జీవనస్రవంతి – 28

జీవనస్రవంతి – 28

ధారావాహిక

: జరిగిన కథ :

జగన్నాథంగారు రాసిన విల్లును లాయరు రామేశం గారు అందరి సమక్షంలో చదివి వినిపించి, రజనీ రఘురాంలకు చూపించి, జీవన్‌కి ఇచ్చారు. జగన్నాథంగారికి భవిష్యత్తులో చెడ్డపేరు రావడం తనకు ఇష్టం లేదని చెప్పి జీవన్‌ ఆ విల్లును చించివేశాడు. రజనీ, రఘురాంలు జీవన్‌, మీనాక్షిలను క్షమాపణలు కోరారు. అందరూ కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు. జీవన్‌కి హెల్ప్‌లైన్‌ పనులు తగ్గాయి. ఇంటి అద్దె పెరిగింది. మీనాక్షికి కూడా పని లేకపోవడంతో ఇల్లు గడవటం కష్టమయింది. దాంతో జీవన్‌ ఇంటి ఖర్చుల కోసం మొదటి నెల ర్యాలీ సైకిల్‌ అమ్మేశాడు. రెండవ నెల తన గోల్డ్‌మెడల్‌, జగన్నాథం తాతయ్య తనకు పెట్టిన ఉంగరం అమ్ముదామని నిశ్చయించుకుని, వాటిని తీసుకుని బంగారు నగలు అమ్మే షాపుకి బయలుదేరాడు.

ఇక చదవండి..

ఆ ఊళ్లో మంచి పేరున్న నగలకొట్టు చగన్‌ లాల్‌ది. అతని షాపు ఎప్పుడూ నగలు కొనడానికి, బంగారం అమ్మడానికీ వచ్చే జనంతో కిటకిట లాడుతూ సందడిగా ఉంటుంది. అక్కడకే వెళ్లాడు జీవన్‌ ఉంగరం, గోల్డుమెడల్‌ తీసుకుని.

జీవన్‌ తనముందు ఉంచిన వాటిని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు చగన్‌లాల్‌. గోల్డుమెడల్‌ ఇంకా మెరుగైనా మాయలేదు. తూకం వేస్తే సరిగా ఐదు గ్రాములురది. ఉంగరాన్ని చూసి అతడు ముఖం చిట్లించాడు. పనివాడిని పిలిచి ఉంగరాన్ని ఇచ్చి శుభ్రపరచి తెమ్మన్నాడు.

శుభ్రమై వచ్చిన ఉంగరాన్ని ఆశ్చర్యంగా చూశాడు జీవన్‌. చాలారోజుల నురడి దానిని అంటి పెట్టుకుని ఉన్న జిడ్డు, మడ్డి అంతా వదిలిపోవడంతో మెరిసిపోతోంది ఉంగరంలోని ఓవల్‌ షేప్‌లో ఉన్న లేత గులాబిరంగు రాయి. దానిని చూడగానే చగన్‌లాల్‌ కళ్లు మెరిశాయి.

‘రెండు లక్షలకు తగ్గదు దీని వెల’ అనుకున్న చగన్‌లాల్‌, వెంటనే దానిని తీసుకువచ్చిన జీవన్‌ వైపు ఎగాదిగా చూశాడు. పాతగా కనిపించే జీన్సు పేంటు, ఇస్త్రీ లేని షర్టు, మాసిన జుట్టుతో నీరసంగా కనిపిస్తున్న జీవన్‌ని చూడగానే అతనికి ఇటువంటి అపురూప వస్తువును అమ్మదగిన వ్యక్తిగా జీవన్‌ కనిపించలేదు. సంశయంతో అతనిని మరోసారి తేరిపారజూశాడు చగన్‌లాల్‌.

వెంటనే, ‘కాసేపు ఆగాలి. సరైన ధర కట్టాలంటే కొంచెం సమయం కావాలి. ఆగండి’ అన్నాడు.

అతడు ఉంగరాన్ని తీసుకుని షాపు లోపలకు వెళ్లిపోయాడు. అతని రాకకోసం ఎదురుచూస్తూ కౌంటర్‌ ముందు నిలబడి ఉన్నాడు జీవన్‌.

చగన్‌లాల్‌ తిరిగి రావడానికి కొంత సమయం పట్టింది. వచ్చాక కూడా అతడు ఆ ఉంగరాన్ని అటుతిప్పి, ఇటుతిప్పి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడే తప్ప ఏదీ తేల్చిచెప్పడం లేదు. అది భోజనాల వేళ కావడంతో షాపులో ఎక్కువ మంది జనం లేరు. జీవన్‌కి కూడా ఆకలిగానే ఉంది. కాని ఏమి అనుకోడానికీ వీలులేని పరిస్థితి! ఇదివరకు ఎప్పుడూ అతడు ఇటువంటి షాపులకు వచ్చివున్నవాడు కాకపోవడంతో, ఇలాంటి చోట్ల ఈ ఆలస్యం మామూలే కాబోలు- అనుకుని ఓపికగా ఎదురు చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు గడిచాక ఇక ఉండబట్టలేక అన్నాడు, ‘శేఠ్‌జీ! ఎంతసేపు? కొంచెం తొందరగా పని కానివ్వండి సార్‌! నేనింకా చెయ్యాల్సిన పనులున్నాయి, వెళ్లాలి’ అన్నాడు మృదువుగా.

‘ఆ! వస్తున్నా! దీనికి సరైన ధర కట్టాలంటే ఒకరు రావలసి ఉరది. వారికోసం ఎదురు చూస్తున్నా. సరేగాని బాబూ! ఇవి నీకు ఎక్కడ దొరికాయి?’ కొంచెం పెడసరంగానే ఉంది అతని స్వరం.

జీవన్‌ తెల్లబోయాడు. ‘దొరకడమేమిటి సార్‌! డిగ్రీలో నేను కష్టపడి చదువుకుని సాధించినది ఈ గోల్డుమెడల్‌. ఇక ఈ ఉంగరం మా తాతయ్య నాకు ప్రేమతో ఇచ్చిన వరం!’.

చగన్‌లాల్‌ భుజాలు ఎగరేసి అన్నాడు, ‘భేష్‌! నువ్వు గొప్ప కథకుడిలా ఉన్నావే!’

చగన్‌లాల్‌ ఒక ఉద్దేశంతో అంటే జీవన్‌ మరోలా అర్థం చేసుకున్నాడు. ‘నేను కథలు చెప్పనండి, పత్రికలకు రాస్తా. అయినా ఆ సంగతి నేనెవరికీ చెప్పలేదే! మీకెలా తెలిసింది’ అని అడిగాడు.

అంతలో ఒక జీప్‌ వచ్చి షాపు ముందు ఆగింది. చగన్‌లాల్‌ ‘హాహాహా’ అంటూ పెద్దపెట్టున వికతంగా నవ్వాడు.

జీవన్‌కి ‘సమ్‌ థింగ్‌ వెంట్‌ రాంగ్‌’ అనిపించింది. అక్కడ నుండి వెళ్లిపోదామన్నా వీలులేని పరిస్థితి. గోల్డు మెడలు, ఉంగరం కూడా చగన్‌లాల్‌ చేతిలోనే ఉన్నాయి.

ఈసారి చగన్‌లాల్‌ గట్టిగానే అన్నాడు, ‘నువ్వు మంచి నటుడివి కూడా! నిజం చెప్పు, ఈ రెండూ నీకు ఎక్కడ దొరికాయి?’

జీవన్‌ ఖంగు తిన్నాడు. అతని ఆత్మాభిమానం దెబ్బతింది. ‘ఆపండి సార్‌! మీరు కొనకపోతే మరేం ఫరవాలేదు. కాని, నా మీద ఇలాంటి అభాండాలు మాత్రం వెయ్యకండి’ అన్నాడు కోపంగా.

‘నిన్ను చూస్తే పూటకు ఠికానా లేనివాడిలా కనిపిస్తున్నావు, అలాంటిది – ఇంత అపురూపమైన వజ్రం నీ దగ్గర చూసిన వాళ్లు అది నీ స్వంతమని ఎలా అనుకుంటారు? దేనికైనా ఉజ్జీ కుదరాలి కదా!’

‘వజ్రమా!’ ఆశ్చర్య పోయాడు జీవన్‌.

‘ఇది వజ్రమన్న సంగతికూడా నీకు తెలియదు! అలాంటిది ఇది నీదేనని ఎలా చెప్పగల్గుతున్నావు? ఇక నీ మాటను నన్నెలా నమ్మమంటావు?’

వజ్రాల వ్యాపారి కాకపోయినా చగన్‌లాల్‌కి వజ్రాల విషయం బాగా తెలుసు. ఈ ఉంగరంలో ఉన్నది చాలా అపురూపమైన వజ్రర. సాధారణంగా వజ్రమంటే గాజులా ఏ రంగూ ఉండదనీ, కాంతిని విశ్లేషణం చేయడం వల్ల మెరుస్తురదనీ అనుకుంటారు. నిజమైన వజ్రాలు ప్రకృతి జన్యాలు. అప్పుడప్పుడు – ఏ ప్రకృతి వైపరీత్యం వల్లనో, చాలా అరుదుగా, వేరేవేరే రంగులతో కూడా వజ్రాలు పుడుతూ ఉంటాయి. అలాంటి అరుదైన వాటిలో ఇది ఒకటి. బఠానీ గింజంత ఉరవతో ఉంది ఈ అపురూపమైన ‘లైట్‌ పింక్‌ జ్యూయల్‌’.

బూట్ల చప్పుడు విని వెనక్కితిరిగి చూసిన జీవన్‌కి ఎదురుగా పరిచయస్తుడైన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కనిపించేసరికి, ‘గుడ్మార్ణింగ్‌ సార్‌!’ అంటూ ఆయనకు అభివాదం చేశాడు.

వెంటనే ఆయన కూడా ‘వెరీ గుడ్‌మార్నింగ్‌ యంగ్‌ మాన్‌!’ అంటూ ప్రత్యభివాదంచేసి, జీవన్‌తో కరచాలనం కోసం చెయ్యి ముందుకు జాపి, ‘ఇక్కడున్నావేమిటి, ఇంట్లో ఏదైనా శుభకార్యమా’ అని అడిగాడు ప్రేమగా భుజం తట్టి.

అది చూడగానే, రెండడుగులు ముందుకువేసి, ‘రండి, రండి’ అంటూ వాళ్లని ఆహ్వానించాలని నోరు తెరిచిన చగన్‌లాల్‌కి నోటమాట రాలేదు.

జీవన్‌ చిన్నగా నిట్టూర్చి, ‘కొనడమెక్కడ సార్‌! అమ్మడానికి వచ్చా. అవసరం అలా వచ్చిరది’ అన్నాడు.

ఇన్‌స్పెక్టర్‌ చగన్‌లాల్‌ వైపుకి తిరిగి అడిగాడు, ‘శేఠ్‌జీ! మీరు మమ్మల్ని అర్జరటుగా బయలుదేరి రమ్మన్నారు, ‘దొంగ’ అన్నారు, ‘దొంగతనం’ అన్నారు, ఇక్కడ అలాంటిదేమీ కనపడటం లేదే! అసలు ఏం జరిగింది?’

జీవన్‌కి ఇన్‌స్పెక్టర్‌ ఇస్తున్న గౌరవాన్ని చూసిన శేఠ్‌ చగన్‌లాల్‌ తెల్లబోయాడు. వెంటనే మాట మార్చడం కోసం, జీవన్‌తో సహా – అందరికీ ‘మజా’ తెమ్మని పనివాడికి పురమాయించాడు. నిజం చెప్పాలంటే, తప్పుడు ఆలోచన చేసినందుకు అతనికి పచ్చి వెలక్కాయ గొంతుకలో అడ్డం పడినట్లు ఉక్కిరి బిక్కిరిగా తయారయింది పరిస్థితి. కానీ ఇన్‌స్పెక్టర్‌ వదలలేదు. అదే ప్రశ్న మళ్లీ అడిగాడు. ఇక చెప్పక తప్పలేదు. తడబడుతూ, నత్తురు నత్తురుమంటూ మొత్తానికి చెప్పేశాడు చగన్‌లాల్‌.

‘అది.. అది.. మరేమీ కాదండీ.. ఈయన ఒక ఉంగరాన్ని అమ్మడానికి తెచ్చారు. అది ఈయనదో కాదోనని అనుమానం వచ్చిరది. లా అండ్‌ ఆర్డర్‌ మా చేతుల్లోకి తీసుకోకూడదు కనుక అదేదో మీరువచ్చి తేలిస్తే తరవాత బేరం ఫైనల్‌ చెయ్యాలని మిమ్మల్ని పిలిచాను. ఉంగరంలోని వజ్రం చాలా విలువైనది, అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు’ అన్నాడు తెలివిగా, తనవల్ల తప్పేమీ లేదన్నట్లుగా.

‘ఏదీ ఆ ఉంగరం నాకు చూపించండి?’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.

చగన్‌లాల్‌ ఉంగరం ఇన్‌స్పెక్టర్‌కి ఇచ్చాడు. దాన్ని ఆయన అటూ ఇటూ తిప్పిచూసి, ‘ఔను, అదే ఉంగరం. ఎటొచ్చి ఇదివరకులా మురికిగా లేదు. ఈ ఉంగరం ఈయనదే! తనను ప్రాణాలకు తెగించి యాక్సిడెంట్‌ నుండి కాపాడినందుకు ఇతనికి ఒక పెద్దాయన బహుమానంగా ఇచ్చారు. దానికి సాక్షిని నేనే! ఈయన నాకు బాగా తెలుసు. ఈయనని గురించి ఏ అనుమానాలూ పెట్టుకోవద్దు. ఇంతకీ దీని వెల ఎంత ఉంటుందంటారు?

‘లక్షన్నర ఉండొచ్చు. దీనిని నేనే కొనుక్కోవాలను కుంటున్నాను’

‘శేఠ్‌ జీ! మీకు నేనొక మాట చెప్పాలను కుంటున్నా. ఎదుటి వ్యక్తిని గురించి మనకు రూఢిగా ఏమీ తెలియనప్పుడు తొందరపడి మాటలు మిగలకూడదు. వయసులో చిన్నగాని, ఈయన అరవై లక్షల విలువ చేసే ఆస్తిని ఆత్మగౌరవం నిలుపు కోడానికని గుడ్డిగవ్వలా వదిలేసిన వ్యక్తి, తెలుసా! అటువంటి వ్యక్తి, రెండు లక్షలైనా చెయ్యని ఈ ఉంగరాన్ని దొంగిలిస్తాడనుకోడం పెద్ద తప్పు, తెలుసా!’

చగన్‌లాల్‌ పశ్చాత్త్తాపంతో వణికిపోయాడు. జీవన్‌ చేతులను తన చేతుల్లోకి తీసుకుని, ‘చిన్నవాడి వని నేను నీ కాళ్లు పట్టుకోలేదు, ఇవి చేతులు కావు, కాళ్లనుకో! నిన్ననుమానించి నేను చాలా పెద్ద తప్పు చేశా, నన్ను మన్నించు’ అంటూ ప్రాధేయపడ్డాడు.

చేతుల్ని విడిపించుకుని అన్నాడు జీవన్‌, ‘మీరేమీ బాధపడకండి శేఠ్‌జీ! ఎంతటి వారికైనా పొరపాట్లు సహజం. అయినా ఇప్పుడు నాకేమీ కాలేదు కదా! ఇక్కడతో అంతా మరిచిపోదాం’.

ఇన్‌స్పెక్టర్‌ ఉంగరాన్ని అటూ ఇటూ తిప్పిచూసి, ‘శేఠ్‌జీ! దీని అందం చూస్తూరటే, దీని వెల మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఉంటుందనిపిస్తోంది’ అన్నాడు. చగన్‌లాల్‌ ఏమీ మాట్లాడలేదు.

‘సరే! దీన్ని తీసుకెళ్లి ‘తనిష్క్‌’లో కూడా చూపించి వెల కట్టిద్దాం. ఆ తరవాత కావాలంటే అది ఆ ఈయనకే ఇవ్వవచ్చు’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.

‘సార్‌! మీరు అక్కడ ధర కట్టించి స్లిప్‌ తీసుకురండి, దీన్ని నేనే కొనుక్కురటా’ అన్నాడు చగన్‌లాల్‌.

‘జీవన్‌బాబూ! పద వెళదాం. నేనటే వెళుతున్నా, అక్కడి వ్యవహారం కూడా ఫైనల్‌ చేయిద్దాం పద’ అంటూ జీప్‌ దగ్గరకు నడిచాడు ఇన్‌స్పెక్టర్‌.

తనిష్క్‌లో ఆ ఉంగరంలోని రాయి చాలా అపురూపమైనదని చెప్పి దానికి రెండు లక్షలు వెలకట్టారు అక్కడి వజ్రశోధకులు. ముచ్చటపడి ఆ ధరకే దాన్ని కొనుక్కున్నాడు భాగ్యవంతుడైన నగల వ్యాపారి చగన్‌లాల్‌. జీవన్‌కి ఇక తన గోల్డుమెడల్‌ అమ్మాల్సిన అవసరం కనిపించలేదు. లక్షరూపాయలు అంటేనే జీవన్‌ దృష్టిలో చాలా పెద్దమొత్తం. ఇప్పుడు తన చేతిలో ఉన్నది రెండు లక్షలు! ఆ డబ్బు తన అవసరాలకు చక్కగా సరిపోతుంది.

ఆ ఉంగరానికి అంత వెల పలుకుతుందని అతడు ఊహించలేదు. ‘తాతయ్య తనను ప్రత్యక్షం గానే కాదు, పరోక్షంగా కూడా కాపాడుతున్నాడు’ అనుకునేసరికి తాతయ్య జ్ఞాపకాలతో అతని హృదయం బరువెక్కింది. నిజానికి ఇంటి ఖర్చుల కోసం ఉంగరాన్ని వదులుకోవలసివచ్చి నందుకు అతని మనసంతా దిగులుతో నిండి పోయింది. ప్రస్తుత పరిస్థితిలో అంతకన్నా గత్యంతరం ఏముంది?! అని మనసు సముదా యించుకున్నాడు.

————

కిరణ్‌ తండ్రిచేత ముహూర్తం పెట్టిరచింది మీనాక్షి. సరిగా ఆ ముహూర్త సమయంలో, ‘శ్రీ జననీ ఫుడ్‌ ప్రోడక్ట్సు’ కి ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిపించారు జీవన్‌, మీనాక్షిలు. ఎప్పుడో తెచ్చి ఇంటిలో ఉంచుకున్న జగన్నాథంగారి ఫోటోని పెద్దది చేయించి తెచ్చాడు జీవన్‌. దానిని కూడా పూజా వేదికమీద దేవుళ్లతో పాటుగా ఉంచి, పూలదండ వేసి, పూజచేసి, తాతయ్య ఎడల తమ కతజ్ఞతను చూపించుకున్నారు తల్లీకొడుకులు.

పూజ తరువాత తొలి విడతగా, తరిగిపెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఉప్పు పసుపు కలిపి జాడీలో పోసి మూతపెట్టింది మీనాక్షి. పూజ చేయిరచిన రామసోమయాజులు గారికి కొత్తబట్టలు, పళ్లు, దక్షిణ సమర్పించి, తల్లీ కొడుకులు ఆయనకు నమస్కరించి వేదవిహితమైన ఆశీస్సులు అందుకున్నారు. ఆహూతులకు, అనాహూతులకు సమంగా పండూ తాంబూలాలతో పాటుగా తీపిని కూడా పంచి వేడుక చేసుకున్నారు.

అలా మొదలయ్యింది మీనాక్షి ఆధ్వర్యంలో ఆ వ్యాపారం. తల్లికి బాగా అలవాటైన పనిలో, తల్లినే యజమానిగా నిర్ణయించి, తల్లి పేరుతోనే ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు జీవన్‌, తాను పక్కనుండి నడిపిస్తూ. అంతేకాదు, తామీ వ్యాపారం మొదలెట్టిన విషయం నలుగురికీ తెలియడం కోసం తెల్లకాగితంపై తన గుండ్రని చేతిరాతతో ‘శుచికి, రుచికి శ్రీజననీ ఫుడ్‌ ప్రోడక్ట్సునే వాడండి, మమ్మల్ని ప్రోత్సహించండి’ అని రాసి, ఊరిలో నలుగురూ తిరిగే ముఖ్యమైన ప్రదేశాలలో ఆ కాగితాలు అతికించాడు. నోటిమాటగా కూడా ప్రచారం బాగా సాగింది. ఇదివరకే హెల్పులైన్‌ ద్వారా పరిచయమైన వాళ్లకు కరివేపాకు పొడి, ఇడ్లీకారం వగైరా చిన్న పొట్లాలు పంచిపెట్టి, తన తల్లి వ్యాపారానికి సహకరించవలసినదిగా కోరాడు.

మెల్లగా అమ్మకాలు మొదలయ్యాయి.

ఏయే రుతువుల్లో ఏయే వస్తువులు విరివిగా దొరుకుతాయో, ఆయా వస్తువులతో ఆయా రుతువుల్లో ఊరగాయలు తయారుచేసి, సంవత్సరం పొడుగునా అమ్మడం లాభసాటిగా ఉంటుంది – అనుకుంది మీనాక్షి. రకరకాల పదార్ధాలను తయారు చేసి, అడిగిన వారికి లేదనకుండా అందజేయడం మొదలుపెట్టింది. క్రమంగా రకరకాల ఊరగాయలు, కందిపొడి, సారబారుపొడి, ఇడ్లీ కారంపొడి, కరివేపాకు పొడి లాంటివీ, వెరైటీగా అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు ఇలా భోజనాన్ని రుచికరంగా చేసే విధవిధాలైన పదార్ధాలు రుచిగా శుచిగా తయారుచేసి, డబ్బాల్లో, సీసాల్లో దాచి జీవన్‌ నిర్ణయించిన సరసమైన ధరలకు అమ్మడం మొదలు పెట్టింది.

రుచి బాగుండటం, ఇంటివంటని తలపించ టంతో రోజురోజుకీ వినియోగదార్ల సంఖ్య పెరగసాగింది. ఇన్నాళ్లూ ఒక్క యాజులుగారి కుటుంబం మాత్రమే ఇష్టంగా మీనాక్షి చేతి వంటను తిన్నారు. ఇప్పుడు ఊళ్లోని వాళ్లకు కూడా క్రమంగా తెలుస్తోంది ఆమె హస్తవాసి ఏమిటో! అనతికాలం లోనే మీనాక్షి తయారుచేసిన వంటలకు మంచిపేరు రావడంతో వ్యాపారం ఊపందుకుంది. దాంతో చూస్తూండగా ఖర్చులుపోను డబ్బు మిగలసాగింది. రోజురోజుకి కొనుగోలుదారుల సంఖ్య పెరుగు తూరడడంవల్ల ఎక్కువ సరుకు తయారు చెయ్య వలసిన అవసరం వచ్చింది. ఆ రద్దీని ఎదుర్కోవడం మీనాక్షి ఒక్కదానివల్ల అవ్వదని అర్ధమయ్యింది వాళ్లకి. దాంతో పనివాళ్లను పెట్టుకోవలసివచ్చిరది.

పనివాళ్లను పెట్టడంతో దినదినాభివృద్ధి అవుతోంది వ్యాపారం. పక్క ఊళ్ల నుండి షాపుల వాళ్లు, కమీషన్‌ మీద మీ సరుకు అమ్మిపెడతా మంటూ రాసాగారు. సరుకు ఇబ్బడి ముబ్బడిగా తయారు చెయ్యవలసిన అవసరం రావడంతో పనివాళ్ల సంఖ్య కూడా పెంచక తప్పలేదు. వెంటనే మరో ఇద్దరు పనివాళ్లను తల్లి ఆధ్వర్యంలో పనిచేసేలా ఏర్పాటుచేశాడు జీవన్‌. సరుకు తయారీ ఇంకా పెరిగింది. అడిగినవాళ్ళకు లేదనకుండా ఇవ్వగలుగు తున్నారు. పనివాళ్లకు ఏయే వస్తువు ఎలా చెయ్యాలో చెప్పి చేయిస్తూ, వాళ్లు సరిగా చేస్తున్నారా – లేదా అని పర్యవేక్షణ చేస్తూ, శుచికి, రుచికి ఏ లోపం రాని విధంగా సరుకు తయారు చేయిస్తోంది.

పనివాళ్ల పెరుగుదలతో ఇంట్లో మసిలే జనం ఎక్కువ కావడంతో ఇల్లు చాలని పరిస్థితి వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న ఆ ఇంటిని విడిచి వేరే పెద్ద ఇల్లు చూసుకుని వెళ్లక తప్పలేదు. తమ అవసరాలకు తగిన పెద్ద ఇంటి కోసం వెతకసాగాడు జీవన్‌.

(ఇంకా ఉంది)

– వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *