నిష్క్రమణ

నిష్క్రమణ

ఏదో పరమార్థంతో మొలకెత్తి పెరిగినట్టుంది ఆ వృక్షం. దాని కింద ఉన్న ఓ రాతి బెంచీ మీద చేతి సంచి పక్కకి పెట్టి దిగాలుగా కూర్చుండి పోయాడు సుబ్బప్ప. వచ్చిన పని కాలేదు. ఊరికి తిరిగి వెళ్లాలన్నా చేతిలో చిల్లి గవ్వలేదు. ఎలాగో ఇల్లు చేరుకున్నా వాడిపోయిన అమ్మ ముఖాన్ని చూడాల్సి వస్తుంది.

ఉన్న కాస్త భూమి తన తండ్రి గతించిన తర్వాత, పినతండ్రి దౌర్జన్యంతో అతని వశం చేసుకున్నాడు. అమ్మ గిరియమ్మ మరిదితో పోరాడలేక ఊరుకుంది. పెరిగొచ్చిన బిడ్డలు – సుబ్బప్ప, శివప్ప, మంజుళ – వీళ్ల కడుపులు నింపటమే సమస్య అయింది. సర్కారీ బడిలో చదువు సాగినా ఉద్యోగాలు గగనమయినాయి. రోజంతా పన్జేసినా కడుపు నిండటం కష్టమయింది. సుబ్బప్ప వేరేవాళ్ల పొలాల్లో పనిచేసేవాడు. అక్కడా ఉండ నివ్వలేదు పినతండ్రి. గిరియమ్మ పనిచేస్తున్న ఇంటి యజమానిని బతిమి లాడితే; ‘తన దూరపు బంధువులు బెంగుళూరులో పని ఇప్పించగలరు. సుబ్బప్పని అక్కడికి పంపించ’మని సలహా ఇచ్చాడు. ఓ జత బట్టలు, ఓ తువ్వాలు గుడ్డ, ఓ అమ్మవారి పటం, రెండరటి పళ్లు- చేతి సంచిలో ఉంచి, ‘మనకే ఆదరవూ లేదురా సుబ్బప్పా! ఇగో ఈ అమ్మను నమ్ము. నీకు మంచి జరుగుతుంది. పోయిరా బిడ్డా!’ అని కన్నీళ్లెట్టుకుని కొడుకుని సాగనంపింది గిరియమ్మ.

అమ్మ ఆశీర్వాదాన్ని నెత్తిన పెట్టుకుని, బెంగుళూరు వచ్చి, ఆ అయ్యగారిచ్చిన వాళ్ల బంధువుల అడ్రస్‌ కోసం తెగ వెతికాడు సుబ్బప్ప. ఇల్లు దొరికేక నిధి పట్టినంత సంబరపడిపోయాడు. కాని అది కొన్ని క్షణాలే. ‘వాళ్లు దుబాయ్‌ వెళ్లిపోయారు. తిరిగి రావటం ఓ రెండు మూడు నెలలకే. ‘తెలియక ఇంతదూరం వచ్చావా, పాపం!’ అని ఇరుగురు పొరుగు వాళ్లన్నాక హతాశుడయ్యాడు. ఆకాశం మీద పడ్డట్టయింది. ఇక్కడేదో ఇంత చోటు దొరుకుతుందని నమ్మాడు. సంచిలో అమ్మ ఉంచిన, అమ్మవారి పటాన్ని తీసి, ‘అమ్మా నేను ఎక్కువగా ఏమీ కోరలేదు తల్లీ. రెండు పూటలా ఇంత తిండి, మానం కాపాడుకోవటానికి ఓ రెండు ఉడుపులు. అంతే తల్లి. మా ఊళ్లో మా పినతండ్రి మాకు నిలువనీడ లేకుండా చేశాడు. గుట్టుగా జీవనం చేయటానికి వీల్లేకుండా చేస్తున్నాడు తల్లీ! ఇక్కడేదో ఇంత చోటు దొరుకుతుందనే ఆశ కూడా ఇంకిపోయింది. ఏం చేసేది తల్లి!’ అంటూ దీనంగా ఆ ఫోటో కేసి చూశాడు.

అప్పుడే ఓ అపరిచితుడు వచ్చి కూర్చున్నాడు. వృద్ధుడతడు. ఆయన ముఖంలోనూ నిరాశే. దిగాలుగా కూర్చున్నాడు ఓడిపోయినట్టు. పరిచయం చేసుకోవలసిన అవసరమేం లేదనిపించింది. అప్రయత్నంగా ఆ వృద్ధుడు సుబ్బప్ప వైపు చూశాడు. ‘ముఖ్యమైనదొకటి పోగొట్టుకున్నా. ఎంతవెదికినా దొరకటం లేదు. ఎంతని వెదకను! ఎక్కడని వెదకను! ఎక్కడికి వెళ్లను? దిక్కు తోచటం లేదు!’ అన్నాడు ఆ వృద్ధుడు. పరిష్కారం సూచించే వాడల్లే సుబ్బప్ప, ‘నాదీ నీ పరిస్థితే. నేను ఉత్తరం వైపు వెళ్లి ఓడిపోయి వచ్చాను. నీవు తూర్పుకి వెళ్లి వెదికి చూడు!’ అన్నాడు. నిజానికి ఆ మాట యథాలాపంగా తనలో తాను అనుకున్నది. కానీ అనుకోకుండా పైకి వచ్చేసింది. ‘నీవు తూర్పుకి వెళ్లి వెదికి చూడు’ అన్నమాటలే ఆ వృద్ధుడికి విన్పించాయి. అంతే, అతడు మంత్రించినట్టు లేచి తూర్పు ముఖంగా అడుగులు వేశాడు.

సుబ్బప్ప కడుపులో ప్రేవులు రాగాలు తీయసాగాయి.తన కోసమని సంచిలో తల్లి వేసిన రెండు అరటిపళ్లని ఆరగించి, చేతిని తలదిండుగా చేసుకొని ఆ బెంచీ మీదనే వాలాడు. చెట్టు నీడ చల్లగా ఉన్నా, ఆలోచనల వేడికి నిద్ర రావటం లేదు. అరగంట గడిచింది.

— —–

అప్పుడే, ‘నీవు చెప్పింది అక్షరాలా నిజమయిందయ్యా!’ అన్న మాటలు వినపడ్డాయి.

ఆ వృద్ధుడే తిరిగొచ్చి సుబ్బప్పను తడుతూ అంటున్నాడు. ‘ఏం వాక్శుద్ధయ్యా నీది! అరుగు మీదే పెట్టాను.. నా ఇల్లు, పొలాల పత్రాలన్నీ. అన్నీ పోయాయి. నీవు చెప్పినట్టే తూర్పు వైపుకెళితే, ఓ రావిచెట్టు వెనకాల, ఇదిగో నా సంచి కన్పించింది. ఏ కుక్కో ఎత్తుకెళ్లి పడేసి ఉండొచ్చు. హమ్మయ్య! ఎవరి చేతికీ చిక్కకుండా సురక్షితంగా ఉన్నాయి’ అంటూ సంతోషంగా నుదిటన పట్టిన చెమట తుడుచుకున్నాడు.

‘నాదేముందయ్యా! ఇదిగో, అంతా ఈ అమ్మవారి దయ!’ అన్నాడు సుబ్బప్ప, ఫోటో కేసి చూపిస్తూ. ఆయన కూడా పటాన్ని కళ్లకద్దుకున్నాడు.

ఉభయకుశలోపరి ముగిసింది. ‘నాపేరు నంజుండప్ప. ఇక్కడికి కొంచెం దూరమేలే, ఇల్లూ పొలం అన్నీ ఉన్నాయి. సుబ్బప్ప! నీవేమీ చింతపడక్కర్లేదు. నేను నీకు పని చూపిస్తా. నీవింక మా ఇంట్లో ఒకడివే. లే!’ అంటూ వెంట తీసుకెళ్లాడు. అనాయాసంగా ఆశ్రయం లభించింది సుబ్బప్పకి. దాహంతో ఉన్నవాడికి మంచినీటి బుగ్గ దొరికినట్టు.

అదో పల్లెటూరు. విశాలమైన పాత ఇల్లు నంజుండప్పది. చుట్టురా పొలాలు, తోటలు. పనోళ్ల తోటి, పాడిపశువుల తోటి కళకళలాడుతోంది. అందరినీ పరిచయం చేశాడు నంజుండప్ప. కడుపు నిండా భోజనం, ఉండటానికి ఆ ఇంటి వెనకాలే అనువైన చోటు దొరికింది సుబ్బప్పకి. హాయిగా నిట్టూర్చాడు. పనివాళ్లపైన అజమాయిషీ తన పని. నిజానికి అదో నెపం. సుబ్బప్ప మాట మహత్యం, అమ్మవారి కృప నంజుండప్ప పుణ్యాన అక్కడంతా ప్రచారమయింది. ఇక చెప్పేదేముంది? జనం రావటం ప్రారంభమయ్యింది. ‘నాలో అంతటి మహత్యం, వాక్‌శక్తి ఏమీలేవు. నేను యథాలాపంగా చెప్పింది నిజమవటం కాదు. అది నంజుండప్పగారి భాగ్యం. నేనో మామూలు మనిషిని!’ అని ఎంత చెప్పినా కానీ, నంజుండప్పే కాదు, జనం కూడా వినలేదు. ‘మీకు తోచిందీ, తెల్సిందీ చెప్పండి స్వామి! మీ అమ్మవారి ఆజ్ఞ అయితే చాలు!’ అని పట్టుపట్టడం మొదలు పెట్టారు.

అలా ప్రారంభమయ్యింది.

దాన్నే ఆధారంగా తీసుకున్నాడు సుబ్బప్ప. తెల్లారగట్లే లేచి తలస్నానం చేయటం, అమ్మవారి పటాన్ని ముందెట్టుకుని పూజ చేయటం, ‘నీవే గతి తల్లీ, నిజాన్నే నా నోట పలికించు!’ అంటూ వేడుకోవటం పరిపాటయింది. కాషాయ వస్త్రధారి కూడా అయ్యాడు సుబ్బప్ప. పూర్వం ఎప్పుడో నేర్చుకున్న మంత్రాలు, దేవి మహత్యాలు, సహస్ర నామావళులు, అష్టోత్తరాలు గుర్తుకు రాసాగాయి. కంచుకంఠంతో దేవీస్తుతి చేయటం చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రావి చెట్టు కింద దేవి ప్రతిష్ఠాపన కూడా జరిగింది. ‘రావిచెట్టు తల్లి’ అంటూ నామకరణం కూడా అయింది. ఆ దేవికి పరమ భక్తుడైపోయాడు సుబ్బప్ప. ప్రచారం పెరిగిన కొద్దీ వచ్చే జనమూ పెరగడం మొదలైంది.

కొడుకు నుంచి గిరయమ్మకు ఉత్తరం వెళ్లింది. ‘ఏదో ఓ దారి చూపించావు తల్లీ. ఇంతే చాలు’ అనుకుని తాను తన సంసారంతో సహా సుబ్బప్ప ఊరు చేరి పోయింది. అనతికాలంలోనే సుబ్బప్ప – ‘సుబ్బస్వామి’గా మారిపోయాడు. తమ్ముడు శివప్ప, మంది సమస్యలని ఆలకించి, వాటిని స్వామివారికి విన్నవించేవాడు. దాని కనుగుణంగా కుంకుమ, భస్మం, తాయెత్తులు, పూలు, పళ్లు, టెంకాయ ఇతరత్రా పోగవుతున్నాయి. భక్తగణం కూడా ఎక్కువైంది. దాతలు ముందుకొచ్చారు. స్వామివారి పూజా కార్యక్రమాలకి కావాల్సిన వాటిని మాత్రం ఆయనకిచ్చి, తక్కిన వాటిని తన కుటుంబ నిర్వహణ కోసం గిరయమ్మ దాచుకొనేది. రాను రాను పూజా ద్రవ్యాల నమ్మే దుకాణాలు పుట్టుకొచ్చాయి.

శివప్ప స్నేహితుడు నటరాజ్‌ అన్ని వ్యవహారాలని చూడడమూ మొదలైంది. గిరియమ్మ, సుబ్బప్ప సోదరి మంజుళ పూజాద్రవ్యాల వ్యాపారం ప్రారంభించారు. నంజుండప్ప సలహా మేరకు భక్తాదులెవ్వరూ, అమ్మవారి ప్రసాదం స్వీకరించే వరకూ, ఏ పనీ ప్రారంభించే వాళ్లు కాదు. ముందు ముందు తనబిడ్డల మనస్సెలా మారుతుందో ఏమోనని తన భూ ఆస్తిలో సగాన్ని సుబ్బప్ప స్వామి పేర రాసేశాడు. ఇంట్లో వాళ్లు కళ్లెర్ర జేసినా, అమ్మవారి ముందు నోరెత్తే సాహసం చేయలేదు. నిజానికి పొలాలు స్వంతమైనప్పుడు ఎగిరి గంతేసింది సుబ్బప్పస్వామి కాదు, మంజుళ, శివప్ప, నటరాజులే. నంజుండప్ప చేయి నిమిరాడు సుబ్బప్ప స్వామి, కృతజ్ఞతగా. ఇద్దరూ అమ్మవారికి నమస్కరించినప్పుడు, ఇద్దరి కళ్లవెంట జారిన కన్నీళ్లు ఆ తల్లికి నైవేద్యాలయ్యాయి.

— —–

రోజులు దొర్లి పోయాయి. ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.

మంజుళ, నటరాజ్‌లు ఒకరికొకరు దగ్గరైపోయారు. చేసేదేమీ లేక తానే వాళ్ల పెళ్లికి సాక్షి అయింది గిరియమ్మ.

— —–

శ్రీకంఠప్ప అమ్మవారి పరమభక్తుడు. ఆయన కూతరు మందాకిని. అందగత్తె. కుశాగ్రమతి కూడాను. ఎంబీఏ చదివింది. మూడు నాలుగు సంబంధాలు వెదికారు. కానీ వాటిలో ఏది మంచిదో అమ్మవారే నిర్ణయించగలదని, ఆమె అనుమతి కోసం సపరివారంగా విచ్చేశారు. అమ్మవారి ముందు చీటీలు వేశారు. కానీ ఆ పేరేలా వచ్చిందో శ్రీకంఠప్పకి అంతుపట్టలేదు. ఆయన కోరుకున్నది ఇది కాదు కూడా. మందాకినితో పాటు వాళ్ల పరివారం ముఖాలన్నీ చిన్నబోయాయి. ఏం మాట్లాడక శ్రీకంఠప్ప పరివారం వెళ్లిపోయింది.

తీసిన చీటిలో వచ్చిన పేరు సుబ్బప్పస్వామిదే.

వాళ్లు వెళ్లిపోయాక తనవాళ్లని పిల్చి, తనకిలాంటివన్నీ నచ్చవని, ఇక మీదట జాగ్రత్తగా ఉండండని చీవాట్లు పెట్టాడు సుబ్బప్పస్వామి.

శివప్ప, నటరాజ్‌ ఒకరి ముఖాలొకరు చూసుకుని మిన్న కుండిపోయారు.

అప్పుడలా అనుకున్నా, శ్రీకంఠప్ప దంపతులు తరువాత మిన్నకుండ లేకపోయారు. అమ్మవారిపైన వాళ్ల భక్తి అలాంటిది. దాంతోపాటు భయం… ఇంటిల్లిపాదీ సతమతమైపోయారు. కడకు అమ్మవారి అనుజ్ఞను మీరలేక శ్రీకంఠప్ప మందాకినిని ఒప్పించి, వైభవంగా పెళ్లి జరిపించాడు. అర్థ మనస్కంగానే మందాకిని సుబ్బప్పస్వామికి భార్య అయ్యింది. పేరుకి సుబ్బప్పస్వామి భార్యే అయినా శివప్ప పెత్తనానికే ఆమె విలువిచ్చింది మందాకిని. తన మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించటానికి మంచి అవకాశం కూడా వచ్చింది మందాకినికి. ‘చిన్నమ్మగారు’ అనే స్థానాన్ని చేజిక్కించుకొంది.

శివప్ప సహితం తన మేనమామ కూతుర్నే చేసుకొన్నాడు. అందరూ ‘రావిచెట్టు అమ్మ’ కృపాకటాక్షానికి పాత్రులై ఆమె సేవా కార్యక్రమాల్లో భాగస్తులైపోయారు. విత్తనం మొలకై చిగురించి, పూలు పూచి కాయలైనట్లు వారి వారి సంతానం, ఇంట్లోనూ, దేవాలయ ప్రాంగణంలోనూ తిరుగాడడం ప్రారంభించింది.

— —–

రెండో అంం ప్రారంభమయ్యింది. పూజా పునస్కారాలు, భక్తులని దీవించటం వరకే స్వామిపని; మిగతా వ్యవహారాలన్నీ మందాకిని, శివప్ప, నటరాజ్‌, మంజుళ వర్గానివే. స్వామివారి, అమ్మవారి మహత్యం అన్ని ఎడల వ్యాపించటంతో, అమ్మవారికో దేవాలయ నిర్మాణం జరిగింది. ట్రస్టు పుట్టుకొచ్చింది. శివప్ప పెత్తనం పెరిగిపోయింది. తన కుటుంబానికి జరుగుతున్న మహర్దశని తల్చుకుంటూ – అమ్మవారిని కొనియాడతూ ఓ రోజు గిరియమ్మ తుదిశ్వాస విడిచింది.

ఇంత సజావుగా వ్యవహారాలన్నీ జరిగిపోతూ ఉన్నా, సుబ్బప్పస్వామిలో ఏదో అశాంతి. కలవరం, పాపభీతి.. తనలో ఇంతటి శక్తి ఉందా అన్న సందేహం నిరంతరం. అలజడితో సతమతమవు తున్నాడు.

తన తమ్ముడు శివప్ప, తన భార్య మందాకిని, మిగిలిన వాళ్లు భక్తిని రోజురోజుకీ ఓ వ్యాపారదృష్టితో అమ్మకపు వస్తువుగా మార్చడాన్ని సహించలేక పోయాడు సుబ్బప్పస్వామి. తన మూల ఉద్దేశానికెక్కడ చ్యుతి వాటిల్లుతుందోననే వ్యాకులత. ఆ పతనాన్ని నివారించలేని పరిస్థితి వచ్చేసిందని స్వామి వారికి ఎరుక అయ్యింది. పరిస్థితులు చేదాటి వెళ్లిపోయాయి. అయినా అన్నింటికీ ఆ తల్లే ఉంది, ఆమె చూచుకుంటుందనే నిర్లప్తభావనతో ఉండిపోయాడు స్వామి.

ఊరొక క్షేత్రంగా మారింది. ఇరవై అడుగుల సుబ్బప్పస్వామి కటౌట్‌ దేవాలయ ద్వారం వద్ద చిరునవ్వుతో దర్శనమిస్తూ నిలబడింది. అమ్మవారి దర్శనానికంటే ప్రశ్నలడగటానికే జనం ఎక్కువగా రాసాగారు. వాళ్లు క్యూలలో పడిగాపులు పడాల్సి వస్తోంది. స్వామివారు చెప్పింది జరగలేదని ఎవరైనా అనుమానం వ్యక్తపరిస్తే – నటరాజ్‌, శివప్పలు కలుగజేసుకొని, ‘మీరు స్వామివారు చెప్పినట్టుగా పూజా పునస్కారాలు చేసి ఉండరు. ఏదో లోపం చేసి ఉంటారు’ అనో, దుష్టశక్తుల ప్రభావమనో.. మీ అదృష్టం బావులేదనో సర్దిచెప్పి వాళ్లని సాగనంపే వారు. స్వామివారి అంతరంగం సుతరామూ ఒప్పుకునేది కాదు.

— —–

తదుపరి అంకంలో హోమాలు, హవనాలు ప్రారంభయ్యాయి. తమ స్థానాన్ని పదిలం చేసుకోవడానికని తన అదుపాజ్ఞల్లో ఉండే ఓ రౌడీ మూకని తయారు చేసి ఉంచాడు. ‘అమ్మవారి ఆజ్ఞ అయ్యింది’ అంటూ డబ్బిస్తే ఎలాంటి అక్రమానికైనా సిద్ధమయ్యింది నటరాజ్‌ గుంపు. పినతండ్రిని బెదరించి పొలాన్ని వశం చేసుకోటం కూడా జరిగిపోయింది.

దీన్నంతా వ్యతిరేకించినందుకు మొట్టమొదటి సారిగా కుటుంబంతో ఘర్షణ ఏర్పడింది స్వామికి. ఆ ఘర్షణ మిన్ను ముట్టింది. ‘మీరు, పూజా పునస్కారాలు చేసికొంటూ, తాయెత్తులనిస్తూ అలా స్వామిలాగా కూర్చుని ఉండండి. మీకివన్నీ అర్థం కావు!’ అని దబాయించింది మందాకిని. బయటి ప్రపంచంలో తన స్థానం ఎంతో ఉన్నతంగా ఉంది. నిజమే, కానీ కుటుంబంలో తన స్థానం ఎక్కడికి దిగజారిపోయిందో సుబ్బప్పస్వామికి తేటతెల్లమై పోయింది. అయినా నిస్సహాయుడిగా ఉండి పోయాడు.

దేవస్థానం అభివృద్ధి చెందటానికి ఇంకా ఎక్కువ స్థలం అవసరమై, నంజుండప్పను, అమ్మవారి ఆజ్ఞ అయ్యింది మీకున్న స్థలాన్ని మాకే అమ్మేయండి’ అని ఆయన్తో తగాదాకు దిగారు. జులుం చేయ ప్రారంభిం చారు. మళ్లీ ఘర్షణ ప్రారంభ మయ్యింది కుటుంబంలో. ‘మన ఆశ్రయదాత నంజుండప్పగారి స్థలాన్ని ఎవ్వరూ ఆశించకూడదని’ స్వామివారు కోపగించుకున్నారు. ఆయన మాటలకి విలువిచ్చే దేవరు?

ఈ మధ్యలో శివప్ప రాజకీయాల్లోకి ప్రవేశించాడు. స్వామి వారి పేరు నడ్డుపెట్టుకుని ఎన్నికల్లో నెగ్గాడు. ఇందుకు మందాకిని తోడ్పాటు లేకపోలేదు. ఇంట్లోకి రాజకీయ వాతావరణం ప్రవేశించింది. అనాచారాలు మితిమీరిపోవటం, పిల్లలూ అందులో భాగస్వాములవటం చూస్తున్న స్వామివారి తల గిర్రున తిరిగిపోయింది. ‘భక్తి’ అన్న రెండక్షరాల పదాన్ని వెదకాల్సి వచ్చింది.

స్వామివారు హతాశుడై తనను తానే శపించుకున్నాడు ఆరోజు. నంజుండప్ప గారు ఇంటికి ఆహ్వానించి ఉండకపోయినట్లయితే, తానిక్కడికి రాకపోయినట్లయితే.. అయితే, గియితే అన్న మీమాంసలో పడిపోయాడు స్వామి. దీర్ఘంగా ఆలోచించి ఓ దృఢనిశ్చయానికొచ్చేశాడు.

— —–

అదొక మధ్యరాత్రి. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయం. సుబ్బప్ప లేచి, తల వెంట్రుకలు, గెడ్డం, మీసం – అన్నింటినీ తీసేశాడు. నున్నటి గుండుపైన చన్నీళ్లు గుమ్మరించుకుని, కాషాయ వస్త్రాలని పక్కకు పెట్టాడు. ఆనాడు ఇంటి నుండి ఇక్కడికొచ్చిన ఉడుపులని ధరించి, అమ్మవారి పటం ముందు నిలబడ్డాడు. ‘అమ్మ ఈ అన్యాయాలను చూడలేను తల్లీ. వీళ్లకి నీవే బుద్ధిచెప్పాలి’ కన్నీళ్లతో ప్రార్థించి ఆ ఫోటోని చేతి సంచిలో వేసుకున్నాడు.

‘సేవ చాలనిపించింది నిష్క్రమణకు దేవి అనుజ్ఞ అయ్యింది’ అని ఓ ఉత్తరం రాసి, అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు.

ఊరి వెలుపల ద్వారానికి విద్యుద్దీపకాంతిలో మెరసిపోతున్న తన నిలువెత్తు కటౌట్‌ని చూసి తనలో తాను నవ్వుకున్నాడు సుబ్బప్ప. ఆటోవాణ్ణి లేపి, ‘రైల్వేస్టేషన్‌ వస్తావయ్యా!’ అని అడిగాడు. నిద్రమత్తు లోంచి లేచిన వాడు, ‘ఈ మధ్యరాత్రిలో ఎందుకయ్యా! పొద్దున్నే సాములోరి దరిసెనం చేస్కో, పెసాదం తీస్కోని వెళ్లు!’ అన్నాడు వాడు. ‘దర్శనం, తీర్థప్రసాదాలు అన్నీ తీరిపోయినాయిరా నాయనా. అవతారం సమాప్తమయింది. ఇక వెళ్లిపోవటమే తరువాయి. పద.. పద,’ అని తొందరించాడు. వాడికేమీ అర్థంకాలేదు. బండి స్టార్ట్‌ చేశాడు. ఆటో రైల్వేస్టేషన్‌ చేరింది. దూరంగా.. దూరంగా.. ఈ నాటకీయ జగత్తు నుండి దూరంగా.. భక్తి నుండి దూరంగా సాగింది స్వామివారి పయనం.

— —–

తపస్సిద్ధికోసం స్వామివారు హిమాలయాలకు వెళ్లారనే వార్త ఊళ్లో గుప్పుమంది. మరిన్ని శక్తులతో తిరిగి వస్తారనే ప్రచారమూ జరిగింది. ఆ నమ్మకం తోనే జనం ఎదురు చూస్తున్నారీనాటకీ.

ఆ ఊరి నుంచి బయట పడినందుకు సంతోషిస్తూ తోటపనుల్లో మునిగి పోయాడు సుబ్బప్ప.

–  కన్నడ మూలం : మధురా కర్ణమ్‌

– తెలుగు అనువాదం : కల్లూరు జానకిరామారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *