జీవనస్రవంతి – 40

జీవనస్రవంతి – 40

: జరిగిన కథ :

‘ఆడపిల్ల పెళ్లి చేస్తే మీకు కన్యాదాన ఫలం దక్కుతుంది’ అని జీవన్‌ అంటే సుబ్బరామయ్యగారు తిరస్కరించారు. సుధీర్‌ ‘ఇది తేలే విషయం కాదు, నాకు ఉరేసుకుని చావాలనిపిస్తోంది’ అన్నాడు. సుబ్బరామయ్యగారు బాధపడి ‘అంతా నా ఖర్మ, ఈ చీడని భరించక తప్పదేమో’ అని గొణుక్కున్నది జీవన్‌ విని ‘మీరు బాధపడకండి, పాపని నేను పెంచుకుంటాను, మీరు వాళ్లిద్దరికీ త్వరలోనే పెళ్లి చేయండి’ అని చెప్పాడు. ‘నీ భార్య ఒప్పుకోవాలి కదా బాబూ’ అన్నారు సుబ్బరామయ్యగారు అనునయంగా. ‘ఒప్పుకునే అమ్మాయినే పెళ్లి చేసు కుంటా’నన్నాడు జీవన్‌. ‘మీ రుణం తీర్చుకోలేనిది’ అంటూ చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పాడు సుధీర్‌ జీవన్‌కి. మాటల్లో జీవనే కథలు రాసే చిరంజీవి అని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఇంటి కొచ్చిన జీవన్‌ ముఖంలోకి ఉద్వేగంగా చూశారు కరణంగారు.

ఇక చదవండి..

జీవన్‌ ఆయన వైపు చిరునవ్వుతో చూస్తూ, ‘అంతా సఫలం చేసుకువచ్చాను. త్వరలోనే వాళ్ల పెళ్లి జరిగిపోతుంది. మీరేమీ దిగులు పడకండి’ అంటూ భరోసా ఇచ్చాడు జీవన్‌.

‘మంచిమాట చెప్పావు బాబూ, చాలు! చాలా ఆలస్యమైపోయింది, రా ! భోజనం చేస్తూ మనం మాటాడుకోవచ్చు’ అంటూ పట్టుకున్న చెయ్యి విడవకుండానే జీవన్‌ని లోనికి నడిపించుకు పోయారు ఆయన.

జీవన్‌ భోజనం చేస్తూ, ఆ దంపతులిద్దరికీ తనకు సుబ్బరామయ్యగారికీ మధ్య జరిగిన సంభాషణంతా వివరంగా చెప్పుకొచ్చాడు. అది విని తెల్లబోయారు ఆ దంపతులు. ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి వాళ్లకి.

కామేశంగారు గొంతు సవరించుకుని, ‘బాబూ! నీకు నేను చెప్పాకదా – మా సుబ్బరామయ్య అసాధ్యుడనీ, ఏదో ఒక పెటకం పెట్టకుండా వదలడనీడు! అలాగే జరిగింది. నీ వెందుకు బాబూ, ఇంత పెద్ద బాధ్యతను తలకెత్తుకున్నావు? మా మూలంగా నువ్వు ఇబ్బందులు పడడమేమిటి! నాకేం నచ్చడంలేదు. నీకు మేము ఏవంక చుట్టాలమని ఇంత త్యాగం చేస్తున్నావు’ అని అడిగారు.

‘సహాయం చెయ్యాలనిపిరచినప్పుడు చెయ్యాలి. అంతేగాని చుట్టరికాల కోసం వెతకకూడదు. జాహ్నవి గారికి సాయం చెయ్యాలనిపిరచింది, చేశాను. ఎవరైనా అవసరంలో ఉంటే వాళ్లకి సాయం చెయ్యాలని తోచినప్పుడు మీన మేషాలు లెక్కించడంలో అర్థం లేదు. ఈ వేళ ఈ ఇబ్బంది మీకు వచ్చిరది, అలాగే రేపు – కేవలం ఇదేరకం కాకపోయినా – మరోరకం ఇబ్బంది నాకు రావచ్చు. ‘ఈ వేళ నువ్వు ఎవరికైనా సాయపడు, రేపు నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీకు సాయపడతారు’ అని కదా అంటారు పెద్దలు. అది మనం మర్చిపోకూడదు. ‘వాట్‌ యు సౌ డాట్‌ యు రీప్‌’ అంటారు ఇంగ్లీషువారు! మీరేం ఇదవ్వకండి, అవసరం ఎవరికైనా రావచ్చు’.

జీవన్‌ మాటలు విని నిర్ఘాంతపోయారు కామేశంగారు.

ఇదివరకు జీవన్‌ ఈ ఊరు వచ్చినప్పుడు యాజులుగారు తనకు రాసిన ఉత్తరంలో జీవన్‌ను గురించి, ‘కుర్రాడు మంచివాడు’ అని రాశారు. మంచితనం అంటే మరీ ఇంత మంచితనమని అప్పుడు తెలియలేదు – అనుకున్నారు ఆయన. జీవన్‌ వైపు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లు రెప్పవాల్చడం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయారు కామేశంగారు.

ఆ చూపుని అపార్ధం చేసుకున్నాడు జీవన్‌.

‘మీరు మరేం సందేహపడవద్దు. నేను మాట తప్పే మనిషిని కాను. త్వరలోనే పాపను నేను చట్టప్రకారం దత్తత చేసుకుంటాను. దానికి కొన్ని ఫార్మాలిటీలు ఉన్నాయి. భార్యా భర్తలిద్దరూ సంతకాలు పెడితేగాని దత్తతను రిజిష్టర్‌ చెయ్యరు. త్వరలోనే, పాపని కన్నబిడ్డలా చూసుకోగల అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసుకుంటాను. ఆ వెంటనే దత్తత జరిగిపోతుంది. మీరు దిగులు పెట్టుకోకండి’ అన్నాడు.

‘బాబూ!’ అంటూ ఉద్వేగంతో జీవన్‌ని కౌగి లించుకున్నారు కరణం కామేశం గారు, ‘నీమీద నాకు సందేహమా! నా కొడుకులెవ్వరూ చెయ్యని ఉపకారం నాకు నువ్వు చేస్తున్నావు. నీ ఋణం మేమెలా తీర్చు కోగలమో తెలియడం లేదు’ అన్నారు గద్గదస్వరంతో. భావోద్వేగంతో ఆయన కళ్లు చెమర్చాయి.

సీతమ్మగారు పైటచెంగు కళ్లకి అడ్డుపెట్టుకుని కన్నీరు కార్చారు. అది ఆవేదనో, ఆనందమో ఆమెకే తెలియలేదు.

———————

ఆ రోజు సాయంకాలం విజిటింగ్‌ అవర్సులో జీవన్‌ని, పాపని తీసుకుని కామేశంగారు హాస్పిటల్‌కి వెళ్లారు. వాళ్లు వెళ్లేసరికి జాహ్నవి మంచం మీద పడుకునే సుధీర్‌తో మాట్లాడుతోంది. ఆమె బలహీ నంగా ఉన్నా ఆమె ముఖంలోని సంతోషం దాన్ని కమ్మేయడంతో ఆమె ఆరోగ్యంగా కనిపిస్తోంది.

తనవెంట తీసుకువచ్చిన మనుమరాలిని తల్లిపక్కన కూర్చోబెట్టారు కామేశంగారు. కూతురుని దగ్గరగా తీసుకుని హదయానికి హత్తుకుంది జాహ్నవి. ముందుగానే సుధీర్‌ ద్వారా అంతా విని ఉండడంతో కూతురిని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంది.

‘జాహ్నవి గారూ! మీరేం దిగులుపడొద్దు, మీకు పాపని చూడాలనిపిరచి నప్పుడల్లా మీరు వచ్చి పాపని చూడొచ్చు.

కొద్ది రోజుల్లో దత్తత జరిపించడానికి అవసర మైన ఫార్మాలిటీలన్నీ పూర్తి కానిచ్చి మీకు ఫోన్‌ చేస్తా. అప్పుడు మీరు తప్పకుండా రావలసి ఉరటురది. పాపకి నేను ఏలోటూ రానివ్వను, మీరు బెంగ పెట్టుకోకండి’ మాటిస్తున్నట్లుగా అన్నాడు జీవన్‌.

జాహ్నవి నొచ్చుకుంది, ‘ఎంతమాట! జీవన్‌ గారూ! మీకు నేను ఎన్ని కతజ్ఞతలు చెప్పినా అవి తక్కువే అవుతాయి. నాకు మంచి భవిష్యత్తు ప్రసాదించడం కోసం నా పాపను మీరు పెంచుకోవ డానికి సిద్ధపడ్డారు. అందుకు మీకు నేను ఎంతో రుణపడ్డాను’ అంటూ కన్నీళ్లు ధారాపాతంగా కారుతుండగా వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ తలవంచుకుని ముఖాన్ని చేతులతో కప్పుకుంది జాహ్నవి.

ఆ సమయంలో జీవన్‌, కామేశంగారితో సహా అక్కడున్న అందరికి ఆమెపై ఎంతో జాలి, దయ పెల్లుబికాయి. జీవన్‌ హృదయం ద్రవించింది. కామేశంగారు భావోద్వేగానికి తట్టుకోలేక అటు తిరిగి కన్నీరు కార్చడం మొదలుపెట్టారు.

కాసేపు వాతావరణం భావోద్వేగంతో నిశ్శబ్దంగా మారింది. జాహ్నవి ఏడుపు మాత్రమే వినిపిస్తోంది.

మొదటగా జీవన్‌ తేరుకుని ఇంతటి భావోద్వేగ వాతావరణాన్ని చల్లబరచాలనుకుని ‘జాహ్నవిగారు మీకు అన్ని విషయాలు తెలుసు. మళ్లీ మనసు పాడుచేసుకోకండి. కష్టాల్లో ఉన్న ఒక ఆడపిల్లకి సాయం చేయడం నా కర్తవ్యంగా నేను భావించాను. మా అమ్మ రుణం తీర్చుకునే అవకాశాన్ని మీరు నాకు కల్పించారు. అందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు నన్ను ‘మీకు సహాయం చేసినవాడిలా’ కాకుండా మీ బంధువుగా భావించండి. అప్పుడు మీ బాధ కొంత తీరుతుంది. మీరు ఇలా బాధపడితే పెద్దవాళ్లయిన మీ తల్లితండ్రులను కూడా బాధపెట్టినవారవుతారు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈ మార్పును అంగీకరించండి. మీకు నచ్చిన సుధీర్‌ని పెళ్లి చేసుకుని మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ ఆనందం పంచండి. మీరు ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక పాపను మీరు ఎప్పుడైనా మాఇంటికి వచ్చి చూడొచ్చు. పాప ఎప్పటికీ మీ బిడ్డే’ అన్నాడు.

జీవన్‌ మాటలతో జాహ్నవి తేరుకుంది. అక్కడి భావోద్వేగ వాతావరణం కొంత చల్లబడినట్లయింది.

జాహ్నవి మాట్లాడింది ‘మీరు నా పాపను పెంచు కుంటాననడం పాప తల్లిగా నాకు మొదట చాలా బాధే స్తున్నది. నా పాపను కోల్పోతు న్నాననే బాధ ఎక్కువైంది. కానీ మరో విషయంలో చాలా సంతోషంగా కూడా ఉంది. అడపిల్లకి ప్రేమలేని చోట బ్రతికే అగచాట్లమారి బ్రతుకుకంటే, మీలాంటి ప్రేమమూర్తుల అండ దరడలలో బ్రతకడం ఎన్నోరెట్లు బాగుంటుంది. అందుకే నాకా విషయంలో బాధకన్నా సంతోషమే అధికంగా ఉంది. మీ పెంపకంలో నా పాపకు ఏలోటూ ఉండదని నాకు తెలుసు. నాపాప చాలా అదష్టవంతురాలు. నాకింక ఏ బెంగా లేదు. అందుకు మీకెన్నో కృతజ్ఞతలు’ అంటూ కృతజ్ఞత నిండిన ముఖంతో జీవన్‌కి చేతులెత్తి నమస్క రించింది.

‘జాహ్నవిగారూ, మీరు అనుమతిస్తే రేపే పాపను నా వెంట తీసుకుని వెళతాను. నాకు ఇంక సెలవు లేదు, రేపే నా ప్రయాణం’ అన్నాడు జీవన్‌.

జాహ్నవి పాప నుదుటి మీదా, బుగ్గలమీదా తనివితీరా ముద్దులవర్షం కురిపించింది. ఆపై, ‘పాపా! అంకుల్‌ దగ్గరకు వెళ్ళమ్మా’ అంటూ పాప చేతిని జీవన్‌ చేతికి అందించిరది.

కొత్త తెలియని పాప జీవన్‌ దగ్గరకు వెళ్లింది. అతడు పాపను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఎత్తుకున్నాడు.

పాప ‘చాకేత్తు కావాలి’ అంటూ చనువుగా జీవన్‌ చొక్కా జేబులో చెయ్యిపెట్టింది.

కామేశంగారు నవ్వుతూ, తన జేబులోనుండి ఒక చాకలెట్‌ తీసి జీవన్‌ చేతికి ఇచ్చి అన్నారు, ‘బాబూ! ఈ రోజుమొదలు నువ్వు నీ జేబులో ఎప్పుడూ నాలుగు చాకొలెట్లు ఉరడేలా చూసుకోవాలి సుమీ!’ అన్నారు సరదాగా. సమస్యలు సమసి పోవడంతో అందరూ హాయిగా నవ్వుకున్నారు. జీవన్‌, చుట్టివున్న కాగితం తీసి చాకొలెట్టు పాప చేతికి ఇచ్చాడు.

‘జీవన్‌ గారూ! మీరే మా అభిమాన రచయిత చిరంజీవిగారని తెలిసిరది. నేను మీ అభిమానిని. నా జీవితకాలంలో నేను మిమ్మల్ని చూడగలనని కలలోకూడా అనుకోలేదు. అలాంటిది మీరు మాకు కనిపించడమేకాదు, మా జీవితాలను నిలబెట్టి, మాకు అత్యంత గౌరవపాత్రులవ్వడం అన్నది నిజంగా మా అదష్టం!’ అంది నవ్వుతూ జాహ్నవి.

మరునాడు పాపను తీసుకుని తిరుగు ప్రయాణ మయ్యాడు జీవన్‌. అతనికి వీడ్కోలు చెపుతూ సీతమ్మగారు, ‘జీవన్‌ బాబూ! నిన్ను కన్నతల్లి ధన్యురా లయ్యా! ఆదర్శాలు వల్లిరచే వాళ్లు, శుష్కప్రియాలు పలికేవాళ్లు ఈ భూమ్మీద కోకొల్లలుగా ఉన్నారు. కాని, నీలా ఆచరణలో పెట్టే ఆదర్శమూర్తులు మాత్రం చాలా అరుదు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి! నీ తల్లి కడుపు చల్లగా, నిండు నూరేళ్లు సుఖంగా ఉండు నాయనా’ అని ఆశీర్వదిరచింది.

———————

గుమ్మంలో టాక్సీ ఆగిన చప్పుడు విని బాల్కనీలోకి వచ్చి చూసిన మీనాక్షి ‘జీవన్‌ వచ్చేశాడు’ అని పెద్ద కేకపెట్టి గబగబా మెట్లు దిగడం మొదలు పెట్టింది. ఆ కేక వినిపించగానే శ్రీ జననీ పరివారమంతా ఎక్కడిపనులు అక్కడ విడిచిపెట్టి పరుగుపరుగున బయటికి వచ్చేశారు. మేడమీద హాల్లో కూచుని కబుర్లు చెప్పుకుంటున్న సుమతి, స్రవంతీ కూడా ఆ కేక విన్నారు.

స్రవంతి మీనాక్షి కేక వినగానే త్రుళ్లిపడింది. ఆమె మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. కాని, తాను జీవన్‌కిచ్చిన మాట మర్చిపోలేదు ఆమె. గబగబా వంటగదిలోకి పరుగెత్తి హారతిపళ్లెం కోసం వెతకసాగింది. ఆమె వెనకాలే వచ్చిన సుమతి, స్రవంతి కంగారు చూసి, ‘ఎక్కడ ఏమున్నాయో నీకెలా తెలుస్తుంది! ముందు నువ్వు క్రిందకు వెళ్లు, నేను హారతి తెస్తాలే’ అంది.

‘లేదు, హారతి నేనే ఇవ్వాలి. అలా ఇస్తానని జీవన్‌కి మాటిచ్చాను కూడా!’

‘సరేనమ్మా, హారతి నువ్వే ఇద్డువుగానిలే! నేను హారతి అమర్చి తీసుకొస్తా అన్నా- అంతేకదా! నువ్వు నడు కిందకి, నేను వెనకాల వస్తా. ఇద్దరం ఇక్కడే ఉండిపోడం ఎందుకు? నువ్వు నడు ముందు’ అంది సుమతి. వెంటనే స్రవంతి కిందికి పరుగెత్తింది.

కొడుకు వస్తానన్నరోజుకి ఒకరోజు ముందుగానే ఎందుకు వచ్చేశాడా – అని ఆశ్చర్యపోతూ వీధి గుమ్మంలోకి వచ్చిన మీనాక్షి, చందమామలాంటి మూడేళ్ల పాపాయిని ఎత్తుకుని జీవన్‌ టాక్సీ దిగడం చూసింది. అంతలో ఆ టాక్సీ వెళ్ళిపోయింది.

మీనాక్షి తెల్లబోయి, దగ్గరగా వెళ్లి ‘జాహ్నవి ఏదిరా’ అంది లోగొంతుకతో.

మల్లెవాడ విశేషాలన్నీ టూకీగా చెప్పి, ‘ఈ పాప జాహ్నవి కూతురు, చిన్నారి జాహ్నవి. ఈ పాపని మనం పెంచుకోడం వల్ల జాహ్నవి గారి కష్టాలు తీరిపోతాయి. జాహ్నవిగారి జీవితం నీ జీవితంలా కాకూడదని కోరుకున్నా. అదే జరిగింది. నా కోరిక తీరింది. కాని, నేనొకలా ప్లాన్‌ చేస్తే, దైవం మరొకలా నిర్ణయించి ఉంచింది. కాని, జరగాలనుకున్నపని జరిగింది. ఇకనుండీ ఈ పాప మనింటి పిల్ల’ అంటూ జీవన్‌ పాపని తల్లిచేతికి అందించాడు. ముద్దులొలికే ఆ పాపను మీనాక్షి సంతోషంగా ఎత్తుకుంది.

మల్లెవాడ కథ స్రవంతి కూడా వింది. ఆమెలో ఆశ చిగురించింది. అంతలోనే ఆమెకు మరో ఆలోచన వచ్చింది. ‘ఏమో! జీవన్‌, తన కర్తవ్యాన్ని వెతుక్కుంటూ దూరంగా వెళ్లిపోడన్న నమ్మకమేమిటి నీకు’ అని నిలదీసింది ఆమె మనసు. ఇలా ఆశా, నిరాశ మధ్య నలుగుతూ, బేలగా జీవన్‌నే చూస్తూ ఒకవారగా నిలబడింది స్రవంతి.

జీవన్‌ కళ్లు స్రవంతి కోసం వెతికాయి. ఆమె కనిపించగానే రెండు అంగలలో ఆమె దగ్గరకు నడిచాడు. ‘స్రవంతీ! అంతా విన్నావుకదూ! నువ్వు నా పాపకు అమ్మవి కాగలవా’ అని అడిగాడు.

స్రవంతి పట్టరాని ఆనందంతో నిలువునా పులకిరచిపోయింది. అకస్మాత్తుగా ఆమెకు ఘనమైన సిగ్గు ముంచుకువచ్చిరది. సిగ్గు బరువున ఆమె సోగకనుల రెప్పలు వాలిపోయాయి. అతనికి జవాబు చెప్పాలనుకుంది కాని నోటినుండి మాట బయటికి రాదే! ఎంతో ప్రయత్నం మీద ఆమె తలొంచుకునే, తలూపి తన సమ్మతిని తెలియజేసింది.

వెంటనే జీవన్‌ తన కుడిచేతికి ఉన్న తాతయ్య వజ్రపుటుంగరాన్ని తీసి స్రవంతి ఎడమచేతి అనామికకు తొడిగి, లేత తమలపాకులా మదువుగా ఉన్న ఆ చేతిని పైకెత్తి తన పెదవులకు చేర్చుకుని ముద్దుపెట్టుకున్నాడు.

అప్పుడే సరుకు రవాణా ముగించి తిరిగి వచ్చిన రాఘవ గట్టిగా విజిల్‌ వేసి సంతోషాన్ని వ్యక్తంచేస్తే, అతని వెనకే వచ్చిన వెంకటేశం మామ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. అక్కడే కనిపెట్టుకుని ఉన్న శ్రీ జననీ పరివారం యావత్తూ చప్పట్లు చరుస్తూ సంతో షంతో కేరింతలు కొట్టారు. వాళ్ల కోసమని స్రవంతి చెయ్యి పట్టుకుని వాళ్ల కెదురుగా నిలబడ్డాడు జీవన్‌.

ఇచ్చిన మాట ప్రకారం స్రవంతికి చేతికి ఇవ్వడానికని హారతి వెలిగించి తీసుకువచ్చిన సుమతి, అది చూసి మొదట్లో ఆశ్చర్యపోయినా, అంతలోనే అర్థం చేసుకుంది. వెంటనే ముందుకు వెళ్లి వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చింది. ఆపై అక్కడే ఉన్న కిరణ్‌ ఆశీర్వచన సూక్తం ఎత్తుకున్నాడు, ‘శతమానం భవతి..’ అంటూ.

మీనాక్షి సంతోషానికి అవధుల్లేవు. తను కోరుకున్నపిల్లే కోడలు కాబోతోంది. జీవన్‌ జగన్నాథం తాతయ్యకు మనుమరాలి భర్త కావడంతో నిజమైన మనుమడౌతాడు. ఆ విధంగా తాతయ్యతో వాడికున్న బంధం అనుబంధంగా మారి బలపడుతుంది. మరో పెద్ద బోనస్‌ ఇంకొకటి ఉంది – ఒకప్పుడు వాడిపైన అక్రమంగా నింద మోపి, వాడిని పరాభవవించ దలచుకున్నవాళ్లే, కన్యాదానం వేళ వాడి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకురటారు. దీనికంతకీ కారణం ఈ పసిపిల్లే! మళ్ళీ ‘కర్తవ్యం, కర్తవ్యం’ అంటూ ఊళ్లు పట్టి తిరక్కుండా తొందరగా పెళ్లికి సిద్ధపడుతున్నా డంటే ఈ పిల్లని పెంచుకోడం కోసమేకదా’ అనుకుంది మీనాక్షి సంతృప్తి నిండిన ఆనందంతో.

అందరినీ చూసి పాపకూడా చప్పట్లు కొట్టి కిలకిలా నవ్వింది. పట్టలేని ఆనందంతో పాపని హదయానికి హత్తుకుని, దాని బూరిబుగ్గలమీద ముద్దులవర్షం కురిపిరచింది మీనాక్షి.

పాప నెత్తుకుని తల్లి తన వెంటరాగా, స్రవంతి చెయ్యి పట్టుకుని శ్రీ జననీ కచేరీ చావడిలో ఉన్న తాతయ్య ఫోటో దగ్గరకు నడిచాడు జీవన్‌, తన సంతోషాన్ని ఆయనతో పంచుకోడానికి.

(అయిపోయింది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *