జీవనస్రవంతి-35

జీవనస్రవంతి-35

: జరిగిన కథ :

భయపడుతున్న శిరీషకు స్రవంతి ఫోన్‌ చేసి పేపర్లో వార్తలు నిజాలు అనుకోవద్దు అని చెప్పి, అరగంటకు ముందే ఆమె వద్దకు చేరింది. శిరీష చూపించిన దుర్వార్త చూసి స్రవంతి బాధపడింది. శిరీష తనకూ ఆ కష్టం వస్తుందేమో అని భయపడింది. తాను నానీని ప్రేమిస్తుంటే, ప్రదీప్‌ తన వెంట పడుతున్నాడని, తనకు దక్కని సిరి మరెవ్వరికీ దక్కనీను అన్నాడని చెప్పింది. ఇద్దరూ ఈ విషయాన్ని జీవన్‌కి చెబుతామని నిర్ణయిం చారు. జీవన్‌ ఆఫీస్‌ నుండి వచ్చి, శ్రీ జననీ ఆఫీసులో ఇంకా పనిచేస్తున్న కిరణ్‌ని కలిశాడు. యాజులు తాతయ్య పెళ్లి సంబంధం తెచ్చారని మీనాక్షి చెపితే, జీవన్‌ ఇప్పుడే వద్దన్నాడు. ఆ మాటకు కిరణ్‌, మీనాక్షి ఆశ్చర్య పోయారు. జీవన్‌ గదిలోకి ప్రవేశించిన స్రవంతి హాయ్‌ హాయ్‌ నాయకా అనడంతో ఆమెను మందలించాడు జీవన్‌. కోపంతో మూతి ముడుచుకురది స్రవంతి.

ఇక చదవండి..

అది కనిపెట్టిన జీవన్‌, ‘అంత కష్టపడొద్దులే, తప్పు నాదేనని ఒప్పేసుకురటున్నా. కాని ఇక్కడ నీ తప్పు కూడా ఉంది, నువ్వనుకున్నట్టుగా నువ్వన్న మాట తెలుగేం కాదు, సంస్కతం! తెలుగుభాషలో సగానికి సగం పైగా ఆక్రమిరచి ఉంది సంస్కతం. అలా రెండు భాషలు కలిసి ఉంటే దానిని ‘మణిప్రవాళం’ అంటారు. చెప్పాడు జీవన్‌ భుజాలెగరవేస్తూ.

‘ఓకే సర్‌! మనం ఇప్పుడు లంచ్‌ బాక్సుల పని ముందుగా చూద్దాం. బై ది బై! ఈ వేళ నా బాక్సు మొత్తం నేను స్వయంగా చేసిన వంటలే! శ్రీ జననీ ప్రోడక్ట్సులోది ఒక్కటి కూడా లేదు’ అంటూ బ్యాగ్‌లోంచి లంచ్‌బాక్సు బైటికి తీసి మూత తెరిచింది స్రవంతి. వెంటనే గదిలోని గాలి వంటకాల వాసనలతో ఘుమఘుమలాడిపోయిరది.

అవి జీవన్‌కి ఇష్టమైన వంటకాలు కావడంతో ఆ పరిమళం అతనిని ఆకట్టుకుంది. ఊపిరి గట్టిగా పీల్చి, ‘ఇంత అట్టహాసంగా ఘుమఘుమలాడి పోతున్నాయి, ఏమేం వండావేమిటి’ అని అడిగాడు.

‘మువ్వరకాయ గుత్తికూర, కొబ్బరికాయ మామిడికాయా కలిపి పచ్చడి – అంతే!’

‘అవి రెండూ కూడా నాకు చాలా ఇష్టం’ అనకుండా ఉరడలేకపోయాడు జీవన్‌.

స్రవంతి మనసులో అనుకుంది. ‘నాకది తెలుసు, అందుకే కదా వాటిని పనికట్టుకుని వండి ఇక్కడకు తెచ్చింది’ అని. కాని, పైకి మాత్రం ‘ఐతే మనం బాక్సులు మార్చేసుకుందామా’ అని అడిగింది ఏమీ ఎరగనట్లు.

‘బాక్సులు మార్చుకోడం ఎందుకు? షేర్‌ చేసుకోవచ్చుకదా?’

‘ఇంటిదగ్గర ఇంకా మూతపెట్టుకుని వచ్చా రాత్రి తినడానికి. అవి నేను తింటా కదా! ఇంతకీ అమ్మ ఏం వండారేమిటి’ అని అంటూ చనువుగా జీవన్‌ లంచ్‌ బాక్సు తీసి చూసింది. ‘హాయ్‌! అమ్మ చేసిన గోరగూరపప్పు, దానిలో నంచుకునేందుకు దోసావ కాయ! ఇవి నాకెంతో ఇష్టం’ అంటూ చొరవగా ఆ బాక్సు తనవైపుకు తీసుకుంది.

కొంతసేపు ఇద్దరూ మాటాడకుండా భోజనం చేశారు. అంతలో స్రవంతి తలపైకెత్తి జీవన్‌ వైపు చూస్తూ, ‘ఇది విన్నావా బాసూ! మనకి అప్పగించిన ప్రాజెక్టుని మనం రికార్డు టైమ్‌లో పూర్తిచేశాముకదా! అందుకని, కొత్తగా వచ్చిన ఫారిన్‌ అసైన్‌మెంట్‌కి మన టీములో కొందర్ని లండన్‌ పంపాలనుకుంటు న్నారుట!’

‘నీ కది ఎలా తెలిసింది! అదింకా కన్ఫర్ము కాలేదు’.

‘గ్రేప్‌ వైన్‌ బాబూ, గ్రేప్‌ వైన్‌! ఇట్టే పాకిపోతుందది. ఇంతకీ ప్రపోజల్‌ ఉందికదా! రేపో మాపో కన్ఫర్మ్‌ అవుతుంది. ఐతే మనలో కొందరికి స్థానచలనం, లోహవిహంగయానం రాసి ఉందన్న మాట!’

”నాకు ఫారిన్‌ వెళ్లే ఉద్దేశం ఎంతమాత్రం లేదు, ఇదే నిజమైతే నా బదులు మరెవరినైనా పంపమంటా’ అన్నాడు జీవన్‌.

‘అదేమిటి బాసూ! ఎగిరి గంతెయ్యకపోగా మరీ ‘సిరికి మోకాలు అడ్డం పెట్టి’నట్లు అలా నెగటివ్‌గా మాట్లాడుతున్నావేమిటి!’

‘సంతప్తిని మించిన సిరి ఏదీ లేదు. నాకీ సిరి చాలు. నేను ఫారిన్‌ వెళ్లిపోతే మా అమ్మ ఒంటరిదై పోతుంది. మా అమ్మని కనిపెట్టి ఉండడం నా కనీస ధర్మం – అని నా ఉద్దేశం. కన్నతల్లినీ, జన్మభూమినీ పట్టిరచుకోని వాళ్లకు పుట్టగతులుండవుట!’

‘ఐతే నీ ఆదర్శ వాక్యం ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్నమాట!’

‘దానిని నోటితో అనడం కాదు, ఆచరణలో చూపిరచాలన్నది నా ధ్యేయం’.

ఇద్దరూ భోజనం ముగించి ఖాళీ బాక్సులకు మూతలు బిగించి, దేని బాగ్‌లో దాన్ని ఉంచింది స్రవంతి. కాసేపు విశ్రాంతిగా కుర్చీల్లో కూర్చున్నారు ఇద్దరూ. అప్పుడు జీవన్‌ని అడిగింది స్రవంతి..

‘ఔనుగాని బాసూ! ప్రదీప్‌ చాలా మారిపోయాడు. ఇప్పుడు శిరీషను ‘హెరాస్‌’ చెయ్యడం పూర్తిగా మానేశాడుట! అంతేకాదు, అతడు ఆమెను తప్పించుకుని తిరుగుతున్నాడని కూడా అనిపిస్తోంది నాకు. పొరపాటున ఎదురుపడినప్పుడు కూడా వంచిన తల ఎత్తకుండా తప్పుకుని దూరంగా వెళ్ళి పోతున్నాడుట! అద్భుతం! ఏం మాయ చేశావోగాని బాసూ..’

‘నాకలాంటి మాయలూ, మంత్రాలూ ఏమీ తెలియవు, ముక్కుకు సూటిగా నడిచిపోవడం తప్ప! నేను చేసిందల్లా ఒక్కటే – అతని ప్రవర్తనలోని లోపాల్ని విశ్లేషించి, అది ఎంత తగనిపనో అతనికి తెలిసేలా చేసి, అతనిలోని ఆలోచనను మేల్కొలిపాను. అంతే! తన తప్పు తనే తెలుసుకున్నాడు. మనిషి చేసే తప్పుల్లో చాలావరకూ కేవలం ఆలోచనా లోపం వల్లే జరుగుతూ ఉంటాయనిపిస్తుంది నాకు. కంగారుపడి నిర్ణయాలు తీసుకోకుండా, కొంచెం బుర్రకు పనిచెప్పి, ఇలా చెయ్యడంవల్ల వచ్చే పరిణామాలు ఏమిటి అని ఆలోచించి ఉంటే ఎవరూ ఏ తప్పూ చెయ్యనే చెయ్యరని నా గట్టి నమ్మకం’.

‘ప్రదీప్‌తో ఏం అన్నావో చెప్పు బాసూ!’ గారాలు పోయింది స్రవంతి.

జీవన్‌ నవ్వీ నవ్వనట్లుగా నవ్వి, చెప్పడం మొదలుపెట్టాడు. ‘ముందుగా మీరు నాదగ్గర వదిలివెళ్ళిన పేపర్‌ కట్టింగ్‌ చేతికి ఇచ్చి చదవమన్నా. చదివాడు. ఆ తరవాత అడిగా, నీకు నచ్చని అమ్మాయి వచ్చి నీకు ‘ఐ లవ్‌ యూ’ చెపితే నువ్వు ‘ఓకే’ చెపుతావా? ‘నో’ చెప్పడంలో తప్పేముంది? ‘నో’ అన్నదని కక్షసాధిస్తే, పేపర్‌లో చూశావుగా.. ‘నో’ అందని కోపంతో అతడు ఆమె మొహం మీద యాసిడ్‌ పోసి కక్ష తీర్చుకున్నాడు. ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె అకాల మరణానికి అతడే బాధ్యుడని, ఆ అబ్బాయికి హత్యానేరం మీద యావజ్జీవ కారాగారశిక్ష పడింది. ఎంత బాగుందో చూడు. దీనివల్ల ఎవరు బాగుపడ్డారు? వీళ్లని కన్న ఆ తల్లులిద్దరు పిల్లలను పోగొట్టుకుని, గర్భశోకం అనుభవిస్తూ వీళ్లని కన్న పాపానికి దుర్భరజీవితం గడుపుతున్నారు. అంతా చెప్పి, చివరలో అడిగా, ‘ఇదంతా అవసరమా? ఈజ్‌ ఇట్‌ వర్తు ది ట్రబుల్‌?’ అని. అంతే – అతడు అర్థం చేసుకున్నాడు’.

‘ఇన్నాళ్లూ ప్రేమ, ప్రేమంటూ తిరిగి అంతలోనే అంతా మర్చిపోయాడన్నమాట! ఎనీహౌ, మొత్తానికి సిరి బ్రతికి బయటపడింది. థాంక్సు బాసూ!’

‘యు ఆర్‌ వెల్కం!’ చిన్నగా నవ్వి అన్నాడు జీవన్‌. ‘ప్రదీప్‌ మనసేమిటో మనకు ఎలా తెలుస్తుంది? జీవితంలో ఈ ప్రేమలూ, పెళ్లిళ్లు ఒక భాగమేగాని పూర్తి జీవితం ఎంతమాత్రం కాదు కదా! వైవాహిక బంధం ఒకటే కాదు, ఇంకా ఇంకా ఎన్నో రకాల బాధ్యతలూ, బంధాలూ ఉంటాయి జీవితంలో. ప్రదీప్‌ విషయంలో ఇప్పుడు జరిగింది మంచిదే కదా, ఇంకా బాధపడుతున్నా వెందుకు? మీ అమ్మాయిలతో వచ్చే చిక్కే ఇది, ఔనంటే తప్పు, కాదంటే ముప్పు!’ విసుక్కున్నాడు జీవన్‌.

గతుక్కుమంది స్రవంతి. ‘సారీ బాసూ! జస్టు క్యూరియా సిటీ! తెలుసుకోవాలన్న కుతూహలం, అంతే!’

‘కల్పనాజగత్తులో చాలా ప్రేమ కథలు వచ్చాయి. వాటిలో కొన్ని పాఠకులను ఆకట్టుకుని పాత్రల సుఖదుఃఖాల్లో లీనమయ్యేలా చేశాయి కూడా. కాని అవి నిజాలు కావు. నిజానికి వాటిని మనం పట్టించుకోవలసిన పనిలేదు. కానీ వాస్తవాలు వేరు. మనం చేసుకున్నది కష్టమైనా సుఖమైనా మనమే అనుభవించక తప్పదు. చాలా ప్రేమలు చిన్నగాలికే ఎగిరిపోయే ఎండుటాకుల్లా చిన్న ఉత్పాతం వస్తే చాలు మాయమైపోతాయి. ఎంత గాలి వచ్చినా చెక్కుచెదరని ఊడలమర్రి లాంటి ప్రేమలు చాలా అరుదు’.

‘అంటే సష్టిలో ప్యూర్‌ అండ్‌ స్ట్రాంగ్‌ లవ్‌ అన్నది లేనే లేదా!’

‘ప్యూర్‌ లవ్‌’ అంటే నీ ఉద్దేశం?’ అడిగా జీవన్‌.

‘మనసారా తను ప్రేమించిన వ్యక్తికోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండడం, తను ప్రేమిరచిన మనిషిలోని తప్పొప్పుల మధ్య వివక్ష లేకుండా ఎప్పుడూ ఒకేలా ప్రేమించడం – ఇలా ఏవో కొన్ని సరిహద్దులు ఉన్నాయి’.

‘ప్యూర్‌ లవ్‌ లేకేం! ఉంది, అదే తల్లిప్రేమ. బిడ్డతో ఎన్ని కష్టాలైనా పడనీ, తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తూ, ఆ బిడ్డ శ్రేయస్సునే కోరుతూ ఉంటుంది. నా ఉద్దేశంలో తల్లిప్రేమను మించిన ప్రేమ మరేదీ లేదు’ అన్నాడు జీవన్‌.

‘కృతజ్ఞతలు గురూ! తెలియని విషయాలెన్నో నాకు తెలిసేలా చేశావు. థాంక్యూ ఎగైన్‌’ అంది ఉత్సాహంగా స్రవంతి.

‘నీకు కూడా కృతజ్ఞతలు. నువ్వు వంట బాగా చేస్తావనుకుంటా..! నువ్వు చేసిన మువ్వంకాయ కూర చాలా బాగుంది’ అన్నాడు జీవన్‌ మాటలను మరోదారి పట్టిస్తూ..

‘అంటే పచ్చడి బాగులేదనా అర్థం!’ అంది స్రవంతి కొంటెగా..

జీవన్‌ చిన్నగా నవ్వుతూ, ‘నేను ముందే చెప్పానుగా నువ్వు బ్రహ్మాండమైన వంటకత్తెవని! అంటే-నువ్వు గడ్డి పచ్చడి చేసినా, అది బ్రహ్మాండగా ఉంటుందని అర్ధం. అలాంటిది కొబ్బరి పచ్చడి బాగుందని వేరే చెప్పాలా ఏమిటి!’ అన్నాడు రెట్టిరచి ముసిముసిగా నవ్వుతూ.

ఆ ప్రశంసకి స్రవంతి బుగ్గల్లో కెంపులు మెరిశాయి. కొంటెగా తనుకూడా ఏదో ఒక కౌంటర్‌ వెయ్యాలని నోరుతెరిచిరది, కాని, అంతలోనే, ‘సార్‌! మీకోసం ఎవరో వచ్చారు’ అంటూ ఆఫీసు బోయ్‌ రావడంతో తెరిచిన నోరు మళ్లీ మూసేసుకుంది స్రవంతి.

జీవన్‌ని కలవడం కోసం ‘హితైషిణి’ పత్రికా ఆఫీసు నుండి ఎవరో వచ్చారన్న వార్త తెచ్చాడు అతడు. వెంటనే లేచి అతని వెనక బయలుదేరాడు జీవన్‌. వెనువెంట నడిచింది స్రవంతి కూడా.

రిసెప్షన్‌ రూమ్‌లోకి వచ్చిన జీవన్‌ని, హితైషిణి పత్రిక నుండి వచ్చిన నడివయసు వ్యక్తికి, ఒకరికొకరిని పరిచయం చేసింది రిసెప్షనిస్టు.

ఒక్కక్షణం ఆ వచ్చిన అతను జీవన్‌ వైపు ఆశ్చర్యంగా చూసి, అంతలోనే సర్దుకుని జీవన్‌ నుద్దేసించి, ‘సర్‌! నేను ‘హితైషిణి’ పత్రికకు సబ్‌ ఎడిటర్‌ని. నన్ను మా పత్రిక వాళ్లు పంపారు, మిమ్మల్ని ఆహ్వానించడానికి. నాపేరు ప్రకాశరావు. మీరు రాసిన ‘జీవన స్రవంతి’ నవలకు ప్రథమ బహుమానం వచ్చిరదని మీకు ఇదివరకే తెలియ జేశాము కదా! ఈ సంవత్సరం హితైషిణికి సిల్వర్‌ జూబిలీ సంవత్సరం జరుగుతోంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించి, ఆ ఉత్సవంలో వేదికమీద మిమ్మల్ని సన్మానించి మీకా బహుమానాన్ని అందజెయ్యాలని మా సంకల్పం. మీకు స్వయంగా మా ఆహ్వానాన్ని అందజేసి, మీ సమ్మతిని అందుకుని రమ్మని నన్ను పంపారు. మీరు కార్యక్రమానికి రావడానికి ఒప్పుకుంటే ఆ సమయానికి మీరు పంపమన్న చోటుకి కారు పంపుతాము. చిరంజీవిగారూ! మీరు తప్పక రావాలి’ గుక్కతిప్పుకోకుండా చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు అతడు.

‘నాకు సెలవు దొరకాలి కదా!’ నసికినట్లుగా అన్నాడు జీవన్‌.

‘ఒక్కరోజు సెలవు పెడితే చాలు, మీకే ఇబ్బందీ ఉండదు. ఆ రోజు రాత్రికే మిమ్మల్ని మీ ఇంటిదగ్గర డ్రాప్‌ చేస్తాము. రాననకండి సార్‌! సిల్వర్‌ జూబిలీ సమయం కనక బహుమతి ప్రదానోత్సవం గొప్పగా చెయ్యాలని ప్లాన్‌ చేశారు మా వాళ్లు. నిజం చెప్పాలంటే, మీ నవల పడడం మొదలయ్యాక మా పత్రిక సర్క్యులేషన్‌ బాగా పెరిగింది. మీకు మా కతజ్ఞత తెలియజేసే అవకాశం మాకివ్వండి. మానవ జీవితానికి ఒక జీవనదితో పోలికపెట్టి మీరు చేసిన ప్రస్తావన చాలామందికి నచ్చింది. ఆ విషయాన్ని చాలామంది పాఠకులు మాకు ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నారు. మీ రచనను చదివిన పాఠకులు మీరెంతో అనుభవజ్ఞులని, మీవయసు ఏభైకి పైమాటే ఉండవచ్చుననీ అనుకురటున్నారు. మిమ్మల్ని చూడకముందు నేనూ అలాగే అనుకున్నా! ఇంత చిన్న వయసులోనే మీరంత బాధ్యతాయుతమైన రచనలు చేసి, గొప్ప పేరు తెచ్చుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. రేపు సభలోని వారందరికీ మిమ్మల్ని రచయిత చిరంజీవిగా పరిచయం చేసే భాగ్యం మాకు కలిగించమని మరీమరీ అడుగు తున్నాను. మీరు ‘సరే’ అంటే మేము ఆహ్వాన పత్రికలు అచ్చు వేయిస్తాం’ అంటూ మాటలు ఆపాడు హితైషిణీ సబ్‌ ఎడిటర్‌ ప్రకాశరావు.

జీవన్‌కి, తానే రచయిత చిరంజీవి – అన్న విషయం ఆఫీసులో తెలియడం ఇష్టం లేదు. కాని ఈ వేళ అందరికీ ఆ సంగతి తెలిసిపోయింది. లంచ్‌ అవర్‌ కావడంవల్ల అందరూ ఖాళీగా ఉండడంతో చోద్యం చూడడానికి వచ్చినట్లు కోలీగ్సంతా రిసెప్షన్‌ రూమ్‌లో చేరిపోయారు. జీవన్‌కి చాలా మొహ మాటం వేసిరది.

ప్రకాశరావు పక్కకు చేరి, అన్యాపదేశంగా, ‘మీకు ఈ అడ్రస్‌ ఎవరు చెప్పారు’ అని అడిగాడు జీవన్‌.

‘మీరు మాకు ఇచ్చిన అడ్రస్‌ ప్రకారం నేను మీ ఇంటికి వెళ్లాను. ఆక్కడ మీ గురించి అడిగితే మీ అమ్మగారు ఈ అడ్రస్‌ ఇచ్చి పంపారు’ అన్నాడు అతడు.

ఇక్కడ ఎవరికీ తెలియకుండా ఉండాలనే తను ఇంటి అడ్రస్‌ ఇచ్చాడు. కాని, తల్లికి చెప్పి ఉంచకపోడం వల్ల ఇలా జరిగింది. అది తన తప్పే అనుకున్నాడు జీవన్‌. సమయానికి తగిన విధంగా ప్రవర్తించక తప్పదు కదా..

‘హితైషిణి వారు నాపై చూపిస్తున్న అభిమానానికి కతజ్ఞుణ్ణి. కాని, నేనొక బాధ్యత గల ఉద్యోగిని. రచనలంటారా.. అది నా ‘హాబీ’ మాత్రమే! ఇలా సభలనీ, సమావేశాలనీ ఊళ్లుపట్టుకుని తిరగడం నాకు కుదరదు, క్షమించాలి మీరు’ అన్నాడు జీవన్‌.

‘అలా అనొద్దు సార్‌!’ అంటూ ప్రాధేయపడ్డాడు ప్రకాశరావు. ‘మీ రచనలు చదివి, చాలామంది పాఠకులు మీపై అభిమానాన్ని పెంచుకున్నారు. మీ రాక మా ఫంక్షన్‌కే హైలైట్‌ ఔతుంది. మా మేనేజర్‌తో విషయం చెప్పి, ఫంక్షన్‌ ఆదివారం జరిగేలా ప్లాన్‌ చేస్తాను. మీరు సెలవు పెట్టవలసిన పని కూడా ఉరడదు. రాననిమాత్రం అనొద్దు’ బ్రతిమాలాడు ప్రకాశరావు.

అప్పటికే అక్కడ ఆఫీసులోవాళ్లు చాలామంది చేరిపోయారు. వాళ్లలో కొందరు చిరంజీవి రచనలు చదివి, అతని మీద అభిమానం పెరచుకున్నవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకి, తమ కొలీగ్‌ జీవనే ‘ప్రముఖ రచయిత చిరంజీవి’ కావడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. వాళ్లందరూ చుట్టూ చేరి బలవంతపెట్టడంతో జీవన్‌కి హితైషిణి వాళ్ల ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు.

జీవన్‌ దగ్గర మాటపుచ్చుకుని ప్రకాశరావు సంతోషంగా వెళ్లిపోయాడు.

— —– —-

ఆ రోజు జీవన్‌ ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా అగరువత్తుల పరిమళంతో గుబాళించి పోతోంది. ఆ సుగంధం అతనికి పరిచయమే! అది అతని మనసును ఉత్తేజపరచి, ఏవేవో పాత జ్ఞాపకాలను రేపింది.

–  వెంపటి హేమ (కలికి)

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *