జీవనస్రవంతి-16

జీవనస్రవంతి-16

జరిగిన కథ

జీవన్‌ చీకటి పడకముందే కరణం గారి ఇల్లు చేరాడు. కరణం దంపతులు అతనిని ఆహ్వానించి ఆ రాత్రి స్నానం, భోజనం, పడక ఏర్పాట్లు చేసారు. కరణంగారు తెల్లారి జీవన్‌తో పని పూర్తయ్యేవరకు ఉండాలని, అప్పటి వరకు ఊరు చూడమని చెప్పారు. అంతలో లోపల ఏడుస్తున్న పసిపిల్లను తెచ్చి ఆడిస్తూ, కరణంగారు తన కూతురు జాహ్నవి దుస్థితి గురించి జీవన్‌తో చెప్పుకున్నారు. అది విని జీవన్‌ బాధపడ్డాడు. అతనికి ఒక ఉదాత్తమైన ఆలోచన వచ్చింది.

ఇక చదవండి..

తన తల్లి కూడా సుమంగళిగా కనిపించాలన్న కోరిక జీవన్‌కి ఉండేది. ఆమె మాత్రం అలాంటి మార్పుకి సుతరామూ అంగీకరించలేదు. పెద్దలు చూపిన దారినే పోతాననీ, ఏ సంస్కరణకీ ఒప్పుకోననీ తెగేసి చెప్పేసింది కూడా! ఆ తల్లికి బిడ్డ తాను. కాబట్టి తన తల్లిలా చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించిన మరే అమ్మాయికైనా సాయపడితే బాగుంటుంది కదా! అని ఎప్పుడో అనిపించింది జీవన్‌కి. ఇప్పుడు, జాహ్నవికి మంచి జీవితం దొరకాలంటే, తాను తనకి చేతనైన సాయం తప్పక చెయ్యాలి అనుకున్నాడు అప్పటికప్పుడే.

కాని ఇప్పుడు తను నిరుద్యోగి, అన్నివిధాలా అసమర్ధుడు! మనసులోని మాట పైకి అనగల సమర్ధత తనకిప్పుడు ఏమాత్రం లేదు. కోపంలో అన్నా తన తల్లి నిజమే చెప్పింది, ‘తా దూర కంత లేదు, మెడకో డోలుట!’ అని. కాబట్టి ఇప్పుడు అది కుదిరేపని కాదు అనుకున్నాడు.

ముందుగానే లేనిపోని ఆదర్శాలకి పరుగెత్తి, అపహాస్యం పాలవ్వడం కన్న, కిరణ్‌ చెప్పినట్లు, తగిన సమయం కోసం ఎదురు చూడడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చి జీవన్‌ మనసు కుదుట పరుచుకున్నాడు.

అలాగని పూర్తి ప్రేక్షక పాత్రకి పరిమితం కావడానికి మనస్కరించడం లేదు. ‘అమ్మాయిగారిది మరీ చిన్నవయసు కదా, మళ్లీ వివాహం చెయ్యడమో, లేదంటే చదివించడమో బాగుంటుంది కదండీ!’ అన్నాడు భయం భయంగానే.

కామేశంగారు, జీవన్‌ అనుకున్నట్లుగా కోపగించుకోలేదు. తన మనోవేదన వెల్లడించే గొప్ప అవకాశం ఇన్నాళ్లకు తనకు దక్కిందన్నట్లుగా మనసులో మాట చెప్పసాగారు..

‘నువ్వు చెప్పిన మాట వినడానికి చాలా ఇంపుగా ఉంది బాబూ! నాకూ పెళ్లి చెయ్యాలనే ఉంది. కాని ఇద్దరు బిడ్డల తల్లిని పెళ్లి చేసుకుని ఆ పిల్లలకు తండ్రి అవ్వడానికి ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? మాతత్వం అంటే ఏమిటో తెలిసిన ఆడదానికే సవతి పిల్లలంటే కిట్టదు, ఇక మగాడేం చూస్తాడు మారుటి పిల్లల్ని! ఒక మగాడు, తనవాళ్లు కాని ఇద్దరు బిడ్డలకి తండ్రి కావడానికి ఇష్టపడగలడంటావా?’

జీవన్‌ ఏమని జవాబు చెప్పగలడు! తనకా సద్బుద్ధి ఉందిగాని, నిర్ధనుడు, నిరుద్యోగియైన తనకామాట పైకి ధైర్యంగా చెప్పే అర్హత లేదు – అన్నది అతనికి తెలుసు. కరణంగారి సవాలుకి జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు జీవన్‌.

పెద్దవాళ్ల సంభాషణలోని వేడి తెలియని పసిపాప జీవన్‌ చెక్కిలికి తన చెక్కిలి ఆనించి, ఒక రోజు పెరిగిన అతని గడ్డం గుచ్చుకుని గిలిగింతలు పెట్టినట్లు కాగా ముద్దుగా నవ్వింది. ఆ పాపను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, హదయానికి హత్తుకున్నాడు జీవన్‌. ఈ పాప కూడా తనలాంటి అభాగ్యురాలే, పైగా ఆడపిల్ల! ముందుముందు ఈ పాపకు ఏమేమి అగచాట్లు రాసి ఉన్నాయో ఏమో పాపం – అన్నభావం ఆ పాపను అతనికి చేరిక చేసింది. దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు జీవన్‌.

క్షణం ఆగి అడిగాడు జీవన్‌, ‘ఏం పేరుపెట్టారు’ అని.

‘పేరా – పాడా? దీనిని ‘చిట్టీ’ అనీ, దీని అన్నని ‘బాబూ’ అనీ పిలుస్తాము. అవసరానికి ఏదో ఒక పేరు తప్పదు కదా! అంగరంగ వైభోగంగా నామకరణం జరగాలంటే, పీటలమీద కూర్చోవలసిన వాళ్లు చల్లగా ఉండాలి కదా బాబూ!’ కరణంగారి కంఠంలో విరక్తి ధ్వనించింది.

—–    —–

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కొంతసేపు విశ్రాంతిగా పడుకుని లేచి, ఊరిలో పనుందంటూ వెళ్లారు కామేశంగారు. పిల్లలు నిద్రపోతున్నారు. జీవన్‌కి తోచనితనం మొదలయ్యింది. కాసేపలా ఉరిలో తిరిగివస్తే బాగుంటుందనిపించి సీతమ్మగారికి చెప్పాడు. కాని, అతడు ఒంటరిగా వెళ్లడానికి ఆమె ఒప్పుకోలేదు. పాలేరు మల్లేశు కొద్దిసేపటిలో వస్తాడనీ, ఇద్దరూ కలిసి వెళ్లవచ్చుననీ అభ్యంతరం చెప్పింది ఆమె. ఇక చేసేదేంలేక జీవన్‌ అరుగుమీద ఉన్న కుర్చీలో కూర్చుని, మల్లేశు రాకకోసం ఎదురుచూస్తూ, ఉదయం చదివిన పేపరునే మళ్లీ తిరగేస్తూ ఎలాగో కష్టపడి పొద్దుపుచ్చుతున్నాడు.

ఇంతలో ఒక అమ్మాయి, సుమారుగా పధ్నాలుగేళ్లు ఉంటాయి, పరుగులాంటి నడకతో, పరికిణీ కుచ్చిళ్లు రెపరెపలాడేలా విసవిసా నడుచుకుంటూ వచ్చి, గబగబా గుమ్మాలెక్కి లోపలకు వెళ్లింది. వెడుతూనే ‘అక్కా’ అంటూ గట్టిగా పిలిచింది.

వెంటనే జాహ్నవి పలికింది, ‘ఏమిటే గాయత్రీ! ఉరమని పిడుగులా ఇలా హఠాత్తుగా ఊడిపడ్డావు, ఏమిటా హడావిడి? ఒగరుస్తున్నావు కూడా, మంచి నీళ్లు తెస్తానుండు’ అంది సావడిలోకి వస్తూనే.

‘ఏమీ వద్దక్కా! ముందీ మాట విను – ‘హితైషిణి’ వీక్లీలో ఈ వారం చిరంజీవి కథ పడింది, తెలుసా!’ అంది గాయత్రి తెగ ఉబలాటపడిపోతూ.

జాహ్నవి నవ్వింది, ‘దానికంత బ్రహ్మాండం చేస్తున్నావేమిటి? చిరంజీవి రాసిన కథలు ఏదో ఒక పత్రికలో తరచూ పడుతూనే ఉంటాయిగా’ అంది.

‘చిరంజీవి’ అన్నపేరు వినగానే ఉలికిపడినట్లై, కుర్చీలో వెనక్కి జారగిలబడి ఉన్నవాడల్లా నిఠారుగా లేచి కూర్చున్నాడు జీవన్‌. సావడిలో సాగుతున్న సంభాషణ అతనికి చక్కగా వినిపిస్తోంది.

‘అబ్బా! కాస్త ఆగక్కా! నేను చెప్పిందంతా విన్నాక నీకే తెలుస్తుందిలే, నే నెందుకంత ఇదవుతున్నానో! ఈ వారం చిరంజీవి కథ అచ్చం నీ కథలాగే ఉంది. నీ సంగతంతా తెలిసి ఉన్నవాళ్లే, ఎవరో పనిగట్టుకుని రాసినట్లుగా ఉంది. నిజం అక్కా, నీ తోడు! ఇకపోతే, ముగింపు – అది నాకు చాలా చాలా నచ్చింది. అది చదివాక ఇక ఉండబట్టలేక ఇటు పరుగెత్తుకొచ్చా, తెలుసా?’ గాయత్రి ఆత్రం పట్టలేక గుటకలు మింగింది.

‘ఏదీ, పత్రిక తెచ్చావా? నాకింకా రాలేదు, మాకైతే పోష్టులో రావాలి కదా, కొద్దిగా ఆలస్యమౌతుంది’ అంది జాహ్నవి.

‘తేలేదక్కా. అన్నయ్య, వదిన చదువుతున్నారు. అన్నయ్య నిన్నేదో పనిమీద రాజోలు వెళ్ళాడు. అక్కడి బుక్‌ స్టాల్‌కి అప్పుడే వచ్చాయిట ‘హితైషిణి’ పత్రికలు. బండిల్‌ విప్పగానే తొలి పుస్తకం అన్నయ్యే కొనితెచ్చాడుట! దాన్ని నేను ముందుగా లాక్కుని చదివేశా! కథ ముగింపు నాకు బాగా నచ్చింది. అది నీకు చెప్పాలనిపించింది. వెంటనే ఇలా వచ్చా. ఈ సాయంత్రం పుస్తకం తెస్తాలే!’.

‘అబ్బా! సాయంత్రం దాకా ఆగాలా నేను? పోనీ, ముగింపు చాలా బాగుందన్నావు కదా, అదొక్కటీ చెప్పు’ అంది జాహ్నవి.

‘చిరంజీవి రాసిన కథకు ‘ముగింపు బాగుందా’ అని వేరే అడగాలా ఏమిటి! ఎప్పుడూ అది బాగానే ఉంటుంది. ఈ కథ ముగింపు సింప్లీ, సుపర్బు! చదువరుల హదయాలకు హత్తుకుపోయేలా ఉంది!’.

‘సరే! అదే చెప్పు!’

‘కథానాయిక పేరు సౌభాగ్య! కాని, నేతిబీరకాయలో నెయ్యి ఎంతో ఆమె జీవితంలో సౌభాగ్యమూ అంతే! మొదట్లో అలాగే అనిపిస్తుంది. కాని చివరకొచ్చేసరికి ఆమెకు తగినపేరే పెట్టినట్లు మనకు తెలుస్తుంది. ‘నేనింకా చదువుకుంటాను’ అంటూ, అచ్చం నీలాగే ఘొల్లున గోలపెడుతున్న పిల్లకు, గొప్ప జమీందారీ సంబంధం, తప్పిపోకూడదు – అంటూ బలవంతంగా మెడలు వంచి మరీ పెళ్లి చేస్తారు పెద్దవాళ్లు..’

చెపుతున్న గాయత్రికి జాహ్నవి అడ్డొచ్చింది, ‘పూస గుచ్చినట్లు మరీ అంత ఇదిగా చెప్పొద్దు, ముఖ్యమైనది ముగింపు. అది మాత్రం చెప్పు. కథంతా రేపు వివరంగా చదువుకుంటాలే’ అంది.

‘సరే, విను. ఆమె భర్త అకస్మాత్తుగా మరణిస్తాడు. ఆ సమయానికి వాళ్లకు ఒక కొడుకు ఉన్నాడు. ఆమె ఆ బిడ్డను తన తల్లిదండ్రుల దగ్గర విడిచివెళ్లి హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. పెద్దచదువులు చదివి ఉద్యోగస్తురాలౌతుంది. ఆమె సహోద్యోగి ఒకడు, ఆమెను ప్రేమించి, ఆమె కొడుకును తన స్వంత కొడుకుగా చూసుకుంటానని వాగ్దానం చేసి మరీ ఆమెను పెళ్లాడుతాడు! తన పేరు, తనగోత్రం ఆ పిల్లాడికి ఇవ్వడం కోసం లీగల్‌గా వాడిని దత్తత తీసుకుంటాడు. కథ సుఖాంతం! అక్కా! ఎండింగ్‌ చాలా బాగుంది కదూ! చిరంజీవి రాసిన కథలు చదువుతూంటే, అతడు మంచి ఆదర్శాలున్నవాడు అనిపిస్తుంది కదూ!’ అంటూ జాహ్నవి వైపు చూసింది గాయత్రి.

‘పోవే! నీకన్నీ గొప్పగానే కనిపిస్తాయి! ‘పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ’ అన్నట్లుగా, ఇంకా నువ్వు చిన్నపిల్లవి కదా, నీకెలా తెలుస్తుంది చెప్పు, ఈ లోకపు తీరుతెన్నులు! కథలు నిజాలు కావు, కేవలం కల్పితాలు! ఆ కల్పనలనీ, కథలనీ చదివి, వాస్తవాలు కూడా అట్లాగే ఉంటాయనుకోడం శుద్ధ తెలివితక్కువ పని. రచయితలు ఏవేవో ఉహించి రాస్తూంటారు, చదువేవాళ్ల మెప్పుకోసం. అవన్నీ అభూత కల్పనలు! కథల్లో ఆదర్శాలని కనీసం కథ రాసినవాళ్లు కూడా పాటించలేకపోవచ్చు. సినిమాలో శ్రీరామచంద్రుని పాత్ర ధరించిన వ్యక్తి నిజ జీవితంలో శ్రీరామచంద్రుడిలా ఉంటాడనుకుంటావా ఏమిటి? ఎంతమాత్రం అనుకోలేవు కదా! ఇదీ అంతే. ఆదర్శాలు కథల వరకే పరిమితం, రచయిత జీవితం రచయితదే!’.

‘అంతేనంటావా అక్కా !’ గాయత్రి గొంతుకలో అంతులేని నిరాశ.

జీవన్‌కి వాళ్ల మాటలన్నీ చక్కగా వినిపించాయి. జాహ్నవి విశ్లేషణ అతని మనస్సుని చివుక్కుమనేలా చేసింది. కాని, ఆమె మాటలు కూడా నూటికి తొంభై పాళ్లు సబబైనవే కదా – అనుకుని మనసు సరిపెట్టుకున్నాడు.

‘చాలామంది రచయితలు, రాజకీయవేత్తల్లాగే ఒకటి చెప్పి వేరొకటి చేస్తూంటారు. రచయితలు తమ రచనల్లో చెప్పే మాటలకీ, నిజజీవితంలో వాళ్లు చేసే చేతలకీ పొంతన ఉండదు. ఒకటి చెప్పి, వేరొకటి చేస్తూంటారు. అలాంటివారి సంఖ్య ఎక్కువే కావచ్చు, కాని తను మాత్రం అలా కాదు. తను, అన్నమాట అన్నట్లుగా నిలబెట్టుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తాడు. తను అన్నమాటకు తానే విలువ నివ్వకపోతే, తనమాటను ఇంకెవరు పట్టించు కుంటారు! తనకు ఆ అవకాశం రావాలేగాని, ఆమెకు తను తప్పక మేలు చేస్తాడు. పాపం! ఆ అమ్మాయి జాహ్నవి, జీవితంలో పెద్ద దెబ్బ తిని ఉండడం వల్ల అలా మాట్లాడింది. ఆమె అనుభవం అటువంటిది, అందులో ఆమె తప్పేమీ లేదు’ అనుకున్నాడు జీవన్‌.

—–    —–

సాయంకాలమౌతోంది. ఎండ తగ్గింది. చల్లబడింది. పిట్టలు నెమ్మదిగా గూళ్లకు చేరే ప్రయత్నంలో పడ్డాయి కాబోలు, కరణంగారి ఇంటి చూరుకు కట్టిన వడ్లకంకులను పొడుచుకు తినే ఊరపిచ్చుకల సంఖ్య క్రమంగా తగ్గసాగింది.

పశువుల్ని మళ్లేసుకు రాగానే సీతమ్మగారు చెప్పారు గావును, ‘రండి అబ్బాయిగోరూ! మనం కుంచేపలా తిరిగొద్దాం’ అంటు వచ్చాడు మల్లేశు జీవన్‌ దగ్గరకు. ఇద్దరూ బయలుదేరి రోడ్డుమీదికి వచ్చి కలిసి నడవసాగారు.

ఆ ఊళ్లో అక్కడక్కడ ఒకో డాబా ఇల్లు కనిపించినా, చాలావరకూ పెంకుటిళ్లే. అరుదుగా ఒక్కో పాత మండువా లోగిలి కూడా కనిపిస్తూ వచ్చింది. ఈ ఇళ్లన్నీ దాటాక విశాలమైన పెరడులో రెండంతస్తుల మేడ ఒకటి కనిపించింది. దాని పక్కనున్న ప్లేగ్రౌండ్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మేడ ఆ ఊరి హైస్కూలని, ఆ మేడకి ఉన్న బోర్డుని చదివి తెలుసుకున్నాడు జీవన్‌. అంతేకాదు, ఆ పేరును బట్టి దాన్ని యాజులుగారే ఆ ఊరి హైస్కూలుకి విరాళంగా ఇచ్చారని కూడా అర్థం చేసుకున్నాడు.

ఒక మనిషిని ఊరిజనం ఇన్నేళ్లు ప్రాణంగా గుర్తుపెట్టుకున్నారంటే, అది ఊరకే ఎలా జరుగుతుంది! దానికి తగిన కారణం ఉండి తీరుతుంది.

(ఇంకా ఉంది)

– వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *