ఖేలో ఇండియా కొత్త ఊపిరి..

ఖేలో ఇండియా కొత్త ఊపిరి..

గత ఆరున్నర దశాబ్దాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైన భారత క్రీడారంగానికి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త ఊపిరి పోసిందనే చెప్పాలి.

సూపర్‌ హిట్‌

2018 ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌ను న్యూఢిల్లీ వేదికగా విజయవంతంగా నిర్వహించారు. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 651 జిల్లాలలో ప్రతిభాన్వేషణ శిబిరాలు నిర్వహించడం ద్వారా మొత్తం 16 క్రీడాంశాలలో 12వేల 415 మంది బాలబాలికలను గుర్తించారు. వీరంతా 17 సంవత్సరాలలోపు వారే కావడం గమనార్హం. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగిన తొమ్మిది రోజుల పోటీలలో భాగంగా అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, జూడో, కబడ్డీ, ఖో-ఖో, షూటింగ్‌, స్విమ్మింగ్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, కుస్తీ అంశాలలో పోటీలు నిర్వహించారు.

హర్యానా అగ్రస్థానం

ఖేలో ఇండియా నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌ విజేతలకు 199 స్వర్ణ, 199 రజత, 275 కాంస్య పతకాలను ప్రదానం చేశారు. ఈ పోటీలలో హర్యానా నుంచి అత్యధికంగా 396 మంది పాల్గొంటే, మహారాష్ట్ర నుంచి రికార్డుస్థాయిలో 188 మంది బాలికలు, యువతులు పాల్గొన్నారు. ఈ పోటీలు నిర్వహిం చడంలో 912 మంది వాలంటీర్లు, 1200 మంది అధికారులు, సాంకేతిక నిపుణులు పాలుపంచు కొన్నారు. చివరకు హర్యానా జట్టు అత్యధిక పతకాలతో ఓవరాల్‌ విజేతగా నిలిచింది.

మహారాష్ట్రలోని పుణె వేదికగా ముగిసిన ద్వితీయ ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌ను సైతం విజయ వంతంగా నిర్వహించారు. మొత్తం 360 కోట్ల రూపాయల్ని బడ్జెట్‌ నుంచి ఈ క్రీడలకు కేటాయించారు. ఈ క్రీడల్లో 10 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు యువతీయువకులు మాత్రమే పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. 2019 ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌లో దేశంలోని 29 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 6వేల మంది క్రీడాకారులు 18 రకాల క్రీడాంశాలలో తలపడ్డారు. ఆతిథ్య మహారాష్ట్ర తొలిసారిగా 200కు పైగా పతకాలు సాధించి ఓవరాల్‌ విజేతగా నిలిచింది. తొలి క్రీడల ఓవరాల్‌ విన్నర్‌ హర్యానా, ఢిల్లీ జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

మెరుపుతీగలు

ప్రారంభ ఖేలో ఇండియా గేమ్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన స్టార్‌ షూటర్లు మను బాకర్‌, సౌరవ్‌ చౌదరి, మేహులీ ఘోశ్‌, అథ్లెట్‌ జిస్నా మాథ్యూ, వెయిట్‌ లిఫ్టర్‌ లాల్‌రిన్‌ నుంగా, స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌, ఆర్చర్‌ ఆకాశ్‌ మాలిక్‌, సాక్షి చౌదరి, అభినవ్‌ షా, ప్రతిమా కుమార్‌, లాల్‌ టాన్‌ చుంగ్‌, కర్మాన్‌ కౌర్‌ తండీ వరుసగా రెండో ఏడాది సైతం తమ ప్రత్యేకతను చాటు కొన్నారు. అంతర్జాతీయ యువజన, జూనియర్‌ క్రీడల్లో సైతం పతకాల మోత మోగించారు. 2018 ఖేలో ఇండియా గేమ్స్‌ ద్వారా దూసుకొచ్చిన మను బాకర్‌, సౌరవ్‌ చౌదరీ గోల్డ్‌కోస్ట్‌ వేదికగా ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు మోత మోగిస్తే, అర్జెంటీనా రాజధాని బ్యునోస్‌ఏర్స్‌ వేదికగా ముగిసిన 2018 యువజన ఒలింపిక్స్‌, జకార్తా వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లో భారత బందం పతకాల మోత మోగించింది.

2014 యూత్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు మాత్రమే సాధించిన భారత్‌ 2018లో మూడు స్వర్ణాలు, 9 రజతాలు, ఓ కాంస్యంతో సహా మొత్తం 13 పతకాలతో సంచలనం సృష్టించింది. జకార్తా వేదికగా గత ఏడాది ముగిసిన ఆసియాక్రీడల్లో సైతం భారత అథ్లెట్లు అత్యుత్తమంగా రాణించారు. భారత్‌ 69 పతకాలతో అంచనాలకు మించి ఫలితాలు సాధించడమే కాదు, యువజన ఒలింపిక్స్‌లో సైతం అదేస్థాయి ఫలితాలు సాధించడం శుభసూచకం

ముందుచూపుతోనే

భారత అథ్లెట్ల ఈ ఘనత వెనుక ప్రధాని మోదీ కలల పథకం ఖేలో ఇండియా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన అథ్లెట్లను గుర్తించి నెలవారీ ఉపకార వేతనాలతో పాటు అత్యాధునిక శిక్షణ అందించిన కారణంగానే మను బాకర్‌, జెర్మీలాల్‌ రినుంగా, సౌరవ్‌ చౌధరి లాంటి నవతరం అథ్లెట్లు వెలుగులోకి రాగలిగారు. 2018 గోల్డ్‌ కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆసియాక్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య అనూహ్యంగా పెరగటం వెనుక ఖేలో ఇండియా పథకం ద్వారా వచ్చిన యువ అథ్లెట్ల కష్టం, ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతగానో దాగున్నాయి. 62 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌లో మిజోరం కుర్రాడు జెర్మీలాల్‌ రినుంగా బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. యువజన ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా రికార్డుల్లో చేరాడు. బాలికల 10 మీటర్ల ఏర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో మను బాకర్‌, బాలుర 10 మీటర్ల ఏర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో సౌరవ్‌ చౌధరి స్వర్ణభేరి మోగించారు.

బాలుర 10 మీటర్ల ఏర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో తుషార్‌ మానే, బాలికల 10 మీటర్ల ఏర్‌ రైఫిల్‌ విభాగంలో మేహులీ ఘోష్‌, బాలికల 44 కిలోల జూడోలో తబాబీ దేవి, బాలుర బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో లక్ష్య సేన్‌, బాలికల 43 కిలోల కుస్తీలో సిమ్రన్‌, బాలుర విలువిద్య వ్యక్తగత విభాగంలో ఆకాశ్‌ మాలిక్‌, 5 కిలోమీటర్ల నడకలో సూరజ్‌ పన్వర్‌ రజత పతకాలు అందించారు. బాలుర, బాలికల హాకీ విభాగాలలో సైతం భారతజట్టు రజత పతకాలు సాధించింది. బాలుర ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రవేల్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం మీద భారత బృందం 13 క్రీడల్లో పతకాలు సాధించడం విశేషం. హాకీ, జూడో, షూటింగ్‌ క్రీడల్లో తొలిసారిగా భారత అథ్లెట్లు పతకాలు సంపాదించారు. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించడానికి ఖేలో ఇండియా పథకంతో అంకు రార్పణ జరిగిందనడంలో సందేహం లేదు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *