ఒకటే చీర

ఒకటే చీర

”నీవు తిని వచ్చిన తరువాత నేబోయి తిని వత్తునుగాని, ముందు నీవేగి తినిరా; చీకటి పడినను నాకు భయములేదు” అని అత్త యనెను.

అచ్చరనయినను పిశాచముగా జేసివైచు కోక కట్టుకొని కూర్చున్న కోడలొక్క నిమిషమాలోచించి- ‘కాదు కాదు, మీరే ముందు వెళ్లవలయును. మీరు వచ్చిన తరువాతనే నేను” అని అనెను.

‘మానమును మరియాదయు ఎక్కువ వారికిగాని మముబోటి తక్కువ వారికి గావమ్మా. కాబట్టి ఆ సంగతి వదిలిపెట్టు. నీకు మధ్యాహ్నము కూడ కూడులేదు. పైగా చిన్నదానవు, చీకటిలో ఆ గుంపులో త్రోసికొని వచ్చుట ప్రమాదము’ అని అత్త అనెను.

‘మానమును మరియాదయును గాలియు నీళ్లవంటి వత్తా. తండ్రియును, కొడుకును తిని పదకొండు గంటలకే నాగరాజుగారి ఇంటికి వెళ్లిరి గదా. మీకు మాత్రం మధ్యాహ్నము కూడేది? కాబట్టి ముందర మీరే వెళ్లిరండు; తరువాతనే నేను వెళ్లుదును. చీకటి యనియు, గుంపనియు నాకొక దయ్యము చూపితిరి. దయ్యములు నన్ను జూచి పారిపోవును’ అని కోడలనెను.

‘కాదమ్మా, నీవు పచ్చపసుపు పోసినటులు, మెఱుపులు ముద్ద చేసినటు లుందువు; నీకు దృష్టి తగులునమ్మా మరి చెప్పను’.

‘మీ మాటయే నిజమగుగాక, మెఱుపులు ముట్టినచో దెబ్బతగులు నత్తా, దానికేమిగాని ముందు మీదే వంతు’.

కోడలు మిగుల వినయ విధేయతలు కలది. అత్తమాట కెన్నడు ఎదురాడి ఎరుగదు. ఆడుచో, మఱి వింధ్య పర్వతమే. ఈ సంగతి ఆ యత్తకు తెలుసు. కాబట్టి యిక లాభము లేదనుకొని అత్త తన అతుకులబొంత విడిచి అటకమీది చీర తీసి కట్టుకొని నాగరాజుగారి సత్రానికి వెళ్లెను.

ఆ బస్తీలో నెటు చూచినను నాగరాజు పేరే. నాగరాజు ఆసుపత్రి. నాగరాజు అనాథ శరణాల యము. నాగరాజు దేవాలయము. నాగరాజు కాలేజి. నాగరాజు సత్రము. నాగరాజు కొళాయి. నాగరాజు వీధి. వీధి, వీధి యేమి కర్మము. ఇంక ఆ బస్తీ బస్తీ నాగరాజపురమై పోవచ్చును.

నాగరాజిపుడు పేదవారికి జావపోయటానికి ఒక సత్రమారంభించెను. ప్రతిదినము సాయంకాలమాఱు గంటలకు నాంది. పదిగంటలకు భరత వాక్యము. కష్టపడి సంపాదించుకొను వారు కూడ నిట దినమరగి సోమరులయిపోదురను సదుద్దేశంతోడనే యిపుడతడు నూకలజావ పోయుటకు ఏర్పాటు చేసెను. కష్టపడి సంపాదించేవారికీ నూకలజావ తినుట అవమానమని అతని ఉద్దేశము. సోమరి తనమును అవమానమును అన్నదమ్ములని అతడెరుగక పోవచ్చును.

రోడ్డుల కిరుప్రక్కలనున్న ముఱికి కాలువల నీరు తగులకుండ జనులు కడు జాగరూకతతో గూర్చుండిరి. దుమ్ము లేవకుండ రోడ్లమీద నీరు కొట్టిరి. నాగరాజు అండ్‌ సస్సు వారి బియ్యపు మరయందును, పిండి మరయందును, నూనె మరయందును, పంచదార మరయందును, పనిచేయు వారెందరో వచ్చి విస్తళ్లు వేయదొడగిరి. నాగరాజును, అతని కొడుకు గంగరాజును బంతులవెంట దిరుగుచు అజమాయిషీ చేయు చుండిరి. కొందరు పచ్చడియు మరికొందరు ఉప్పును వేసుకొనుచు బోవుచుండిరి. తరువాత నూకల జావ వచ్చెను. అది పేరునకు జావ. అర్థమునకు జాఱు ముద్ద.

దరిద్ర నారాయణులందఱును దంత యంత్ర ములు విప్పిరి. ‘ఇక ఒక ఏడాది వరకు తిండిలేక చావ’ మనే ధైర్యము వారి మొగములలో గనబడు చుండెను. గ్రుడ్డి వారందఱును నాగరాజును చూడవలయు ననియు, కుంటివాండ్రందఱును నాగరాజు ముంగలికి పరువెత్తి జేపెట్ట వలయు ననియు దలచుచుండిరి. అంగవైకల్యములేని వారందరును నాగరాజును, అతని కుమారుడును తమ నడుము నుండి పోవుచుండగా తలలు వంచుకొనుచుండిరి.

తన యింటి చుట్టును నలువైపులున్న రోడ్ల నడుమ నడచుచు ఈ దరిద్ర నారాయణుల జూచుచున్న నాగరాజు హృదయము బరువెక్కెను. శిల్పసంపదతో, రసపురుషుని దెలుపు తన పాలరాతి మేడచుట్టును కూర్చున్న ఈ జీవచ్ఛవములను జూచుచున్న నాగరాజుకు సృష్టిచేయు బ్రహ్మకి విశ్వంనిండ శవములు కనిపించుచో నెటులుండనో అటులుండెను. అతడు వడివడిగా ఆ రోడ్డుదాటి ఎడమవైపు రోడ్డుమీదికి తిరిగెను.

అచట బంతులన్నియు పూలమొక్కలు పాతిన చందంగా ఉండెను. అతని కంటికి కొంచెము శాంతి దొరికెను. నడుచుచు నడుచుచు నున్న వాడచట ఆగి అక్కడ కూర్చున్న వారినందరిని పరికించెను. పలువురు తన మిల్లులలో పనిబాగులవారే. ‘వీరు కూడ నిచటికేల వచ్చిరి?’ అని యతడునుకొనెను. ఇక నిలిచినచో బాగుండదు. వారందఱాడువాండ్రు. అతడు మెలమెల్లగా పదియడుగులు నడచెను. అచట వింతతోడను వెగటు తోడను అతడాగి పోయెను- మాతరమ్మ. ప్రతిదినం తన ఇంటికి పాలు తెచ్చి ఇచ్చును. బియ్యపు మరలో కూలిది.

మాతరమ్మ జావముద్ద తినుచున్నది. అతడాగి చూచెను. మాతరమ్మ యుఁజూనెను. ఆమెలో నెక్కడేని ఏమాత్రమేని సందియము లేదు. తన హక్కును తాను వృధాచేయకుండ వినియోగించు కొనుచున్న చందంగా తినుచు లోలోపల నాగరాజు నకు మ్రొక్కుచున్నది. కొడుకును బిలిచి సరిగా వినియోగము చేయింపుమని చెప్పి నాగరాజు మేడలోనికి వెళ్లిపోయెను.

‘అప్పుడు వచ్చిరేమి? దరిద్ర నారాయణ సేవ సమాప్తమా?’ అని అతని భార్య యోగమాయ ప్రశ్నించెను.

‘ఇది సేవ కాదు, పరీక్ష.’

‘నారాయణునికి పరీక్షయా?’

‘ఆ, దరిద్ర నారాయణ పరీక్ష. ఈ గుంపులో మన మిల్లుల పనివాండ్రు కూడ పలువురు దూరిరి. వారికేమి రోగం? వారిలో నొకొక్కతే ఎటువంటి చీర కట్టుకొని వచ్చినదో యొకపరి చూడు. వైస్రాయి విందుకు వచ్చినట్లు. మాతరమ్మయు వచ్చినది. నీవు కూడ అంత విలువగల కోక కట్టవు. నీ వెప్పుడో అట్టికోక కట్టినటులు గుఱుతు?

యోగమాయ కొంచెం సిగ్గుపడి ఇటులనెను – ‘సరిసరి. మాతరమ్మయు నామె కోడలు జయయు, ప్రతిదినమును మిల్లుకు వచ్చుచు దగ్గఱ ఉండి పాలు పిండించి మనకుఁ దెత్తురు. ఒకనాడు నేను పాలగిన్నె తీసికొనవలసి వచ్చెను. ఆమెను చూతునుగదా గుడ్డలమ్మ, బీరువా తీయగనే ఒక చీర కనబడెను. అది కట్టించి ఆమె నపుడు మిల్లుకు పంపితిని. వాండ్లు చాలా మంచి వాండ్లు!’

‘మంచివాండ్లగుచో నిక్కడి కేలవత్తురు? పేదలకు సత్రంగాని వీరికా? వీరికి మనం జీతములిచ్చుట లేదా?’

‘ఏమిచ్చుచున్నారు?’

‘నాకు గురుతా? గుమాస్తా నడుగు.’

‘మీ రిచ్చునది తమకు జాలినచో మాతరమ్మ చచ్చినను సత్రానికి రాదు.’

‘ఆడువాండ్ర మీద నీకభిమానము’

‘ఒకవేళ నున్నచో అది మీరనుకొనినటులు తప్పుకాదుగాని, మీరిచ్చు జీతము వారి కుటుంబ మునకు జాలదు. అది యటులుండుగాక. నాకు గూడ మీ సత్తరువున వారితోపాటు తిని రావలయు నని సంకల్పము కలుగుచున్నది.’

‘ఏమేమి?’

‘ఇపుడొక డీ దరిద్రులకు బ్రతినిధిగా మోకాలు దిగని కొల్లాయ కట్టుకొనుచుండగా నేనొక యేడాదిపాటు దరిద్రుల దుఃఖమెంతయో కనుగొను టకు నూకలకూడు తినజాలనా? అదియుఁగాక కాయకష్ట మొనరించి మన సంపదలో, గొంతకు గానున్నను గొంతకు కారణమైన మన ఈ కూలి వాండ్ర తరువాతనే ఈ దరిద్రులు. మన గుమాస్తాల తరువాతనే ఈ దరిద్రులు.’

హేతుపూర్ణమైన ఈ వాక్‌ ప్రవాహపు టురవడికి నాగరాజు మనస్సు చాల దవ్వు కొట్టుకొని పోయెను.

సరిగా ఆ సమయమునకు మాతరమ్మ వారి ముందరికి వచ్చి కొంచెము వెనుకకు దగ్గి తలుపు చాటున నిలువబడెను.

నాగరాజు కొంచెము బిడియపడి మేడమీదికి పోబోయి గదిలోనికి మరలెను.

‘కోడలిని దీసికొని రాకుండ నీ వొక్కతెవే వచ్చితి వేమి?’ అని యోగమాయే అడిగెను. ‘చీర్‌ర్‌…’ అని ఆగిపోయి కొంచెము సిగ్గుపడి వేదనననుభవించి మాతరమ్మ మరల నందుకొని- ‘మే మిరువురమును వచ్చుచో నింటికాపెవరు? నేను వెళ్లుచునే పంపెదను. దానికి మధ్యాహ్నము కూడ కూడలేదమ్మా!’ అని అనెను.

‘సరి నాకు గనపడిపొమ్మని చెప్పు?’

‘నేను చెప్పనక్కఱలేదు. దానికి దెలియును’ అనుచు మాతరమ్మ వడివడిగా వెళ్ళిపోయెను.

మాతరమ్మ వెళ్లిన గంట తరువాత కోడలు జయ ఏ రోడ్డు మూలనో కూరుచుండి ఆకలి పోగొట్టుకొని కలకలలాడుచు యోగమాయ ఎదుటికి వచ్చి దండము పెట్టి నిలువబడెను.

‘గదిలో మీ బాబుగారున్నారు; ముందు వారికి దణ్ణము పెట్టవలెను’ అని యోగమాయ అనెను.

జయ నోరు కఱచుకొని, తెఱచిన గుమ్మము ముందు వంగి నమస్కరించచుండగా నాగరాజు వచ్చి చూచెను. మరల నదే చీర! మాతరమ్మ కట్టుకొనినదే!

అతని నోరినుండి గబ గబ ఈ మాటలు దొరలెను – ‘ఇట్టి చీరలు మీ ఇంటనెన్ని కలవు?’

జయ భయపడెను. అత్తగారు చావనయిన చచ్చునుగాని దొంగతనం చేయదని జయకును దెలియును. అంత నామె భయము తొలగెను. పిదప ఇటులనెను – ‘అమ్మగారు పదిరోజుల క్రింద మా అత్తగారికి కోక ఇచ్చిరి. అదే అక్షయముగా నున్నది’.

‘మీ ఇరువురును గలిసి రాక నీవు వెనుక వచ్చితివేమి?’

జయకు నవ్వును దుఃఖమును వచ్చెను. ‘అయ్యా! నేనిపుడు తమ సన్నిధానంలో మనవి చేసికొనినదదే. అందులకనియే మే ఇరువురమును మిల్లు పనిలోనికి రాజాలకున్నాము. ఆమె యొకరోజునను, నేనొక రోజునను వచ్చుచుందుము. అందువల్ల…’

జయ మాటలు విని నాగరాజు ఱిచ్చవడి పోయెను.

(వేలూరి శివరామశాస్త్రి కథాభారతి నుండి)

పద్య కవిత్వం, అవధాన ప్రక్రియ తెలుగు నేలను పాలిస్తున్న కాలంలో ఆధునిక రూపం లోని చిన్న కథకు పట్టం కట్టిన వారు వేలూరి శివరామశాస్త్రి. 1928 నుంచి కథా రచన సాగించినా, అందులో కొంత గ్రాంథిక జాడ ఉన్న ఇతివృత్తాలు మాత్రం సామాజిక సమస్యలే. ఒకటే చీర కథ ఒకానొక కాలంలో ప్రజలను వేదించిన పేదకరాన్ని నగ్నం ప్రదర్శిస్తుంది. వేలూరి వారి డిప్రషన్‌ చెంబు కథ తెలుగు సాహిత్యానికి మరో కలికితురాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతర మాంద్యాన్ని అందులో చిత్రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *