పరాజయాల బాటలో విజయపు ‘మజిలీ’ !

పరాజయాల బాటలో విజయపు ‘మజిలీ’ !

నాని నటించిన ‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా మారాడు శివ నిర్వాణ. అలానే నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’తో నిర్మాతలుగా చిత్రసీమలోకి అడుగుపెట్టారు సాహు గారపాటి, హరీష్‌ పెద్ది. విశేషం ఏమంటే… ఆ దర్శకుడు, ఈ నిర్మాతలు కలిసి ఇప్పుడు నాగచైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ సినిమా రూపొందించారు. తొలి చిత్రంలో భగ్న ప్రేమను కథావస్తువుగా తీసుకున్న శివ నిర్వాణ ఇప్పుడు కూడా ఆ జానర్‌లోనే ‘మజిలీ’ని తెరకెక్కించాడు.

పూర్ణ (నాగ చైతన్య) వైజాగ్‌లో తండ్రి చాటున పెరిగిన కుర్రాడు. చదువుమీద కంటే కొడుక్కి క్రికెట్‌ ఆట మీదే ఆసక్తి ఉందని గ్రహించిన ఆ రైల్వే ఉద్యోగి… అందులోనే రాణించమని ప్రోత్సహిస్తాడు. క్రికెట్‌లో తన సత్తా చాటుకుంటున్న సమయంలో పూర్ణ నేవీ ఆఫీసర్‌ కూతురు అన్షు (దివ్యాన్ష్‌ కౌషిక్‌)తో ప్రేమలో పడతాడు. ఇద్దరి మనసులూ కలిసి, ఇక పెద్దలను ఒప్పించాలని అనుకుంటున్న టైమ్‌లో అన్షు ఇంట్లో వీరి ప్రేమ వేరే వారి వల్ల తెలుస్తుంది. దాంతో పూర్ణపై దాడి జరుగుతుంది. అతని ప్రాణాలు ఎలాగైనా కాపాడాలనే తపనతో, తండ్రి కోరిక మన్నించి, అన్షు వైజాగ్‌ నుండి వెళ్లిపోయి, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుంది. దాంతో పూర్ణ భగ్న ప్రేమతో మందుకు బానిస అయిపోతాడు. క్రికెటర్‌ కావాలనుకున్న కోరికకూ ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తాడు. తండ్రి అనారోగ్య కారణంగా, ఆయన మాట కాదనలేక తమ కాలనీలోనే ఉండే శ్రావణి (సమంత)ని అయిష్టంగానే పెళ్లాడతాడు. ఎప్పటి నుంచో పూర్ణతో వన్‌ సైడ్‌ లవ్‌లో ఉన్న శ్రావణి… తిరిగి అతడిని తన వాడిగా ఎలా చేసుకుంది? వీరి వైవాహిక జీవితం కష్టాల కడలి దాటి… ఎలా ముందుకు సాగిందన్నది మిగతా కథ.

ఇలాంటి కథలకు సహజంగానే ప్రేక్షకులలో ఓ రకమైన సానుభూతి ఉంటుంది. ప్రేమను, లక్ష్యాన్ని, జీవితం పట్ల ఆశను పోగొట్టుకున్న వ్యక్తి తిరిగి తన కాళ్ల మీద తాను ఎలా నిలబడ్డాడు అనే అంశాన్ని సమర్థవంతంగా, ఆసక్తికరంగా తెరకెక్కించగలిగితే, గతంలో ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా… కొత్త చిత్రానికీ పట్టం కడతారు జనం. ‘మజిలీ’ విషయంలోనూ అదే జరిగింది. ఇందులోని సన్నివేశాలు, కథాగమనం కొత్తగా లేకపోయినా… పూర్ణ బాధకు, శ్రావణి మానసిక వ్యధకు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. ఇక బేబీ అనన్య పాత్ర ప్రవేశించిన తర్వాత సమస్యకు ఆమె ద్వారా పరిష్కారాన్ని చూపడంతో కన్వెన్స్‌ అవుతారు.

భగ్న ప్రేమికుడి పాత్రలు పోషించడంలో నాగచైతన్యకు మంచి అనుభవమే ఉంది. అది తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున నుండి అబ్బిందనుకోవాలి. పైగా గతంలో ‘ఏం మాయ చేశావే’, ‘ప్రేమమ్‌’ వంటి సినిమాల్లో చేసిన అనుభవం ఇప్పుడు అక్కరకొచ్చింది. కొత్తమ్మాయి దివ్యాన్ష్‌ పాత్ర పరిధి మేరకు చక్కగానే నటించింది. ఇక ద్వితీయార్థమంతా సినిమాను సమంత తన భుజానకెత్తుకుందనే చెప్పాలి. తన అభినయ పటిమతో ప్రేక్షకులను, అభిమానులను మెప్పించింది. ఇతర ప్రధాన పాత్రలను రావు రమేశ్‌, పోసాని, అతుల్‌ కులకర్ణి, సుబ్బరాజు, రవిప్రకాశ్‌, బేబీ అనన్య చక్కగా పోషించారు. కొత్తవాడైనా దర్శకుడు శివ నిర్వాణ ప్రధాన పాత్రలను చక్కగా మలిచాడు. అయితే… వీటికి పరిపూర్ణమైన ముగింపు కలిగించే విషయంలో మాత్రం శ్రద్ధ చూపలేదు. అది చేసి ఉంటే… సినిమాకు మరింత నిండుతనం వచ్చి ఉండేది. క్లయిమాక్స్‌లో పూర్ణ, శ్రావణి కలయికకి ఇచ్చిన ప్రాధాన్యం మిగిలిన పాత్రలకు ఇవ్వలేదు. దర్శకుడు శివ నిర్వాణ రాసిన సంభాషణలు బాగున్నాయి. కొన్ని చోట్ల అతని మాటలు ప్రేక్షకులతో చప్పట్లూ కొట్టించాయి. గోపీసుందర్‌ స్వర పరిచిన బాణీలు రెండుమూడు హృదయానికి హత్తుకునేలా ఉండగా, తమన్‌ సైతం తన నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. విష్ణుశర్మ కెమెరా పనితనం బాగుంది. తన తొలి చిత్రం ‘నిన్ను కోరి’లో అందమైన వైజాగ్‌ పరిసరాలను చూపించిన శివ నిర్వాణ ఈ సినిమాలో ఓల్డ్‌ వాల్తేర్‌ను కాప్చర్‌ చేసే ప్రయత్నం చేశాడు.

మొత్తం మీద గత కొంతకాలంగా పరాజయాలతో ప్రయాణిస్తున్న నాగచైతన్యకు ‘మజిలీ’ రూపంలో శివ నిర్వాణ మంచి విజయాన్ని అందించా డనే చెప్పాలి. అందుకు సమంత నటన కూడా దోహదపడింది. తొలి చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ నిరాశ పరిచినా నిర్మాతలు సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ సినిమా నిర్మాణం విషయంలో రాజీ పడలేదు. ఆ ఫలితాన్ని వారిప్పుడు పొందారు. అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా, వినోదం కోసం పక్కదార్లు తొక్కకుండా తాను అనుకున్న కథను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో శివ నిర్వాణ సఫలుడయ్యాడు. ప్రేమకథలను ఇష్టపడే వారికి ‘మజిలీ’ నచ్చుతుంది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *