మల్కంబ్‌కు మంచిరోజులు..

మల్కంబ్‌కు మంచిరోజులు..

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో క్రీడలు సైతం ఎంతో భిన్నంగా, వైవిధ్యభరితంగా ఉంటాయి. సాంప్రదాయ క్రీడలు, గ్రామీణ, అంతర్జాతీయ.. ఇలా ఎన్నో రకాల ఆటలు మనకు కనిపిస్తాయి. అయితే వ్యాయామ క్రీడగా, పోల్‌ జిమ్నాస్టిక్స్‌గా పేరుపొందిన మల్కంబ్‌ క్రీడకు సైతం ప్రస్తుతం మంచిరోజులొచ్చాయనే చెప్పాలి. ప్రపంచస్థాయిలో మల్కంబ్‌ క్రీడల్ని నిర్వహించడమే కాదు, ఐపీఎల్‌ తరహాలో మల్కంబ్‌ లీగ్‌ను సైతం నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది.

ప్రపంచీకరణతో

ప్రపంచీకరణ పుణ్యమా అంటూ భారత క్రీడారంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ లాంటి గ్లోబల్‌ గేమ్స్‌తో పాటు.. కుస్తీ, వాలీబాల్‌, కబడ్డీ లాంటి క్రీడల్లో సైతం ప్రొఫెషనల్‌ లీగ్‌లు జోరుగా సాగిపోతున్నాయి. ఈ లీగ్‌లతో క్రీడాకారులకు ఆర్థిక భద్రతతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు సైతం దక్కుతోంది. దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఖో-ఖో, మల్కంబ్‌ లాంటి క్రీడలు సైతం.. ప్రొఫెషనల్‌ లీగ్‌ల వైపు చూస్తున్నాయి.

ఏమిటీ మల్కంబ్‌?

దీనినే పోల్‌ జిమ్నాస్టిక్స్‌ అని కూడా పిలుస్తారు. నేలపైన పాతిన ఓ కొయ్యస్తంభంపై వేలాడుతూ.. వివిధ భంగిమల్లో క్రీడాకారులు విన్యాసాలు చేయటాన్నే మల్కంబ్‌ క్రీడ అంటారు. ఎంతోకాలం నుంచి భారత ప్రజలకు సుపరిచితమైన ఈ పురాతన క్రీడలో తాడు సాయంతో చేసే విన్యాసాన్ని రోప్‌ మల్కంబ్‌, కొయ్య స్తంభంపైన చేసే విన్యాసాన్ని పోల్‌ మల్కంబ్‌గా పరిగణిస్తున్నారు. ఇందులో రాణించా లంటే జిమ్నాస్టిక్స్‌లో కొద్దిపాటి ప్రవేశం ఉండితీరాలి. శరీరాన్ని విల్లులా వంచే నైపుణ్యం, చెక్కుచెదరని ఏకాగ్రత, శారీరక పటుత్వం, శరీరంపై నియంత్రణ ఉన్నవారు మాత్రమే ఈ ఆటలో రాణించ గలుగుతారు.

మల్కంబ్‌ క్రీడ అభివద్ధి కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ప్రత్యేక క్రీడా సంఘా లున్నాయి. మనదేశంలో 1958లో నిర్వహించిన తొలి జాతీయ జిమ్నాస్టిక్స్‌లో భాగంగా మల్కంబ్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టారు. భారత జిమ్నాస్టిక్స్‌ పర్యవేక్షణలోనే జాతీయ మల్కంబ్‌ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్జా తీయ స్థాయిలో మాత్రం ప్రపంచ మల్కంబ్‌ సమాఖ్య పోటీలను నిర్వహిస్తూ వస్తోంది.

విదేశాలలో సైతం

భారత సాంప్రదాయ క్రీడ మల్కంబ్‌కు ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా లాంటి దేశాలలో సైతం ఆదరణ ఉంది. 2004లో స్పెయిన్‌ వేదికగా ప్రపంచ మొట్టమొదటి మల్కంబ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో భారత్‌ తిరుగులేని విజేతగా నిలిచింది.

ముంబైలోని శివాజీపార్క్‌ వేదికగా ఇటీవలే ప్రపంచ మల్కంబ్‌ పోటీలు విజయవంతంగా నిర్వహించారు. ఈ టోర్నీలో ఆతిథ్య భారత్‌తో సహా మొత్తం 15 దేశాల జట్లు, క్రీడాకారులు తలపడ్డారు. స్పెయిన్‌, జర్మనీ, చెక్‌ రిపబ్లిక్‌, ఇటలీ, అమెరికా, ఇరాన్‌, నార్వే, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, మలేసియా, సింగపూర్‌, జపాన్‌, వియత్నాం, బహ్రెన్‌ దేశాలు పురుషుల, మహిళల విభాగాలలో తమ నైపుణ్యాన్ని చాటుకొన్నారు. టీమ్‌ విభాగంలో భారత్‌ మొత్తం 244.73 పాయింట్లతో విజేతగా నిలిచింది. 44.45 పాయింట్లతో సింగపూర్‌ రెండు, 30.22 పాయింట్లతో మలేసియా మూడు స్థానాలు సాధించాయి. పురుషుల, మహిళల విభాగాలలో భారత క్రీడాకారులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. అయితే.. మల్కంబ్‌ క్రీడ ప్రపంచస్థాయిలో విస్తరించాలంటే ఐపీఎల్‌ తరహాలో లీగ్‌ నిర్వహించడం మినహా వేరే దారి లేదని భారత జిమ్నాస్టిక్స్‌ సంఘం ప్రతినిధులు అంటున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యాన్ని కలిగించే.. ఏమాత్రం క్రీడాపరికరాలు, ఖర్చులేని ఈ క్రీడను పాఠశాల స్థాయి నుంచే ప్రవేశపెట్టాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ మానసపుత్రిక ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సైతం మల్కంబ్‌ను విస్తృతంగా నిర్వహించా లని సలహా ఇస్తున్నారు. ప్రపంచంలోనే యువజన జనాభా ఎక్కువగా ఉన్న దేశం భారత్‌లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే మల్కంబ్‌ లాంటి సాంప్రదాయ క్రీడల అవసరం ఎంతైనా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించాలి.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *