జీవన స్రవంతి -14

జీవన స్రవంతి -14

ఆ యువతి తను కోరుకున్న వ్యక్తినే పెళ్ళాడింది. ఆ సంతోషంలో త్వరగానే గర్భవతి కూడా అయింది. కానీ అంతలోనే ఆ సంతోషం ఆవిరయ్యింది. ఒక ప్రమాదంలో భర్త చనిపోతాడు. జీవితాంతం కష్టాలు పడమని రాశాడేమో భగవంతుడు. గర్భవతిగా ఉండగానే భర్త చనిపోవటంతో చిన్న వయసులోనే అనంత శోకానికి గురైన ఆ యువతికి కొడుకు జన్మించటంతో శోకానికి కొంత విరామం లభించినట్లయింది. కొడుకు రూపంలో జీవన ఆశాదీపం మిణుకుమిణుకుమంటూ కనిపిస్తోంది. కొడుకును బతికించుకుంటూ తను బతుకుదాం అనుకుంది. కాని విధి ఆమె జీవితంలో మరో కష్టాన్ని రాసిపెట్టింది. అప్పటికే అత్తింటివారు పట్టించుకోవడం మానేయడం, పుట్టింట్లో వదిన ఆరళ్ళ రూపంలో ఆ కష్టం ఎదురయ్యింది. ఆ ఊరిలో ఇక బతకడం కష్టం అని నిర్ణయించుకున్న ఆ యువతి ఒక అర్ధరాత్రి తనను, తన కొడుకును బతికించుకోడానికి ఊరు దాటింది. అర్ధరాత్రి బయటకు వచ్చిన ఆ యువతి ఎటువెళ్ళింది ?

తన కొడుకును ఎలా బతికించుకుంది ? అనేక కష్టనష్టాలను భరిస్తూ, జీవితాన్ని ఎలా ముందుకు నడిపింది ? కొడుకు ఏమయ్యాడు ?

ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే

‘జీవన స్రవంతి’ ధారావాహిక.

మహిళల కంట కన్నీరు తెప్పించి మనసులు కదిలించే ధారావాహిక.

జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా కుటుంబ ధర్మాన్ని పాలించడానికి అడుగు ముందుకే వెయ్యాలనుకునే ప్రతి వ్యక్తి చదవాల్సిన ధారావాహిక

‘జీవన స్రవంతి’.

ప్రతీవారం జాగృతిలో…

జరిగిన కథ

జీవన్‌ డిగ్రీ పాసై ఉద్యోగం వెతుకుతూ, ఖర్చుల కోసం పత్రికలకు కథలు రాస్తుంటాడు. జీవన్‌ తల్లి మీనాక్షి యాజులుగారింట్లో వంట పనిచేస్తూ కొడుకును చదివించింది. జీవన్‌ యాజులుగారి మనవళ్ళకు ప్రైవేట్లు చెపుతుంటాడు. యాజులుగారి మనవరాలు కోవిద జీవన్‌కి 143 చెపితే, జీవన్‌ నవ్వుతాడు. నవ్వినందుకు తల్లి మీనాక్షి జీవన్‌ని తిడుతుంది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. జీవన్‌ కోసం ఎదురుచూస్తూ మీనాక్షి తన గతంలోకి వెళ్ళింది.

తన మేనత్త కొడుకు శంకరాన్ని పెళ్ళాడింది మీనాక్షి. గర్భవతిగా ఉండగా భర్త చనిపోతాడు. కూతురి పరిస్థితి చూసి తల్లీ మరణించింది. మీనాక్షికి కొడుకు పుట్టాడు. అతనికి జీవన్‌ అనే నామం స్థిరపడింది. కొన్నాళ్లకి మీనాక్షి తండ్రీ కాలం చేయడంతో చివరికి మీనాక్షి అన్నా, వదినల దగ్గర ఉంటూ ఆ ఇంటి పనులన్నిటినీ చేస్తూండేది. వదిన పద్మ మీనాక్షిని, జీవన్‌ని నానా మాటలూ అంటూండేది. తక్కువగా చూసేది. అది నచ్చక మీనాక్షి జీవన్‌తో సహా ఆ ఇల్లు వదలి, యాజులుగా రుంటున్న ఊరికి వచ్చి, వారింట్లో వంటలక్కగా పనికి కుదురుతుంది. అప్పటి నుండి మీనాక్షి యాజులుగారింట్లో వంటలక్కగా జీవనం సాగిస్తూ, కొడుకును పెంచుకుంటూ ఉంది.

అలా పెరిగిన కొడుకుని తను ఇప్పుడు అనరాని మాటలు అన్నందుకు ఎంతో బాధపడింది. ఇంతలో అర్థరాత్రి 2 గంటలకు తిరిగొచ్చిన జీవన్‌ని మనసారా ఆలింగనం చేసుకుని, తనను పచ్చాత్తాప పడుతుంది. మీనాక్షి. కోవిద ఢిల్లీ వెళ్ళిపోయే వరకు యాజులుగారింటికి రావద్దని జీవన్‌కి చెబుతుంది. తెల్లారి వంటకోసం యాజులుగారింటికి వెళ్ళిన మీనాక్షిని కోవిద కలిసి జీవన్‌ మాస్టారుని తాను ప్రేమించానని, అతనిని ఢిల్లీ రమ్మనమని, తన తల్లితండ్రులతో మాట్లాడి పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది. అది తప్పు అని, ‘ఊహలకీ వాస్తవాలకీ మధ్య తేడా చాలా ఎక్కువ’ అని మీనాక్షి చెపుతుంది.

మరో రెండు రోజుల్లో కోవిద తన తల్లితో కలిసి ఢిల్లీ వెళ్ళిపోతుంది. జీవన్‌కి మోక్షం కలిగినట్లయి తెల్లారి నుండి యాజులుగారింటికి వారి మనవళ్ళకు ట్యూషన్‌ చెప్పటానికి వెళుతుంటాడు. మీనాక్షి కూడా ఈ మధ్య జీవన్‌ని మురిపెంగా చూసుకుంటోంది. రోజులు గడుస్తున్నాయి.

ఒకరోజు యాజులుగారు జీవన్‌ని పిలిచి నీకు మించిన నమ్మకస్తుడు నాకు మరెవరూ లేరని, కాబట్టి నువ్వు ముఖ్యమైన పనిమీద మా ఊరు మల్లెవాడ వెళ్ళి రావాలని, అక్కడి నా మిత్రుడు నా పొలం అమ్మిన డబ్బు ఇస్తాడని, అది తేవాలని చెపుతారు. అందుకు జీవన్‌ ఒప్పుకుని, రైలెక్కి నరసాపురం చేరుకుని, అక్కడ బసెక్కి మల్లెవాడకు దగ్గరలో దిగుతాడు. అక్కడ ఉన్న దేవాలయంలో దేవుడికి నమస్కారం చేసుకున్నాడు. పూజారి మల్లెవాడకు వెళ్ళే దారి చెప్పి, అటుగా వెళ్ళే ఆసామితో జతచేస్తానన్నాడు. అంతలో పూజాసామాగ్రి తీసుకుని మల్లెవాడ ఆసామి రానే వచ్చాడు. అతని పేరు రామారావు. ఇక చదవండి..

పూజారిగారు రామారావుకు జీవన్‌ గురించి చెప్పి, అతను మల్లెవాడ చేరేందుకు సాయం చెయ్యమన్నారు.

వెంటనే, ‘ఆయ్‌! అలాగేనండి’ అంటూ పూజారికి మాటిచ్చి, రామారావు జీవన్‌ని మల్లెవాడ చేర్చే బాధ్యత తనమీద వేసుకున్నాడు.

పూజారి జీవన్‌ని గోత్రనామాలు అడిగి, అతని పేరుమీద కూడా అర్చన చేశాడు. పూజ చేసి, ఇద్దరికీ తీర్థప్రసాదాలు ఇచ్చాడు. ఇద్దరూ చెరో పది రూపాయలు పళ్ళెంలో ఉంచి శఠగోపం పెట్టించుకుని, పూజారివద్ద సెలవు తీసుకున్నారు.

పూజారిగారు, ‘శుభమస్తు!’ అని దీవించి, ‘రామారావుగారు! ఇంటికెళ్ళ గానే శివనామం జపిస్తూ, విభూతి అబ్బాయి నొసటన పెట్టండి. ఈ రాత్రికి మీ అబ్బాయికి జ్వరం తగ్గి, తెల్లారేసరికి లేచి తిరుగుతాడు. ఇంక దిగులు పడక్కర లేదు’ అంటూ భరోసా ఇచ్చారు. ఆయనకి మళ్ళీ నమస్కరించి, రామారావు తిరుగుప్రయాణ మయ్యాడు.

దేవాలయం మెట్లు ఇంకా పూర్తిగా దిగకముందే రామారావు జీవన్‌ చేతిలోని పెట్టెను అడిగాడు, తను తీసుకువస్తా ఇమ్మనంటూ..!

‘మీరు మా ఊరువస్తే మా ఇంటికి వచ్చినట్లే నండి, ఆయ్‌! ఇంటికాడి కొచ్చిన చుట్టాలు ఎవరి సామాను ఆళ్ళే మోసుకుంటే ఇంక మేముండి లాబమేంటండీ, ఆయ్‌!’

బలవంతంగా జీవన్‌ చేతిలోని పెట్టెను రామారావు అందుకున్నాడు.

జీవన్‌కి అది నచ్చలేదు. కాని యాజులుగారు వచ్చేముందు చెప్పి పంపారు, ‘పల్లెవాసులు చేసే మర్యాదల్ని మనం కాదంటే వాళ్ళు మనసు చాలా కష్టపెట్టుకుంటారు, వద్దనకుండా భరించాలి మనం’ అని. ఆయన చెప్పింది గుర్తొచ్చి రామారావుకి పెట్టె ఇచ్చేశాడు జీవన్‌.

వాళ్ళు రోడ్డుమీద కొంతదూరం వెళ్లి పక్కకు మళ్ళి, పొలం గట్లవెంట మరికొంత దూరం నడిచాక, ఒక కాలవగట్టు ఎక్కారు. కాలవ గట్టు వెంట ఒక అరకిలోమీటరు దూరం వెళ్ళాక, కాలవకి అడ్డంగా ఒక కొబ్బరి దుంగ వెయ్యబడి ఉంది. దానిమీద, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి రామారావు పెట్టెతో సహా, అవలీలగా దాటి వెళ్ళిపోయాడు. కాని జీవన్‌కి కాలువలో పడిపోతానేమోనని భయం వేసి, ఈవలి ఒడ్డునే నిలబడిపోయాడు.

‘అబ్బాయిగారూ! మరేం పర్లేదండి, వచ్చె య్యండి. ఇదేమీ పెద్ద పడవల కాలువేం కాదండి, ఆట్టే లోతుండదండి, పొలాలకి నీరు తీసుకెళ్ళే పంటకాలువండి, ఆయ్‌! దష్టి దుంగమీదే పెట్టి జాయ్‌గా, దారినే చూసుకుంటూ వచ్చెయ్యండి! ఇది చాలా చిన్నకాలువ. పంట కాలువకి తక్కువ, బోదికాలవకి ఎక్కువ! మేం దీన్ని రేవటి కాలువ అంటామండి, ఆయ్‌!’ అన్నాడు రామారావు.

ఆవలి ఒడ్డుకి వెళ్ళాక, తానెందుకంత భయపడ్డాడో తనకే తెలియలేదు జీవన్‌కి.

కొంతదూరం వెళ్ళాక ‘ఔనుగాని, అబ్బాయిగారు! తమరు ఎంతవరకూ చదూకున్నారండి’ అని అడిగాడు రామారావు.

‘లెక్కల్లో కాలేజి చదువు పూర్తిచేశాను’ అన్నాడు జీవన్‌ టూకీగా.

‘లెక్కలంటే – వడ్డీ లెక్కలు, సగటు, సరాసరి, బద్దింపు లెక్కలు, ఇంకేంటంటే కాలమూ, దూరమూ – ఇలాంటి లెక్కలేనాండి !?’

‘ఇవి నేర్చుకోడం హైస్కూల్లో ఐపోతుంది. కాలేజీల్లో ఇంకొంచెం పెద్దతరహా లెక్కలు నేర్పుతారు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ.. ఇలా కొన్నిరకాలు. ఇవికాక ఇంకా పై తరహా లెక్కలు కూడా ఉన్నాయి. ఆ లెక్కలు విమానాలు, రాకెట్లు లాంటివి నడిపేటప్పుడు ఉపయోగిస్తాయి! చదువుకు ఆదే గాని, అంతం లేదండి!’ అన్నాడు జీవన్‌.

‘అయ్యబాబోయ్‌! అంత చదువు చదవడానికి ఎంతో పెట్టిపుట్టాలి. తమరు అదురుష్టవంతులండి’ అన్నాడు రామారావు.

వెంటనే జీవన్‌ టాపిక్‌ మారుస్తూ ‘మీకు ఏపాటి వ్యవసాయం ఉంది? కిట్టుబాటుగా ఉంటుందా?’ అనడిగాడు.

‘అబ్బే! ఎంతో లేదండి, ఓ పదెకరాల మాగాణి, ఐదెకరాల కొబ్బరితోట ఉన్నాయండి. అదికాక మరో మూడెకరాల బంజరుందండి. ఇక కిట్టుబాటు సంగతి చెప్పాలంటే శానా కథ ఉందండి – ఒకోసారి అతివష్టి, మరోసారి అనావష్టి! ఏటేటా గాలివానలు! గాలివాన వస్తే పెట్టుబడికూడా దక్కదండి. ఒకోసారి ధరలు కిట్టుబాటుగా ఉండవండి. దళారులకు దక్కినంత కూడా ఏడాది కష్టపడ్డ రైతుకు దక్కనప్పుడు ఎందుకొచ్చిన యవసాయమండీ! కూటికా, గుడ్డకా?’ గాఢంగా నిటూర్చాడు రామారావు.

‘అలా అనకండి రామారావుగారు! ఏ వత్తీ కూడా ఈ వ్యవసాయానికి సాటిరాదు. ఏ పనినైనా తీసి పారేయ్యవచ్చునేమోగాని, తిండిపెట్టి మనిషిని పోషించే వృత్తిని మాత్రం తక్కువ చెయ్యకూడదు. మీ కషిని సరిగా అర్ధం చేసుకుని తగిన గౌరవాన్నిచ్చే మంచిరోజు త్వరలోనే రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను’ అన్నాడు జీవన్‌ కొంచెం బాధ నిండిన కంఠస్వరంతో.

భావోద్వేగంతో ఇద్దరూ కూడా మాట్లాడలేక పోయారు. కొంతసేపు అలాగే మౌనంగా నడిచారు.

అకస్మాత్తుగా దూరం నుండి, ‘ఒ¬¬య్‌’ అన్నకేక వినిపించింది. ఆ కేక విన్న రామారావు ఆగి, కేకవచ్చిన దిక్కుగా తిరిగి చూశాడు. దూరంగా నడిచి వస్తున్న మనిషి కనిపించాడు. అదే తీరుగా రామారావు కూడా ఆ కేకకు బదులిచ్చాడు.

ఆశ్చర్యంగా చూస్తున్న జీవన్‌తో ‘ఆయబ్బి మా రంగనాధం మావయ్యండి! అలాని మా సొంత మావయ్యేం కాడండి, అసలు మా కులపోడు కూడా కాడండి. ఏ కులమైతేనేం, మంచోడు, పెద్దమనిషి. అందుకని మేమంతా ‘మావ’ అంటామండి. దూరానికి మనిషి రూపు సరిగా తెలియకపోయినా ఆ గొంతు గుర్తేనండి, ఆయ్‌ ! మేము అలాగే ఒకళ్ళ ఉనికి ఒకళ్ళకు చెప్పుకుంటామండి. గాలి వాలున కేక శానాలెక్క వినిపిస్తుందండి. స్వరాన్నిబట్టి కేక ఎవరిదో తెలుస్తుంది. దీన్ని ‘పొలంకేక’ అంటామండి. పొలంలో పనులు చేసుకునేటప్పుడు ఎవరెక్కడున్నారో ఇలా కేకేసి తెలుసుకుంటుంటామండి, ఆయ్‌’ అని చెప్పాడు రామారావు.

ఇంతలో రంగనాధం సమీపించాడు. రంగనాధం వయసులో రామారావు కంటే చాలా పెద్దవాడు. అరవైకి పైబడినా, కాయకష్టం చేస్తున్న శరీరం కావడంతో, ఇంకా దారుఢ్యం ఏమాత్రం సడలలేదు. నిలువెత్తు మనిషి! దఢంగా పెరిగిన కండరాలతో రాజసంతో ఉన్నాడు. జుట్టుకూడా సగం నెరిసింది. తలవెనుక ముచ్చటగా ముడి ఉంది. తెల్లని మీసాలు బుగ్గలమీదికంతా పెరిగి ఒంపుతిరిగి ఉన్నాయి. చెవులకు ఒంటిరాయితో ధగధగా మెరుస్తున్న తమ్మంట్లు ఉన్నాయి. పొలంపని మధ్యలో వచ్చాడేమో మోకాళ్ళవరకు ధోవతి కట్టుకుని, అరచేతుల చొక్కా వేసుకుని ఉన్నాడు. తలకి తలపాగాగా తువ్వాలు చుట్టి ఉంది. అతనివైపు చూసి జీవన్‌ ‘రూపుగొన్న కషీవలుడు’ గా గుర్తించాడు. ‘అన్నదాతా! సుఖీభవ’ అని మనసులోనే అనుకుని అతనికి భక్తిగా నమస్కరించాడు జీవన్‌.

వెంటనే ప్రతినమస్కారం చేశాడు రంగనాధం. ‘ఈయనెవర్రా, ఊరికి కొత్తలావుంది. ఎవరి తాలూకు?’ అని అడిగాడు, జీవన్‌ వైపు చూస్తూ.

‘కరణంగారి చుట్టాలు. పట్నం నుండొచ్చారు. గుడికాడ దసూలైతే, దారి చూపించమంటే ఎంటెట్టుకొస్తున్నా’ చెప్పాడు రామారావు.

‘అలాగా! తవరి పేరేంటండి అబ్బాయిగోరు! పట్నంలో తమరేం చేస్తూంటారండి?’ నడుస్తూనే మాటాడుతున్నాడు రంగనాధం.

‘రెడ్డొచ్చె మొదలాడు’ అన్నట్లు మళ్ళీ అదంతా ఏకరువు పెట్టాలేమోనని భయపడ్డాడు జీవన్‌. కాని ఆ బాధ్యత స్వయంగా రామారావు తీసుకున్నాడు.

‘ఈయన పట్నంలోని పెద్ద కాలేజీలో చదివారు. ఈయనకి విమానాలు నడిపే పెద్దపెద్ద లెక్కలు తెలుసునంట’

అంతా అతిశయోక్తి! తాను అతనికి చెప్పినదేమిటి, అతను ఇతనికి చెపుతున్నదేమిటి!

ఏం మాటాడడానికీ తోచలేదు జీవన్‌కి.

ఇంకా రామారావు మాట పూర్తవ్వకముందే అందుకున్నాడు రంగనాధం, ‘తమర్ని చూస్తేనే తెలిసిపోద్దండి – తమరు శానా గొప్పోరని! కరణంగోరు తమకేమౌతారండి? తమరిక్కడ నాల్రోజులు ఉంటేనే బాగుంటాదండి. ఆయ్‌ !’

ఇలా దారిపొడుగునా రంగనాధం ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. జీవన్‌ ఓపిగ్గా వాటికి జవాబులివ్వక తప్పలేదు. యాజులుగారి పనిమీద వచ్చినట్లు తెలిసి రంగనాధం పాత జ్ఞాపకాలతో ఉప్పొంగిపోయాడు.

‘అద్గదీ మాట ! ఐతే అబ్బాయిగోరూ, తమరు ఈ ఊరు వచ్చింది యాజులుగోరి పనిమీదాండి! బాగా చిన్నతనంలో మేమిద్దరం ‘గూటీబిళ్ళ’ అడేటోళ్ళం. ఆ తరవాత కూడా చిన్నప్పటి స్నేయితం మర్చిపోకుండా ఎప్పుడు కనిపించినా నోరారా పలకరించేటోరు! ఆయన ఊరు విడిచి వెళ్ళిపోయాక ఊరికి కళే లేకుండా పోయింది’ నిట్టూర్చాడు రంగనాధం.

జీవన్‌ పెట్టె కొంతసేపు రంగనాధం కూడా మోశాడు.

దారిలో ఎదురుపడ్డ ప్రతి ఒక్కరూ, ఎంతో ఇదిగా జీవన్‌ని గురించి – ‘ఎవరింటికి వచ్చారు, ఏం పనిమీద వచ్చారు, ఎన్నాళ్లుంటారు’ వగైరా వివరాలను అడగసాగారు. ఒకసారి రామారావు, ఒకసారి రంగనాధం తనగురించి చెపుతున్న విశేషాలు విని నవ్వుకోడం తప్ప ఇంకేం చెయ్యాలో తెలియలేదు జీవన్‌కి. ఇక, యాజులుగారి పనిమీద వచ్చారంటే జనం యాజులుగారిని తలుచుకునే తీరు, వాళ్ళకి ఆయన మీదున్న గౌరవ ప్రతి బింబించేదిగా ఉంది. వేరేచోటికి వెళ్లి ఇన్నేళ్లయినా కూడా ఆ ఊరి జనం ఎంతో ఆప్యాయంగా ఆయనను తలుచు కుంటున్నట్లు యాజులు తాతయ్యకి చెప్పాలి అనుకున్నాడు జీవన్‌.

ఊరిని సమీపించినదానికి గుర్తుగా కరెంటు స్తంభాలు కనిపించసాగాయి. కాని ఎక్కడా విద్యుద్దీపాలు వెలుగుతున్న జాడలేదు. ఎందుకనో ఇళ్ళళ్ళో ఇంకా చిమ్నీ బుడ్లే వెలుగుతూ కనబడు తున్నాయి. దీపాల వేళ కావడంతో చిమ్నీ దీపాలు వెలిగించి పెట్టారు. పాలు పితికే వేళ సమీపించడంతో ఉండుండీ లేగల అరుపులు వినిపిస్తున్నాయి.

పెద్దపెద్ద పాల కేన్లు సైకిళ్ళకు కట్టుకుని పాలు పోయించుకుంటూ తిరుగుతున్నారు, సిటీలోని పెద్దపెద్ద పాలవిక్రయ కేంద్రాలకు సంబంధించిన వాళ్ళు. రాత్రి వంటల తాలూకు ఘుమఘుమలు వీధిలోకంతా వ్యాపించి, దారిన పోయేవాళ్ళకి నోరూరిస్తున్నాయి. రామాలయంలోని గంటలు మ్రోగుతూ, భగవంతునికి భక్తులను అనుసంధాన పరుస్తున్నాయి.

ఒక వీధి మలుపు దగ్గర ఆగి, ‘అబ్బాయిగారు! ఇక ఉంటానండి, దయుంచండి. యాజులుగారికి రంగనాధం దండాలన్నాడని, అడంగుకెళ్ళాక మర్సిపోకుండా చెప్పండేం’ అంటూ మరీమరీ చెప్పి రంగనాధం సెలవు తీసుకున్నాడు. రామారావు మాత్రం రామాలయం వరకూ వచ్చాడు.

‘అబ్బాయిగారు! ఇంకొక్క పదడుగులు వెళ్ళేసరికి కరణంగారి ఇల్లు వచ్చేస్తుందండి. అంతదాకా వచ్చేవాణ్ణేగానండి, పిల్లాడికి ఎలా ఉందోనని ఆదుర్దాగా ఉందండి, లేపోతే వచ్చేటోణ్ణే, ఆయ్‌!’ ఎంతో వినయంగా జీవన్‌కి కరణం కామేశంగారి ఇంటికి గుర్తులు చెప్పి పంపాడు రామారావు.

‘ఫరవాలేదు, తిన్నగా వెళ్ళడమేగా, నేను వెళ్ళగలను’ అంటూ పెట్టె అందుకుని, ఇంతవరకూ తనకు చేసిన సాయానికి కతజ్ఞతలు తెలియజేశాడు జీవన్‌.

కాని, రామారావు పదడుగుల దూరం అన్నది ఒక కిలోమీటర్‌ దూరంగా తేలింది. ఇంకా కాసేపట్లో చీకటి పడేట్లుంది. జీవన్‌ ఒక్కడే పెట్టె పట్టుకుని నడుస్తున్నాడు. (ఇంకా ఉంది)

– వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *