కొడుకులాంటి వాడు

కొడుకులాంటి వాడు

మాధవ్‌తో మాట్లాడి వెంటనే టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు శ్రవణ్‌. టికెట్‌కి పెట్టిన ధర చూసి అతని ప్రాణం వుసూరు మంది. ఈ ఏడాదిలో ఇది మూడోసారి ఇలా పరుగెత్తటం.

తమ్ముడు ప్రణవ్‌కి ఫోన్‌ చేసాడు. ‘అవును. ఇప్పుడే నాకు కూడా ఫోన్‌ చేసాడు’ అన్నాడు ప్రణవ్‌.

‘నేను వెళ్తున్నాను. మరి నువ్వేం చేస్తావ్‌?’ అని తమ్ముడిని అడిగాడు.

‘ఏమో! నాకు ఏమీ తోచడం లేదు. రెండు నెలలు కూడా అవలేదు నేను వెళ్లి’ అన్నాడు.

అంతలోనే జెన్నీ ఫోన్‌. జెన్నీ వాళ్లిద్దరి తోడబుట్టిన చెల్లెలు. పేరు జానకి. అందరూ జెన్నీ అంటారు.

ముగ్గురూ కాన్ఫరెన్స్‌ కాల్‌లో కాసేపు తర్జన భర్జనలు పడ్డారు.

‘ఏవిటో అమ్మ సునాయాసంగా వెళ్లిపోయింది. నాన్నగారు అవస్త పడుతున్నారు’ అంది జెన్నీ.

‘మరి ఏమంటావ్‌?’ అని మాధవ్‌ని అడిగారు ముగ్గురు.

అతనేం చెప్తాడు!?

‘ఇలా ఉంది బాబుగారికి. మరి మీ ఇష్టం. మీ వీలు చూసుకోండి’ అన్నాడు.

ముగ్గురూ మరి కాసేపు చర్చించుకున్నారు.

ముందు శ్రవణ్‌ వెళ్లేట్లు, ఆ తర్వాత పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేట్లు అనుకున్నారు.

శ్రవణ్‌ విమానం ఎక్కాడు.

అతను హైదరాబాద్‌ చేరే సరికి కృష్ణారావు కోమాలోకి వెళ్లిపోయాడు. హాస్పిటల్‌లో ఉన్నాడు మాధవ్‌. శ్రవణ్‌ని చూడగానే ఏడ్చేసాడు.

శ్రవణ్‌ లోపలికి వెళ్లి తండ్రిని చూసి వచ్చి డాక్టర్‌ని కలిశాడు. వాళ్లు కూర్చోబెట్టి బోలెడంత సమాచారం అందించారు.

‘ఎన్నాళ్లయినా ఉండచ్చు. లేదా రేపే పోవచ్చు. వెంటిలేటర్‌ మీద పెట్టమంటే పెడతాం. ఇంటికి తీసుకువెళ్లాలంటే పంపిస్తాం’ అని నిర్ణయం ఈయనకే వదిలేశారు.

మళ్లీ ముగ్గురూ మాట్లాడుకున్నారు. నీ ఇష్టం. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సమర్ధిస్తాం అన్నారు తమ్ముడు, చెల్లెలు. నాలుగు రోజులు గడిచాయి. ఇంట్లో ఉండి హాస్పిటల్‌కి వెళ్లి వస్తున్నాడు శ్రవణ్‌. మాధవ్‌ హాస్పిటల్‌లోనే ఉన్నాడు.

పరిస్థితిలో మార్పు లేదు. శ్రవణ్‌కి ఏం చెయ్యాలో తోచలేదు. అవతల సెలవు అయిపోతోంది. మాధవ్‌తో సంప్రదించాడు.

‘ఇంటికి తీసుకువెళ్దాం పెద్దబాబు. నేను చూసు కుంటాను’ అన్నాడు మాధవ్‌.

ఆ మాటకు వస్తే గత పదిహేనేళ్లుగా అతనే చూసుకుంటున్నాడు. రాముడికి హనుమంతుడిలాగా సేవ చేస్తున్నాడు.

కృష్ణారావు గారు చాలా మంచి ఉద్యోగం చేశారు. ఆయనకి ముగ్గురు పిల్లలు. అందుకని ఏడు వందల గజాల స్థలం కొని పెద్ద ఇల్లు కట్టాడు. వెనక పనివాళ్లు ఉండటానికి చిన్న ఇల్లుతో సహా అన్ని హంగులూ ఏర్పాటు చేశాడు.

ఆ సమయంలో వాళ్ల ఊరి నుంచి తండ్రి దగ్గర పాలేరుగా పని చేసిన రాజన్న, తన కొడుకును వెంట బెట్టుకుని వచ్చాడు ‘అయ్యా. వీడు మాధవ్‌. మీరే ఏదో దారి చూపించాలి’ అన్నాడు.

బయట ఉద్యోగం ఇప్పించినా ఎక్కడా నిలదొక్కు కోలేకపోయాడు మాధవ్‌. ఇలా కాదు అని డ్రైవింగ్‌ నేర్పించి తనదగ్గరే పెట్టుకున్నాడు. అది మొదలు ఆయన దగ్గరే ఉండి పోయాడు మాధవ్‌. వాళ్లింట్లో ఒక మనిషి లాగా ఉన్నాడు. ముగ్గురు పిల్లలు ఒకరి వెనక ఇంకొకరు అమెరికా వెళ్లి పోయారు. పెళ్లిళ్లు అయ్యాయి. మాధవ్‌కీ పెళ్లయింది.

అందరికీ పిల్లలు కలిగారు. కృష్ణారావు దంపతులు మాధవ్‌తో ఆ ఇంట్లో ఉండిపోయారు. కడుపున పుట్టకపోయినా కొడుకులా ఉన్నాడు. మాధవ్‌ భార్య వసంత మంచి పిల్ల. ఆ దంపతులని కూతురి లాగా కనిపెట్టుకుని ఉంది.

కాలం గడు స్తోంది. కృష్ణారావు పిల్లలు ముగ్గురూ అక్కడి పౌరసత్వం పొందారు.

కృష్ణారావు భార్య తన అరవై మూడో ఏట చనిపోయింది. మామూలుగా రాత్రి భోజనం చేసి కూచుంది. హఠాత్తుగా పక్కకి ఒరిగి పోయింది. హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. అప్పటికే ప్రాణం పోయింది.

పిల్లలు వచ్చారు. ఒంటరిగా వదలటం ఇష్టం లేక తండ్రిని వెంట తీసుకువెళ్లారు. నాలుగు నెలలు అక్కడే ఉండి తిరిగి వచ్చాడు కృష్ణారావు.

తల్లి సంవత్సరీకాలకు వచ్చారు ముగ్గురు. ఆ సమయంలోనే ఒక బిల్డర్‌ వీళ్లింటికి వచ్చాడు. అది మంచి సెంటర్‌. ఆ స్థలం ఇస్తే అందులో పెద్ద కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కడతా నన్నాడు.

తండ్రిని అడిగారు. ఆయనకు భార్య పోయాక దేని మీదా ఆసక్తి లేకుండా పోయింది. మీ ఇష్టం అన్నాడు.

సగం బిల్డర్‌కి, సగం వీళ్లకి. వీళ్ల వాటా నాలుగు భాగాలు చేసి తలో భాగం అనుకున్నారు.

కృష్ణారావు వద్దన్నాడు. నా పెన్షన్‌ నాకు చాలు. నా పేర పెట్టటం, నా అనంతరం మళ్లీ పంచు కోవడం. ఎందుకూ హైరానా? మూడు భాగాలుగా చేసి తలో భాగం తీసుకోండి అంటూ ఒక్క మాట మాత్రం చెప్పాడు.

మాధవ్‌ నన్నే కనిపెట్టుకుని ఉన్నాడు. మీతో సమానంగా కాక పోయినప్పటికి వాడికీ ఏదో ఏర్పాటు చెయ్యడం న్యాయం అన్నాడు.

కొడుకులు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎలాగూ! ఉన్న ఇల్లు ఖాళీ చెయ్యాలి. కాబట్టి ఆయనకు వేరే ఇల్లు చూడాలి. అద్దె ఇంటి బదులు టూ బెడ్రూం ఫ్లాట్‌ కొంటే సరిపోతుంది. పెద్ద వయసులో ఆయన స్వంత ఇంట్లో ఉంటేనే మంచిదనుకున్నారు.

వాళ్ల అదృష్టం బావుంది. వాళ్లు అనుకున్న ధరలో మూడు బెడ్రూంల ఇల్లు దొరికింది. అయిదేళ్ల క్రితం కట్టినదే అయినా బావుంది. మాధవ్‌ కుటుంబంతో అందులోనే ఉంటాడు. ఆయన తదనంతరం ఆ ఇల్లు మాధవ్‌కి ఇద్దాం అనుకున్నారు. కృష్ణారావు తృప్తి పడ్డాడు. ఇల్లు మారారు.

అవతల ఆ బిల్డింగ్‌ పూర్తి అయింది. ముగ్గురికీ తలో అంతస్తు వచ్చాయి. పెద్ద కంపెనీల వాళ్లు బోలెడంత అద్దె చెల్లించి లీజ్‌కి తీసుకుని షో రూమ్స్‌ పెట్టుకున్నారు.

కృష్ణారావు ఇంకా ఎంతో కాలం బతకను. ఓ ఏడాది. మహా అయితే రెండేళ్లు అని ఆశ పడ్డాడు. కానీ పుష్కరం దాటిపోయింది భార్య గతించి. ఆయన వయస్సుతో పాటు వచ్చిన అనారోగ్యాలతో లాక్కొస్తున్నాడు. కొడుకులు దూరాన ఉన్నారు కాబట్టి మాధవ్‌, వసంత ఆయన్ని కనిపెట్టుకుని ఉన్నారు. ఏడాది నుంచి ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. సీరియస్‌ అవనూ, అమెరికా నుంచి పిల్లలు రానూ, ఈయన కోలుకొని ఇంటికి రానూ… అదే జరుగు తోంది. ప్రస్తుతం అదే పరిస్థితి.

కోమాలో ఉన్నకృష్ణారావుని మాధవ్‌ చెప్పినట్లు ఇంటికి తీసుకుని వచ్చారు. శ్రవణ్‌ మర్నాడు అర్ధరాత్రి ప్లైట్‌కి టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు.

‘ఏ మాత్రం తేడా చేసినా నాకు ఫోన్‌ చెయ్యి. ఎవరో ఒకరం వస్తాం’ అన్నాడు.

ఆ అవసరం లేకుండా మర్నాడు పొద్దున్నే కన్నుమూసాడు కృష్ణారావు. అమెరికా నుంచి అందరూ వచ్చారు.

విత్తం కొద్దీ విభవం. ఘనంగా చేశారు. బంధు వులు కొద్ది మందిని మాత్రమే కాశీ సమారాధనకు పిలిచారు. మర్నాడు ఘనంగా సంతాప సభ. హోటల్లో లంచ్‌. అయిదు వందల మంది వచ్చారు. కుటుంబంలోని వారు అందరూ తెల్లని బట్టలు కట్టుకుని ముత్యాల నగలు ధరించారు. స్టేజ్‌ మీద తెల్లటి పూలతో అలంకరణ. మధ్యలో ఆయన ఫోటో. మరో వైపు తెర మీద ఆయన ఫోటోల స్లయిడ్‌ షో. గొప్పగా చేశారు తండ్రికి అని మెచ్చుకున్నారు అందరూ.

మరో రెండు రోజుల తర్వాత ప్రయాణం.

ఆ వేళ ఆయన పిల్లలు ముగ్గురూ కష్ట సుఖాలు మాట్లాడుకున్నారు. ఆ ఇంటి ప్రసక్తి వచ్చింది.

అప్పుడు పాతిక లక్షలకు కొన్నా, ఇప్పుడు ఆ ఏరియా బాగా పెరిగిపోయింది. ఇప్పటి ధరల ప్రకారం నలభై లక్షలు చేస్తుంది. అప్పుడే ఆ ఇల్లు మాధవ్‌ పేర పెడుతూ అగ్రిమెంట్‌ రాయమన్నాడు కృష్ణారావు.

వాళ్లే వద్దనుకున్నారు. ఆస్తి చూసి అతనికి చెడు ఆలోచనలు కలుగుతాయి. అది తండ్రికి క్షేమం కాదు సమయం వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నారు. తీరా సమయం వచ్చేసరికి వాళ్ల ఆలోచనల్లో మార్పు వచ్చింది.

‘అప్పుడు ఏదో అనుకున్నాం. ఇప్పుడు చూస్తే అనవసరం ఏమో అనిపిస్తోంది. అంత గొప్పగా ఏం చేశాడు! సుఖంగా నాన్న గారితో ఈ ఇంట్లో ఉండి టి.వి., ఏసీ, అన్ని హంగులూ ఎంజాయ్‌ చేశాడు. భోజనం ఇక్కడే. ఇక ఖర్చు ఏముంది? నాన్న గారు ఇచ్చిన జీతం అంతా మిగులే’ అన్నాడు ప్రణవ్‌.

‘జీతం సరే. నాన్న గారి పెన్షన్‌లో ఆయన ఖర్చు పోగా మిగిలిన డబ్బు ఏమయింది అని ఏనాడూ ఆయనా చెప్పలేదు, మనమూ అడగలేదు. బాగానే వెనకేసి ఉంటాడు’ అంది జెన్నీ.

‘ఏదో అమెరికాలో ఉన్నాం అని పేరేగానీ మనం మాత్రం ఏం గొప్పగా ఉన్నాం. అందులోనూ ఈ మధ్య కాలంలో ప్రయాణాలకు బోలెడు ఖర్చు అయింది. చెప్పుకోకూడదు గానీ ఆయన పోయాక సామాన్యంగా అయిందా?’ అన్నాడు శ్రవణ్‌.

‘కార్యక్రమం చేయించినందుకే లక్షన్నర తీసు కున్నాడు. మరి అస్తికలు కలపటానికి అలహాబాద్‌ ప్రయాణం. హోటల్లో లంచ్‌. మొత్తం లెక్కేసుకుంటే పది దాటింది’ అన్నాడు ప్రణవ్‌.

‘ఈ కార్యక్రమంలో ఆడపిల్ల ఖర్చు పెట్టకూడదు అన్నారు. అందుకే నేను షేర్‌ చెయ్యలేదు. కానీ మనం ¬టల్‌ ఉన్నాం. ఆ ఖర్చు నేనే పెట్టాను’ అంది జెన్నీ.

అలా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు.

ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురూ పంచు కుంటారు. మాధవ్‌కి ముగ్గురూ తలో రెండు లక్షలు ఇస్తారు. దాంతో అతను ఏదైనా వ్యాపారం చేసుకుంటాడు.

మాధవ్‌కి ఈ విషయం చెప్పారు.

వసంత ఖంగు తిన్నది. మాధవ్‌ ఇవేమీ పట్టించు కునే స్థితిలో లేడు. కృష్ణారావు అతని జీవితంలో ఒక భాగం. ఆ వెలికి తట్టుకోక పోతున్నాడు.

శ్రవణ్‌ వాళ్లు నిదానంగా ఖాళీ చెయ్యమని చెప్పారు. కానీ వసంతకి ఇంకా ఆ ఇంట్లో ఉండాలి అంటే మనసు ఒప్పలేదు. వెంటనే ఇల్లు వెతికింది.

ఇంట్లోని వస్తువులను కూడా పట్టుకెళ్లమన్నది జెన్నీ.

వద్దు చిన్నమ్మా. అవన్నీ మీవే. అనేసి తమ సామాను మాత్రమే తీసుకుంది.

మిగిలిన వారు వెళ్లిపోయినా కొడుకులు మరి కొన్నాళ్లు ఉండి ఇల్లు అమ్మేసి వెళ్లారు. వెళ్లేముందు మాధవ్‌కి ఆరు లక్షలు ఇచ్చి వెళ్లారు.

అందరూ తమ తమ పనుల్లో పడిపోయారు గానీ మాధవ్‌ మాత్రం కోలుకోలేదు. ఒక రోజు వసంత బాగా చీవాట్లు పెట్టింది.

‘ఇట్లా ఏడుస్తూ కూచుంటే ఇల్లు గడవద్దా? పిల్లలూ నేను ఏమైపోవాలి? నీకు డ్రైవింగ్‌ వచ్చు. ఎక్కడైనా పని చూసుకో. లేదంటే వాళ్లిచ్చిన డబ్బుతో కారు కొనుక్కుని తిప్పుకో’ అని మందలించింది.

‘ఒక్క పదిరోజులు వదిలెయ్‌. కాస్త బాధ తగ్గితేగానీ పని చెయ్యలేను’ అన్నాడు.

‘ఏవిటి నీ వెర్రి. కడుపున పుట్టిన వాళ్లే మామూలుగా ఉంటే పరాయి వాడివి. నీకెందుకు ఇంత బాధ?’ అంది.

‘పాతికేళ్ల నుండి కూడా ఉన్నాను. నేనంత తేలిగ్గా మర్చిపోగలనా?’ అన్నాడు కళ్లు తుడుచుకుంటూ.

నిజమే పెరట్లో పెరిగిన చెట్టు మీదా, పెంచుకున్న కుక్క మీదనే మమకారం పెరుగుతుంది. మరి ఒక మనిషితో అనుబంధం పెంచుకుని ఆ వ్యక్తి దూర మయితే ఆ బాధ భరించటం సామాన్యమా? సమయం పడుతుంది.

సరిగ్గా అప్పుడే దేవతలా వచ్చింది సుమతి.

ఆవిడని చూడగానే బావురుమని ఏడ్చాడు మాధవ్‌.

సుమతి కృష్ణారావుకు ఆప్తురాలు. ఆయన పోగానే వచ్చి అన్నింటా నిలబడి సాయం చేసిన వ్యక్తి. ఆయనకు ఎంతో ఋణపడి ఉంది.

పాపం చిన్న వయసులోనే ఆమె భర్త చనిపోతే దూరపు బంధువు అయిన కృష్ణారావు చాలా సాయం చేశాడు.

కష్టాలు గట్టెక్కి జీవితంలో స్థిరపడిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్లింది. అప్పటికి ఆయన భార్య పోయి ఫ్లాట్‌లో ఉంటున్నాడు.

‘మీ ఋణం తీర్చుకోలేను బాబాయి గారూ’ అంది.

‘లేదమ్మా తీర్చుకోవాలి. తప్పదు’ అన్నాడు ఆయన.

ఆశ్చర్యపోయింది సుమతి ‘ఏ విధంగా? చెప్పండి’ అంది.

‘చెప్తాను నీకూ, నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. అలా అని నాకు ప్రమాణం చెయ్యి’ అన్నాడు. అలాగే అంది.

సుమతి షేర్‌మార్కెట్‌లో కొద్ది పెట్టుబడితో ప్రారంభించి బాగా నిలదొక్కుకుంది. ఇతరులకు సలహాలు ఇచ్చే స్థాయికి చేరి అదే వృత్తిగా చేసుకుంది. అది తెలుసుకున్న కృష్ణారావుకి ఒక ఆలోచన వచ్చింది.

‘సుమతి, కన్న పిల్లలకు ఇవ్వాల్సింది ఇచ్చేశాను. మాధవ్‌కే ఏమీ ఇవ్వలేదు. నా తదనంతరం ఈ ఇల్లు వాడికే అన్నారు కానీ ఎందుకో నాకు నమ్మకం కలగటం లేదు. నీకు కొంత డబ్బు ఇస్తాను. షేర్‌లలో పెట్టు. నాకు వీలైనప్పుడల్లా కొంత మొత్తం ఇస్తూ పోతాను. నేను వెళ్లిపోయాక వాడికి అందించు’ అన్నాడు.

‘మరి నా మీద నమ్మకం ఉందా బాబాయ్‌ గారూ మీకు?’ అని అడిగింది.

‘ఉంది’ అన్నాడు.

అప్పటి నుండి కుదిరినప్పుడల్లా ఇస్తూనే వచ్చాడు. మంచి షేర్స్‌ కొంటూనే ఉంది. పన్నెం డేళ్లలో బ్రహ్మాండంగా లాభాలు వచ్చాయి.

ఆ విషయం వివరంగా చెప్పి ‘ఇదుగో నీకు ఇంత డబ్బు ఉంది’ అంది సుమతి.

నిర్ఘాంతపోయాడు మాధవ్‌. వసంతకు కళ్లు గిర్రున తిరిగాయి.

‘అక్కా, ఇదంతా నిజమేనా?’ అని అడిగింది.

‘నిజమే వసంతా. బాబాయ్‌ గారు మీకోసం చేసిన ఏర్పాటు’ అంది సుమతి.

‘వద్దమ్మా. ఇవేమీ వద్దు. మాదేముంది ఎట్లాగో బతికేస్తాం’ అన్నాడు మాధవ్‌.

‘మాధవ్‌ ప్రేమ, మమకారం ఒకవైపు నుండే ఉండవు. నీకు ఆయన మీద ఎంత గౌరవం ఉందో ఆయనకీ నీ మీద అంతే వాత్సల్యం ఉండేది. వాడు నాకు కొడుకులాంటి వాడమ్మా అని చెప్పేవారు. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి ఆరాటం సహజమే’ అన్నది.

‘మరి పెద్దబాబు, చిన్నబాబు, జానకమ్మ ఏమంటారో?’ అంత డబ్బు అనే సరికి సంతోషం కంటే భయం ఎక్కువ అయింది మాధవ్‌కి.

‘ఏమీ అనరు. దీంతో వాళ్లకి సంబంధం లేదు. వాళ్లకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బాబాయ్‌ గారు స్పష్టంగా రాసి పెట్టారు’ అని చెప్పింది సుమతి.

పకడ్బందీగా ఆ మొత్తం మాధవ్‌ పేరున జమ చేసింది. చిన్న మొత్తం కాదు. అప్పుడు పిల్లలకు ఇచ్చిన ఆస్తికి ఓ నాలుగు మెట్లు తక్కువ అంతే. అతను ఏ లోటూ లేకుండా జీవించడానికి సరిపోతుంది.

ఈ సమాచారం అంతా అమెరికా చేరింది.

తెల్లబోయారు. తేలు కుట్టిన దొంగలా ఉంది వాళ్లకి. మింగలేక కక్కలేక అవస్త పడ్డారు.

జెన్నీ ఆగలేక సుమతికి ఫోన్‌ చేసింది.

‘ఇంకా ఎవరెవరికి ఏం దాచి పెట్టి ఇచ్చారు మా నాన్నగారు?’ అని అడిగింది.

‘ఇంకెవరు ఉన్నారు ఇవ్వటానికి. హక్కుదారులకు ఎప్పుడో ఇచ్చేశారు. కొడుకులాంటి వాడు కనుక అభిమానంతో ఇతనికి ఇప్పుడు ఇచ్చారు. నా మీద నమ్మ కంతో నాకు ఆ బాధ్యత అప్పగించారు’ అన్నది.

–  పొత్తూరి విజయలక్ష్మీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *