‘నోటా’ మీట నొక్కిన ప్రేక్షకులు!

‘నోటా’ మీట నొక్కిన ప్రేక్షకులు!

కథానాయకులకు ఉండే ఇమేజ్‌ను బ్రేక్‌ చేయాలంటే బలమైన కథను ఎంపిక చేసుకుని జనం ముందుకు రావాలి. కానీ కేవలం గత చిత్రాలకు భిన్నమైన పాత్రలను తయారు చేసుకుంటే ప్రేక్షకులు ఏమాత్రం హర్షించరని గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు అదే తరహాలో ‘నోటా’ జనం ముందుకు వచ్చింది. ‘పెళ్లిచూపులు’ సినిమాలో అమాయక బద్ధకస్తుడి పాత్ర చేసి విజయ్‌ దేవరకొండ అందరినీ ఆకట్టుకున్నాడు. దానికి పూర్తి భిన్నమైన యారొగెంట్‌ మెడికో పాత్ర ‘అర్జున్‌రెడ్డి’తో యూత్‌లో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. మళ్లీ దానికి పూర్తి భిన్నమైన పాత్రను ‘గీత గోవిందం’లో చేసి మెప్పించాడు. అలాంటి విజయ్‌ దేవరకొండతో పొలిటికల్‌ డ్రామా తీయాలంటే… ఎంత హోమ్‌ వర్క్‌ చేయాలి!? కానీ అలా జరగకుండా అసంపూర్ణమైన వంటలా ‘నోటా’ తయారైంది. దాంతో ఈ సినిమాపై సూపర్‌ హిట్‌, హిట్‌, ఎబౌ ఏవరేజ్‌, ఏవరేజ్‌ అంటూ నాలుగు ఆప్షన్స్‌ ఇచ్చినా జనం ‘నోటా’ (నన్‌ ఆఫ్‌ ద ఎబౌ) మీటనే నొక్కేస్తున్నారు.

కథ విషయానికి వస్తే… వరుణ్‌ (విజయ్‌ దేవరకొండ) సీఎం వాసుదేవ (నాజర్‌) తనయుడు. తండ్రి అంటే ఇష్టంలేని వరుణ్‌ విదేశాల్లో కంప్యూటర్‌ గేమింగ్‌లో శిక్షణ తీసుకుంటూ సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఓ స్కామ్‌లో ఇరుక్కున్న వాసుదేవ తాను నమ్మే ఓ స్వామీజీ సలహా మేరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొడుకును తాత్కాలికంగా ముఖ్యమంత్రిని చేస్తాడు. కేసులో తాను గెలిచినట్టు తీర్పు రాగానే ఆ పదవిని తిరిగి తీసేసుకోవచ్చని భావిస్తాడు. కానీ కోర్టులో వాసుదేవకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఈ మధ్య కాలంలో రాజకీయ నేతలు ఎంత స్వార్థంతో ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్నారో వరుణ్‌కు అర్థమౌతుంది. దాంతో తన శ్రేయోభిలాషి మహేంద్ర (సత్యరాజ్‌) సాయంతో సీఎం బాధ్యతలను స్వీకరించి, పరిపాలన ప్రారంభిస్తాడు. అతను తీసుకునే చర్యల వల్ల ‘రౌడీ సీఎం’అనే ముద్ర పడుతుంది. అయినా సామాన్య జనంలో మాత్రం అతనికి ఆదరణ పెరుగుతుంది. జైలు నుండి బెయిలుపై బయటకు వచ్చాక తిరిగి చక్రం తిప్పాలని వాసుదేవ భావిస్తాడు. ఇంతలో అతనిపై హత్యాయత్నం జరుగుతుంది. కోమాలోకి వెళ్లిపోతాడు. తన తండ్రిని చంపాలని ఎవరు ప్లాన్‌ చేశారో వరుణ్‌ తెలుసుకుంటాడు. తండ్రి పేరుతో ఉన్న వేల కోట్ల విలువైన ఆస్తులపై ఆయన గురువుగా భావించే స్వామీజీ కన్నేసి ఇదంతా చేస్తున్నాడని అర్థమవుతుంది. స్నేహితుడి సాయంతో తండ్రి పేరుతో విదేశాల్లో ఉన్న మొత్తాన్ని ట్రాన్సఫర్‌ చేయించేస్తాడు. ఈలోగా తండ్రి స్థానం నుండే ఉప ఎన్నికల్లో గెలుస్తాడు. సరిగ్గా అదే సమయంలో వాసుదేవ కోమాలోంచి బయటకు వస్తాడు. అధికారం కొడుకు చేతుల్లోకి వెళ్లిపోవడం ఇష్టం లేని వాసుదేవ కొడుకును ఎలాంటి ఇబ్బందులకు గురిచేశాడు? తండ్రితో పాటు స్వామీజీ ఎత్తులను వరుణ్‌ ఎలా చిత్తు చేశాడు అన్నదే మిగతా కథ.

దీనిని చూస్తుంటే మనకు తమిళ డబ్బింగ్‌ సినిమా చూసిన అనుభూతే కలుగుతుంది. నటీనటులు తెలుగువారికి సుపరిచితులే అయినా… కథ అంతా ఇటీవల తమిళనాడులో జరిగిన రాజకీయాల నేపథ్యంలోనిది కావడమే దానికి కారణం. అధికారం కోసం తండ్రీ కొడుకులే కుట్రలు, కుతంత్రాలకు పాల్పడటం, సీఎం ముందు ఎమ్మెల్యేలు సాష్టాంగ పడటం, రిసార్ట్‌ రాజకీయాలు ఇవన్నీ అక్కడ జరిగిన సంఘటనలే. దాంతో తెలుగువారు ఈ కథతో కనెక్ట్‌ కావడం కష్టమైపోయింది. పైగా విజయ్‌ దేవరకొండ వంటి వ్యక్తితో సీరియస్‌ పొలిటికల్‌ డ్రామా చేయించడాన్నీ జనం హర్షించలేకపోయారు. నటుడిగా విజయ్‌ మెప్పించినా…. కథ బలహీనంగా ఉండటంతో అతనూ ఏమీ చేయలేకపోయాడు. ఇక కథానాయిక మెహ్రీన్‌ది అతిథి పాత్రకు ఎక్కువ, కథానాయిక పాత్రకు తక్కువ. నిజం చెప్పాలంటే మెహ్రీన్‌ కంటే ప్రతిపక్ష నాయకుడి కూతురు పాత్ర చేసిన సంచనా నటరాజన్‌ పాత్ర బాగుంది. అసలు ఆ పాత్రనే హీరోయిన్‌ క్యారెక్టర్‌గా మలిచి ఉంటే ఇంకా బాగుండేది. నాజర్‌, సత్యరాజ్‌, ఎం.ఎస్‌. భాస్కర్‌, ప్రియదర్శి తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. శామ్‌ సీఎస్‌ బాణీల కంటే నేపథ్య సంగీతం బాగుంది.

సీఎం అరెస్ట్‌కు నిరసనగా అధికార పార్టీ వాళ్లు మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉండి నిరసన తెలపాలన్న పాయింట్‌ సినిమాలో చెప్పుకోదగ్గది. అలానే చేసిన అభివృద్ధి చూపించి ఓట్లు అడగాలి తప్పితే తాయిలాలు ఇచ్చి కాదని సినిమా చివరలో చెప్పిన సన్నివేశం కూడా బాగుంది. కానీ రాజకీయ రణతంత్రాన్ని వెండితెరకు యథాతథంగా ఎక్కించాలని అనుకున్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మరీ ముఖ్యంగా సాఫీగా సాగిపోతున్న సినిమాలో ఉపకథలా మహేంద్ర ఫ్లాష్‌బ్యాక్‌ చూపించడంతో ద్వితీయార్థంలో కథ దారితప్పేసింది. క్లయిమాక్స్‌లో దానికి లింక్‌ చేసినా ప్రేక్షకులు పెద్దంతగా ఆ పాయింట్‌కు కనెక్ట్‌ కాలేదు. పొలిటికల్‌ డ్రామాలను ఇష్టపడేవారికే ఇది నచ్చుతుంది. ఏదేమైనా విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌తో దర్శక నిర్మాతలు ఆనంద్‌ శంకర్‌, జ్ఞానవేల్‌రాజా ఆటాడుకున్నారనే చెప్పాలి.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *