కొంచెం లవ్‌… కొంచెం సెంటిమెంట్‌తో నన్ను దోచుకుందువటే

కొంచెం లవ్‌… కొంచెం సెంటిమెంట్‌తో నన్ను దోచుకుందువటే

సీనియర్‌ నటుడు కృష్ణ చిన్నల్లుడు సుధీర్‌బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి చూస్తుండగానే ఆరేడేళ్లు గడిచిపోయాయి. అతను నటించిన సినిమాల్లో మంచి విజయం సాధించినవి ఏవైనా ఉన్నాయంటే అవి ‘ప్రేమకథా చిత్రమ్‌, సమ్మోహనం’ మాత్రమే.

నటుడిగా భిన్నమైన పాత్రలు చేయాలన్న కసి సుధీర్‌బాబులో ఉన్నా… ఆ స్థాయి కథలేవీ అతన్ని పలకరించడం లేదు. ఆ మధ్య హిందీ చిత్రం ‘భాగీ’లోనూ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. మల్టీస్టారర్‌ మూవీ ‘శమంతకమణి’లో ఇప్పటికే నటించాడు. మరో మల్టీస్టారర్‌ ‘వీరభోగ వసంతరాయలు’ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంతో అతనే నిర్మాతగానూ మారి తీసిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఎన్టీయార్‌ నటించిన ‘గులేబకావళి కథ’లోని గీతం పల్లవినే తన సినిమాకు పేరుగా పెట్టేసుకున్నాడు సుధీర్‌బాబు.

కథ విషయానికి వస్తే సింపులే… ‘బోయ్‌ మీట్స్‌ ద గర్ల్‌’ టైప్‌. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మేనేజర్‌ కార్తీక్‌ (సుధీర్‌బాబు). చాలా స్ట్రిక్స్‌ పర్సన్‌. ఎవరినీ క్షమించడు. పెద్ద వర్క్‌హాలిక్‌. నాన్నమ్మ చనిపోతే కూడా చివరిచూపుకు వెళ్లలేనంత బిజీ. అలాంటి కార్తీక్‌కు తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు మేనమామ. కానీ ఆ అమ్మాయేమో అప్పటికే తానొకడిని ప్రేమించానని, ఎలాగైనా ఈ పెళ్లి జరక్కుండా చూడమని కార్తీక్‌నే వేడుకుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఇప్పటికే సిటీలో సిరి అనే తన కొలిగ్‌ను ప్రేమించానని తండ్రితో అబద్ధం చెబుతాడు కార్తీక్‌. ఆఫీస్‌ పని తప్పితే వేరే ధాస్యలేని కార్తీక్‌ ప్రేమలో పడటం తండ్రికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సిరిని చూడటానికి ఓ రోజు పల్లె నుండీ హైదరాబాద్‌ వస్తాడు. దాంతో స్నేహితుడి సాయంతో షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించే ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ మేఘనను సిరిగా తండ్రికి పరిచయం చేస్తాడు. కేవలం తండ్రి కోసం రెండు రోజుల పాటు జీవితం లోకి ఆహ్వానించిన మేఘన ఆ తర్వాత కార్తీక్‌ జీవితంలోకి ఎలా శాశ్వతంగా ప్రవేశించిందన్నదే మిగతా కథ.

కథగా చెప్పుకోవాలంటే చాలా రొటీన్‌. ఇలాంటి మిస్‌ అండర్‌ స్టాండింగ్‌ లవ్‌ స్టోరీలు తెలుగులో వందలకు పైగా వచ్చాయి. అయితే హీరో క్యారెక్టరైజేషన్‌, హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌పై దర్శకుడు ఎక్కువగా ఆధారపడ్డాడు. అవి రెండు కాస్తంత కొత్తగా ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాడు. ఈ ప్రేమకథకే ఇటు హీరో వైపు నుండీ ఫాదర్‌ సెంటిమెంట్‌, అటు హీరోయిన్‌ వైపు నుండీ మదర్‌ సెంటిమెంట్‌ను జత కలిపాడు. దాంతో యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ కాస్త ఫ్యామిలీ డ్రామాగా మారిపోయింది. ఎంచుకున్న నటీనటుల నుండి మంచి నటన రాబట్టుకోవడంలో కొత్తవాడైనా దర్శకుడు ఆర్‌.ఎస్‌.నాయుడు సఫలీకృతుడయ్యాడు.

నిజానికి సుధీర్‌బాబుది సీరియస్‌ పాత్ర కాబట్టి పెద్దగా నటించడానికి ఏమీలేదు. అయితే.. పతాక సన్నివేశంలో తన ప్రేమను నిజాయితీగా వ్యక్తపరిచే దగ్గర బాగా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్‌ది మాటకారి పాత్ర. దానికి తగ్గ అమ్మాయిని ఏరి కోరి తెలుగు చిత్రసీమలోకి తీసుకొచ్చారు. కన్నడ నటి నభా నటేశ్‌ ఇందులో మేఘన/సిరి పాత్ర పోషిం చింది. చాలా చక్కగా ఆ పాత్రలో ఒదిగి పోయింది. సినిమా ఆద్యంతం బోర్‌ కొట్టకుండా సాగిందంటే ఆమె నటన కారణంగానే. ఇక ఇతర ప్రధాన పాత్రలను నాజర్‌, జీవా, తులసీ, వేణు, రవివర్మ, వర్షిణి తదితరులు పోషించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే కన్నడ సంగీత దర్శకుడు, ‘కిరాక్‌ పార్టీ’ ఫేమ్‌ అజనీష్‌ బి. లోక్‌నాథ్‌ స్వరాలు సమకూర్చాడు. ట్యూన్స్‌ రొటీన్‌కు భిన్నంగా ఉన్నాయి. సురేశ్‌ రగతు సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. చోటా కె ప్రసాద్‌ కూర్పు కూడా బాగుంది. నిర్మాతగా సుధీర్‌బాబుకు, దర్శకుడిగా ఆర్‌.ఎస్‌. నాయుడుకు ఇది మొదటి సినిమా కాబట్టి చాలా పరిమితులకు లోబడే సినిమా తీశారని అర్థమవుతోంది. ఎక్కడా అతిగా పోకుండా ఎంతవరకూ కథ డిమాండ్‌ చేస్తుందో దాని వరకే చూసుకున్నారు.

సహజంగా హీరోలు తమ సత్తా చాటే కథల కోసమే, లేదా ప్రయోగాత్మ చిత్రాల కోసమో నిర్మాతలుగా మారతారు. కానీ రొటీన్‌ లవ్‌స్టోరీని తెరకెక్కించడానికే సుధీర్‌ బాబు నిర్మాత ఎందు కయ్యాడో అర్థం కాదు.. ఇలాంటి కథను ఎవరైనా నిర్మించడానికి సహజంగానే ముందుకొస్తారు. అయితే దర్శకుడు కొత్తవాడు కాబట్టి ఎలా డీల్‌ చేస్తాడో అనే సందేహం కోట్లు ఖర్చుపెట్టే నిర్మాతలకు ఉండొచ్చు. ఆ రకంగా దర్శకుడిని నమ్మి సుధీర్‌ నిర్మాతగా మారాడని అనుకోవాలి. ఏదేమైనా.. హీరోగానే కాకుండా నిర్మాతగానూ సుధీర్‌బాబును ‘నన్ను దోచు కుందువటే’ ఓ మెట్టు పైకి ఎక్కించింది. భారీ అంచ నాలు పెట్టుకోకుండా వెళ్లి చూస్తే నచ్చుతుంది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *