కొబ్బరి తోటల సీమ కేరళ

కొబ్బరి తోటల సీమ కేరళ

నేషనల్‌ జాగ్రఫిక్‌ ట్రావెలర్స్‌ సర్వే (జాతీయ భౌగోళిక యాత్రికుల సర్వే) ప్రకారం ప్రపంచంలోనే దర్శించదగిన మొట్టమొదటి యాభై ప్రదేశాలలో కేరళ రాష్ట్రం చోటు సంపాదించడం విశేషం.

కేరళ అందచందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నదులు, ఎత్తైన కనుమలు, లోతైన లోయలు, రకరకాల పూలతోటలు, వనమూలికలు, అరేబియా సముద్రం… ఇలా ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి.

అంతేకాకుండా శబరిమల అయ్యప్ప క్షేత్రం, చిన్నార్‌ వన్యమృగ సంరక్షణ కేంద్రం; అలెప్పి, మున్నార్‌, ఎర్నాకుళం, గురువాయార్‌, తిరుశూర్‌, కాసరగడ్‌, మల్లంపూజ, పాలక్కాడ్‌, కన్నూర్‌, తొయ్యం, వైనాడ్‌, కొయక్కుడి లాంటి ఎన్నో వేసవి విడిదులన్నాయి. భూమి మీద పచ్చని దుప్పటి పరచినట్లనిపించే తేయాకు, కొబ్బరి, మలబారు తోటలు పర్యాటకులను కనువిందుచేస్తాయి.

‘కిట్టువనం’ సరస్సులో ఆకర్షణీయమైన హౌస్‌బోట్లు చాలా ఉంటాయి. యాత్రికుల కోసమే వీటిని నిర్మించారు. ఇవి చాలా విశాలంగా ఉంటాయి. ఈ ప్రాంతం ముఖ్యంగా కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. దాదాపు 500 నుండి 1000 కొబ్బరి తోటలుంటాయి.

అలెప్పి

కేరళలో అత్యంత చూడదగ్గ ప్రదేశాల్లో అలెప్పి ఒకటి. ఇది అలప్పుజా జిల్లా ముఖ్యకేంద్రం. బ్యాక్‌వాటర్‌ సందర్శక కేంద్రంగా దీనికి మంచి పేరుంది. ఇది హౌస్‌బోట్లు, స్నేక్‌బోట్లకు ప్రసిద్ధి.

అలెప్పి వెళ్లాలంటే మున్నార్‌ నుండి 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దారికిరువైపులా కొబ్బరి చెట్లు, పచ్చని పకృతి మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఇక్కడ ముఖ్యమైన ప్రయాణ సాధనాలు పడవలే.

ఈ ప్రాంత అందాలను చూసేందుకు సందర్శకుల కోసం దాదాపు వెయ్యి హౌస్‌బోట్లు తయారుగా ఉంటాయి. వీటిలో ప్రీమియం, డీలక్స్‌, లగ్జరీ.. ఇలా వివిధ సౌకర్యాలతో ఉంటాయి.

పడవల్లో కూడా చాలా రకాలుంటాయి. సిట్టింగ్‌, లివింగ్‌, డైనింగ్‌.. అన్ని పడవల్లో ఏసీ, వైఫై, టీవీ., హోటళ్లు, మెడికల్‌ స్టాల్స్‌ మొదలైన సౌకర్యా లుంటాయి. పడవ మీద ఎక్కి కూర్చునేందుకు ‘సన్‌డెక్‌’ ఉంటుంది.

సాయంకాలం పడవలో సుమారు 4 నుంచి 6 గంటలు నీటిలో ప్రయాణించి రాత్రంతా అక్కడే సేద తీరి పొద్దున్నే తిరిగి వస్తే ఆ మజాయే వేరు. ఇందులో కొన్ని ప్యాకేజీలుంటాయి. ఒకరాత్రికి గాని, లేదా ఒక పగలుకు గాని టూరిజం వాళ్లతో ప్యాకేజీ మాట్లడుకోవచ్చు. టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌, కాఫీ, టీలు… మొత్తం వారే ఏర్పాటు చేస్తారు.

‘నెహ్రూ ట్రోఫీ బోట్‌ రేసింగ్‌’ కి అలెప్పి ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో రెండో శనివారం నాడు ఇక్కడ పడవ పందేలు నిర్వహిస్తారు. వీటినే ‘స్నేక్‌బోట్‌ రేస్‌’ అని కూడా అంటారు. ప్రతీ పడవకు వెనకభాగంలో పదిన్నర అడుగుల ఎత్తులో నాగుపాము చిత్రం మనకు కనిపిస్తుంది.

నూటనలభై అడుగుల పొడవుండే ఈ పడవలు ఒకేసారి దాదాపు వంద వరకు పందెంలో పాల్గొనడం విశేషం. ఇరవై బృందాలు ఈ పోటీల్లో పాల్గొంటాయి.

వీటిని చూసేందుకు కొన్ని లక్షలమంది స్థానికులతో, పాటు పర్యాటకులు బారులుతీరతారు. వందమంది పోటీదారులు ఒకే సారి పడవలకు తెడ్డు వేయడం చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది.

అలెప్పిలో ‘ఓనం’ పండగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ప్రాంత ప్రజలు వంటల్లో తాజా కొబ్బరినూనె ఎక్కువగా వాడుతారు. ఇది ఆరోగ్యదాయకం కూడా.

సంప్రదాయాలు

కథాకళి, మోహినీ వంటి ప్రాంతీయ నృత్యాలు చూపరులను ఆకట్టుకుంటాయి. కేరళ ప్రజలు ఏనుగులను నడుస్తున్న గురువాయారప్పన్‌ (దేవుడు) గా భావిస్తారు. ధనికులు ఆలయాలకు ఏనుగులను కానుకలుగా ఇస్తుంటారు. ఉత్సవాలప్పుడు దేవుళ్లను ఏనుగుల మీదే ఊరేగిస్తారు.

అలెప్పికి దగ్గరలోనే ఆరునేండ్రంలో అనంతపద్మనాభ స్వామి ఆలయం ఉంది. అక్షరాస్యత పరంగా కేరళ మనదేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అలెప్పిలో కూడా విద్యాధికుల శాతం చాలా ఎక్కువ. ఆయుర్వేద వైద్యానికి ఈ రాష్ట్రం పెట్టిందిపేరు.

ఇలా వెళ్లొచ్చు..

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ప్రాంతాల నుంచి కేరళ వెళ్లేందుకు రైలు సదుపాయం ఉంది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి కూడా కేరళలోని ఎర్నాకుళం చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రైవేట్‌ బస్సుల్లో గాని, కార్లలోగాని అలెప్పి వెళ్లొచ్చు. అక్కడ బస చేసేందుకు చాలా హోటళ్లు ఉన్నాయి.

– డా|| మంతెన సూర్యనారాయణరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *