జీవనస్రవంతి-39

జీవనస్రవంతి-39

: జరిగిన కథ :

మల్లెవాడ వెళ్లిన జీవన్‌కి జాహ్నవి గురించి కరణం గారు చెపుతూ ‘జాహ్నవిని చదువుకని సుధీర్‌ వద్దకు పంపితే వాడు దానిని లొంగదీసుకున్నాడని, జాహ్నవి ఆత్మహత్య చేసుకుందని, హాస్పిటల్‌లో ఉందని చెప్పి బాధపడ్డారు కరణంగారు. జాహ్నవిని కోడలిగా చేసుకోడానికి సుధీర్‌ నాన్న సుబ్బ రామయ్య ఒప్పుకున్నాడని, కాని పిల్లలు రావటానికి వీల్లేదన్నాడని చెప్పారు. సుధీర్‌తో మాట్లాడటానికి జీవన్‌ వెళ్లాడు. ‘జాహ్నవికి అప్పుడు నేనే సహాయం చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడిలా జరిగింది, మీరు కాస్త పెద్ద మనసు చేసుకోవాలి’ అంటే సుబ్బ రామయ్యగారు కోపంతో అరిచి, అప్పుడు జాహ్నవిని మాకిమ్మంటే మా కాముడు డబ్బున్న సంబంధం చూసి జాహ్నవిని అటిచ్చాడు. వేరేవాళ్లకి పుట్టిన పిల్లల్ని మేం రానివ్వం అన్నారు. ‘ఆడపిల్ల త్వరగా పెరిగి పెళ్లి చేసుకుని వెళుతుంది కదా.. కన్యాదాన ఫలమూ దక్కుతుంది మీకు’ అన్నాడు జీవన్‌.

ఇక చదవండి..

ఆ మాటకు సుబ్బరామయ్యగారు ఎడ నవ్వు నవ్వారు, కోపంతో ఆయన ముఖం జేవురించింది. ‘పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ! నీకేం తెలుసని గొప్పగా మాట్లాడుతున్నావు? వధూవరులను పెళ్లి పీటలమీదకి తీసుకువెళ్లే ముందు, వాళ్ల పుట్టు పూర్వోత్తరాలన్నీ చదువుతారు. అప్పుడు ఈ పిల్ల ఎవరి పిల్లని చెపుతారో వాళ్లకే దక్కుతుంది కన్యాదాన ఫలం. ఇంక ఆ పెళ్లి బాధ్యత తీసుకున్న వాళ్లకు మిగిలేవి, పెళ్లికి చేసిన అప్పులు మాత్రమే!’

‘మా సుబ్బడు చాలా మొండివాడు, లొంగ దియ్యడం అంత తేలికేమీ కాదు’ అన్న కరణంగారి మాట గుర్తుకువచ్చింది జీవన్‌కి. అతడు ఇదికాదు పని – అని సుధీర్‌ వైపు చూసి, ‘అంతా విన్నారు కదా, ఇంక మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి సార్‌’ అని అడిగాడు.

‘బాగా ఆలోచించి చివరకి నేనొక నిర్ణయానికి వచ్చాను, నేను నా తల్లితండ్రుల మాట కాదనలేను, జాహ్నవిని పెళ్ళిచేసుకోను. కాని ఇంకెవరినీ కూడా పెళ్లి చేసుకోను. నేను జాహ్నవిని చిన్నప్పటినుండీ మనసారా ప్రేమిస్తున్నాను. ఈ జన్మకి ఆమే నా భార్య అనుకున్నాను. అలా జరగని నాడు నాకు పెళ్లేవద్దు. అదే నేను జాహ్నవికి చేసిన ద్రోహానికి నాకు తగిన శిక్ష కూడా ఔతుంది’ వంచిన తల ఎత్తి చూడకుండా తన మనసులోని మాటను చెప్పేశాడు సుధీర్‌.

నిర్ఘాంతపోయారు సుబ్బరామయ్యగారు. కొడుకు నిర్ణయం ఆయనకు అశనిపాతంలా తగిలింది. ‘నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు పెళ్లి వద్దంటే మన వంశం ఏమైపోవాలిరా’ అన్నారు ఆక్రోశించి నట్లుగా.

సుధీర్‌ ఏమీ జవాబు చెప్పలేదు. మళ్లీ ఆయనే అన్నారు, ‘సుధీ! నీ ఆలోచన సరైనది కాదు. మన వంశాన్ని నిలబెట్టడం నీ బాధ్యత. తక్కినవన్నీ తరువాతి విషయాలే..’

‘లేదు నాన్నా! నేను మీ మాటా కాదనలేను, జాహ్నవికీ అన్యాయం చెయ్యలేను. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఎటూ తోచని ఈ సందిగ్ధంలో నాకు ఉరేసుకుని చచ్చిపోవాలనిపిస్తోంది. నన్ను ఏరచెయ్యమంటారు!’

‘బాగుందిరా నాయనా! బాగుంది నీ వరస. ఇలా బెదిరించి నన్ను లొంగదియ్యాలని చూస్తున్నా వన్నమాట! ఇప్పటికే నేను నీకోసం జాహ్నవిని కోడలిగా చేసుకోడానికి ఒప్పుకున్నా. ఇప్పుడు ఈ పిల్లనికూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. ఏమి చెయ్యను, పాలకోసం రాయిని మొయ్యక తప్పదు మరి’ అంటూ ఉసూరుమన్నాడు ఆయన.

ఆపై తనలో తాను అనుకున్నట్లుగా ‘అంతా నా ఖర్మ! మగపిల్లాడు కనక ఎవరోవచ్చి, వాడిని పెంచుకుంటామని తీసుకుపోయారు. ఇది ఆడపిల్ల – దీన్నెవరూ తీసుకెళ్లరు. నాకు ఈ చీడని భరించక తప్పదు కాబోలు. దాని ముఖం చూసినప్పుడల్లా పూర్వాపరాలన్నీ నాకు గుర్తురాకుండాపోవు, నా గుండెల్లో మంటలు మండకాపోవు. ఏజన్మలో చేసుకున్న పాపమో ఇది, అనుభవించక తప్పుతుందా నాకు’ అనుకున్నారు సుబ్బరామయ్యగారు.

ఆయన చెప్పుకున్న స్వగతం, దగ్గరలోనే ఉన్న జీవన్‌కి చక్కగా వినిపించింది. జీవన్‌ పాపని తలుచుకుని చాలా బాధపడ్డాడు. వెంటనే అతనికొక పరిష్కారమార్గం తోచింది.

‘మీరేం దిగులుపడకండి బాబాయ్‌ గారూ! ముద్దులు మూటకట్టే ఒక చిన్నారి పాపవల్ల మీ ప్రశాంతతకు భంగం కలగడం నాకూ ఇష్టం లేదు. ఆ పాపని నేను రేపే నాతో మా ఊరు తీసుకెళ్లి పెంచుకుంటా. మీరు త్వరలోనే మీ అబ్బాయితో జాహ్నవిగారి పెళ్లి జరిపించండి, చాలు. ఈ సమస్యవల్ల మొత్తంగా పెళ్లే మానేస్తానన్న మీ అబ్బాయి ఆలోచన సరైన పరిష్కారం కాదు’.

‘ఏమిటి బాబూ! నువ్విలా అందరి సమస్యలూ నీవే అనుకురటే మీ అమ్మగారు ఒప్పుకుంటారా? అసలు, ఈ పిల్లని పెంచుకోడానికి రేపు నీ భార్య ఒప్పుకోవాలి కదా!’

‘మీకు మా అమ్మ గురించి తెలియదు. కాని, నాకు బాగా తెలుసు. పాప మాకేమీ సమస్యకాదు, ఒక వరం! నడిచొచ్చిన పాప నట్టింట నడయాడు తూరటే, కలిసొచ్చేకాలం కదలి వస్తుందనుకుంటుంది మా ఆమ్మ. నేను ఆఫీసుకు వెళ్లిపోయాక పాప మా అమ్మకు తోడుగా ఉంటుంది. ఇక నా భార్యంటారా – ఈ పాపకు తల్లిగా ఉంటానన్న అమ్మాయినే నేను పెళ్లాడుతా. ఎట్టి పరిస్థితిలోనూ మీకిచ్చిన మాట తప్పను. లోకంలో అందరికీ మేలు జరగాలని కోరుకోగలము గాని, లోకంలో కష్టాల్లో ఉన్న అందరికీ మేలు చేయగల స్తోమతు మనకి ఉండదు. కనీసం ఒక్కళ్లకి మేలు జరిగేలా చేసినా మన పుట్టుక సార్ధకమౌతురది. చూడండి, నేను ఈ పాపని తీసుకెళ్లి పెంచుకోడం వల్ల రెండు కుటుంబాలకి మధ్యనున్న సమస్య తీరిపోయి ఇరువైపులవారికీ మేలు కలుగుతుంది, మా అమ్మకీ ఒంటరితనం తగ్గుతుంది. ఇక పాప విషయానికి వస్తే – ఇక్కడ చీడగా, పీడగా పెరగడం కంటే, మా ఇంట్లో ఉంటే గారాబంగా పెరుగుతుంది. ఈ చిన్న మార్పువల్ల ఎన్నో లాభాలున్నాయి. ఎందరికో సుఖసంతోషాలు దొరుకు తాయి. ఎంతోమందికి మనశ్శారతి కలుగుతుంది. ఏ మంచి పనికైనా ఇంతకంటే గొప్ప ఫలితం ఇంకేం కావాలి చెప్పండి! అంత బాధలో ఉరడికూడా జాహ్నవిగారు మీ అబ్బాయినే కలవరిస్తున్నారుట. ఒకసారి మీ అబ్బాయి వెళ్లి ఆమెకు నాలుగు ఓదార్పు మాటలు చెప్పిరావడం బాగుంటుంది. సాధ్యమైనంత తొందరగా మీరు వాళ్ల పెళ్లి జరిపించేస్తే అందరం ప్రశాంతంగా బ్రతకొచ్చు. నేను రేపు వెళ్లిపోతున్నాను. జాహ్నవిగారు ఒప్పుకుంటే రేపే పాపనికూడా నాతో తీసుకువెళతా’ అంటూ వెళ్లడానికి లేచాడు జీవన్‌.

అప్రయత్నంగా సుబ్బరామయ్యగారు కూడా లేచారు.

‘జీవన్‌ బాబూ! నీది చాలా విశాలహదయ మోయ్‌! నువ్వు నా అహాన్ని కాపాడావు, కతజ్ఞుణ్ణి’ అన్నారు.

చిన్నగా నవ్వి అన్నాడు జీవన్‌, ‘మీరు మీ మాట నిలబెట్టుకురటారు కదూ!’

‘తప్పకుండా! ఒక్కొక్కప్పుడు చిన్నవాళ్లే పెద్దవాళ్లకు మార్గదర్శకులౌతారు. సాటి వాళ్లకు సాయపడడం కోసం నువ్వరత గొప్పనిర్ణయం తీసుకున్నావే, నా కొడుకు కోసం నేనాపాటి కూడా చెయ్యలేనా ఏమిటి!’

జీవన్‌ ఆయన దగ్గర సెలవు తీసుకుని మెట్లు దిగసాగాడు. సుధీర్‌ అతన్ని సాగనంపడానికన్నట్లుగా వెంటవచ్చాడు.

తండ్రి కనుమరుగవ్వగానే ఎదురుగా వచ్చి జీవన్‌ రెండుచేతులూ పట్టుకున్నాడు సుధీర్‌. ‘మీరు నన్ను రక్షించారు మేష్టారూ’ అన్నాడు గద్గదంగా.

‘సుధీర్‌ గారూ! మీరంతగా ఇదవ్వాల్సినదేమీ లేదు ఇందులో. అందరికీ మేలు జరిగేలా నాకు తోచిన పరిష్కారమార్గమిది, దానినే అమలు చెయ్యాలనుకుంటున్నా. మనం పాప సుఖం కూడా ఆలోచించాలి కదా’ అన్నాడు జీవన్‌.

‘మాకు సుఖ శాంతులు ప్రసాదించిన పుణ్య మూర్తులు మీరు. నేనూ, జాహ్నవీ మా జీవిత కాలమూ మర్చిపోలేని గొప్పత్యాగం మీది. మీకు కతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు’ అంటూ జీవన్‌ చేతుల్ని కళ్లకు హత్తుకున్నాడు సుధీర్‌. అతని కళ్లలో ఉబికిన కన్నీరు వల్ల జీవన్‌ చేతులకు తడి అంటింది.

జీవన్‌ చేతుల్ని గమ్మున వెనక్కి తీసుకున్నాడు. ‘సుధీర్‌ గారూ! దిసీజ్‌ టూ మచ్‌! ఇదేమి పని సార్‌’ అంటూ కంగారుపడ్డాడు.

‘సార్‌ ! మీరు నా పాలిట దేవుడు సార్‌! ఇటు వద్ధులైన తల్లిదండ్రుల్నీ కాదనలేక, ప్రియమైన జాహ్నవినీ వదులుకోలేక నేను పడ్డ నరకయాతన ఇంతా అంతా కాదు. ఈ చిక్కుముడి ఎలా ఇప్పాలో తెలియక చచ్చిపోవాలనిపిరచేది. మీరు మాకు ప్రాణం పోశారు. మీ రుణర ఎలా తీర్చుకోగలను, చేతులు జోడించి నమస్కరిరచడం తప్ప!’

‘అయ్యయ్యో! అలాంటివేమీ అనవద్దు. నేను కష్టాల్లో పుట్టాను, కష్టాల్లో పెరిగాను. కష్టాలను గురించి నాకు బాగా తెలుసు. అందుకేనేమో, కష్టాలలో ఉన్నవాళ్లను చూస్తే నా మనసు స్పందిస్తుంది. చెయ్యగల సాయం, ఏదైనా చెయ్యాలని పిస్తుంది. మా అమ్మని తలుచుకుని, మా అమ్మలాగే కష్టాలలో ఉన్న జాహ్నవిగారికి ఆ కష్టాలనుండి బయటపడేందుకు సాయపడడం నా కర్తవ్యంగా భావించాను. జాహ్నవిగారు సరేనంటే పాపని రేపే నాతో తీసుకెళ్లిపోవా లనుకుంటున్నా. మొహమాట పడవద్దు, పాపని చూడాలనిపిస్తే, మీరు జాహ్నవి గారిని తీసుకుని ఎప్పుడైనా రావచ్చు. మా ఇంటి తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని గుర్తుపెట్టుకోండి’.

సుధీర్‌ నొచ్చుకున్నాడు, ‘మా నాన్న మరీ అంత చెడ్డవాడు కాదు. ఆ కామేశం గారితో పంతాలుపోయి అంతలా మాటాడాడు గాని కొన్నాళ్లు గడిచిపోతే మనసు మార్చుకుంటాడు. అప్పుడు పాపను మళ్లీ మేము తెచ్చుకుంటాము. అప్పుడింక పాపకి ఏలోటూ రాదు’.

‘ఆ పని మాత్రం వద్దు. మేము పాపమీద మమకారం పెంచుకున్నాక మీరొచ్చి తీసుకెళ్లి పోతామంటే మేమెలా తిరిగి ఇవ్వగలము? త్వరలోనే నాపెళ్లి. ఆపై వెంటనే పాపని మేము లీగల్‌గా దత్తత తీసుకురటాము. అప్పుడు మీరు తప్పక రావాలి. సర్వ హక్కులతో పాపని మా ఇంటి పిల్లగానే పెరగనీయండి. ఇదిగో నా విజిటింగ్‌ కార్డు. మీరు మాకు ఎప్పుడైనా ఫోన్‌ చెయ్యవచ్చు’ పర్సులోంచి విజిటింగ్‌ కార్డు తీసి సుధీర్‌కి ఇచ్చాడు జీవన్‌.

కార్డుని పదిలంగా తన జేబులో ఉంచుకురటూ, ‘ఇంత చిన్న వయసులోనే ఇంత మెచ్యూర్‌ థాట్‌ మీకెలా వస్తోంది సార్‌!’ అన్నాడు సుధీర్‌.

‘సుధీర్‌ గారూ! మనమిద్దరం సమవయస్కులం. మీరిలా నన్ను ‘సారూ’, ‘మాష్టారూ’ అనడం ఏమీ బాగాలేదు. నా తక్కిన మిత్రులందరిలాగే మీరు కూడా నన్ను ‘జీవన్‌’ అంటేనే బాగుంటుంది’.

‘అలాగే సార్‌! కాని, మీరిరకా నేనడిగినదానికి జవాబు చెప్పనేలేదు’ అన్నాడు సుధీర్‌.

‘మురదా ‘సార్‌’ అన్నపదం వదిలెయ్యండి. ఇక మీ ప్రశ్నకు జవాబు వినండి.. మనం ఏ సబ్జక్టునైనా ఎంచుకుని, దానిలో పరీక్ష నెగ్గాలంటే ఏర చేస్తాము?’

వెంటనే జవాబు చెప్పాడు సుధీర్‌, ‘ఆ సబ్జెక్టుని థరోగా స్టడీ చేస్తాము. ఎంత బాగా స్టడీ చేస్తే అంత మంచి మార్కులు వస్తాయి. అంతేకదా..’

‘ఔనుకదా! మన స్టడీమీదే అధారపడి ఉంటుంది మన సక్సెస్‌. అలాగే మానవజీవితాలలోని సంఘటనలను విశ్లేషిస్తూ కథలు రాయాలను కున్నప్పుడు మానవ మనస్తత్త్వశాస్త్రాన్ని కూలంకషంగా చదవవలసి ఉంటుంది. చదువంటే బడికివెళ్లి చదివింది మాత్రమే చదువు కాదు, ఇరట్లో ఉండి కూడా ఉద్గ్రంథాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు’.

సుధీర్‌ ముఖం వికసించింది. ‘జీవన్‌ గారూ! మీరు రచయితలా? మీ మాటలు వింటూంటే, మీరొక గొప్ప రచయిత – అనిపిస్తోంది, నిజమేకదూ!’

జీవన్‌ చిన్నగా నవ్వి అన్నాడు, ‘ఔను, నాకు చిన్నప్పటినుండీ కథలు రాసే అలవాటు వుంది. రచన నా హాబీ!’

‘నేను మన పత్రికలను బాగా చదువుతాను. ‘జీవన్‌’ అన్నపేరు నాకు ఎక్కడా కనిపించిన గుర్తులేదు. ఏమైనా కలంపేరు వాడుతున్నారా?’

‘మీ ఊహ నిజమే’ అంటూ నవ్వాడు జీవన్‌. ‘నాలోని రచయిత పేరు ‘చిరంజీవి’, అదే నా అసలు పేరు కూడా! మా తాత నాకు పెట్టిన పేరది. జీవన్‌ అన్నది వ్యవహారనామం మాత్రమే’.

ఆశ్చర్యంతో నోరు తెరిచేశాడు సుధీర్‌. ‘ఏమిటిది! మా అభిమాన రచయిత చిరంజీవి మీరా! పత్రికల ద్వారా మీరు మాకు సుపరిచితులు. కాని, మిమ్మల్ని చూసింది మాత్రం ఇదే మొదటిసారి. దిశానిర్దేశికాలైన చిరంజీవి కథలు చదివి, ఆయన ఎవరో పెద్ద వయసున్నవారు, గొప్ప అనుభవజ్ఞులు అనుకున్నామేగాని, మీరింత చిన్న వయసువారని మా ఊహకైనా రాలేదు. జాహ్నవి కూడా తెలుగు పుస్తకాలు బాగా చదువుతుంది’.

‘మీ సందేహాలన్నీ తీరినట్లేనా? ఇక నాకు సెలవిప్పిస్తారా’ అంటూ రెండు చేతులతో నమస్కరించాడు జీవన్‌.

మళ్లీ అతనే మాట్లాడుతూ ‘సుధీర్‌ నా పెళ్లికి మీకు శుభలేఖ పంపుతా, ముందుగానే వచ్చి, పాప దత్తత వరకూ ఆగి, ఫార్మాలిటీస్‌ అన్నీ ముగించి తీరుబడిగా తిరిగి వెళ్లాలి, గుర్తుంటుంది కదూ..’ అన్నాడు.

కరణర గారి ఇంటివైపుగా నడుచుకుంటూ వెళుతున్న జీవన్‌ని చూస్తూ, ‘నానషిః కురుతే కావ్యం’ అంటారు. అలాగే ఈ రోజుల్లో కూడా పదికాలాల పాటు జనం మనస్సుల్లో నిలిచిపోయే ఉత్తమమైన కథలు రాయాలంటే, అది జీవన్‌లాంటి వారికే సాధ్యమౌతుంది. ఎంత నిర్మలమైనది అతని మనసు! ఇలాంటి వ్యక్తి ఈ రోజుల్లో కూడా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది’ అనుకున్నాడు సుధీర్‌.

——

జీవన్‌ ఇల్లు చేరేసరికి కామేశంగారు అతనికోసం ఎదురుచూస్తూ వీధి గుమ్మంలో నిలబడి ఉన్నారు. జీవన్‌ గుమ్మంలోకి రాగానే అతని చెయ్యి అందుకుని, ఉద్వేగం నిండిన చూపులతో అతని ముఖంలోకి చూశారు.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *