ఒడ్డుకు చేరిన ఒంటరి కెరటం

ఒడ్డుకు చేరిన ఒంటరి కెరటం

పాతకాలం నాటి రోమన్‌ అంకెల గోడగడియారం ‘టంగ్‌… టంగ్‌’ మంటూ అయిదు గంటలు కొట్టింది.

రోజూ అయిదు గంటల కంటే ముందే లేచే విశాలాక్షమ్మ గారు కూడా గడియారపు గంటల్ని విన్నారు. రాత్రి పక్కమీద చేరినప్పటి నుండి ఆమెకు నిద్ర కరువైంది. ఏవో ఆలోచనలు, దిగులు, ఆమెను క్రమ్ముకున్నాయి. కలత నిద్రవల్ల ఆమె కళ్లు మండుతున్నాయి. నిరాసక్తత పక్క మీంచి లేవనీయటం లేదు.

పనిమనిషి చంద్ర బయట వాకిలి ఊడుస్తున్న శబ్దం వినపడుతోంది. ‘అమ్మగారు ఇంతాలస్యం ఎప్పుడూ పడుకోలేదు. ఇవ్వాళ్లేంది ఇలా’ అనుకుంది. అప్పటికే రెండుసార్లు చేస్తున్న పని ఆపి వచ్చి చూసి వెళ్లింది. కస వూడుస్తున్నా, కళ్లాపి చల్లుతున్నా, దాని మనసు ఇటే తచ్చాడుతోంది.

విశాలాక్షమ్మ గారికి అలా రాత్రంతా నిద్రపట్టకపోవటానికి కారణం ఆమె కొడుకు గోపీనాథ్‌. వెంట తీసుకెళ్లటానికి రెండురోజుల క్రితం హైదరాబాద్‌ నుండి తల్లి ఉంటున్న పల్లెకు వచ్చాడు.

పల్లె విడిచి వెళ్లాలన్న ఆలోచన వస్తేనే చాలు; విశాలాక్షమ్మను దిగులు మబ్బులు క్రమ్ము కుంటున్నాయి. అంతటి పుష్యమాసపు చలిలో కూడా ఆమెకు చెమటలు పోస్తున్నాయి. నిస్త్రాణత, నిర్లిప్తత ఆమెను అతలాకుతలం చేస్తున్నాయి. అలా కదిలిస్తే చాలు – జలజలా రాలే పారిజాతపు పువ్వుల్లా, కన్నీరు బయటకు దూకాలన్న ప్రయత్నం చేస్తోంది.

సుమారు ఏభయి ఏళ్ల క్రితం భర్తతో ఆ ఇంట కుడిపాదం మొపిన్నాటి నుండీ విశాలాక్షమ్మ ఎక్కడికీ వెళ్లలేదు. అధవా వెళ్లినా, అదే రాత్రి తిరిగి రావాలనిపించేది.

భర్త బ్రతికి ఉన్నన్నాళ్లూ, ఆయనకు సపర్యలు స్వయంగా ఆమే చేసేది. ఇంటినిండా పని మనుషులున్నా, అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, పెళ్లయ్యాక కూడా భర్త రంగడితో అక్కడే స్థిరపడ్డ కూతురు లాంటి పనిమనిషి చంద్ర ‘అయ్యగారికి కావల్సినవన్నీ నేను చూసుకుంటాను లే…అమ్మా!’ అని భరోసా ఇచ్చినా, భర్త భోజనం వేళకు తిరిగి వచ్చేది.

ఒక్కగానొక్క కొడుకు గోపీనాథ్‌ని పదేళ్ల ప్రాయంలోనే జిల్లా కేంద్రం దగ్గరి నవోదయ స్కూల్లో జాయిన్‌ చేసిన్నాడు కూడా ఆమెకు ఇంతటి వేదన కలుగలేదు.

నెలకోసారి భర్తే గోపీనాథ్‌ని చూసి వచ్చేవాడు. ‘నువ్వూ రావచ్చును కదా! కొడుకును కళ్లతో చూసినట్లుంది’ అని భర్త అన్నా, ‘ఎందుకు లెండి! మీరు చూసి వస్తున్నారుగా!’ అనేది కాని, ఊరు కదిలేది కాదు.

విశాలాక్షమ్మ గారి భర్త గతించి పదేళ్లపైనే కావస్తోంది. లంకంత ఆ ఇంట్లో పేరుకు ఆవిడ ఒక్కర్తే.. కాని రోజంతా ఆ ఇల్లు సందడిగా ఉంటుంది. ఇంటిని ఆనుకుని ఉన్న దొడ్లో పశువులు, పెరటికి మరో కొసన పాకలో చంద్ర దంపతులు, పాలేర్లు, విత్తనాలకనో, ఎరువులకనో.. ఒక్కోసారి చేబదులుకంటూ వచ్చిన రైతులు, చందాలకో మరేదో సాయానికి వచ్చి నిరీక్షించే ఆశ్రిత జనం- వేకువన తెరిచి ఉంచిన ఆ ఇంటి సింహద్వారం రాత్రి ఎనిమిది వరకు తెరిచే ఉంటుంది. ఎనిమిది గంటల తరువాత, ఆ ఇంటి మనుషుల్లాగానే, ఇల్లు కూడా నిద్రపోయినట్లు నిశ్శబ్దం!

ఉదయం అయిదు గంటల కంటే ముందు పశుపక్ష్యాదులతో పాటు విశాలాక్షమ్మ గారు కూడా నిద్రలేస్తారు. చంద్ర కస వూడ్చి కళ్లాపి చల్లుతుంది. చంద్ర భర్త రంగడు పశువుల దొడ్డి శుభ్రం చేస్తాడు. పాలు పితికి చంద్రకు అప్పగించి, గొడ్లకు కుడితీ, దాణా పెడతాడు. అప్పటివరకు మిగతా పాలేరులు వస్తారు.

విశాలాక్షమ్మ గారు స్నానాదికాలు పూర్తి చేసుకుంటారు. నిండా వంద కుటుంబాలు కూడా లేని ఆ చిన్న పల్లెలో సరిగ్గా పల్లె నాలుగు రోడ్ల కూడలిలో వేణుగోపాలస్వామి కోవెల ఉంది. కోవెలలోని సుప్రభాత ఘంటానాదం, విశాలాక్షమ్మ గారి పూజగదిలో చిరుగంటానాదం ఒకేసారి మ్రోగుతాయి. అప్పటికే పిడకల్ని చిదిమి రంగడు తెచ్చిన పాలబానను దాలిగుంటలోకి ఎక్కిస్తుంది చంద్ర.

ఇంతలో వేణుగోపాలస్వామి కోవెలలోని పూజారి సుప్రభాతానంతర తీర్థంతో వస్తాడు. భక్తి ప్రపత్తులతో ఆమె చాచిన ఆరచేతి గుంటలో ఓ తులసీదళం వేసి ‘అకాల మృత్యు నివారణం. సర్వ వ్యాధి ప్రశమనం..’ అంటూ మూడుసార్లు తీర్థం వంపుతాడు. తీర్థసేవనం అవుతూనే పెద్దగ్లాసులో ‘చాయ’ ఆమెకూ, అక్కడ చేరిన జనాలందరికీ చంద్ర ఇస్తుంది.

తిథి, వార, వర్జ్యాల వివరాలు, విశేష దినాలు దగ్గర పడుతూంటే, స్వామి వారికి చేయవలసిన కైంకర్య వివరాలు పూజారి ద్వారా వింటుంది.

పూజారిని పంపించి, ఖాళీగ్లాసును చంద్ర చేతికిచ్చి, నాలుగడుగులు ముందుకువేసి, గుమ్మం ముందున్న పాలేర్లనూ, రైతుల్నీ పలుకరిస్తుంది. బీద విద్యార్థులకు పుస్తకాలకు, ఫీజులకు డబ్బులు ఇస్తుంది. పెళ్లిళ్లకూ, ఇతర శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటుంది. పాలేర్లకు పనులు పురమాయించి, నిన్న అప్పజెప్పిన పనులు ఎంతవరకు అయ్యాయో.. అవకపోతే కారణాలు ఏమిటో అడిగి తెలుసు కుంటుంది.

విశాలాక్షమ్మ గారి చదువు అంతంత మాత్రమే! కాని ఆమె జ్ఞాపకశక్తి అమోఘం! క్రొత్త వంగడాలు, ఎరువులు, చీడపీడలు, వాటికి వాడాల్సిన పురుగుల మందులు; ధాన్యం రాలుబడి, ధరవరలు ఆమెకు కరతలామలకం!

తెల్లటి చీర, నుదుట తెలుపు రంగు నిలువు నామం బొట్టు, చేతులకు రెండేసి పల్చని బంగారు గాజులు – నిరాడంబరంగా కనిపించే విశాలాక్షమ్మ గారు ఆ పల్లెవాసులందరికీ అన్నపూర్ణమ్మ తల్లి. ఆపదలో ఉన్న వారికి ఆమె కొండంత అండ.

చంద్ర రోజు విడిచి రోజు చల్ల చిలుకుతుంది. వెన్న తీసిన చల్లబానను గుమ్మంలోపల కడపకు ఇవతలి వేపు ఉంచుతుంది. పాడి లేని బీదసాదలు చల్లను వంపుకుపోతారు. అలా వచ్చేవారు ఎవరూ, ఉట్టి చేతుల్తో రారు. కుడితిలోకి చిట్టు, తవుడు, దాణాకై ఉలవలు పట్టుకొస్తారు. ఏదీలేకపోతే దొడ్లో కాసిన నాలుగు వంకాయలో, చిక్కుడు కాయలో పట్టుకొస్తారు. విశాలాక్షమ్మగారికి ఇవి తక్కువయ్యా యని కాదు. ఉట్టి చేతుల్తో వచ్చి చల్ల తీసుకెళ్లటం ఆత్మన్యూనతగా భావించే దొడ్డగుణం ఆ ఊరి వారిది.

అతిథి అభ్యాగతుల్తో మధ్యాహ్నం భోజనం అయ్యాక అరుగు మీది మంచంలో కాసేపు నడుం వాల్చుతుందావిడ. నిద్ర అని కాదు; అలా నడుం వాల్చటం విశాలాక్షమ్మ గారికి అలవాటు. సాయంత్రం నాలుగు గంటల వేళ చంద్ర వస్తుంది. వంట పాత్రలు అవీ తోమేసి, మళ్లీ ఓసారి ఇల్లూడ్చి, సంజవేళ ఇద్దరూ వేణుగోపాలస్వామి గుడివేపు నడుస్తారు.

దోవెంట విశాలాక్షమ్మ గారిని పలకరించని ఇల్లు ఉండదు. ఒకరికి ఆమె అక్క, మరొకరికి వదిన, మరో తల్లికి పిన్ని, మామ్మ, అత్త. పల్లె అంతా విశాలాక్షమ్మ బంధువులే!

దీపాలవేళ, పూజగదిలో సంధ్యాదీపం వెలిగించి, కాసేపు టి.వి.లో వార్తల కాలక్షేపం. భోజనానంతరం దగ్గరి వారెవరైనా వస్తే, కాసేపు కబుర్లు. లోకాభి రామాయణం. కాసేపు పచార్లు. ఎనిమిది గంటల వేళ ప్రొద్దున తెరిచి ఉంచిన సింహద్వారం గడియ వేసి నిద్రకు ఉపక్రమించుతుంది. విశాలాక్షమ్మ గారి మంచం ప్రక్కనే చంద్ర పడుకుంటుంది. వీరిద్దరికి కాస్త దూరంగా రంగడు నిద్రపోతాడు.

పల్లె విడిచి ఎక్కడికీ కదలని విశాలాక్షమ్మ గారిని బలవంతాన ఒకటి రెండుసార్లు గోపీనాథ్‌ తనతో హైద్రాబాద్‌ తీసుకెళ్లాడు. గట్టున పడ్డ చేప పిల్లే అయింది విశాలాక్షమ్మ గారు. రెండు రోజులు ఆమెకు అతి కష్టమ్మీద గడిచినట్లయింది. వెనక్కిదింపేయమని కొడుకును పోరింది.

‘అదేంటమ్మా! ఇదీ నీ ఇల్లే. ఇక్కడ నీకు ఏం లోటు?’ అని ప్రశ్నించే కొడుక్కి ఒకే ఒక వాక్యపు జవాబు. ‘నాకిక్కడ తోచటం లేదురా!’

పచ్చని పొలాలు, ప్రాణమిచ్చే పల్లె జనం, వేణుగోపాలుడు, ఇల్లు, ఆశ్రిత జనం – ఇవన్నీ, విశాలాక్షమ్మ గారి జీవితంలో భాగం అయి పోయాయి. పెద్దా చిన్నా అనే తేడా లేకుండా, ఆ పల్లెజనంతో ఆవిడ పాలలో నీళ్లలా కలిసిపోయింది. ఏనాడూ తాను ఒంటరిని అన్న భావం కలగలేదు. భర్త పోయాక కూడా, ఆమెను ఒంటరితనం బాధించలేదు. గడియారంలోని ముల్లులా, క్రమం తప్పని ఆవిడ దిన చర్యలో అలాంటి ఆలోచనలకు సమయం ఉండేదికాదు. విశాలాక్షమ్మగారి నిష్కాపట్యం, దాతృత్వం, అందరూ తన వారే అనుకునే విశాల హృదయం వల్ల ఆ పల్లె ప్రజలు ఆమెను తల్లికంటే ఎక్కువ ఆప్తురాలిగా భావిస్తూ, తమలో ఒకరిగా కలిపేసుకున్నారు…

నిద్ర పట్టని విశాలాక్షమ్మగారు కాస్త ఇబ్బందిగా పక్కమీద అటూ ఇటూ కదుల్తున్నారు.

కొడుక్కి కూడా నిద్ర పట్టటం లేదని ఆమె తల్లి మనసుకు అర్థం అయింది. ఎ.సి.రూం కాదు. పడవంత పక్కలేదు. సావిడ్లో గొడ్డ అంబారావాలు. ఎలా నిద్రపడుతుంది పాపం అనుకుంది.

అబ్బాయి అలా ఆఘమేఘాల మీద పల్లెకు రావటానికి కారణం ఆమె మనసులో మెదిలింది. రెండు రోజుల క్రితం విశాలాక్షమ్మ గారికి ఆకస్మాత్తుగా గుండె బరువెక్కింది. కుప్పలా కూలిపోవటం గమనించిన చంద్ర అమ్మగారికి ఆసరా ఇచ్చి, ఊళ్లో ఉన్న ఒకే ఒక ఆర్‌.యం.పి. డాక్టర్‌కు కబురు పెట్టింది. కబురందగానే, ఉన్న ఫళాన వచ్చిన ఆయన విశాలాక్షమ్మగారిని పరీక్షించాడు. ‘గుండెపోటు’ అని తేల్చాడు. ఎలాగూ అబ్బాయి హైదరాబాదులోనే ఉంటున్నాడు. కనుక అక్కడికి తీసుకెళ్లమని తొందరపెట్టాడు.

గుండెపోటు ఎప్పుడు వస్తుందో.. ఎంత తీవ్రంగా వస్తుందో.. ఎవరికీ తెలియదని, పెద్ద పట్టణాలల్లో మేలైన సౌకర్యాలూంటాయని, సరైన చికిత్స వెంటనే అందించటం అత్యవసరమని చెప్పాడు. అలా చెప్పటమే కాకుండా గోపీనాథ్‌కు స్వయంగా ఫోన్‌ చేసి తల్లి సంగతి వివరించాడు.

కబురందుకున్న గోపీనాథ్‌ వెంటనే పల్లెకు బయల్దేరాడు. తన వెంట రావాల్సిందేనని తల్లిని బలవంత పెట్టాడు. దగ్గరివారంతా వెళ్లాల్సిందేనని విశాలాక్షమ్మకు సలహా ఇచ్చారు.

అప్పటి నుండి ఆమె మనసుకు స్థిమితం కరువయింది. ఊడలు దిగిన వట వృక్షాన్ని కూకటి వ్రేళ్లతో పెకలించుతోన్న బాధ ఆమెకు కలుగుతోంది.

క్రితం రోజు రాత్రి ఆలయ పూజారి, ఆర్‌.యం.పి. డాక్టరులు అన్న మాటలు ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి.

‘అన్ని రోజులూ మనవి కావు విశాలాక్షమ్మా! ఏ క్షణం మనల్ని ఎలా చెండుకు తింటుందో ఎవరికి ఎరుక? ఈ పరిస్థితుల్లో మీరు మీ అబ్బాయి దగ్గర ఉండటమే శ్రేయస్కరం’ పూజారి సలహా.

‘వదినా! నా మాట విను. ఈ గుండెజబ్బు మహాప్రాణాంతకమైనది. చల్లగా, ఏ క్షణాన మనపైకి దాడి చేస్తుందో తెలియదు. అబ్బాయి పెద్ద ఆఫీసరు. కనుసన్నల్లో పదిమంది నౌకర్లు. చాకర్లు. పైగా హైద్రాబాదు రాజధాని. మంచి వైద్య సదుపాయా లుంటాయి. గుండెల్ని కూడా మార్చగలరు. ఈ వయసులో మీరు మీకు కావల్సిన వారి దగ్గర ఉంటేనే మంచిది’ ఆర్‌.యం.పి. డాక్టరు సలహా.

కొద్దిరోజుల క్రితం చాతుర్మాసాల సందర్భంగా వేణుగోపాలస్వామి కోవెలలోకి వచ్చిన పెద్ద స్వాముల వారి ప్రవచనాలు ఆమెకు గుర్తుకు వచ్చాయి.

‘తల్లి, తండ్రి, భార్య, పిల్లలు – ఈ బంధాలు ఏవీ శాశ్వతం కావు. ఎంతటి వ్యక్తి విషయంలోనైనా, జీవుడు నిష్క్రమించి కట్టె మిగిలితే – ఈ కట్టెను ఎంత త్వరగా కాటికి చేరుద్దామా.. అని తొందర పడుతారు. జీవుడు పుట్టిన్నాడే ఆయుష్షును తనతో తెచ్చుకుంటాడు. ఆ ‘ఘడియ’ సమీపించిన క్షణాన ఎవ్వరూ ఆపలేరు. శాశ్వతం కాని ఈ శరీరం కంటే, శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోవటంపై దృష్టి పెట్టాలి. లోకానికి మేలు చేసేవారు చిరంజీవులు, చిరాయువులు.’

విశాలాక్షమ్మ గారిని ఆవహించిన సందిగ్ధత, అస్పష్టత తొలిగిపోయినట్లయింది. లోగడ ఆమె ఎక్కడో వినింది. రెక్కలొచ్చిన పక్షులు ఎదగగానే గూటిని విడిచి దూరానికి ఎగిరిపోతాయట! తల్లి పక్షిగాని, తండ్రి పక్షిగాని ‘మేమూ వస్తాము. కాస్తా ఆగండీ!’ అనో.. ‘అయ్యో మమ్మల్ని విడిచి వెళ్తున్నారా’ అనో విలపించవట! పిల్ల పక్షుల వెంట పరుగు తీయవట!

దూరంగా ఉన్న తన కొడుకూ కోడలుకు దగ్గర కావాలనుకుంటోంది. చంద్ర, దాని మొగుడు రంగడూ, పూజారి, ఆర్‌.ఎం.పి. మరిది, పాలేర్లు, రైతులు, పక్కింటి వదిన, బడిపంతులు, దసరాకు పప్పు బెల్లాలకు వచ్చే బడి పిల్లలు, బీద విద్యార్థులు – వీరంతా తన వారు కాదేంటి?

ఉన్న చోటి ప్రేమను వదులుకుని, దూరంగా మరెక్కడో తెలియని స్థలాల్లో ప్రేమను వెదుక్కుంటూ వెళ్లాలా? అక్కడి వారికి మాత్రం ఇలా జబ్బులు రోగాలు రాకుండా చిరంజీవులై మనగలుగు తున్నారా? ఏ డాక్టరయినా, తాత్కాలిక విపత్తులోంచి గట్టున చేర్చగలుగుతాడే కాని, పండుటాకుకి ప్రాణం పోయగలడా?

ఆమె ప్రశ్నలకు జవాబు దొరికినట్లనిపించింది. మనసు తేట పడింది. చిలుక బడుతున్నా చల్లకుండలో వెన్న తేలిన ప్రశాంతత ఆమెను ఆవహించింది.

వేణుగోపాలుడి కోవెలలో ఘంటానాదంలా, వేకువను స్వాగతించే పక్షిగణంలా, పెరటి తలుపు తీయగానే ఆత్మీయంగా తాకే ప్రత్యూష పవనంలా, పుష్యమాసపు ఉషోదయవేళ చీకట్లు చీల్చుకు వచ్చిన భానుడి లేలేత కిరణాల్లా, ఓ స్థిర నిర్ణయం విశాలాక్షమ్మగారిలో చోటు చేసుకుంది.

రోజుటిలా దైనందిన చర్యల్లో నిమగ్నమయింది.

అమ్మగారిలో కనిపించే క్రొత్త ఉత్సాహం, శక్తీ గమనించిన చంద్ర మనసు సంతోషంతో నిండి పోయింది. కొడుకూ కోడలిని చేరబోతున్నందుకు కలిగే సంతోషం అది అనుకుంది.

* * * * *

నిన్న రాత్రిదాకా ‘సరే లేరా! నీ ఇష్టం’ అని బట్టలు వగైరా సర్దుకుని, ఊరందరికీ వీడ్కోలు చెప్పిన అమ్మ, తెల్లారాక ఎందుకు రానంటుందో గోపీనాథ్‌కి అర్థం కాలేదు.

పై పెచ్చూ, ఆమె గొంతులోని స్థిరత్వం గోపీనాథ్‌ని ఆశ్చర్యపరిచింది.

‘అమ్మ ఎప్పుడూ ఇంతే! ఎప్పటికీ అర్థం కాదు’ అనుకున్నాడు.

మౌనంగా కార్లో సర్దించిన బట్టల సూట్‌కేసుని తిరిగి ఇంట్లోకి చేర్పించాడు.

‘అమ్మగారు బాబుగారితో వెళ్తే ఎలా?’ అన్న చంద్ర ప్రశ్నకు జవాబు దొరికింది. ఊరి జనాల మనసులలాగే దాని మనసూ తేలికైంది.

వాకిట్లో నించుని కొడుక్కి వీడ్కోలు పలికిన విశాలాక్షమ్మ గారికి కారు విడుస్తున్న పొగ, పొగకు తోడయిన పొగమంచులో కొద్దిసేపటి వరకు, కొడుకు ఎక్కి కూర్చున్న కారు కనిపించలేదు. పొగ కాస్త పలుచనై పరిసరాలు కనబడటం మొదలయ్యేసరికి కారు కనుచూపు మేర దాటిపోయింది. వీడ్కోలు పలకటానికి వచ్చిన పల్లె జనాలకు లేత ఎండ వెలుగులో విశాలాక్షమ్మ గారు మరింత ఉజ్వలంగా కనిపించారు.

– కూర చిదంబరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *