రీడా చరిత్రలోనే అత్యధిక ప్రపంచ టైటిల్స్‌ సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డుల్లో చోటు సంపాదించాడు. బిలియర్డ్స్‌ 150 పాయింట్ల ఫార్మాట్‌తో పాటు టైమ్‌ ఫార్మాట్‌ విభాగాలలోనూ పంకజ్‌ తిరుగులేని మొనగాడిగా గుర్తింపు పొందాడు.

2005, 2008, 2014, 2016, 2017, 2018 సంవత్సరాలలో 150 పాయింట్ల ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అంతేకాదు టైమ్‌ ఫార్మాట్లోనూ 2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015 సంవత్సరాలలో గెలుపొందాడు. స్నూకర్‌ విభాగంలో 2003, 2015 సంవత్సరాలలో విశ్వవిజేతగా నిలిచిన పంకజ్‌ ప్రపంచ సిక్స్‌ రెడ్‌ స్నూకర్‌ టైటిల్స్‌ను 2014, 2015 సంవత్సరాలలో సాధించాడు. 2014లో ప్రపంచ టీమ్‌ బిలియర్డ్స్‌ టైటిల్‌ను సైతం భారత్‌కు అందించాడు.

అంతేకాదు, 2006 దోహా ఆసియా క్రీడలు, 2010 గాంగ్జు ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించాడు. 22 సంవత్సరాల తన క్రీడాజీవితంలో పంకజ్‌ అద్వానీ 55 బంగారు పతకాలు, 31 జాతీయ టైటిల్స్‌, 20 ప్రపంచ టైటిల్స్‌ సాధించి భారత క్రీడా చరిత్రలోనే మరే క్రీడాకారుడూ సాధించని ఘనతను సొంతం చేసుకొన్నాడు.

అవార్డులే అవార్డులు!

క్రికెట్టే పిచ్చిగా భావించే మనదేశంలో బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ క్రీడల ద్వారా పంకజ్‌ అద్వానీ పలురకాల క్రీడా, పౌరపురస్కారాలు అందుకున్నాడు. 2004లో అర్జున అవార్డు, 2005- 06లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 2007లో ఏకలవ్య పురస్కారం, 2009లో పద్మశ్రీ పురస్కారం.. ఇలా ఒకదాని వెనుక ఒకటిగా వచ్చి పంకజ్‌ అద్వానీని వరించాయి. భారత క్యూస్పోర్ట్‌ చరిత్రలో మాత్రమే కాదు, ప్రపంచ బిలియర్డ్స్‌, స్నూకర్‌ క్రీడల చరిత్రలోనూ పంకజ్‌ ఓ అసాధారణ క్రీడాకారుడిగా మిగిలిపోతాడు.

– క్రీడా కృష్ణ , 8466864969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *