‘నారీ శక్తి’

‘నారీ శక్తి’

స్త్రీ శక్తికి ప్రేరణనిచ్చేందుకు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో భారత్‌టుడే టి.వి. ప్రతి ఆదివారం రాత్రి 9.30 నిమిషాలకు ‘నారీ శక్తి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది.

2018 జూలై 29న ప్రసారమైన ‘నారీ శక్తి’ ప్రోగ్రాంలో నీలిమ వేముల (ఔత్సాహిక పారిశ్రామికవేత్త) పాల్గొన్నారు. ఆ విశేషాలు చూద్దాం !

ఆల్‌రౌండర్‌

నీలిమ ఫిజియోథెరపి విభాగంలో మాస్టర్‌ డిగ్రీ పొందారు. కాని ఆమె డాక్టరుగా స్థిరపడలేదు. భర్త ప్రోత్సాహంతో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ఇటీవలే ‘మిసెస్‌ హైదరాబాద్‌ 2018’కి కూడా ఎంపికయ్యారు. డ్యాన్స్‌ మీదున్న ఆసక్తితో చిన్నప్పుడు డ్యాన్స్‌ కూడా నేర్చుకున్నారు.

సంకల్పం ఉంటే చాలు

‘మీరు ఇవన్నీ ఎలా చేయగలిగారు ?’ అన్న ప్రశ్నకు నీలిమ స్పందిస్తూ ‘సంకల్పం’ ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. అవును ఇది అక్షరాల నిజం. ‘నేను ఏం చేయగలను ?’ అనుకుంటే మనం ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం. కష్టపడితే ఏదైనా సాధించ వచ్చు అన్న ధీమాతో ముందుకెళ్లాలి. అప్పుడే విజయాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.

ఇందుకు ఉదాహరణగా తన అనుభవాన్ని పంచుకున్నారు నీలిమ. స్వల్ప పెట్టుబడితో ఓ చిన్న ఎలక్ట్రానిక్స్‌ షాపును ప్రారంభించి పరిమిత కాలంలోనే కోటి మొబైల్‌ ఫోన్స్‌ అమ్మి ప్రతిష్ఠాత్మక బహుమతి పొందిన వైనాన్ని చెప్పుకొచ్చారు. దీనంతటికీ కారణం సంకల్పబలమే అన్నారు.

ఇదంతా కేవలం ఉన్నత విద్యావంతులకు మాత్రమే సాధ్యమవుతుందని కొందరు అభిప్రాయ పడొచ్చు. కాని అది తప్పు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు సైతం వ్యాపార రంగంలో రాణించవచ్చు. మహిళలకు ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలు సైతం కల్పిస్తున్నాయి. ఈ వివరాల్ని నీలిమ వివరించి ఉంటే బాగుండేది.

సరైన లక్ష్యం ఉండాలి

మనలో చాలామందికి ఏదేదో సాధించాలని ఉన్నా దానికి అనుగుణంగా వనరులు ఉన్నాయా ? లేదా ? ఒకవేళ లేకపోతే ముందుకెళ్ళడమెలా ? ఉంటే వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ? లాంటి ప్రశ్నలు వెంటాడుతాయి. వీటిన్నిటికి నీలిమ చాలా చక్కని సమాధానం చెప్పారు. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మనకు నిర్దేశిత లక్ష్యం ఉండాలని, ఆ దిశగా ముందడుగు వేయాలని, తెలియని విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. ఇది వాస్తవం. లక్ష్యం లేకుండా ఎవరూ విజయం సాధించలేరు.

వ్యాపార మెలకువలు పాటించాలి

స్త్రీలలో కొనుగోలు అభిరుచిని పెంచేందుకుగానూ ఉగాది పర్వదినం సందర్భంగా తాను ‘మహిళలకు మాత్రమే అమ్మకాలు’ అంటూ ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు, అలాగే రాఖీ పౌర్ణమి సందర్భంగా ‘సోదరితో రండి – బహుమతి గెలవండి’ అనే ఆఫర్‌ను ప్రకటించినట్లు తన వ్యాపార అనుభవాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు నీలిమ.

ఈ కార్యక్రమంలో నీలిమ మరో స్ఫూర్తివంతమైన అంశాన్ని కూడా స్పృశించారు. వ్యాపార రంగంలో రాణించాలనుకునే మహిళలకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. వారి అభివృద్ధికి సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ఔత్సాహికులు దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది.

భవిష్యత్తులో తాను నటనా రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు ఈ సందర్భంగా నీలిమ స్పష్టంచేశారు. ఇది ఆమె నిరంతర ప్రతిభాన్వేషణకు తార్కాణంగా కూడా పేర్కొనవచ్చు.

తెలుగు పదాలు వాడాలి

ఈ కార్యక్రమానికి కేటాయించిన సమయంలో ఓ పది నిమిషాలు ప్రకటనలకు పోగా నికరంగా ప్రోగ్రాంకు కేటాయించింది ఇరవై నిమిషాలే! ఇలాంటి విస్తృత ప్రయోజనాలున్న కార్యక్రమాలకు ప్రకటనల నిడివి తగ్గిస్తే ఇంకొన్ని అంశాలు పేర్కొనడానికి సాధ్యపడేదేమో! అలాగే ‘ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ అనే అద్భుతమైన తెలుగు పదం ఉండగా కార్యక్రమంలో ‘ఎంటర్‌ప్రిన్యూర్‌’ అనే పదాన్ని ఎక్కువగా వాడారు. ఈ కార్యక్రమం అందరికీ చేరువ కావాలంటే వీలైనంతవరకు తెలుగు పదాలే ఎక్కువగా వాడాలి.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *