జీవనస్రవంతి -15

జీవనస్రవంతి -15

జరిగిన కథ

జీవన్‌ని మల్లెవాడకు చేర్చమని పూజారి రామారావుకి చెప్పారు. అలా జీవన్‌, రామారావులు మల్లెవాడకు బయలుదేరి కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు. వీరిద్దరికి తోడుగా రంగనాథం కలిశాడు. ముగ్గురూ మల్లెవాడకు చేరారు. అప్పటికి చీకటి పడుతున్నది. మొదట రంగనాథం, తరువాత రామారావు తమ ఇళ్ల వద్ద ఆగిపోగా, జీవన్‌ ఒక్కడే తన పెట్టె పట్టుకుని కామేశం గారింటికి నడక సాగించాడు.

చివరికి చీకటి పడకముందే గమ్యాన్ని చేరుకున్నాడు జీవన్‌.

—- —–

కరణంగారిది, ఎత్తు అరుగుల పెద్ద పెంకుటిల్లు. ముందువైపు విశాలమైన పెరడు. పెరటి చుట్టూ పిట్టగోడ. దానికి ఒక గేటు. అది సరిగ్గా ఇంటి సింహ ద్వారానికి ఎదురుగా ఉంది. ఆవరణ లోపల ఒక ఆవు, ఒక గేదె గుంజలకు కట్టి ఉన్నాయి. ఆవుకు పాలు పితికి, దూడను వదిలినట్లున్నారు, తెల్లని ఇస్త్రీ మడతలా ఉన్న లేగదూడ తల్లి దగ్గర పాలు కుడుస్తూ, అంతలోనే దొడ్డంతా పరుగులు పెడుతూ ఆడుతోంది. బరువైన పొదుగుతో గేదె తనవంతు కోసం ఎదురుచూస్తూ, తనను కట్టిన గుంజ చుట్టూ తిరుగుతూ, దూరంగా కట్టి ఉన్న తన లేగదూడ వైపు ప్రేమగా చూస్తోంది.

గేటుదాటి లోపలకు వచ్చిన జీవన్‌ని మోర పైకెత్తి క్షణం చూసి, కొత్తమనిషని గుర్తించిన ఆవుదూడ చెంగు చెంగున గంతులు వేసుసుంటూ దూరంగా పరుగెత్తుకుపోయింది. గేదెకు పాలు పిండడానికి, తపేలా పట్టుకుని వచ్చిన కరణంగారి భార్య సీతమ్మగారు, జీవన్‌ని చూసి అడిగారు, ‘ఎవరు బాబూ మీరు ?ఎవరు కావాలి ?’

‘మల్లెవాడ కరణం, కామేశం గారి ఇల్లు ఇదేనాండి ? నన్ను యాజులుగారు పంపారు’ అన్నాడు జీవన్‌.

అరుగుమీద లాంతరు వెలుగుతూ ఉంది. కరెంటు లేకపోవడంతో ఏంచెయ్యడానికీ తోచక, అరుగుమీద పడకకుర్చీలో పడుకుని ఉన్న కామేశం గారు, యాజులు పేరు విని వెంటనే లేచి, అరుగు దిగి వచ్చారు.

‘నువ్వా, రా బాబూ! నిన్ను పంపుతున్నట్లు యాజులు ఎప్పుడో ఉత్తరం రాశాడు. అతడు చెప్పిన నమ్మకస్తుడైన కుర్రాడివి నువ్వేనన్న మాట! సందేహించకు, లోపలకురా. ఇక్కడ ఉన్నన్నినాళ్ళూ ఇది నీ ఇల్లే అనుకో. మొహమాటంలాంటివేం వద్దు’ అంటూ జీవన్‌ని ఆహ్వానించారు కామేశంగారు.

ఇంతలో కరెంటు రావడంతో ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది. ఆ ఎత్తరుగుల ఇంట్లోకి వెళ్లడానికి చాలా మెట్లు ఎక్కవలసి వచ్చింది. జీవన్‌ పెట్టె పట్టుకుని, మెట్లన్నీ ఎక్కి నడుస్తూ ‘యాజులు తాతయ్య మీకిమ్మని ఒక ఉత్తరం ఇచ్చారు, అది ఈ పెట్టెలో ఉంది, తీసి ఇస్తా!’ అన్నాడు.

‘ఇద్దువుగానిలే, తొందరేం లేదు. ప్రయాణం బాగా సాగిందా? యాజులు గారింట్లో అందరూ కుశలమేనా? ఇప్పుడిలా చెరోదారీ అయ్యింది గాని, ఇక్కడున్నప్పుడు ఇద్దరం ఒక్క ప్రాణంగా ఉండేవాళ్ళం!’ అన్నారు కరణంగారు.

ఇంతలో చేతిలో గుమ్మపాల గ్లాసుతో వచ్చింది సీతమ్మ గారు. ‘బాబు! అలా ఆ కుర్చీలో కూర్చుని ఈ గుమ్మపాలు తాగు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు, బడలికతో ఉన్నావు’ అంటూ జీవన్‌ చేతికి అందించింది ఆమె.

నులివెచ్చగా, తెల్లని నురగలతో నిండి, కొద్దిసేపటిముందు పితికిన ఆవుపాలవి. కాచకుండానే తాగుతారు. పంచదార కలిపినట్లు తియ్యగా ఉంటాయి. ఆ పాలు తాగేసరికి ప్రయాణపు బడలిక చాలావరకు తగ్గినట్లు అనిపించింది జీవన్‌కి.

‘అమ్మా, జాహ్నవీ! అబ్బాయి స్నానానికి వేడినీళ్లు తోడు తల్లీ ! అంటూ కేకపెట్టారు కరణంగారు. ఆపై జీవన్‌ వైపు తిరిగి, ‘భోజనాలవేళ ఔతోంది, నువ్వు స్నానం చేసి వచ్చాక భోజనం చేద్దాం. ఆ తరువాత తీరిగ్గా కూర్చుని, మాటాడుకోవచ్చు’ అన్నారు ఆయన. పట్టణ వాసులలా కాకుండా, పల్లెటూరిలో ఉండేవాళ్లు చీకటి పడకముందే భోజనాలు చేస్తూంటారు.

జీవన్‌ పెట్టె తెరిచి, సబ్బు, తువ్వాలు తీసుకుని, పనిలోపనిగా యాజులుగారి ఉత్తరం తీసి కరణంగారికి ఇచ్చాడు.

కరణంగారు ఆ ఉత్తరాన్ని అందుకుంటూ, ‘నువ్వు ఎవరి అబ్బాయివి? అక్కడ ఏం చేస్తూంటావు ? అమ్మా, నాన్నా, తమ్ముళ్లు, చెల్లెళ్లు అంతా కుశలమా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

జీవన్‌ ఒక ఎడనవ్వు నవ్వి, తాపీగా జవాబిచ్చాడు ‘నేనంత అదష్టవంతుణ్ణేమీ కాదండి. నా జీవితం అంత ఇంపైనదీ కాదు. అయినా మీరు అడిగారు కనక చెపుతాను. నా తండ్రిని నేనెరుగను. నేనింకా రెండు నెలలకు పుడతాననగా యాక్సిడెంట్‌లో చనిపోయారట! మా అమ్మ యాజులుగారి ఇంట్లో వంటమనిషిగా ఉంటూ నన్ను పెంచింది. నేను డిగ్రీ చదివాను. గోల్డుమెడల్‌ తెచ్చుకున్నంత తేలికగా నాకు ఉద్యోగం తెచ్చుకోడం కుదరలేదు! అందుకని నేను ఇప్పటికీ నిరుద్యోగిగా ఉన్నాను’ అన్నాడు.

అంతలో ఒక నాజూకైన కంఠం వినిపించింది, ‘నాన్నా! నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, స్నానాకి రావచ్చు’.

జీవన్‌ని రమ్మని, కరణంగారు దొడ్డివైపుకి నడిచారు.

వేడి వేడినీళ్ల స్నానంతో జీవన్‌కి ప్రయాణం బడలిక తగ్గి హాయిగా ఉంది. అతను బట్టలు మార్చుకుని వచ్చేసరికి, వెండిపూల పీటలు వాల్చి, కొసలున్న లేత అరటాకులు పరిచి, బంగారంలా మెరుస్తున్న పెద్దపెద్ద కంచుగ్లాసులలో మంచినీళ్లు ఉంచి, చిన్న చిన్న వెండి గిన్నెలతో అప్పటికప్పుడు కాచిన, సువాసనలు వెదజల్లే కమ్మని నెయ్యి విస్తళ్ల పక్కన ఉంచి, విస్తరి కొసలో కొద్దిగా నూరిన ఉప్పు వేసి, వడ్డించడానికి సిద్ధంగా కనిపెట్టుకుని ఉంది ఆ ఇంటి ఇల్లాలు సీతమ్మగారు.

కామేశంగారు జీవన్‌ని వెంట తీసుకుని వచ్చారు. ఇద్దరూ పీటలమీద కూర్చోగానే వడ్డన మొదలుపెట్టారు సీతమ్మగారు. ప్రత్యేకమైన అతిథి మర్యాదలతో ఆమె కొసరి కొసరి వడ్డిస్తుండగా షడ్రసోపేతమైన భోజనం – గడ్డపెరుగు, చక్కెరకేళీ అరటిపండుతో సహా తప్తిగా తిని లేచాడు జీవన్‌. అతిథి మనల్ని మర్చిపోయినా మనం పెట్టిన భోజనాన్ని మరచిపోకూడదన్నది పల్లెటూరివాళ్ల అభిమతం మరి!

చేతులు కడుక్కువచ్చిన జీవన్‌కి తువ్వాలు అందిస్తూ కరణంగారు, ‘బడలికతో ఉన్నావు, పెండరాళే నిద్రపో. రేపు మాటాడుకోవచ్చు’ అన్నారు. ఆ తరువాత ఆయన జీవన్‌కి మల్లెపూవులాంటి దుప్పటి పరచి ఉన్న పడక చూపించి తను పడుకునేందుకు వెళ్లిపోయారు.

మంచాన్ని చూడగానే జీవన్‌కి ఆవులింతలు వచ్చాయి. పక్కమీద తనువు వాల్చేసరికి కనురెప్పలు బరువుగా మూతలుపడ్డాయి. మరుక్షణంలో అతడు గాఢంగా నిద్రపోయాడు.

—-   —–

మరునాడు జీవన్‌ నిద్ర లేచేసరికి బాగా పొద్దెక్కింది. అంతవరకు లేవనందుకు అతనికి సిగ్గుగా అనిపించింది. వెంటనే మంచం దిగి, బ్రెష్‌ మీద పేస్టు వేసుకుని, టంగ్‌ క్లీనర్‌ తీసుకుని, నూతి దగ్గరకు పరుగెత్తాడు.

దొడ్డి అరుగు మీద కూర్చుని, తోటకూర బాగుచేస్తున్న అమ్మాయి అతని రాక చూడగానే, చేతిలోని పని విడిచి వెంటనే లేచి లోపలకు వెళ్లిపోయింది.

ఆ కొద్దిసేపట్లోనే, జీవన్‌ క్షణం పాటు ఆమెను ఆశ్చర్యంగా చూశాడు.

సరైన సంరక్షణ లేక చెదిరిన జుట్టుతో, తెల్లని చీరతో, ఏ అలంకరణా లేకుండా ఉంది ఆమె. మొహంలో కనిపిస్తున్న అంతులేని దైన్యంతో తన సహజమైన రూపురేఖల్ని కనిపించనీయకుండా మరుగుపరుచుకుంటూ, కనిపించిన ఆ అమ్మాయి చిన్నవయసులో ఉన్నప్పటి తన తల్లి ప్రతిరూపంలా కనిపించింది!

జీవన్‌ పళ్లు తోముకుని వచ్చేసరికి కాఫీ గ్లాసుతో ఎదురువచ్చింది సీతమ్మ గారు. అప్పుడే పితికిన పాలతో కలిపిన చిక్కని ఫిల్టర్‌ కాఫీ.

అక్కడే ఉన్న కరణంగారు, ‘ఏమోయ్‌! నువ్వింకా రెండు-మూడురోజులు తప్పనిసరిగా ఆగాల్సి ఉంటుంది అనుకుంటా. ప్రతి ఉదయం మేజర్‌గారు ఆయన జాగిలంతో సహా మన రోడ్డు వెంబడే జాగింగ్‌కి వెళతారు. మధ్యలో ఆపి నువ్వు వచ్చావని చెప్పా. ధాన్యం మిల్లుకి వేసి రెండురోజులయ్యిందిట! కాని మొత్తం డబ్బు చేతికి రావడానికి మరో రెండు-మూడు రోజులు పట్టొచ్చు అంటున్నారాయన. అంతవరకూ నువ్వు ఆగక తప్పదు’ అన్నారు.

‘మరీ అన్నాళ్లా? మీకు ఇబ్బంది..’ అంటూ నసిగాడు జీవన్‌.

అతణ్ణి మాట పూర్తి చెయ్యనివ్వలేదు కామేశం గారు ‘వేడినీళ్లకి ఇళ్లు కాలవురా అబ్బాయ్‌! ఒక అతిథిని నాలుగురోజుల పాటు ఇంటిలో ఉంచుకో లేని గహస్థూ ఒక గహస్థేనా’ అంటూ తెగనొచ్చు కున్నారు ఆయన.

ఏమి చెప్పాలో తోచక మాటాడకుండా ఉండి పోయాడు జీవన్‌.

మళ్లీ కరణంగారే ‘ఇదిగో బాబూ! అంత దూరం నుండి వచ్చావు, పని పూర్తిచేసుకుని గాని వెళ్లే ప్రసక్తి లేదు. చూసి ఆనందించగల మనసే ఉండాలిగాని, పట్నంలో ఎంత వెతికినా కనిపించని విశేషాలెన్నో ఈ పల్లెల్లో కనిపిస్తాయి. మన పాలేరు మల్లేశు తోడొస్తాడు, ఊరంతా తిరిగి చూడు, నీకు మంచి కాలక్షేపంగా ఉంటుంది. మళ్లీ ఇటువైపు ఎప్పుడొస్తావో!?’ అన్నారు.

‘రెండు మూడు రోజులు ఉండాల్సివచ్చినా కూడా, ఉండి పని పూర్తి చేసుకుని రావాలి సుమీ!’ అన్న యాజులుగారి మాటలు గుర్తొచ్చాయి జీవన్‌కి. ఇంతలో లోపలి గదిలోనుండి గుక్క పట్టి ఏడుస్తున్న పసిపిల్ల ఏడుపు వినిపించింది, పాపం! పక్క తడుపుకుందో ఏమో !

వెంటనే, ‘ఇప్పుడే వస్తాను’ అంటూ కరణం గారు లోపలకు వెళ్లారు. తిరిగివస్తూ పదినెలల పసిపాపను ఎత్తుకుని వచ్చారు. పది నెలలు ఉంటాయి.

పిల్ల చాలా ముద్దుగా ఉంది. పండిన జామపండు రంగులో ఉన్న పాలబుగ్గలు, కాంతివంతమైన పెద్ద పెద్ద కళ్లు, చిన్ని లక్కచిట్టి లాంటి తీరైన నోరు, చిరునవ్వుతో విచ్చుకునే గులాబీ రంగు పెదవులు, చంద్రబింబం లాంటి ముఖాన్ని ఆవరించిన చిరుమేఘాల్లాంటి ముంగురులు. చూసినకొద్దీ చూడాలనిపించే ముద్దులు మూటకట్టే రూపం పాపది! ‘ఇక నా కాలక్షేపానికి లోటేం ఉండదు, ఈ పాపతో ఆడుకుంటే చాలు’ అనుకున్నాడు జీవన్‌, పాపను అందుకోడానికి చేతులు ముందుకు చాపుతూ.

చాపి ఉన్న చేతుల్లోకి కొత్త తెలియని ఆ పాపను అందిస్తూ, ‘నా మనుమరాలు బాబూ! అదో పెద్దకథ!’ అన్నారు ఆయన. అలా అంటున్నప్పుడు ఆయన కళ్లల్లో కదిలిన విషాద వీచిక జీవన్‌ దష్టి నుండి తప్పించుకుపోలేదు.

పై గుడ్డతో కళ్లూ మొహం నొక్కి తుడుచుకుని కామేశంగారు చెప్పసాగారు. ‘నా తల్లి జాహ్నవి! ముగ్గురు కొడుకుల తరవాత, ఇంక పిల్లలు పుట్టరు అనుకునే తరుణంలో అపురూపంగా పుట్టిన ఒక్కగానొక్క కూతురు. అవతలి వాళ్ల అబద్ధపు మాటలు నమ్మి, అన్నివిధాలా మంచి సంబంధమని భ్రాంతి పడి, జాహ్నవి, ‘అప్పుడే నాకు పెళ్లి వద్దు నాన్నా!, చదువుకుంటా’నని ఏడుస్తున్నా పట్టించుకో కుండా, బలవంతంగా దాని మెడలువంచి మరీ పెళ్లి చేశాము. వాళ్ల భోగభాగ్యాలన్నీ వట్టి మేడిపండు వాటమని తరవాత తెలిసింది. ఆస్తికి మించిన అప్పులున్నాయి. ఉంటే ఉన్నాయి పోనీ-అని సరిపెట్టుకుందామన్నా, అతని బుద్ధయినా మంచిది కాదు! లేని వ్యసనాలు లేవు. ఒకసారి, పూటుగా తాగి రాత్రిపూట బైక్‌ మీద క్లబ్బు నుండి ఇంటికి వస్తూంటే ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టాడు. మా అమ్మాయి అప్పటికి గర్భవతి అయి ఉండకపోయినట్లైతే, ‘పీడా పోయింద’ని సరిపెట్టుకుని ఉండేవాళ్ళమేమో! ఆ కొద్దిరోజులలోనే మా ప్రాణం అంత విసిగి పోయిందంటే నమ్ము! అదక్కడితో అయ్యిందా – అంటే, అదీలేదు. కరువులో అధికమాసంలా కవలలు పుట్టారు. ఒకబ్బాయి, ఒకమ్మాయి! ఏం చెయ్యగలం చెప్పు, ఏడవడం తప్ప! అంతా మా కర్మ, దాని తలరాత అనుకొని అనుభవించడమే మా వంతయింది’ అంటూ తలమీద చేత్తో టపటపా కొట్టుకున్నారు కరణంగారు.

జాహ్నవి దుస్థితి విన్న జీవన్‌కి తన తల్లి తలపుకి రావడంతో మనసు ద్రవించింది.

వెంటనే అతనికి ఒక ఉదాత్తమైన ఆలోచన వచ్చింది.

(ఇంకా ఉంది)

–  వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *