కింగ్‌ ఆఫ్‌ క్రికెట్‌

కింగ్‌ ఆఫ్‌ క్రికెట్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ 2018 సంవత్సరాన్ని అత్యంత విజయ వంతంగా ముగించాడనే చెప్పాలి. ఫార్మాట్‌ ఏదైనా పరుగుల మోతలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా, స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా కొహ్లీ అత్యుత్త మంగా రాణించిన ఏడాదిగా 2018 భారత క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోతుంది.

ఆధునిక క్రికెట్లో తిరుగులేని మొనగాడిగా పేరు తెచ్చుకున్న విరాట్‌ సాంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌, ఇన్‌స్టంట్‌ వన్డే, ధూమ్‌ధామ్‌ టీ-20 క్రికెట్‌.. ఫార్మాట్‌ ఏదైనా తనకు తేడా లేనే లేదని, పరుగుల మోత మోగించడమే తనకు తెలిసిన విద్య అని సత్తా చాటే క్రికెటర్‌.

గత ఏడాది కాలంలో అత్యధికంగా పరుగులు, సెంచరీలు సాధించడమే కాదు; టెస్ట్‌, వన్డే క్రికెట్‌ ఫార్మాట్లలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ ప్లేయర్‌గా నిలిచాడు.

జైత్రయాత్ర

2018 జనవరిలో సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ ద్వారా పరుగుల జైత్రయాత్ర ప్రారంభించిన కొహ్లీ ఇంగ్లండ్‌, విండీస్‌, సఫారీ, కంగారూ సిరీస్‌ల్లో అత్యుత్తమంగా రాణించాడు.

సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో సెంచరీతో సహా మొత్తం 286 పరుగులు సాధించడం ద్వారా టాప్‌ రన్‌రేటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత సఫారీలతో జరిగిన వన్డే, టీ-20 సిరీస్‌ల్లో కలపి మొత్తం 558 పరుగు లతో చెలరేగిపోయాడు. మొత్తం మూడు ఫార్మాట్ల లోనూ 871 పరుగులతో ‘వారెవ్వా’ అనిపించు కొన్నాడు.

అదే జోరు..

2018 ఇంగ్లండ్‌ టూర్‌లో సైతం విరాట్‌ తన దూకుడు కొనసాగించాడు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో 149 పరుగులతో శతకం బాది మూడు ఫార్మాట్ల సిరీస్‌లో ఏకంగా 894 పరుగులతో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో సహా 453 పరుగులు, టెస్ట్‌, వన్డే సిరీస్‌లో 637 పరుగులతో అగ్రస్థానం సంపాదించాడు.

ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా జరిగిన తీన్మార్‌ టీ-20 సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 61 పరుగులతో సిరీస్‌ సమం చేయటంలో ప్రధానపాత్ర వహించాడు. అంతేకాదు ఆసీస్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోనూ తన పరుగుల వేటను కొనసాగించాడు. సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా ముగిసిన తొలిటెస్టులో కేవలం 37 పరుగులు మాత్రమే చేసిన కొహ్లీ పెర్త్‌ వేదికగా ముగిసిన రెండో టెస్టులో మాత్రం మాస్టర్‌ క్లాస్‌ సెంచరీ సాధించాడు. 257 బాల్స్‌లో 123 పరుగులు నమోదు చేశాడు.

సూపర్‌ ఇన్నింగ్స్‌

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ వేదిక మెల్బోర్న్‌లో ముగిసిన బాక్సింగ్‌ డే టెస్టులో సైతం విరాట్‌ 32 స్కోరుతో మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వన్‌డౌన్‌ పూజారాతో కలసి 3వ వికెట్‌కు 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 82, రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా నిలిచి 2018 సీజన్‌ను ముగించాడు.

గత ఏడాది కాలంలో కొహ్లీ ఆడిన 13 టెస్టుల్లో మొత్తం 1322 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు శతకాలు సైతం ఉన్నాయి. ఇన్‌స్టంట్‌ వన్డే క్రికెట్లో 14 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 1202 పరుగులు సాధించాడు. పది టీ-20 మ్యాచ్‌ల్లో 211 పరుగులు తన ఖాతాలో జమ చేసుకొన్నాడు.

ఆరు.. ఆరు..

ఓవరాల్‌గా టెస్టుల్లో ఆరు, వన్డేల్లో ఆరు సెంచరీలు సాధించడం ద్వారా విరాట్‌ తన ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను మరింతగా పటిష్టం చేసుకోగలిగాడు. ప్రపంచ క్రికెట్‌ రారాజుగా నిలిచాడు. 2019లో సైతం విరాట్‌ ఇదే జోరును కొనసాగించడం ద్వారా టీమిండియాను తిరుగులేని విజేతగా నిలపాలని కోరుకుందాం!

కెప్టెన్సీ రికార్డు

విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా సౌరవ్‌ గంగూలీ పేరుతో ఉన్న 11 విజయాల రికార్డును విరాట్‌ కొహ్లీ సమం చేశాడు. మెల్బోర్న్‌ వేదికగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియా 137 పరుగుల విజయం సాధించడంలో కెప్టెన్‌గా తనవంతు పాత్ర నిర్వర్తించాడు. కొహ్లీ నాయకత్వంలో మొత్తం 24 టెస్టులు ఆడిన టీమిండియా 11 విజయాలు, 9 పరాజయాలు, 4 మ్యాచ్‌ల డ్రా రికార్డుతో ఉంది.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *