జీవితమే సఫలం

జీవితమే సఫలం

ప్రోత్సాహక బహుమతి పొందిన కథ

సౌమ్యకి మనసంతా ఆందోళనగా ఉంది. కంటిమీద కునుకు రావటం లేదు. భవిష్యత్తు గురించి కించిత్‌ ఆందోళనగా ఉంది. ‘రేపు తర్వాత నా ప్రణాళిక ఏమిటి? నేను ఏం చెయ్యాలి? సమయాన్ని ఎలా వెళ్లబుచ్చాలి? ఉద్యోగం లేకుండా ఒక్క క్షణమైనా ఊహించుకో గలనా?’

తను ఇప్పుడు ఏలుతున్న తన సామ్రాజ్యం- ఒక సంస్థకి హెడ్‌గా ఉంటూ, పని ప్రారంభించగానే చుట్టూ ఉండే తన కొలీగ్స్‌, మీటింగులు, ఏ సమస్య ఎదురైనా చిటికెలో పరిష్కరించగలిగే సామర్థ్యం ఇవన్నీ సౌమ్యని ఎదురులేని మనిషిగా నిలబెట్టాయి. ప్రతిరోజు స్టాఫ్‌ అందరి నుంచి అందుకునే గ్రీటింగ్స్‌, పొగడ్తలు, ప్రశంసలు ఇవేమీ రేపటి తర్వాత ఇక ఉండవు. ఇంతవరకూ తనకంటూ ఏర్పరచుకున్న ఆ గూడు తనని ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయే సమయం ఆసన్నమైంది, తప్పదు అని హెచ్చ రించింది. ‘వర్క్‌ ఈజ్‌ వర్షిప్‌’ ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టడం కోసం మంగళసూత్రానికి కూడా దూరమైపోయింది సౌమ్య. ఆఫీసులో కూడా ఆమెను అందరూ ‘ఒంటరి’ అని ఏనాడు వేలెత్తి చూపలేదు. ‘యూ ఆర్‌ వెరీ లక్కీ! యూ ఆర్‌ ఎ ఫ్రీ బర్డ్‌!’ అని అంటూ ఉంటే ‘అవును. నిజమే సుమా!’ అనుకుని మురిసిపోయేది. అవును సమాజంలో పొగడ్తలకు అంత బలముంది. అవి మనిషిలో ఉత్సాహాన్ని నింపేసి, ఒక్కోసారి నిజాన్ని కూడా కప్పేస్తాయి. ఇన్నాళ్లు తను ఉద్యోగం ద్వారా వచ్చే రాయల్టీస్‌, పెర్క్స్‌ అందుకుంటూ ఇదే జీవితం, ఇదే శాశ్వతం అని భావించింది.

ఎంత వద్దనుకున్నా సౌమ్య మనస్సు వినకుండా గతంలోకి జారుకుంది.

– – – – – –

రామనాథం, జానకమ్మ గార్లకు లేక లేక కలిగిన సంతానం సౌమ్య. మా ఇంటి మహాలక్ష్మి, మా గారాలపట్టి అని ఎంతో అపురూపంగా చూసుకునే వారు ఆమెను. అలా పెరిగిన సౌమ్యకు ఏది కావాలంటే అది క్షణాల్లో అమర్చేవారు రామనాథం గారు. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవటానికి కావలసిన మెలకువలను ఆమెకు దగ్గరుండి బోధించే వారు. ‘నువ్వు ఏ పని చేస్తున్నా, సమయపాలన పాటించు. నేను నీకొక అరగంట పని నియమం చెపుతాను. దానిని ఆచరణలో పెట్టావంటే నువ్వు సమయాన్ని నీ అదుపులో ఉంచుకున్నట్లే. ప్రతి అరగంటకు నువ్వు చేసే పని ఆపి, ఐదు నిమిషాలు కాస్త రిలాక్స్‌ అవుతూ, ఆ పని నీ లక్ష్యసాధనకు ఎలా ఉపయోగకరమో ఆలోచించుకో. పని పూర్తి కాగానే నీకు నువ్వే రివార్డ్‌ ఇచ్చుకుంటూ ఇష్టమైన పాట విను’ ఇలా ఆ తండ్రి ఆమెకు ఎన్నో మంచి విషయాలు నిత్యం చెప్పేవారు. తల్లిదండ్రుల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా స్కూల్‌లో ప్రతి ఏడాది సౌమ్య అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులు తెచ్చుకునేది. సౌమ్యతో పాటు తరగతి గదిలో తన పక్కనే కూర్చునే రమ్య సౌమ్యకి మంచి పోటీ ఇచ్చేది. పదవతరగతి వరకు సౌమ్య టాపర్‌గా తన స్థానాన్ని నిలుపుకుంటూ వచ్చింది. స్కూల్‌లో ఎన్నో ప్రత్యేక బహుమతులు, స్కాలర్‌షిప్స్‌, సర్టిఫికెట్సు అందుకునేది. టీచర్సు, ప్రిన్సిపాల్‌ ఆమెను అభినందించేవారు. తండ్రి ఆమె ప్రోగ్రెస్‌ రిపోర్టుపై సంతకం చేసి, ఆనందం పట్టలేక విలువైన పుస్తకాలు కానుకగా కొని తెచ్చేవాడు. సౌమ్యకి ప్రతిరోజు స్కూల్‌కి వెళ్లడమంటే చెప్పలేని సంతోషం. హైస్కూల్‌ పూర్తయ్యేసరికి తనమీద తనకు గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసం ఏర్పడ్డాయి. అప్పుడే సౌమ్య తన మనస్సులో దఢంగా అనుకుంది, కాలేజ్‌లో కూడా తన స్థానం ఎప్పుడూ నంబర్‌వన్‌గానే ఉండి తీరాలి. తనను ఎవరూ బీట్‌ చేయకూడదు, చేయలేరు…అని. దానికి తగ్గట్టుగానే చదువు విషయంలో నూరు శాతం మార్కులు రావడానికి ఏమి చేయాలో ప్రణాళికాబద్ధంగా సబ్జక్టులు క్షుణ్ణంగా అధ్యయనం చేసేది. ఈ నేపథ్యంలో తండ్రి కూడా సౌమ్యకి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాడు.

అలా మొదలైన జీవన ప్రయాణంలో ఇంట్లో తనకి తోబుట్టువులు ఎవరూ లేకపోయినా, బయట తనకంటూ ప్రాణమిత్రులను ఏర్పరుచుకోకపోయినా కూడా తను ఒంటరిని అని ఎప్పుడూ భావించలేదు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. తన ఆలోచనలను కార్యరూపంలో పెట్టడమే విధిగా అలవరచుకుంది. దానికి ప్రతిఫలంగా అందరూ తనపై కురిపించే ప్రశంసల వర్షం, పొందే స్కాలర్‌షిప్స్‌ ఇవన్నీ వేరే ధ్యాస లేకుండా చేసాయి. ఆఖరికి కాలేజీలో ఎవరైనా అబ్బాయి మాట్లాడి, దగ్గరవుదామని చూసినా ముక్తసరిగా, ముక్కుసూటిగా సమాధానమిచ్చేది. ఈ స్వభావమే తన ఆలోచనలు పెళ్లి మీదకి మళ్లకుండా చేసింది. ఒకానొక సందర్భంలో తల్లి జానకి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినా సౌమ్య ‘ససేమిరా ఇప్పుడు కాదు.. నేను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి తీరుతాను’ అనటంతో తండ్రి కూడా ఆమె నిర్ణయానికి ఎదురుచెప్పలేదు.

ప్రశంసలు, పొగడ్తలు మనిషిని ఒక దశలో సరైన నిర్ణయాలు తీసుకోనివ్వకుండా చేస్తాయా? ఎవరిమాట వినని మనిషికి ఏమిటి పరిష్కారం? ఏమో అది కాలమే నిర్ణయించాలి.

కాలగమనంలో ఎదురయ్యే అనుభవాలే ప్రతిఒక్కరికీ పాఠాలు నేర్పుతాయేమో!

ఒకదశలో వత్తిలో పైకెదిగాక ఆయా రంగాలలో ఉన్నవారికి ఏర్పడే అభిమానులు, అభిమాన సంఘాల వల్ల సదరు వ్యక్తికి తనమీద తనకే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పరచుకునేలా చేయవచ్చు. ఒక్కోసారి అనుకోకుండా ఏర్పడే అభిమానులు, ఫ్యాన్స్‌ అసోసియేషన్స్‌, వారి వల్ల కలిగే అలజడితో అంచనాలను చేరుకోలేకపోతే జీవితంలో బోర్లా పడే ప్రమాదం కూడా లేకపోలేదు. మన చుట్టూ అలాంటి వ్యక్తులను కూడా గమనించవచ్చు.

సౌమ్య తీసుకున్న ఆ నిర్ణయం ఎటువంటి మలుపులు తిప్పిందో చూడాలి.

– – – – – –

సౌమ్యతో కొద్దిపాటి స్నేహం ఉన్న రమ్య జీవితంలోకి తొంగి చూస్తే…

రమ్య రఘురామయ్య గారి పెద్ద కుమార్తె. ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన అమ్మాయి. కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుంటూ, ఆర్ధిక స్థితిగతులకు అనుగుణంగా పొదుపుగా జీవితాన్ని ఎలా గడపాలో తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంది. ఒకపక్క తను చదువుకుంటూ, తమ్ముళ్లకు కూడా చదువు చెప్పేది. మరోపక్క ఇంటి పనులు కూడా చేసేది. క్షణం పాటు తీరికగా ఉండేది కాదు. తండ్రి వయసు పైబడుతూ వచ్చే అనారోగ్యం కారణంగా రమ్యకి డిగ్రీ పూర్తి కాగానే త్వరగా పెళ్లి ప్రయత్నం మొదలుపెట్టాడు. రమ్య వేరే మాట మాట్లాడకుండా తండ్రి తెచ్చిన సంబంధాన్ని చేసేసుకుంది.

మనిషిగా భూమి మీద జన్మించడమనేది ఒకే ఒక్కసారి లభించే అద్భుతమైన వరం. ఆ జీవితానికి సార్ధకత చేకూర్చుకుంటూ, తనకు గుర్తింపు తెచ్చుకుంటూ, సమాజంలో తన ఉనికిని చాటుకుంటూ తనని తాను నిరూపించు కుంటూ ప్రతి క్షణం జీవితపు మధురాను భూతులను ఆస్వాదించడమనేది ఏ కొద్దిమందికో మాత్రమే తెలుసు. అది కూడా ఒక కళే.

ఒక క్షణం, క్షణాలూ గంటలుగా, గంటలు రోజులుగా, రోజులు నెలలుగా, నెలలు ఏడాదిగా కాలం గిర్రున తిరిగిపోతుంది. వెనుతిరిగి చూస్తే గడచిపోయిన కాలం మళ్లీ తిరిగిరానిది. ఒక క్షణంలో జీవితంలో ఎవరు తీసుకున్న నిర్ణయానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని జీవితంలో ఎంతమంది సఫలమవుతున్నారు? జీవితంలో సఫలం అవ్వడ మంటే ఏమిటి? సంతప్తితో జీవించడమా? లేదంటే లోకం తీరును బట్టి ఉద్యోగం, డబ్బు, సొంత ఇల్లు, పెళ్లి, పిల్లలు, తరగనంత ఆస్తిని సంపాదించటం, ఇంకా మరెన్నో … కలగలిపి దాన్ని సక్సెస్‌ అంటారా?

– – – – – –

సౌమ్య అనుకున్న విధంగానే యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. క్యాంపస్‌ ఇంటర్వ్యూ ద్వారా పేరున్న ఐటి సంస్థలో ఉద్యోగం పొందింది. జీవితంలో ప్రతీ మనిషికి అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ జరుగుతుందా? కొన్ని విషయాలు తనకు సంబంధించినంత వరకు తన ఆధీనంలో ఉంటాయి. కొన్ని వేరే వ్యక్తి జీవితంతో ముడిపడి ఉంటాయి. మరికొన్నింటిని ప్రకతి నియంత్రిస్తుంది. సౌమ్యకి తనకంటూ వ్యక్తిత్వం వచ్చింది, ఆర్థిక స్వాతంత్యం వచ్చింది అన్న ఆనందం క్షణకాలంలో కరిగినట్టనిపించింది. అది తను ఎంతగానో అభిమానించి, తనను ఈ స్థాయికి ఎదగనిచ్చిన తండ్రి హఠాన్మరణం. దానికి తోడు తనకు ఆసరాగా ఉంటుంది అనుకున్న తల్లి కూడా ఆరునెలల్లోనే తనను పూర్తిగా ఒంటరిదాన్ని చేసి స్వర్గస్థురాలైంది. తన జీవితంలో ఏర్పడిన ఈ వెలితి వల్ల సౌమ్య మానసికస్థితిలో పెద్దగా మార్పు ఏమి రాలేదు. కేవలం వారు లేరన్న దిగులు తప్ప. ఎందు కంటే సౌమ్య చిన్నతనం నుంచి తన లక్ష్యం అంతా చదువు, తర్వాత ఉద్యోగం ఇదే జీవితం అనుకుంది. తండ్రి ద్వారా అలవరచుకున్న క్రమశిక్షణ, మానసిక వికాసానికి తను అవలంబించే మెడిటేషన్‌ ఇవన్నీ ఆమెకు ఎంతగానో తోడ్పడ్డాయి. నిరాశ, నిస్పహ అంటే ఏమిటో తెలియకుండా చేసాయి.

తన దష్టి అంతా పూర్తిగా ఉద్యోగం పైనే పెట్టి ఆరు నెలల్లోనే మేనేజర్‌గా ప్రమోషన్‌ పొందింది. తనకంటూ ఓ ఇంటిని నిర్మించుకుంది. కానీ తనకోసం ఒక తోడు, నీడా ఉండాలని కోరుకోలేదు.

ఒకరకంగా వర్క్‌ హాలిక్‌గా మారిపోయిందామె. ఉద్యోగంలో మధ్యమధ్యలో తన సామర్ధ్యాన్ని సవాలు చేస్తూ సౌమ్యకు ఎవరైనా అడ్డు తగిలినా, రాజకీయాలతో ఆమెను ఇబ్బంది పెట్టాలని చూసే బాస్‌, కొలీగ్స్‌ను ధైర్యంగా ఎదుర్కొనేది. వాళ్ల ఎత్తులను ముందే పసిగట్టి తన ఆలోచనలను, ప్రయత్నాలను తను చేసే జాబ్‌ మీదే పెట్టి తన లక్ష్యాలను సాధించసాగింది.

ఈ ఉద్యోగ పర్వంలోనే సౌమ్య జీవితంలో ఎన్నో ఏళ్లు దొర్లిపోయాయి. కాన్ఫరెన్సెస్‌, మీటింగ్‌లు, సెమినార్స్‌ హాజరవటం కోసం దేశ, విదేశాలు తిరిగింది. అపారమైన జ్ఞానాన్ని, అనుభవాన్ని గడించింది. ఎన్నో అవార్డ్స్‌, సర్టిఫికెట్స్‌ కైవసం చేసుకుంది. తను చేసే ఐటి సంస్థలో కొత్త ఒరవడిని సష్టించింది. ఈ విజయ పరంపరలో సౌమ్యకి పెళ్లి చేసుకోవాలనే ధ్యాస కలగకపోవటం పరిస్థితుల ప్రభావమే అనుకోవచ్చు. ఏరోజుకారోజు మరునాడు వెళ్లబోయే స్టేక్‌ హోల్డర్‌ మీటింగ్‌, అక్కడ తన ప్రెజెంటేషన్‌ ఎలా ఇవ్వాలి, నెక్స్ట్‌ కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌.. వీటి చుట్టే తన ఆలోచనలు పరిభ్రమించేవి. ఆఫీసుకి వెళ్లిరావటం, తనకి కావలసినట్టుగా కూరగాయలతో సలాడ్స్‌, ఆరోగ్యకరమైన డైట్‌ తీసుకునేది. ఏనాడు ఎవరితోను తనేమిటో, తన మనస్సులో ఎమోషనల్‌ ఫీలింగ్స్‌ వ్యక్తపరచలేదు.

సగటు మనిషి తన జీవితంలో సగభాగం ఉద్యోగం, విధి నిర్వహణ కోసం కేటాయిస్తూ, వ్యక్తిగతంగా స్వంత జీవితం గురించి ఆలోచించనీయ కుండా చేస్తాయేమో. ఐటి రంగంలో, మరే ఇతర రంగంలో పని చేసేవారు డెడ్‌ లైన్లు చేరుకోవటం కోసం పాపం రాత్రింబవళ్లు కష్టపడతారు. అవును మరి జీవితం, జీతంతోనే ముడిపడి ఉంటుంది. జాబ్‌ సెక్యూరిటీ జీవితానికే పెద్ద భద్రత. ఉన్న జాబ్‌ని నిలబెట్టుకోవడం కోసం వ్యక్తిగత జీవితంలో ఎన్నో కోల్పోతారు. ముఖ్యంగా మహిళలైతే పిల్లలని చైల్డ్‌ కేర్‌లో వదిలేయాల్సి వస్తుంది. వాళ్ల అల్లరి, చిలిపి చేష్టలు.. అవి చూస్తూ ఉండడంలో పొందే ఆనందాన్ని కోల్పోతున్నారు. ప్రొద్దున్న లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేవరకు ఉరుకులు, పరుగులు. మాయాలోకంలో పడి తానేమిటి, తనకిష్టమైనది ఏమిటి అని కూడా గుర్తించలేక పోతున్నారు. చిన్న చిన్న సంతోషాలను అనుభవించ లేకపోతున్నారు.

ఈ రోజుల్లో ఆడ, మగ అనే బేధం లేకుండా పరిచయమవ్వగానే అడిగే మొదటి ప్రశ్న ‘ఏం చేస్తారు’ అనే. జీవితంలో హోదాని ఇచ్చేది ఒక ఉద్యోగమేనా లేదా వయస్సుని బట్టి మారుతుందా?

– – – – – –

రమ్య పెద్దకోడలిగా అత్తారింట్లోకి అడుగు పెట్టింది. అత్తామామలు పెద్దవారు కావటంతో సగం కుటుంబ బాధ్యత అంతా ఆమె నెత్తిన పడింది. మరిది, ఆడపడుచులకు మేథ్స్‌, సైన్స్‌ సబ్జెక్ట్స్‌ పరీక్షలకు ఎలా ప్రిపేర్‌ కావాలో వివరించేది. ఇంట్లో అందరికీ వంటలు రుచికరంగా వండిపెట్టేది. భర్త ఉద్యోగంలో క్యాంపులు అంటూ ఊళ్లు తిరిగేవాడు.

క్షణం తీరిక లేకుండా అన్ని పనులు సమర్థ వంతంగా నిర్వర్తిస్తూ అత్తారింట్లో మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు కలిగిన ఇద్దరు సంతానంతో మరింత బిజీ అయ్యింది. పిల్లలను బాధ్యతా యుతంగా తీర్చిదిద్దింది. ఆడపడుచు, మరిది, వదిన సాయంతో చదువులో బాగా రాణిస్తూ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం పరీక్షలు రాసి విదేశాలకు వెళ్లిపోయారు. అక్కడే ఎమ్మెస్‌ పూర్తిచేసి స్థిరపడి పోయారు. లోకల్‌గా ఉంటున్న ఇండియన్‌ ఫ్యామిలీతో వారికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. భారతదేశం వచ్చి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని తిరిగి అమెరికా వెళ్లిపోయారు.

రమ్య అత్తమామలు పెద్దవారు కావటంతో వారిని కనిపెట్టుకుని వారికి వేళకి కావలసిన మందులు దగ్గరుండి మరీ ఇచ్చేది. ప్రాణం పోకడ మనిషి ఆధీనంలో లేనిది. ఎవరెన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఏదో ఒక నెపంతో మనిషికి సమయం ఆసన్నమవగానే తన శరీరాన్ని ఖాళీ చేసి ఆత్మ పరమాత్మలో లీనమవ్వాల్సిందే. ఈ ప్రయాణంలో ఎన్నో మజిలీలు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఆ పరిస్థితికి తగ్గట్టుగా స్పందించి ఆ సమయంలో నెగ్గుకొచ్చినవారే విజేతలు.

రమ్య మామగారు గుండెపోటుతో మత్యువు ఒడిలోకి చేరారు. అత్తగారు బాత్రూంలో కాలుజారి పడి మంచాన పడ్డారు. మూడునెలలకే ఆమె మరణించింది. రమ్య కాలగమనంలో వచ్చే ఒత్తిడులను అధిగమిస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. కూతురు దీప్తి, కొడుకు అఖిల్‌ బాబాయిని స్ఫూర్తిగా తీసుకుని ఎప్పుడు రెక్కలు వస్తాయా అని ఎదురు చూస్తూ అమెరికా దేశానికి ఎగిరి వెళ్లిపోవాలని కలలు కంటున్నారు. ఇదిలా ఉండగా భర్త క్యాంప్‌ నుంచి తిరిగివస్తూ కారు ప్రమాదంలో చనిపోయాడనే వార్త రమ్యను విషాదంలో ముంచి సగం ఒంటరిదాన్ని చేసింది. తనకి కలిగిన బాధను దిగమ్రింగుకుంటూ, పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా వారికి ధైర్యాన్ని నూరిపోసింది. మరిది, ఆడపడుచు రెండేళ్లకోసారి చుట్టపుచూపుగా వచ్చినా హడావుడిగా ఉండి తిరిగి వెళ్లిపోయేవారు. పిల్లలు కాలేజీ చదువులు పూర్తికాగానే వాళ్ల మనసులో కోరిక బయటపెట్టారు. పైచదువుల కోసం, అమెరికా వెడతాం అని పట్టుబట్టారు. ఇంక చేసేదేమి లేక భర్త ద్వారా సంక్రమించిన ఇన్సూరెన్స్‌ డబ్బు కూడగట్టుకుని పిల్లలిద్దరినీ అమెరికా పంపించింది. వారు అక్కడే జాబ్‌ తెచ్చుకుని ప్రయోజకులయ్యారని తెలిసి సంతోషించింది. మొదట్లో తల్లికి ఫోన్‌ చేసి విషయాలు తెలిపేవారు. క్రమక్రమంగా రమ్యకి పిల్లలిద్దరి నుంచి ఫోన్లు కూడా రావటం మానేసాయి. అక్కడ వారిద్దరు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని స్థిరపడిపోయారు. ఒకానొక సందర్భంలో ఆ వార్త రమ్య చెవిలో నెమ్మదిగా వేసారు. మేము సెటిల్‌ అయ్యాక ఇండియా ఒకసారి అందరం వచ్చి వెడతాం అని చెప్పారు. రమ్యకి ఒక్కసారిగా జీవితంలో శూన్యం ఆవహిం చింది. ‘ఇన్నాళ్లు ఎవరికోసం ఇంత కష్టపడ్డాను. నా కుటుంబం, నా వాళ్లూ అనుకుని రాత్రింబవళ్లు అలుపెరగకుండా చాకిరీ చేసాను. నాకంటూ ఇప్పుడు ఒక్కళ్లు లేరా? అందరికీ సేవ చేయటంలోనే తప్తిని పొందాను. ఇపుడు నాకు చివరికి మిగిలిందేమిటి? నేను ఒంటరిదానినా? నా ఇష్టాలన్నీ వదులుకున్నాను. హాబీలు అన్నిటినీ వదిలిపెట్టేసాను. జీవితంలో పొరపాటు చేసానా?’ అని మథనపడింది.

– – – – – –

సౌమ్య గతాన్ని తలుచుకుంటూ తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. నిద్రలేవగానే కళ్లముందు అమ్మ మెదిలింది. ‘నేను తప్పటడుగు వేసానా? ఆ రోజు అమ్మ మాట ఒక్కక్షణం విని పెళ్లి చేసుకుని ఉండాల్సింది. హాయిగా నాకంటూ ఒక చిన్ని ప్రపంచాన్ని నిర్మించుకోలేకపోయానా? నా జీవితం చేజారిపోయిందా?’ అని విరక్తిగా అనుకుంది.

‘నా ఉద్యోగ పర్వంలో ఇదే ఆఖరి రోజు’ అనుకుంటూ ఆఫీసులో అడుగుపెట్టింది. స్టాఫ్‌ అందరూ సాదరంగా ఆహ్వానం పలికారు. హాల్‌లో అందరూ సౌమ్య సంస్థ కోసం చేసిన కషిని కొనియాడారు. అందరి సంతకాలతో ఒక గ్రీటింగ్‌ కార్డ్‌, బొకే, గిఫ్ట్‌ ప్యాకెట్‌ ఆమె చేతిలో పెట్టారు. ఘనంగా ఫేర్‌వెల్‌ చెపుతూ సౌమ్యకు అందరూ వీడ్కోలు పలికారు.

‘గతం గతః.. జరిగిందేదో జరిగిపోయింది’ అనుకుంటూ సౌమ్య వేరే ఆలోచనకు తావివ్వకుండా మర్నాడు షిర్డీ వెళ్లడానికి టికెట్‌ బుక్‌ చేసుకుంది. రైలు ఎక్కి లగేజీ సీటు దగ్గర పెట్టుకుని కూర్చుంది. తనకిష్టమైన ‘రీడర్స్‌ డైజెస్ట్‌’ పుస్తకం పేజీలు తిరగేయసాగింది. ఎదురు సీట్లో సాంప్రదాయకంగా తీరైన దుస్తులలో మరొక మహిళ కూర్చుని ‘ఋషిపీఠం’ పత్రిక చదువుతోంది. అప్రయత్నంగా సౌమ్య చూపులు ఆమె పైకి మళ్లాయి. చూడగానే ఎవరికైనా మాట్లాడాలి అనిపించే కళకళాలాడే ముఖం ఆమెది. ఆమె రూపురేఖలను అదే పనిగా చూస్తూ ‘ఈమె ఎవరై ఉంటుంది. ఎక్కడో చూసినట్టుగా ఉంది. కానీ గుర్తు రావటం లేదు’ అనుకుంటూ ఆమెనే ఎగాదిగా చూస్తోంది సౌమ్య. ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి పలకరింపుగా నవ్వింది. జీవిత మజిలీలో మనకి ఎంతోమంది వ్యక్తులు కలుస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని చూడగానే ఎదో తెలియని ఆత్మీయ భావనే వారితో మాట్లాడాలి అని సద్భావన కలుగచేస్తుంది. మరొకరిని చూస్తే అసలు పన్నెత్తి పలుకరించాలని కూడా అనిపించదు. అది అందమా, ఆకర్షణ అంటే కానే కాదు. ఆ వ్యక్తిలో ఉట్టిపడే పాజిటివ్‌ ఎనర్జీ, జీవితంపై వారికున్న దక్పథం, వారు చేసే సాధన, దైవిక ప్రార్థనలు వారి ముఖంలో ప్రతిబింబిస్తాయేమో.

‘నమస్తే మీరు ఎక్కడివరకు వెడుతున్నారు?’ అనుకోకుండా వచ్చిన ఆ పలకరింపుకు నవ్వుతూ సౌమ్య షిర్డీ వెడుతున్నానని సమాధానమిచ్చింది.

‘నేను కూడా షిర్డీ వెడుతున్నాను. నా పేరు రమ్య’

‘పేరు ఎక్కడో విన్నాను.. అనుకుంటూ నా పేరు సౌమ్య’

‘మీరు ఎక్కడ ఉంటారు?’

ఇలా ఒకళ్ల వివరాలు ఒకరు తెలుసుకుంటూ ఒక్కసారిగా గట్టిగా కావలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

చిన్ననాటి బాల్యస్నేహితులు మళ్లీ నలభై ఏళ్ల తరువాత కలుసుకున్నారు.

వాళ్ల జీవితంలో ఎదురైన ఒంటరి భావన వారి కలయిక వల్ల తొలగినట్లనిపించింది. ఎన్నో పాత జ్ఞాపకాలు, ఇద్దరు విడిపోయాక ఎదురైన అనుభవాలు ఒకరితో ఒకరు పంచుకున్నారు.

సౌమ్య అంది, ‘ఏమిటోనే రమ్యా! జీవితపు చరమాంకంలోకి చేరుకున్నాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని ఇంతవరకు నేనేమి సాధించానని ఆలోచించుకుంటే పెద్ద శూన్యం తప్ప ఏమీ కనిపించటం లేదు. నా మనస్సుని భయంకరమైన నైరాశ్యం కమ్మేస్తోంది. అప్పట్లో మా అమ్మ మాట విని పెళ్లి చేసేసుకుని ఉంటే నాకంటూ భర్త, పిల్లలతో ఒక కుటుంబం ఏర్పడి ఉండేది. అప్పుడు బంధాలు, అనుబంధాలు ఏర్పడి ఉండేవి. నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని సుఖమయమైన సంసార జీవితం గడుపుతున్నావు. ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నావు. నేను కోల్పోయిందేమిటో ఇప్పుడు నాకు కొట్టొచ్చినట్టుగా తెలుస్తోంది’

సౌమ్య కళ్ల నుంచి ఆగకుండా కన్నీరు ప్రవహిస్తోంది. ఆమె మాటలు విన్న రమ్య వెక్కి వెక్కి ఏడవసాగింది. సౌమ్య కళ్ల నీళ్లు తుడుచుకుంటూ అంది, ‘అయ్యో రమ్యా! నా మనస్సులో గూడు కట్టుకున్న బాధనంతటినీ నీతో వెళ్లగక్కుకుని అనవసరంగా బాధపెట్టాను. ప్లీజ్‌ ఏడవకు. నా చిన్ననాటి స్నేహితురాలు, నా ప్రియమైన రమ్య సంతోషంగా ఉంది. అది చాలు నాకు’

రమ్య ఏడుపు ఇంకా ఎక్కువైంది. ‘అయ్యో సౌమ్యా! నువ్వు చెప్పింది విని నేను బాధ పడటం లేదు. నీ ఉద్యోగం గురించి, నీ హోదా గురించి, నీ విలాసవంతమైన జీవితం గురించి నువ్వు చెపుతూ ఉంటే నేను పెళ్లి చేసుకుని ఎంత తప్పు చేశానా? అని బాధ కలిగింది. నా కోసమంటూ నేనెప్పుడూ బ్రతకలేదు. ఎంతసేపూ అత్తమామలు, మొగుడు, మరిది, ఆడపడుచులకి ఊడిగం చేయటంతోనే బ్రతుకంతా గడిచిపోయింది. ఇంక పిల్లలంటావా వాళ్లని పైకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా నా మీదే పడింది. చివరికి ఏమైంది? వాళ్లు కూడా తమ దారి తాము చూసుకున్నారు. ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా నిరాశగా ఉంది. నువ్వు బాగున్నావనే నేననుకున్నాను. నేను బాగున్నావని నువ్వు అనుకున్నావు. కాని గమ్మత్తుగా ఇద్దరం కూడా ఈ వద్ధాప్యంలో ఏకాకులు గానే మిగిలిపోయాం’ అని కళ్ల నీరు తుడుచుకుంటూ సౌమ్యకేసి చూసి చిరునవ్వు నవ్వింది రమ్య. సౌమ్య కూడా రమ్యని చూసి నవ్వింది. వారి నవ్వులు క్రమేపి పెద్దవై ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు. ‘ఓ దూరపుకొండా! నువ్వు నున్నగా ఉన్నావనుకున్నాను సుమీ!’ అంది రమ్య పక పకా నవ్వుతూ’ సౌమ్య రమ్య బుగ్గ మీద చిటిక వేసి ‘మరేనే దూరపుకొండా! నేను కూడా నువ్వు చాలా నున్నగా ఉన్నావు అనుకున్నాను సుమీ!’ అంది. ఇద్దరూ మనసారా హాయిగా నవ్వుకున్నారు. మళ్లీ వారి ఒంటరి బ్రతుకు వారి జీవితంలో ఏర్పడిన శూన్యం గురించి చర్చించుకున్నారు. అలా చర్చించుకుంటూ ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.

రమ్య అంది, ‘సౌమ్యా! ఇప్పుడు మనం ఇద్దరం ఒంటరివాళ్లం కానేకాదు. నాకు నువ్వు, నీకు నేను ఆ భగవంతుడే కలిపాడు.’

సౌమ్య సంతోషంగా అంది, ‘అవునే రమ్యా! మన జీవితాలు అయిపోలేదు. ఇప్పుడే మన ఇద్దరికీ మరో కొత్త జీవితం మొదలవబోతోంది. మనం ఇద్దరం మన అనుభవం, చదువు, లైఫ్‌స్కిల్స్‌ వీటిని జోడించి ఒక సంస్థని నెలకొల్పుదాం. జీవితంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, శక్తి, సామర్థ్యాలు, జీవితంపై ఒక అవగాహన, పట్టు, దశ, దిశ, గమ్యం నిర్ధేశించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాం అనుకోకుండా ముందుగానే నేటి యువతకు డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌ అనేవి తెలియచెపుదాం. అయితే డాక్టర్‌ లేకపోతే ఇంజనీర్‌ అనే ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయట పడాలి. జీవితంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. జీవితం అంటే పూలబాట, ముళ్లబాట కానే కాదు. అయిష్టంగా ఏ పని చేయద్దు. ఆడుతూ, పాడుతూ వారికి నచ్చిన మార్గాన్ని వారే ఎంచుకోవాలి. సమయాన్ని వారి చేతుల్లోకి వారే తీసుకోవాలి. ఉన్న జీవితాన్ని సఫలం చేసుకోవాలి. యువతను ఈ ఆశయ సాధనతో ప్రయోజకులుగా తయారుచేద్దాం, తీర్చిదిద్దుదాం. మనం గతంలో ఏ పొరపాట్లు చేసామో అవి వేరొకరి జీవితాలలో పునరావతం కాకుండా చేద్దాం.’

రైలు ఆగిన స్టేషన్‌ నుంచి నెమ్మదిగా పట్టాల మీదనించి కదులుతోంది.

రమ్య, సౌమ్య మనసారా నవ్వుకుంటూ ఆనందంగా కాఫీ తాగుతున్నారు.

– విజయ గొల్లపూడి, (ఆస్ట్రేలియా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *