జీవనస్రవంతి-34

జీవనస్రవంతి-34

: జరిగిన కథ :

శరభయ్య కూతురి పెళ్లికి డబ్బు అప్పుగా కాక జగన్నాథం తాతయ్య ఛారిటబుల్‌ ఫండ్‌ నుండి డబ్బు ఇస్తానని జీవన్‌ చెప్పడంతో మీనాక్షి సంతోషించింది. ఆ ఫండుతోనే డిగ్రీ తరువాత డబ్బు లేక చదువుకోలేకపోయిన కిరణ్‌ని చదివిస్తానని జీవన్‌ అంటే కిరణ్‌ నాకు అంత ఓపిక లేదన్నాడు. సుమతి అమ్మ కాబోతోందని చెప్పాడు. మీనాక్షి స్వీట్‌ తినిపించింది. ఇకనుండి ప్రతి సంవత్సరం తన జీతంతో తాతయ్య పుణ్యతిథి రోజున అన్నదానం చేయడానికి జీవన్‌ నిర్ణయించాడు. జీవన్‌ సుమతికి భోజనం చెప్పివచ్చి, తల్లితో స్రవంతి కనపడిందని, ఇప్పుడు తమ ఆఫీసులోనే పనిచేస్తున్నదని చెప్పాడు. తల్లి సంతోషించి ఇంటికి రమ్మనమని చెప్పింది. నిద్రపోతున్న స్రవంతికి పొద్దున్నే శిరీష ఏడుస్తూ ఫోన్‌ చేసి వెంటనే రమ్మంది. ‘అరగంటలో అక్కడ ఉంటాను. బై’ అంటూ ఫోను పెట్టేసింది శిరీష.

ఇక చదవండి..

శిరీష మాటల్నిబట్టి ఆమెకేదో పెద్ద కష్టమే వచ్చిందని గ్రహించింది స్రవంతి. శిరీష వట్టి పిరికిది. నీడను చూసి భయపడే రకం. తను అక్కడకి వెళ్లేవరకూ ఆమె ధైర్యంగా నిలబడాలంటే కొంత ధైర్యం నూరిపొయ్యవలసి ఉంది – అనుకున్న స్రవంతి వెంటనే ఫోన్‌ అందుకుంది.

‘సిరీ! పేపర్లో వచ్చే వార్తల్ని చదివి, అవన్నీ నిజాలనుకోవద్దు. పేపర్‌ సర్క్యులేషన్‌ పెంచడానికి కొన్నివార్తల్ని కల్పిరచి కూడా రాస్తారుట! మరి కొన్నింటిని ‘గోరంతల్ని కొండంతలుగా’ చేసి ప్రచురిస్తారుట! అలాంటివన్నీ చదివేసి, ఆపై సింపుల్‌గా ఊరుకోవాలేగాని, మనసుకి పట్టించుకో కూడదు. ధైర్యంగా ఉండు. వచ్చేస్తున్నా. అక్కడనురడే ఇద్దరం కలిసి ఆఫీసుకి వెళదాములే!’ అంది.

‘అసలుసంగతి తెలియకుండా ఏవేవో మాటాడెయ్యకే సావీ! వస్తున్నావుగా, అంతా చెపుతా, విని ఆపై మాటాడుదువుగానిలే’ అంటూ ఫోన్‌ పెట్టేసింది శిరీష.

‘అరగంట’ అందిగాని అంతకంటే రవ్వంత ముందుగానే శిరీష ఇంటిని చేరింది స్రవంతి. తలుపు చప్పుడు విన్న శిరీష ‘మేజిక్‌ ఐ’ లోంచి తొరగిచూసి మరీ తలుపు తీసింది. స్రవంతి లోనికి రాగానే తలుపు మూసి గడియవేసేసి, స్నేహితురాలిని కౌగిలించుకుని భోరున ఏడ్చింది. ఆమెకు అంత కష్టం ఏమొచ్చిందో తెలియని స్రవంతి నిర్ఘాంత పోయింది. కొంతసేపలా ఏడ్చి, సర్దుకుని, పేపర్‌ తీసి చూపించింది ఆ దుర్వార్త! ఆ వార్త చదివి అంది స్రవంతి..

‘ఎంత ఘోరం! వాడెవడో మామూలువాడు కాదు, సైకో అయినా, శాడిస్టయినా అయి ఉండాలి. పాపర! ఎంతో విలువైన ఒక నిండు జీవితాన్ని పొట్టన పెట్టుకున్నాడు. ప్రేమించానని చెప్పడానికి వాడికి ఎంత హక్కుందో, తాను ప్రేమించడం లేదని చెప్పడానికి ఆ అమ్మాయికీ అంత హక్కుంటుంది కదా! ప్రేమించడం కుదరదన్నంతమాత్రంలో ఇంత అన్యాయం చేస్తాడా? ఎంత ఘోరం! ఏ అమ్మాయ యినా ‘ప్రేమించా’ నంటూ తన వెంటపడితే, ఇష్టం లేకపోయినా ఒప్పేసుకుంటాడా? ‘నో’ చెప్పాడని, ఆ అమ్మాయి వీడి ముఖంమీద యాసిడ్‌ పోస్తే! అప్పుడు తెలుస్తుంది వాడికి బాధ అంటే ఏమిటో! వీడు చేసిన పనికి, వికతంగా మారిన మొహాన్ని చూసుకుని, భరించలేక ఆ అమ్మాయి నిరాశతో ఆత్మహత్య చేసుకుందంటే, మానసికంగా కూడా ఎంతో బాధపడి ఉంటుంది, పాపం! ఆ అమ్మాయి చావుకి కారణమైనందుకు హత్యా నేరం మీద వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది కదాని, ఆ అమ్మాయికి పోయిన ప్రాణర తిరిగి వస్తుందా?’

‘అంతలా ఎక్సైట్‌ అవ్వకే స్రవంతీ! నువ్వు వినవలసింది ఇంకా చాలా ఉంది. ఎవరో ముక్కూ ముఖం తెలియనివాళ్లకు వచ్చిన కష్టానికే ఇంతగా బాధపడుతున్నావు అంటే, ఇక అదే కష్టం నా కొస్తే..’ అంటూ భోరున ఏడ్చింది శిరీష.

‘ఏమిటీ! నీకా..? నీ కిలాంటి కష్టమేమిటే! పగవాళ్లకు కూడా వద్దనుకోవలసిన దుర్దశ ఇది!’

‘ఒక సమస్యకు పరిష్కారం దొరికిందనుకుంటే మరో సమస్య తలెత్తింది. నానీ, నేనూ కలిసి బ్రతకడమన్నది మా ముఖాన రాసిలేదు కాబోలు’ అంటూ మరింతగా ఏడ్చింది శిరీష.

‘నానీ ఎవరు సిరీ? సారీ! ఏడవకు, ఎటువంటి సమస్యకైనా ఒక పరిష్కారం ఉండకపోదు, దానికోసం వెతుకుదాం’ అంటూ స్నేహితురాలిని ఓదార్చాలని చూసింది స్రవంతి.

కొంతలో కొంత తెప్పరిల్లి చెప్పసాగింది శిరీష. ‘నానీ అంటే మరెవరో కాదు నరేంద్ర! ముద్దుపేరు నానీ! నాకోసం ఈ ఊరు వచ్చినప్పుడు నరేంద్రను నువ్వు చూశావు కదా. ఇంతవరకూ నీకు అసలు సంగతి చెప్పలేదు. అతడు నాకు ఫ్రెండు మాత్రమే కాదు, ‘వుడ్‌ బి’ కూడా. నానీ నేనూ ఒకే ఊరివాళ్లం. రెండు కుటుంబాలూ ఒకరికొకరం బాగా తెలిసిన వాళ్లం. నానీ నేనూ చిన్నప్పటినుండీ కలిసి ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాం, వయస్సు పెరిగాక ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవా లనుకున్నాం. కాని కులాలు వేరు కావడంతో అటూ – ఇటూ కూడా పెద్దవాళ్లు ఎవరూ మా పెళ్లికి ఒప్పుకోలేదు. చివరకు వాళ్ల ప్రమేయం లేకుండా, నానీకి ఉద్యోగం రాగానే, స్వతంత్రించి మా పెళ్లి మేమే చేసుకోవాలనుకుంటున్నాము. ఆ సుము హూర్తంకి ఇక ఎన్నోరోజులు లేవని ఎంతో సంతోషంగా ఉన్నాము. అంతలో ఈ ఉపద్రవం..’ మాట పూర్తిచెయ్యలేక ఏడ్చింది శిరీష.

శిరీష పక్కన చేరి, భుజం చుట్టూ చెయ్యివేసి , ఓదార్పుగా దగ్గరకు తీసుకుంది స్రవంతి. స్నేహితు రాలి భుజంపైవాలి సేదదీరిన శిరీష మళ్లీ చెప్పసాగింది. ”ఇన్నాళ్లూ గొడవ ఎందుకని ఎవరికీ చెప్పలేదు -మన కొలీగ్‌ ప్రదీప్‌ లేడూ.. వాడే నాపాలిటి విలన్‌. కాస్త వీలు దొరికితే చాలు ‘ఐ లవ్‌ యూ’ అంటూ నా వెంట పడుతున్నాడు. నేను ‘నో’ చెప్పినప్పుడు అతని కళ్లల్లో కనిపించే కసి, కోపం చూస్తే నాకు చాలా భయమయ్యేది. కాని ఏమీ పట్టిరచుకోనట్లుగా ఉరడిపోయా. నిన్న ఒంటరిగా మెట్లు దిగితూంటే ఎదురుగా వచ్చాడు. దారికి అడ్డంగా నిలబడి మళ్లీ, ‘ఐ లవ్‌ యూ’ అన్నాడు. ‘నా పెళ్లి నిశ్చయమై పోయింది, నన్నిలా బాధపెట్టడం భావ్యం కాదు’ అన్నా. ‘మనసు మార్చుకో’ అన్నాడు. ‘కుదరదు, కమిటైపోయా’ అన్నా. వెంటనే అతడు నావైపు కోపంగా చూస్తూ, ‘ఈ ప్రదీప్‌ అంత దద్దమ్మేమీ కాడు, నాకు దక్కని సిరి మరెవరికీ దక్కనీను’ అంటూ నాకు దగ్గరగా వచ్చాడు. నా పై ప్రాణాలు పైకే పోయాయి. అంతలో నా పుణ్యం బాగుండి, మెట్లమీద ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. దాంతో నన్నొదిలి గబగబా మెట్లెక్కి వెళ్లిపోయాడు. అది మొదలు ఎప్పుడు ఏం చేస్తాడోనన్న భయంతో లోలోన ఒణికి చచ్చి పోతూంటే నమ్ము! తెల్లారగానే పేపర్లో ఇదీ వార్త! ఇక భరించలేకపోయా. దిక్కుతోచక, నీకు ఫోన్‌ చేసి నిన్నుకూడా బాధపెట్టా, నన్ను క్షమించవే సావీ! ఇక్కడ నా కష్టసుఖాలు షేర్‌ చేసుకొనేందుకు నాకని నువ్వుకాక మరెవరున్నారు చెప్పు’ అంది.

‘నీ ముఖంలే! నిన్ను క్షమిరచాలా? స్నేహితు లన్నాక ఆపాటి సాయం కూడా చెయ్యలేదంటే అది స్నేహానికే అవమానం. సరే, మరి ఇప్పుడేంచేద్దాం? మీ వాళ్లకు చెపితే..’

‘వంక దొరికింది కదాని వెంటనే ఉద్యోగం మానిపించి నన్ను ఇంటికి తీసుకుపోతారు. వాళ్లకసలు నేను ఉద్యోగం చెయ్యడమే నచ్చదు. అక్కడితో నానీ, నేనూ వేసుకున్న ప్లాను ఖతం!’

‘పోనీ, నానీకి చెపితే?’

‘చదువుమాని వచ్చేస్తాడు. పాండిచేరీ జిప్మెర్‌లో కార్డియాలజీ చేస్తున్నాడు. కొద్దిరోజుల్లో చదువు పూర్తవుతుంది. నానీకి మంచి ఉద్యోగం ఉంటేగాని మేము జీవితంలో స్థిరపడలేము కదా! ఇవన్నీ నేనూ ఆలోచించా. చివరకు ఏ దారీ సరైనదిగా కనిపించ లేదు. అందుకే..’ అంటూ మళ్లీ ఏడవసాగింది శిరీష.

‘సిరీ! అంతలా ఏడవకు.. ఏడ్చి సాధించేది కాదిది. సమస్య మనల్ని భయపెట్టినప్పుడు పరిష్కార మార్గం ఏదైనా ఉందేమో వెతికి చూడాలి గాని, ఇలా బేలగా ఏడుస్తూ కూచుంటే ఎలాగమ్మా! మనం ఈ విషయం మన ప్రాజెక్టు లీడర్‌కి చెప్పి, అతని సలహా అడుగుదాం. అతను మనకి ఏదైనా పరిష్కారమార్గం సూచించగలడన్న నమ్మకం నాకుంది. ఈవేళ మనం పొయ్యి వెలిగించవద్దు, మన ఆఫీస్‌ కేంటీన్‌ మీద పడదాం. తొందరగా తయారవ్వు, మన గురుడు వచ్చేవేళకి మనం అక్కడ ఉండాలి కదా’ అంటూ శిరీషను తొందర పెట్టింది స్రవంతి.

——

జీవన్‌ ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి శ్రీ జననీ ఆఫీసు రూంలో లైటు వెలుగుతూ కని పించింది. వెంటనే అటు వెళ్లాడు జీవన్‌. కిరణ్‌ని కలుసుకుని చాలారోజులవ్వడంతో ఒకసారి చూడాలనిపించింది అతనికి.

జీవన్‌ వెళ్లేసరికి కిరణ్‌ కొన్ని ఫైళ్లు ముందుంచు కుని సరిజూస్తున్నవాడల్లా జీవన్‌ని చూసి, గమ్మున లేచి, కూర్చోమని తన కుర్చీ చూపించాడు జీవన్‌కి.

కాని ఆ కుర్చీలో జీవన్‌ కూర్చోలేదు. టేబులుకి ఎదురుగా ఉన్న విజిటర్సు కూర్చునే కుర్చీలో కూర్చుంటూ, ‘ఆ కుర్చీని మరీ అంత లోకువ చెయ్యకురా కిరణ్‌! అది శ్రీ జననీ వారి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీటు. అది ఆయనకు మాత్రమే సొంతం’ అంటూ, ఒక ఫైల్‌ ముందుకు లాక్కుని లెక్కలు సరిచూడసాగాడు జీవన్‌.

కొడుకు రావడం చూసి, మీనాక్షి రెండు కప్పుల కాఫీ ట్రేలో ఉంచుకుని తీసుకువచ్చి ఇద్దరికీ ఇచ్చింది. ఇంత అభివద్ధి సాధించినా కూడా ఆమె ఏ డిజైనూ లేని తెల్లని చీరతో, ఏ అలంకారమూ లేకుండా, తన పూర్వపు నిరాడంబర వేషంలోనే ఉంది. చూసీ చూడగానే వెనకటికీ, ఇప్పటికీ ఆమెలో ఏ మార్పూ కనిపించదు. కాని జాగ్రత్తగా పరికించి చూస్తే మాత్రం ఆమె కళ్లలో సంతప్తి వల్ల వచ్చిన కాంతి కనిపిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించిన ఆనందం అది. ఏ కొడుకు అభివద్ధి కోసం తను అ¬రాత్రాలు కషి చేసిందో, ఆ కొడుకు ఈనాడు తగిన పొజిషన్లో ఉన్నాడు. అంతకంటే ఆమెకింకేమి కావాలి! ఎడమ చేత్తో కాఫీ కప్పు పట్టుకుని ఒక్కొక్క గుక్క కాఫీ తాగుతూ, కుడిచేత్తో పెన్ను పట్టుకుని చకచకా కాగితాలు తిప్పుతూ ఫైళ్లు చూస్తున్న కొడుకువైపు మురిపెంగా చూసింది మీనాక్షి.

జీవన్‌కి హఠాత్తుగా గుర్తుకొచ్చి అడిగాడు తల్లిని, ‘అమ్మా! యాజులు తాతయ్య ఏదో చెప్పారన్నావు, ఏమిటది?’

‘అదేరా! నీకు పెళ్లి సంబంధం చెప్పారు. వాళ్ల బంధువుల అమ్మాయి ఉందిట! నువ్వు సరేనంటే త్వరలో పెళ్లిచూపులకు వాళ్లింట్లోనే ఏర్పాటు చేస్తానన్నారు. వాళ్లకి ఇద్దరు కొడుకుల మధ్య ఒక్కటే కూతురుట! పిల్ల బోలెడు ఆస్తితో వస్తుందిట! నీతో సంప్రదించి, తొందరగా ఏమాటా చెప్పమన్నారు’.

చేతిలోని పెన్ను టేబులుమీద ఉంచి, రెండు చేతులు గుండెలమీద ఉంచుకుని భయం నటిస్తూ, ‘అమ్మో! కొంపతీసి ఆ కోతిపిల్ల కోవిద కాదు కదా..’ అన్నాడు జీవన్‌.

మీనాక్షి చిన్నగా నవ్వి, ‘ఏమో! అయినా అవ్వొచ్చు! ఇంకా నాకు ఏ వివరాలూ చెప్పలేదు వాళ్లు’ అంది.

‘కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలని పెద్దవాళ్లు చెప్పినది ఉత్తిమాట కాదమ్మా! మనకి మనలాంటి వాళ్లే తగినవాళ్లు. భాగ్యవంతులతో వియ్యం మనకు వద్దు. అయినా ఇప్పుడే అంత తొందరపడవలసిన అవసరం లేదమ్మా!’

ఫైళ్లు చూస్తూ ఆ తల్లీ కొడుకుల మాటలు వింటున్న వాడల్లా, కిరణ్‌ ఫైళ్ల లోంచి తలపైకెత్తి, వాళ్లని చూస్తూ, ‘వాడలా ఊరికే అంటున్నాడు. అమ్మా! ఆ మాటలు నువ్వు పట్టించుకోవద్దు. అవన్నీ ఉత్తుత్తి మాటలు. వీడికి పెళ్లీడు వచ్చింది. ఈ మధ్య వీడు అస్తమానూ అమ్మాయిల కబుర్లే చెపుతున్నాడు, తెలుసా..’ అంటూ జీవన్‌ వైపు చూసి కొంటెగా కన్ను కొట్టాడు.

జీవన్‌ గమ్మున లేచి, ‘ఒరేయ్‌ కిరణ్‌! నిన్నసలు బతకనివ్వకూడదురా! ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పటినుండి మొదలుపెట్టావు? ఉండు, నీ పనిచెప్తా’ అంటూ పెన్నుని కిరణ్‌ని కొట్టడానికి అన్నట్లుగా ఎత్తి పట్టుకున్నాడు.

కిరణ్‌ తన చేతిలోని పెన్ను టేబులు మీద ఉంచి, దెబ్బను కాసుకురటూన్న వాడిలా రెండు చేతులూ తలకి అడ్డం పెట్టకుని ఘొల్లుమన్నాడు, ‘అమ్మా! శరణు, శరణు! వీడు నన్ను చంపెయ్యకుండా నువ్వే కాపాడాలి’ అన్నాడు, వాళ్లనే చూస్తూ ముసిముసిగా నవ్వుకుంది మీనాక్షి.

‘కిరణ్‌! నాకు తెలుసురా, వీడికి పెళ్లీడు వచ్చిందని. ఆ విషయంలో నాకూ తొందరగానే ఉంది. వీడికి పెళ్లి చెయ్యాలనే ఉద్దేశంతోనే తెలిసిన వాళ్లకి నలుగురికీ చెప్పా, ‘మీకు తెలిసిన వాళ్లలో ఎవరికైనా మా అబ్బాయికి తగిన అమ్మాయి ఉంటే చెప్పండి’ అని. తగిన పిల్ల దొరకగానే సన్నాయిమేళం మ్రోగుతుంది. ఇంక ఎక్కువ రోజులు పట్టదు, కాని కొద్దిరోజులు ఓపిక పట్టాలి మనం తప్పదు’ అంది మురిసిపోతూ.

వెంటనే కిరణ్‌ అందుకుని, ‘ఔను! ఏ వయసుకి తగిన అందం ఆ వయసులో ఉండాలమ్మా..’ అంటూ దీర్ఘం తీశాడు.

‘ఇక ఆపండి’ అంటూ కేకపెట్టాడు జీవన్‌. ‘ఇదిగో, చెపుతున్నా వినండి, నా పెళ్లిగురించి ఇకనుండీ ఎవ్వరూ మాటాడవద్దు. సమయం వచ్చినప్పుడు నేనే చెపుతా’ అన్నాడు ఖచ్చితంగా.

మీనాక్షి, కిరణ్‌ అవాక్కై స్థాణువుల్లా నిలబడి పోయారు. మీనాక్షికి రవంత కోపం కూడా వచ్చింది. కొడుకువైపు తీక్షణంగా చూసింది.

వెంటనే ఖాళీ ఐన కాఫీ కప్పులు తీసి ట్రేలో ఉంచి తల్లికి అందిస్తూ జీవన్‌ మళ్లీ తనే మాట్లాడాడు, ‘అమ్మా! అటువంటి మాటలకి ఇది తగిన సమయం కాదమ్మా! ఈ అక్కౌరట్ల పని తొందరగా ముగించి, వీడిని ఇంటిదగ్గర దిగవిడిచి రావాలి. సుమతి వీడికోసం ఎదురుచూస్తూ, భోజనం చెయ్యకుండా కూర్చుంటుంది కదా!’ అన్నాడు.

మీనాక్షి ఏమీ మాటాడకురడా, కాళీ కప్పులు తీసుకుని వెళ్లిపోయింది. మిత్రులిద్దరూ సీరియస్‌గా పనిలోపడ్డారు.

——

లంచ్‌ అవర్లో, ప్రాజెక్టు లీడర్‌ జీవన్‌ గదిలోకి ప్రవేశించిన స్రవంతి, ‘హై, హై నాయకా!’ అంటూ నవ్వుతూ అతనికి అభివాదం చేసింది.

లంచ్‌ అవర్‌ కావడంతో, లంచ్‌ బాక్సు ఓపెన్‌ చేస్తున్న జీవన్‌, చేస్తూన్న పనిని ఆపి, వింతగా చూశాడు ఆమెవైపు. ‘ఏయ్‌, కొంటెకోణరగీ! జనం జడుసుకునేలా ఏమిటా గావుకేకలు’ అన్నాడు మందలింపు ధోరణిలో.

‘హా! హతవిధీ! తెలుగువాళ్లకే తెలుగు తెలియ కుండా పోతే, ఇక తెలుగుభాషకు వెలుగు ఎక్కడ నురడి వస్తుందిట! ఇరక ఈ భాషని ఆ భగవంతుడే కాపాడాలి’ అంటూ నిట్టూర్చింది స్రవంతి నాటకీయంగా.

‘మరీ బాగుంది, ఇదేమి ఆరోపణ’ అంటూ విసుక్కున్నాడు జీవన్‌.

‘ఆరోపణా? కాదు! ఇది ఆరోపణ ఎంత మాత్రర కాదు, అసలు సిసలైన నిజం! ‘హలో బాస్‌!’ అన్న మాటనే నేను మాతభాషలోకి తర్జుమా చేసి ‘హాయ్‌ హాయ్‌! నాయకా’ అన్నాను, అది తప్పా! అంతలోనే నన్నన్ని మాటలనాలా ఏమిటి!’ కోపంవచ్చిన దానిలా మూతి ముడుచుకురది స్రవంతి. జీవన్‌ వైపు తీక్షణంగా చూడాలనుకురది, కాని అది ఆమెకు చేతకాలేదు. కొంటె నవ్వును ఆమె పెదవులు దాచలేకపోయాయి.

–  వెంపటి హేమ (కలికి)

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *