కాలాతీతం

కాలాతీతం

‘శ్రీకృష్ణ జయంతి రెండునే వచ్చేసిందేవిఁటే అమ్మాయీ! ఇంకా నయం.. కాలెండర్‌ చూసు కున్నావట సరిపోయింది. శ్రావణ బహుళ షష్ఠి లగాయితు భాద్రపదమంతా అన్నీ పర్వదినాలే..’

ఉదయ కాలపు పూజా కార్యక్రమాలు సంతృప్తిగా ముగించుకొని- తడి, పొడి, మడి బట్టలు మార్చుకుని స్థిమిత పడ్డాక జగదీశ్వరమ్మ గారు నింపాదిగా కళ్లద్దాలు తగిలించుకుని – హాల్లో పెద్ద సింహాసనం లాంటి పాతకాలపు టేకు కుర్చీలో సుఖాసీనురాలై వెంకట్రామా అండ్‌ కో వారి తెలుగు కాలెండర్‌ తిరగేస్తోంది. ఏ పండగైనా సరే నెల రోజుల ముందే జగదీశ్వరమ్మ గారింట్లో ప్రవేశిస్తుంది. ఇల్లు, వాకిళ్లు దులుపుకోవటం, కడుక్కోవటం- ముంగిట్లన్నీ ముగ్గులతో నింపేయడం, రంగులు నింపటం.. గుమ్మం, గుమ్మానికి లేత మావిడాకు తోరణాలు కట్టటం.. పరిస్థితిని బట్టి ముందస్తుగానే ప్రారంభి స్తుంది. అప్పటికి వారం రోజుల ముందు నుంచి దిండు క్రింది పంచాగం తీసి ‘అయితే.. ఏమీ వారం.. రెండు.. ఆదివారమే నంటావేమిటే కృష్ణ జయంతి..’ అంటూనే ఉంది.. అన్నిసార్లు వరలక్ష్మి ‘ఊఁ..ఊఁ.. అంతే నమ్మా..’ అంటుంటుంది. నిజానికావిడకి ఇదేమీ పట్టదు కానీ తల్లికోసం కొంత సర్దుకుంటుంది. అంతటితో తృప్తి పడదావిడ. కూతురి మాటమీద అసలు లక్ష్యం ఉండదు. ఏ కరివేపాకనో, గోరింటా కనో లేకపోతే పూజకు మందార పూలకోసమనో గుమ్మంలోకొచ్చే పిల్లల్ని ‘కృష్ణ జయంతి ఎప్పు డంటోందే మీ మామ్మ’ అంటే వాళ్లు వెర్రిమొహం వేసుకుని బిక్కుగా ‘ఏమీ అంటం లేదండీ మామ్మ గారూ’ అంటారు. అటువంటి సమాధానం మామ్మ గారసలు సహించలేదు. ‘అనకపోవటమేమిటే పిల్లా.. ఇంతింత అక్షరాల్తో కాలెండర్‌లో రాసుంటేనూ’ అని చూపిస్తుంది. ఇదంతా వాళ్లకెందుకో ఆ పిల్లలకి తెలియదు. అయినా ఆవిడ్ని ధిక్కరించలేక ‘అవునండీ మామ్మగారూ. ఇదిగో రెండో తారీఖు కృష్ణజయంతి అని రాసారు’ అంటారు. ఆవిడ తృప్తిపడి ‘ఊఁ సుందరమ్మకి చెప్పు.. చూసిందో లేదో… భగవద్గీత ఒక్క అధ్యాయమన్నా చదువు కోమను.’ ఇలా ఒకటికి పది అభిప్రా యాలు సేకరించాక ఆవిడ ఆరాటం మరీ పెరిగిపోతుంది. ఇదొక్కటే కాదు పుష్యం మొదలు మార్గశిరం వరకు సంవత్సరమంతా మూడు వందల అరవై రోజులూ వచ్చే పండగలు, పర్వదినాలు, ఏకాద శులు, జయంతులు, వర్ధంతులు, జాతీయ దినాలూ ఏదీ వదల దావిడ. అన్నీ యథావిధిగా సంద ర్భానికి తగినట్టూ శాస్త్రోక్తంగా పాటించాల్సిందే! డెబ్భై ఏళ్ల పైబడిన వృద్ధురాలు- శరీర శ్రద్ధ ఏమాత్రంలేని మనిషి. ఈ స్నానాలు, జపాలు, గుళ్లు- గోపురాలు అంటూ ఆరాటపడి ఎక్కడ మూలపడుతుందోనని కూతురు భయం.

‘ఏవిఁటేమ్మా.. నీ చాదస్తం.. మరీ నాగుల చవితీ, అట్లతద్దీ కూడా ఎందుకే నీకు. ముఖ్యమైనవి పాటిస్తే సరిపోదూ’ తల్లీ, కూతుళ్ల మధ్య ఇరవయ్యేళ్ల అంతరముంది. ఆవిడీ మధ్యే కారణాంతరాల వల్ల పుట్టింటికి వచ్చిచేరింది. మిగతా నలుగురు దూరప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ‘అదెలా కుదురుతుంది? ఏ దేవుడి విలువ ఆ దేవుడిదే! మళ్లీ ఏడాద్దాకా వస్తాయా ఇవాళ వెళ్లిపోతే.. ఏడాది తరువాత మాట.. ఏమో.. ఎవరు చెప్పగలరు? జన్మలన్నింటిలోనూ హైయెస్టు మానవ జన్మ అంటారు. ఇలాగైనా సద్వినియోగం చేసుకోకపోతే ఎలా?’ తను చెప్పదలచుకున్నదాన్ని చెదురు ముదురుగా ఆంగ్ల భాషా పదాలు ప్రయోగిస్తుంటుంది జగదీశ్వరమ్మగారు.. ‘అబ్బో..!’ అని ఎవరన్నా విని సరదాగా నవ్వితే..’ ఏం ముసలిదాన్నైనంత మాత్రాన చదువు, సంధ్యాలేని దాన్ననుకుంటున్నావా…? మా తాతగారు డిప్టీ కలక్టరుగిరీ చేసారు. మా అమ్మ ఆ రోజుల్లోనే ఎనిమిదో తరగతి, హిందీ రాష్ట్ర భాష చదివారు ఇక మా అత్తగారింట్లో డిగ్రీకి తక్కువ చదివిన వాళ్లెవరూ లేరు. మా ఊళ్లో అప్పట్లో హైస్కూలు లేనందున మా నాన్నగారు మమ్మల్ని.. అంటే నేను, మా తమ్ముడు, చెల్లి అన్నమాట జట్కా బండిలో పెనుమంట్ర స్కూల్‌కి పంపించి ఎనిమిది వరకూ చదివించారు. పెద్దమనిషి కాకుండా పెళ్లి చేసేయా లన్న ఆచారం మూలాన మీ తాతగారికిచ్చి పెళ్లి జరిపించాక చదువు ఆగిపోయింది. యామనుకుంటు న్నావు పిల్లా… మీ తాతగారేం సామాన్యులను కుంటున్నావా.. పే.. ద్ద.. స్వాతంత్య్ర సమర యోధులు.. ఉద్యమంలో ఆస్థిపాస్థులన్నీ వెళ్లి పోబట్టి కాని.. జమీందారీ వంశం… ఎంతపేరు.. ఎంత

ప్రతిష్ఠ.. మా మేనత్తకు చిన్నతనంలోనే భర్తపోతే మా తాతగారా రోజుల్లోనే ద్వితీయం చేసారు. ఆదర్శమంటే ఆదర్శమే.. ఆంధ్రరాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు గాంధీగారి విడిదెక్కడో తెలుసా నీకు..! మా పెదమామగారి మేడ.. లంకంత భవనం.. గోస్తనీ కాలువ ఒడ్డున.. ఇప్పుడు ఆడపిల్లల హైస్కూలుందే.. అది.. యావఁను కుంటున్నావట’ అవతలి వాళ్లు ఏమీ అనుకునే స్థితిలో ఉండరు. ఒక్కసారిగా మూడొందల సంవత్సరాల నాటి బ్రిటిష్‌ ఇండియా నుండి బయట పడలేక విలవిలలా డుతుంటారు.

వరలక్ష్మికి తల్లి ధోరణి నచ్చదు.. నచ్చదంటే.. వినేవాళ్లు ఆవిడ్ని ఎగతాళిగా అనుకుంటారని భయం. లేనిపోని గొప్పలు చెప్తోందను కోవచ్చు. ఆ స్వాతంత్య్ర సమరం, ఉద్యమాలు, ఆ జైలు శిక్షలు ఎవరిక్కా వాలిప్పుడు! అయినా ఆవిడగారు చెప్పేది చెప్పేదే! అందుకే పెద్దవాళ్లకి గతం

తప్ప భవిష్యత్తు ఉండదంటారు. ఆ పురావైభవ గాధలు వివరిస్తుంటే లీలగా మెరుస్తుండే అభిజాత్యంతో సూటైన ముక్కున ఉన్న మూడురాళ్ల రవ్వల బేసరి దగదగ మరింత దేదీప్యమానంగా నాటి వైభవాన్ని తలపిస్తూ వెలిగి పోతుంటుంది. మొగలిపువ్వు రంగులో కాంతి వంతంగా ఉండే ఆ ముఖం గంభీరమైన ప్రకాశంతో అబ్బురపరుస్తుంది. ‘ఎంత బతుకమ్మా..! ఎన్ని చూస్తే ఇంతదాన్నయ్యాను!’ అన్న ముక్తాయింపుతో నిట్టూర్పు విడుస్తుంది.

——————————–

ఇంటి మెయిన్‌ హాల్లో నాలుగు గోడలకు చెక్కబద్దీల మీద ఇనప తీగలకు వ్రేలాడుతూ ఆ వంశ వృక్షమంతా ఒక క్రమంలో పటాలు కట్టి ఉంటాయి. నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు సింహద్వారం దాటి లోపలికి వచ్చేవాళ్లని గంభీరంగా స్వాగతిస్తూ ఉంటాయి. భారీ ఫ్రేముల్లో బిగించిన నిలువెత్తు అందమైన మధ్యవయస్కుల ఛాయా చిత్రాలు కొత్తగా వచ్చిన వాళ్లని చాలా ఆకట్టుకుంటాయి. ఎన్నోసార్లు చూసిన పరిచయస్థులు, మిత్రులు కూడా వాటివంక మరోసారి చూడకుండా ఉండలేరు. ‘మా అమ్మ వాగ్దేవి.. మా నాన్నగారు శ్యాంమోహనరావు.. కుడి వైపు ఉన్నది మా తాతగారు.. నాయనమ్మ.. ఇటువైపు ఉన్న ఫోటోలు మా మామగారు, అత్తగారునూ. మిగతావన్నీ మా అన్నయ్యలు, వదినెలు, అక్కాచెల్లెళ్లు- బావ మరుదులూ’ అని పరిచయం చేస్తుంది జగదీశ్వరమ్మగారు.

‘దేవీ నవరాత్రులొస్తున్నాయి. పిల్లలకి దసరా సెలవులని ఉంటాయి కదా. అక్కని, అన్నయ్యల్ని, వదిన పిల్లల్నీ.. అందరినీ రమ్మని చెప్పాలి..’ అని అందరికీ ఫోన్‌చేసి ‘ముందుగానే చెప్తున్నాను పిల్లల సెలవులున్నాళ్లు మీరు ఆఫీసుకి సెలవుపెట్టి రండి..’ అని హుకుం జారీ చేసింది.

‘అప్పటికప్పుడు సెలవంటే ఎలా.. ఇది ఉద్యోగమా మరోటా.. పండగలెక్కడికి పోతాయి.. ఏటా వచ్చేవే కదా.. మళ్లీ మళ్లీ.. దసరా కాకపోతే దీపావళి..’

‘అవెక్కడికీ పోవు.. మనమే పోతాం కాలమొస్తే.. వచ్చే ఏడు తిరిగి వస్తామో రామో చెప్పలేం..’

ఇక మాట్లాడటానికి అతని నోరు పెగలలేదు.

‘అందరూ వస్తారు లేమ్మా.. అలా మాట్లాడకే అన్నయ్య పాపం బాధపడతాడు’.

‘ఆఁ.. వస్తాడు.. తప్పించుకుందామని చూస్తాడు.. వసతులు లేవని.. కాస్త ఇల్లు, వాకిలి శుభ్రం చేయించు..’ పత్తి బుట్ట దగ్గరకు తీసుకుని గోడకానుకుని కూర్చుంది జగదీశ్వరమ్మ.

‘ఆ.. సమంతను పిలుస్తాలే.. కాసిన్ని రోజులు పోనీ పండగల ముందు చేయిద్దాం..’

పత్తంతా నిదానంగా గింజలేరి విడదీస్తూ.. ‘అదోటి దొరికింది నీకు సమంత.. సినిమా తారలా ముస్తాబై వస్తుంది చెవిలో ఫోనిరికించుకుని.. పని చేసే లక్షణమేమన్నా ఉందా దానికి..’

‘మనిషి కాస్త షోగ్గా ఉంటుంది కాని పనిమాత్రం బానే చేస్తుంది. ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు. అదంతా మనం పట్టించుకోకూడదు మరి..!’

గణేశ స్తోత్రం మొదలెట్టి సమస్త దేవదేవతల అష్టోత్తర శతనామాలు గణగణ వల్లె వేస్తూ వత్తుల తయారీ కార్యక్రమంలో పడింది మామ్మగారు.

ఇంటికి పదిచారల దూరంలో గోస్తనీ నది. ప్రాచీన సోమేశ్వర స్వామివారి ఆలయ ప్రాకారాన్ని ఒరుసుకుని ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీక మాసం మొత్తం ఆవిడకు క్షణం తీరదు. అందుకు తగిన ఏర్పాట్లలో పత్తి కొని వత్తులు చేసుకోవటం ముఖ్య మైన పని. ప్రతి సంవత్సరం చాలా ముందుగానే ‘వత్తుల పత్తి మామ్మగారు’ అంటూ అలవాటుగా ఇచ్చివెడతాడు ఒక వ్యాపారి. ‘పత్తి దొంగతనంగా కాని, చెప్పకుండా కాని, ఉచితంగా కానీ తీసుకో రాదురా అబ్బీ..! వచ్చే జన్మలో బొల్లి రోగం పట్టుకుంటుంది’ అని గీచి, గీచి బేరమాడి దీపాలకు, నిత్య దీపారాధనకు కావలసినంత ముడి సేకరిస్తుంది. కార్తీక దీపాలకు, నిత్య దీపారాధనలకు కావలసినన్ని వత్తులు తయారు చేసుకోవటం ఆవిడ కెంతో ఇష్టం. కొన్న పత్తంతా గింజలేరి శుభ్రంచేసి ముందు ఎండలో పెడుతుంది. భోజనానంతరం మధ్యాహ్నాలు పంచలో కాళ్లు చాపుకుని, చేతులకు వెలిబూడిద పూసుకుని దారం పొడవుగా లాగి తొడలమీద ఉంచి పురెక్కించి రకరకాల సైజుల్లో బుట్టనిండుగా జాజి మొగ్గలు నింపినట్లు వత్తులు చేస్తుంది.

‘పది రూపాయలిస్తే బజార్లో దొరుకుతాయి. ఇంకా ఈ రోజుల్లో నడుం పడిపోయేటట్లు తినీ తినగానే ఈ వత్తులు చేసుకోవటమేమిటే అమ్మ.. మళ్లీ నడిరాత్రే లేచి కూర్చుంటావు. కాసేపు నడుం వాల్చకూడదా..’ అంటుంది వరలక్ష్మి. ‘ఎందుకు దొరకవు.. పత్తి పత్తిలా విడదీసి నాలుగేసి దారపు పోగులు తగరపు కాగితాల్లో చుట్టి అమ్ముతారు. అన్నీ పైపై మెరుగులే కదా.. అసలు సరుకు కంటే పైపై ఆర్భాటాలకే విలువ.. ఒకటి తెలుసుకో.. దైవ కార్యానికి ఉపయోగించేవి మనం స్వయంగా శుచిగా శుభ్రంగా చేసుకోవాలి. అసలు కాస్త స్థలముంటే నాలుగ్గింజలు చల్లి ముడిపత్తి కూడా చక్కగా మన పెరట్లోనే పండించుకోవచ్చు.. అసలు శ్రద్ధ ఉండాలి. ‘శ్రద్ధావాసి లభతే జ్ఞానం’ అన్నారు. శ్రద్ధ ఉన్నవారికే భగవంతుడు కరుణించి జ్ఞానాన్నిస్తాడు.’

‘ఏం శ్రద్ధో కదే.. గంధపు చెక్కలా అరిగి పోతున్నావు కదే..!’ ఎట్టి పరిస్థితిలోను ఆత్మ విశ్వాసాన్ని కోల్పోని తల్లితో అనలేక లోలోపల వ్యధపడుతుంది వరలక్ష్మి.

మూడో ఝాము పూర్తికాకుండానే కొబ్బరికాయ, అరటిపళ్లు, దీపారాధనకు చిన్న తేనెసీసాలో నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, అగరత్తులు, ర్పూరం బిళ్లలు, మందార పూలు.. అన్నీ జాగ్రత్తగా పూజ బుట్టలో సర్దుకుని – నిద్రపోతున్న కూతుర్ని లేపకుండా తలుపులు దగ్గరగా వేసి నది ఒడ్డుకు చేరుకుంటుంది. ముందు కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి మరీ వస్తుంది నదికి. ‘మరీ ఛాదస్తం.. నదికి వెడుతున్నది స్నానానికే కదా. మళ్లీ ఇంట్లో చెయ్యటమెందుకు’ అడిగిందో అమాయకురాలు ఆవిడగారితో నదీస్నానా నికి వచ్చి.. ‘అవునే ఇంతేనుటే.. భ్రమరాంబ… నీకు తెలిసింది. గోదావరంటే ఏమనుకుంటున్నావు.. ఆషామాషీ పిల్లకాలవను కుంటున్నావా… జలదేవత, పుణ్య పుష్కరిణి, జీవనది.. మనందరి ప్రాణాధారం.. ఆ పుణ్య ప్రవాహంలో మలినమైన కాళ్లతో దిగి – శరీరాలను, మనసులకు అంటిన పాపాలను ప్రక్షాళన చేసుకుంటున్నాం. ఒక దేవాలయంలో ప్రవేశించే టప్పుడు పరిశుభ్రమైన దేహంతో, దైవస్మరణతో, పరిశుద్ధమైన హృదయంతో ఎలా ఉంటామో అదేవిధంగా నదీ ప్రవాహంలో పవిత్ర స్నానం చెయ్యాలి. తెలుసుకుని పాటించవలసిన నియమాలు మన సనాతన ధర్మంలో ఎన్నో ఉన్నాయి. తెలియని ఈతరం పిల్లలకు చెప్పాలి.’

ఆధ్యాత్మిక మార్గంలో ఆవిడ్ని అనుసరించి – తరించే ప్రయత్నాలు తెలుసుకోవాలని కొందరు చుట్టుపక్కల స్త్రీలు చేరుతుంటారు. ఆరోజు తిథి – నక్షత్రాలు తెలుసుకోవటం దగ్గర్నించి, సందేహాలు, లోతైన ధర్మసూక్ష్మాలు తెలుసుకోవటాని ఆవిడ్ని ఆశ్రయిస్తారు. అయితే ఒక్కోసారి ఆవిడగారు చెప్పేవి ఆచరణకు సాధ్యం కానివని భయపడి మధ్యలో వదిలేస్తుంటారు. ‘ఆధ్యాత్మిక మార్గానికి అడ్డదారులు, షార్ట్‌కట్‌లు ఉండవే అమ్మాయి…’ అంటూ నవ్వుతుందావిడ.

——————————–

‘మనిషి సంకల్పిస్తాడు, భగవంతుడు వికల్పిస్తాడు…’ మామ్మగారు కోరుకున్నట్లు ఆవిడ సంతానం ముగ్గురు మగ పిల్లలు, అమ్మాయి.. పిల్లాపాపలతో కలిసికట్టుగా వచ్చేసారు నవరాత్రులకి బాగా ముందే…!

పదిరోజుల క్రితం మామ్మగారు తన డెబ్భై ఏడో ఏట ముగించుకుని డెభై ఎనిమిదిలోకి అడుగు పెట్టింది. అయితే ఆకస్మాత్తుగా ఆ రోజు నుంచే ఆవిడ ఆరోగ్యంలో పెద్దమార్పు సంభవించింది. వారం పదిరోజులలో కంటికి కనపడని రుగ్మతేదో ఆవిడ్ని లొంగతీసుకుంది. ఉధృతవేగంతో ప్రవహించే చైతన్య వాహిని గ్రీష్మ తాపానికి ఎండిపోయినట్లు చూస్తుండగానే వాడిపోయింది. సంవత్సరాలుగా జీవిత విధానాలుగా పరమ నిష్ఠతో ఆవిడ పాటిస్తూ వస్తున్న నిత్య నైమిత్తికాలన్నీ వెనకబడిపోయాయి. తల్లిని చూస్తుంటే వరలక్ష్మి గుండె జారిపోతోంది. విషయం తెలిసి పిల్లలంతా ఉన్నవాళ్లు ఉన్నట్లు వచ్చిపడ్డారు. ‘పెద్ద వయస్సు.. ఉపశమనం కోసం తప్ప మందులు పెద్దగా పనిచెయ్యవు’ అన్నారు డాక్టర్లు. పిల్లల సంతృప్తి కోసం ఇచ్చిన మందులు మింగుతోంది.. ‘ఎవరికైనా ఇది సహజమే. సునాయాసంగా వెళ్లిపోతే అదే అదృష్టం. అమ్మాయి వరం తులసమ్మకు నీళ్లు పొయ్యి.. అమ్మవారి ముందు దీపంపెట్టు.. భాగవతం కాసేపు చదువుతావూ..’

ఇటువంటి పరిస్థితిలో ఆవిడ ఉండగా ఆశ్రమ ప్రారంభోత్సవానికి శ్రీస్వామివారు వస్తున్నారని తెలిసింది. ఇప్పుడాయన మన ఊరికే వస్తున్నారు. ‘వరం నన్నెలాగైనా తీసుకెళ్లవే.. ఆ మహానుభావుడి దర్శనం చేసుకుంటే నా జన్మకు సార్థం దక్కుతుంది.’ వారి అనుగ్రహ భాషణలూ గ్రంథాలూ ఎన్నో చదువుకుందావిడ. ఇప్పుడాయనే స్వయంగా తమ ఊరినే పాదస్పర్శతో పునీతం చెయ్యబోతున్నారు. దర్శనం చేసుకుని… నమస్కరించుకోకుండా ఉండగలదా. మనసాగుతుందా. ‘ఏమిటీ పరీక్ష..! అమ్మ లేవలేని స్థితిలో ఉంది. తీసుకెళ్లి దర్శనం చేయించకుండా ఉండగలదా..’ అందరూ కూడా ఎలాగోలా ఆవిడ్ని స్వామి సన్నిధిలోకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. కూతురి సాయంతో స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించింది మామ్మగారు. స్వామివారు సరిగ్గా మూహూర్త సమయానికి ప్రధాన మార్గం గుండా ఊరేగింపుగా గోదావరి తీరంలోని ఆశ్రమానికి చేరుకుంటారు. ‘ప్రాప్తముంటే దర్శంచు కోగలుగుతాను. ఏమో ఆయన సంకల్పమెలా ఉందో..’ అనుకుంటోంది.

‘అమ్మా.. మెల్లిగా నా చెయ్యి పట్టుకొనిలే… ఆశ్రమానికి వెడదాం ముహూర్తం వేళవుతోంది.. రిక్షా వచ్చింది…’ పిల్లలు సాయం చేస్తుంటే మామ్మగారు ఎక్కడలేని శక్తి వచ్చినట్టు వాళ్ల ఆసరాతో చప్పున పైకి లేచింది. వీధి గుమ్మం దాకా వచ్చి నిలవలేక చేతుల్లోంచి కుప్పలా క్రిందకు జారిపోయింది ‘అమ్మా.. అమ్మా.. ఏమైంది’ పిల్లలు విలవిలలాడు తున్నారు. ‘ఏం… లేదు.. వెడదాం.. స్వామి దర్శన మౌతుంది.. యతీశ్వరులు.. ఆయనే వస్తారు..’ అంటోంది అస్పష్టంగా.. మగతగా..

ఆకస్మాత్తుగా తమ వీధి మొగలోంచి పెద్ద పెట్టున మంగళ వాద్యాలు, వేద ఘోష, జయజయ నినాదాలు వినిపించి ఆశ్చర్యపోతున్నారు.. ‘ఏమైంది.. స్వామి ప్రధాన మార్గంలో కాకుండా ఇటువైపు నుంచి వస్తున్నారే..’ సంభ్రమంతో తడబడపోతూ.. ‘అమ్మా.. స్వామి మన వీధిలోకే వస్తున్నారమ్మా.. కొంచెం ఓపిక తెచ్చుకునిలే.’

జన ప్రవాహం దారి మార్చుకుని ఇటువైపుకి పరుగులు తీస్తోంది.

‘ప్రధాన మార్గంలో ఏదో ప్రమాదం జరిగింది. ఊరేగింపు ఇటు మళ్లించారు.. తప్పుకోండి.. స్వామి వస్తున్నారు..’

ఈ హఠాత్సంఘటనకు చకితురాలైంది జగదీశ్వరమ్మగారు. ఒక్కసారిగా మహాబలమేదో తననావహించగా వీధి గుమ్మంలోకి వచ్చింది. ఆవిడ దోసిట్లో మల్లెపూలు ఉంచింది వరలక్ష్మి. ముందు పూర్ణకుంభంతో, వేద మంత్రఘోష దిక్కులను పిక్కటిల్ల చేస్తుండగా- మేళతాళాలతో శిష్యబృందం, పుర ప్రముఖులు అల్లంత దూరంలో అనుసరించి వస్తుండగా పరమాచార్య స్వామి మామ్మగారి వాకిలి ముందుకు వచ్చారు.. ‘అమ్మా… స్వామి… దణ్ణం పెట్టుకో..’ తల్లిని పొదివి పట్టుకుంది వరలక్ష్మి. సరిగ్గా ఇంటి ముందుకు వచ్చి క్షణం ఎందుకోన్నట్లు ఆగారు ఆచార్యులవారు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న కళ్లలోంచి ఆనందాశ్రువులు దొర్లిపోతుండగా ‘స్వామీ.. పరమాచార్య.. ధన్యుర్నాలి’ పాదాలపై పూలుంచి ఆర్తిగా ప్రణామం చేసింది జగదీశ్వరమ్మ గారు. చిరునవ్వుతో దయగా చూస్తూ ఆవిడ శిరస్సు మీద చెయ్యి ఉంచి ‘శుభం’ అని అనుగ్రహించి అంతలోనే ముందుకు కదిలారు స్వామి. నివ్వెరపాటుకు గురై నోట మాటలేక అట్టే నిలబడి పోయిన జనం ‘మామ్మగారు అదృష్టవంతులు.. అందుకే స్వామివారి ఊరేగింపు ఇటువైపుకి మరల్చాడు దేవుడు’ అని వింతపడుతూ కదిలారు.

అంతకన్నా విచిత్రమైన దృశ్యం ఇంటిళ్లిపాదినీ సంభ్రమానందాల్లో ముంచెత్తింది. మామ్మగారు వరలక్ష్మి చేతి పట్టు తప్పించుకుని స్వయంగా నడుచుకుంటూ లోపలికి వస్తోంది. ‘ఈ జన్మకిది చాలు స్వామి..’ అనుకుంటూ.

‘వరం కాసిని మంచి తీర్థం ఇయ్యమ్మా…’ అని గటగట నీరు తాగి ప్రశాంతంగా నవ్వుతూ.. ఇంకా ‘దీని వల్ల ఏం ప్రయోజనం ఉందో మరి.. కొంత కాలం పొడిగించడం.. తండ్రి..’ అని తన శరీరాన్ని చూపిస్తూ.. ‘కాని గుర్తుంచుకోండి ఇది కొనసాగింపే.. శాశ్వతం కాదు..’ అంది.. ‘అలా అనకమ్మా నువ్వు లేకుండా మేం బ్రతకలేం’ అంది వరలక్ష్మి ఆర్తిగా.. ఈ మమత్వాన్నే వదుల్చుకోవాలి. ఇదే మనల్ని పగ్గాలేసి బంధిస్తోంది. ఒక్కటి జాగ్రత్తగా వినండి… ‘చలా లక్ష్మి చలాః ప్రాణాశ్చలం జీవిత యౌవనమే. చలా చలే సంసారే ధర్మ ఏకోహి నిశ్చలః’, అంటే సంపదలు లక్ష్మి చంచలం.. ప్రాణాలు అస్థిరం. ఏ క్షణాన వెళ్లిపోతుందో చెప్పలేం. ఒక ప్రాయం.. వయస్సు కదిలిపోయేది కరిగిపోతుంది అంతలోనే.. అన్నీ అతి చంచలమైన ఈ ప్రపంచంలో.. ధర్మమొక్కటే శాశ్వతమైనది.. నిశ్చలమైనది.. అనుభవ పూర్వకంగా ఈ సత్యాన్ని గ్రహించి ధైర్యంగా ఉండండి.. వచ్చినవారు వెళ్లక తప్పదు.. దేహ ధర్మం… వెళ్లిన వారు రాకా తప్పదు.. ఈ పరంపర అనివార్యంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈశ్వర నియతి.. సృష్టిధర్మం, పునరపి జననం పునరపి మరణం.. అని ఈ చక్రంలో పడకుండా తప్పించు కునే మార్గాన్ని తెలుసుకోండి.. అనుసరించండి..’ అందరి వంకా ప్రేమగా, దయగా చూస్తూ ప్రశాంతంగా చిరునవ్వులు చిలకరిస్తోంది ‘స్వామి దయ.. పునర్జన్మ.’ అని గొణుక్కుంటూ..

– యర్రమిల్లి విజయలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *