గ్యాంగ్‌స్టర్‌ వారసుల ఆధిపత్య పోరు నవాబ్‌

గ్యాంగ్‌స్టర్‌ వారసుల ఆధిపత్య పోరు నవాబ్‌

గ్యాంగ్‌స్టర్‌ మూవీ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. దాని స్ఫూర్తితోనే మణిరత్నం అప్పుడెప్పుడో కమల్‌ హాసన్‌తో ‘నాయకుడు’ సినిమా తీశారు. దక్షిణాదిన ఆ తరహా జానర్‌ సినిమా అనగానే అందరూ ముందుగా ఉదహరించేది ‘నాయకుడు’ మూవీనే. అలాంటి మణిరత్నం పలు జానర్స్‌లో సినిమాలు తీసి అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ గ్యాంగ్‌స్టర్‌ జానర్‌కే వచ్చారు. అదే ‘నవాబ్‌’. అయితే ఈ సినిమా ఓ సామాన్యుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడన్నది కాదు.. గ్యాంగ్‌స్టర్‌ వారసుల మధ్య ఆధిపత్య పోరు ఎలా జరిగిందన్నది.

భూపతి రెడ్డి (ప్రకాశ్‌రాజ్‌) నగరంలో సమాంతర ప్రభుత్వం నడుపుతుంటాడు. ఒకప్పటి గ్యాంగ్‌స్టర్‌ అయిన భూపతి కనుసన్నలలోనే ప్రభుత్వాధినేతలైనా, పరిపాలనా విభాగమైనా నడుస్తూ ఉంటుంది. అలాంటి భూపతి, అతని భార్య (జయసుధ) మీద ఓ రోజున హత్యాప్రయత్నం జరుగుతుంది. ప్రాధమిక విచారణలో అతని ప్రత్యర్థి చిన్నప్ప (త్యాగరాజన్‌) అందుకు కారణమని తేలుతుంది. అయితే చావును తప్పించుకుని ఇంటికి వచ్చిన భూపతికి మాత్రం తనపై దాడిచేసింది తన ముగ్గురు కుమారుల్లో ఒకరనే విషయం తెలుస్తుంది. ఈ విషయాన్ని భార్యకూ చెబుతాడు. ఆ మర్నాడే గుండెపోటుతో భూపతి మరణిస్తాడు. తండ్రి మరణానంతరం ఆయన స్థానాన్ని పొందాలని చూస్తాడు పెద్ద కొడుకు వరద (అరవింద స్వామి). తండ్రి సహకారంతో దుబాయ్‌లో వ్యాపారాలు చేసుకుంటూ ఉండే రెండో కొడుకు త్యాగు (అరుణ్‌ విజయ్‌)కూ తండ్రికి వారసుడు కావాలనే కోరిక ఉంటుంది. ఇక ఇంట్లో అందరి నిర్లక్ష్యానికి గురై సెర్బియాలో మారణాయుధాల అక్రమ రవాణ చేసే రుద్ర (శింబు)కూడా అవకాశం కలిసివస్తే తండ్రి స్థానాన్ని భర్తీ చేయాలని అను కుంటూ ఉంటాడు. దాంతో భూపతి సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి అతని ముగ్గురు కొడుకులు ఒకరిపై ఒకరు ఎలాంటి ఎత్తులు పైఎత్తులు వేసారన్నదే మిగతా కథ.

ప్రధమార్థం భూపతి, అతని కొడుకులు, వారి స్నేహితుడు రసూల్‌ (విజయ్‌ సేతుపతి) పరిచయా లతో సాగిపోతోంది. ద్వితీయార్థంలో సెంటిమెంట్‌ కంటే యాక్షన్‌ సన్నివేశాలకే ప్రాధాన్యమిచ్చారు. గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన భూపతి ఎలాంటి ఎమోషన్స్‌ లేకుండా పెరగడమే కాదు.. తన కొడుకులనూ అలానే పెంచినట్టుగా వారి ప్రవర్తన చూస్తే అర్థమౌ తుంది. అంతేకాదు.. కనీసం తమను నమ్ముకున్న భార్య పట్ల కూడా విశ్వాసం చూపని వ్యక్తులు వారు. సహజంగా తెరమీద కనిపించే ఏదో ఒక పాత్రతో ప్రేక్షకుడు తనని తాను ఐడెంటిఫై చేసుకుంటే.. ఆ సినిమా నచ్చుతుంది. అలాకాకుండా కొన్ని వాస్తవ పాత్రల సమూహాన్ని తెర మీద ఆవిష్కరిస్తే ఆ కాసేపు ప్రేక్షకుడు ఆనందాన్ని అనుభవించవచ్చేమో కానీ థియేటర్‌ నుండి బయటకు వచ్చాక అవి మనల్ని వెంబడించవు. ఇది అలాంటి కథే. ప్రతి మనిషిలో ఉండే మంచి, చెడులను నిష్పక్షపాతంగా తెరపై చూపించాడు మణిరత్నం. దాంతో భావోద్వేగాలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. పైగా ద్వితీయార్థంలో యాక్షన్‌ సీన్స్‌ డామినేట్‌ చేయడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. నటీనటులలో ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, జ్యోతిక సహజంగా నటించారు. అరవింద్‌ స్వామి, శింబులను ఆయా పాత్రల్లో చూడటం కాస్తంత ఇబ్బందే. స్టైలిష్‌ విలన్‌గా తెలుగు తెరపైకి వచ్చిన అరుణ్‌ విజయ్‌ తనకు నప్పే పాత్రనే చేశాడు. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేశ్‌, కథను నడిపే కీలకమైన వ్యక్తిగా విజయ్‌ సేతుపతి చక్కగా నటించారు. అదితిరావ్‌ హైదరి, డయానా ఎర్రప్పతో గ్లామర్‌ పండించే ప్రయత్నం మణిరత్నం చేశారు. నిజానికి ‘నవాబ్‌’ అనే పేరు కూడా సినిమాకు సూట్‌ కాలేదు. వరద పాత్రను ‘నవాబ్‌’ అంటూ కొన్ని సందర్భాలలో సంభోదించినా.. సినిమా పూర్తయ్యే సరికి ఈ టైటిల్‌ను విజయ్‌ సేతుపతి పోషించిన రసూల్‌ పాత్రకు వర్తింప చేయొచ్చనిపిస్తుంది.

ఎ.ఆర్‌. రెహమాన్‌ వంటి గొప్ప సంగీత దర్శకుడిని పెట్టుకుని మణిరత్నం హృదయానికి హత్తుకునే పాటలను తీసుకోలేదు. ఉన్న మూడు, నాలుగు పాటలు కూడా నేపథ్యగీతాలే కావడం నిరాశ పరుస్తుంది. సీతారామశాస్త్రి, రాకేందుమౌళి అందించిన సాహిత్యాన్ని గాయనీ గాయకులు అర్థవంతంగా, ఆకట్టుకునేలా ఆలపించలేకపోయారు. ‘భగ భగ’ అనే పదాలను ‘భగా.. భగా’ అంటూ సాగదీయడం చికాకు కలిగిస్తుంది. ఆ మధ్య వచ్చిన మణిరత్నం ‘రావణ్‌’, ‘చెలియా’ చిత్రాలతో పోల్చితే ‘నవాబ్‌’ ఫర్వాలేదని పిస్తుంది కానీ అందరికీ నచ్చే చిత్రం కాదిది. గ్యాంగ్‌స్టర్‌ చిత్రాలను, యాక్షన్‌ మూవీలను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం లేకపోలేదు.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *