జీవనస్రవంతి – 29

జీవనస్రవంతి – 29

ధారావాహిక

: జరిగిన కథ :

జగన్నాథం తాతయ్య పెట్టిన ఉంగరం, తన గోల్డ్‌మెడల్‌ రెంటినీ అమ్మడానికి నగలు అమ్మే షాపుకు వెళ్లిన జీవన్‌ను షాపులోని సేఠ్‌ చగన్‌లాల్‌ దొంగగా అనుమానించి, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ని పిలిపించాడు. ఇన్‌స్పెక్టర్‌ వస్తూనే జీవన్‌తో కరచాలనం చేసి, జీవన్‌ గురించి 60 లక్షలు విలువ చేసే ఇంటినే వదులుకున్న వ్యక్తి అని చెప్పగానే చగన్‌లాల్‌ జీవన్‌కి క్షమాపణ చెప్పాడు. చివరకు 2 లక్షలకు ఉంగరాన్ని కొన్నాడు. దాంతో జీవన్‌ గోల్డ్‌మెడల్‌ అమ్మలేదు. ఆ 2 లక్షలతో జీవన్‌ తన తల్లి చేత ‘శ్రీ జననీ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌’ పేరుతో వ్యాపారం ప్రారంభం చేయించాడు. మెల్లగా అమ్మకాలు మొదలయి వ్యాపారం వృద్ధి పొందింది. పనివాళ్లను కూడా పెట్టాల్సి వచ్చింది. పనివాళ్లు పెరగడంతో ఇల్లు ఇరుకైంది. దాంతో పెద్ద ఇంటి కోసం వెతకసాగాడు జీవన్‌.

ఇక చదవండి..

పెద్ద ఇల్లు త్వరగానే దొరికింది. వెంటనే ఆ ఇంటిలోకి మారారు శ్రీ జననీ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ బృందం జీవన్‌, మీనాక్షిల ఆధ్వర్యంలో. వేరే ఇంటికి మారాక వ్యాపారం మరింత అభివృద్ధిలోకి వచ్చింది. ఉత్పత్తి ఇంకా పెరిగింది. క్రమంగా ‘శ్రీ జనని’ అన్న పేరు ఇంటింటా వినిపించసాగింది. ఉద్యోగాలు చేసుకునే ఆడవారికీ, వండుకుతినే శక్తి తగ్గిన ముసలివారికీ, ఒళ్లు కదలడానికి ఇష్టపడని బద్ధకస్తులకు సరసమైన ధరలకు దొరికే ‘శ్రీజననీ ఫుడ్సు’ వరమయ్యాయి.

తమ కృషి ఫలించినందుకు సంతోషించారు తల్లీకొడుకులు. వాళ్లకిప్పుడు ఏ లోటూ లేదు. ఏ ఇబ్బందీ లేకుండా వాళ్లింత తినగలగడమే కాకుండా నలుగురికి పని ఇచ్చి, వాళ్లకు భుక్తి కల్పిరచగలగడ మన్నది కూడా వాళ్లకి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఒక్క సంవత్సరకాలం గడిచేసరికి ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి వాళ్ల జీవితాల్లో!

వ్యాపారం లాభదాయకంగా ఉండి డబ్బు మిగులుతూరడడంతో, పని తేలికగా జరగడం కోసం కొన్ని పనుల కోసం విద్యుత్పరికరాలు కొని వాడసాగారు. వ్యాపారం మరింత శీఘ్రంగా వృద్ధి పొందుతోంది.

మీనాక్షి మనసులో పెళ్లి బాజాల సందడి మొదలయ్యింది. పెళ్లీడుకి వచ్చిన కొడుక్కి పెళ్లిచెయ్యడం తన బాధ్యతగా భావించింది ఆమె. కొడుక్కి పెళ్లిచేసి, కోడలికి సంసార బాధ్యతలు అప్పగించి, తాను ఈ సంసార జంజాటానికి దూరంగా, నిర్లిప్తంగా బ్రతకవచ్చునని ఆశపడింది. ‘వీడికోసం ఒక అమ్మాయిని ఈసరికి దేవుడు ఎక్కడో పుట్టించే ఉంటాడు. కాని ఇద్దరికీ మధ్యనున్న తెర తొలగి, వాళ్లిద్దరూ ఒకటయ్యేది ఎప్పుడో! అయినా నా ప్రయత్నం నేను చెయ్యాలిగా, ఆపై దైవ నిర్ణయం! దేనికైనా ఆ సమయం రావాలి’ అనుకుంది. ఆ విషయం నేరుగా జీవన్‌తోనే ప్రస్తావించింది.

కాని జీవన్‌ ఒప్పుకోలేదు. దానికింకా సమయం రాలేదు, వచ్చినప్పుడు నేనే నీకు చెపుతాలే’ అని మాట దాటవేశాడు.

———

పడమటి కనుమల్లో పుట్టిన జీవనది కృష్ణవేణి. ఆ నది తరలివెళ్లిన దారిలోని గుట్టలూ, మిట్టలు అన్నీ ఆ నీటిలోనే మునిగిపోయాయి. నదిలోని నీరు తగ్గినప్పుడల్లా అవి బయటపడి, నదిలో జలకాలాడుతున్న ఏనుగుల మూపుల్లా నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. నదీతీరంలోని పచ్చదనంతోపాటుగా కొండలూ గుట్టలుగా ఉన్న ఆ ప్రదేశపు నైసర్గిక స్వరూపం రమణీయంగా ఉంటుంది. యాజులుగారికి జబ్బుచేసినప్పుడు వైద్యులు ఆయనను సముద్రతీరానికి ఎడంగా వెళ్లి ఉండమని సలహా ఇచ్చారు. ఆ సమయంలో ఆయన పెద్దకొడుకు ఉద్యోగరీత్యా కృష్ణా తీరానికి దగ్గరలో ఉన్న ఈ ఊళ్లో ఉండడంతో ఆయన ఈ ఊరికి వచ్చారు. ఇక్కడకు వచ్చాక ఆయన ఆరోగ్యవంతుడు కావడంతో ఆయన ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకుని, ఇల్లుకట్టుకుని స్థిరపడిపోయారు. కొడుకు అమెరికా వెళ్లిపోయాక కూడా ఆయన ఇక్కడే ఉండిపోయారు.

అప్పటికి చాలా ఏళ్లకు ముందే మనకు ఇంకా స్వాతంత్య్రం రాని రోజుల్లో ఒక జాగీర్దార్‌కి కూడా ఈ ప్రదేశం నచ్చడంతో ఇక్కడ పెద్ద భవంతి కట్టించుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. కాలక్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. భారతదేశానికి స్వతంత్రర వచ్చింది. జాగీర్దారుకి వృద్ధాప్యం వచ్చింది. మరో విషయం ఏమిటంటే ఆ జాగీర్దారుకి పిల్లలు లేరు.

పిల్లలు లేని ఆ ముసలి జాగీర్దార్‌ దంపతులకు ధనానికి లోటు లేదు. దాంతో ఒక నౌకరును పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కొంతకాలం బాగానే గడిచిపోయింది. తరువాత మరీ వృద్ధాప్యం పెరగడం వల్ల, కాలూ చెయ్యీ ఆడని పరిస్థితిలో మంచం పట్టారు ఆ జాగీర్దారు దంపతులు. కానీ నౌకరు సంరక్షణలో రోజులు ఓమాదిరిగానే గడిచాయి.

అకస్మాత్తుగా ఒకరోజు నౌకరు భార్య చని పోవడంతో జాగీర్దారు దంపతుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. భార్య మరణంతో తాగుబోతుగా మారిన సేవకుడు వాళ్ళను పట్టించుకోక పోవడంతో చివరకు ఆ జాగీర్దారు, అతని భార్య తిండీ తిప్పలు చూసేవాళ్లు లేక ఆకలితో అలమటిరచి, చివరకు చనిపోయారు. ఆపై రెండుమూడు రోజులు గడిచి, పరిసరాలు దుర్వాసనతో నిరడి పోయాకగాని నౌకరు వాళ్లను గురించి పట్టించుకోలేదు. కుళ్లిపోయిన శవాలను చూసి అపరాధ భావంతో తబ్బిబ్బైన అతనికి కళ్లు మూసినా తెరిచినా శవాలుగా మారిన జాగీర్దారు దంపతులే కళ్లకు కట్టడంతో భయంతో ఆ ప్రారతాన్ని విడిచి దూరంగా పారిపోయాడు.

జాగీర్దారు దంపతులు దుర్మరణం పొందడం వలన దయ్యాలై, అందుకు కారణమైన తనను వెంటాడుతున్నారని ఆ నౌకరు వాపోయేవాడు. చివరకు అతడు ఆ భయంతోనే మరణించాడు. అందమైన ఆ భవనానికి దయ్యాలకొంప అనే పేరు వచ్చింది. ఇక ఆ వైపు చీకటి పడితే ఎవరూ వెళ్లేవారు కాదు. దాంతో ఆ భవనం మట్టికొట్టుకుని పాతగా కనబడేది.

జీవన్‌ కూడా వీలు చిక్కినప్పు డల్లా అదే కృష్ణానదీ తీరానికి వ్యాహ్యాళికి వెళుతుంటాడు. అయితే ఆ తీరంలోనే ఎప్పటినుండో ఉన్న ఆ భవనాన్ని చూస్తూ, అంత పెద్ద ఇల్లు దెయ్యాలకొంపగా పేరుపడి, అలా నిష్ప్ర యోజనంగా ఉండిపోవడం నచ్చక జీవన్‌ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు.

ఈ మధ్య జీవన్‌, మీనాక్షిలు వ్యాపారం ప్రారంభించడం, అది దినదినాభివృద్ధి చెందడంతో ధనానికి ఇబ్బంది లేని స్థితికి చేరుకున్నారు.

ఒకరోజు సుప్రభాత సమయంలో నదీతీరానికి వ్యాహ్యాళికి వెళ్లిన జీవన్‌కి అద్భుతమైన ఆలోచన ఒకటి వచ్చింది. అతనికి దయ్యాలమీద నమ్మకం లేకపోవడంతో ఆ భవనాన్ని తానే ఎందుకు వాసయోగ్యంగా చేసుకోకూడదు – అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే వెంటనే ఆ పనిలో పడ్డాడు.

నలుగురినీ కనుక్కుని, జాగీర్దారుకి నౌకరుగా పనిచేసిన వాని కుమారుడి చిరునామా సంపా దించాడు. తక్షణం అతనిని కలుసుకుని తన ఉద్దేశం చెప్పాడు.

నౌకరు కుమారుడు చాలా సంతోషించాడు. ఆ దయ్యాలకొంపను ఎలాగైనా వదిలించుకోవాలను కుంటున్నట్లు చెప్పాడు. ఆ భవనాన్ని జీవన్‌ చాలా తక్కువ ధరకు కొన్నాడు. అప్పటికప్పుడు రాతకోతలు ముగించి త్వరలోనే రిజిస్టర్‌ చేయించడానికి మాట పుచ్చుకుని, తల్లిదగ్గరకు తిరిగి వచ్చాడు.

ఆ ఇంటి విషయం తల్లికి చెప్పినప్పుడు ఆమె అభ్యంతరం చెప్పింది, ‘నీకేమీ భయభక్తులు లేవా ఏమిటిరా! అది దయ్యాల కొంపని ఊరంతా ఘోష పెడుతూంటే నీకేమీ చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదా! నిమ్మకి నీరెత్తినట్లు నిశ్చింతగా కబుర్లు చెపుతున్నావు! ఆ ఇల్లు మనకు ఎలా అచ్చొస్తుందనుకోమంటావు?’ అంది.

”అమ్మా! ఇలాంటి విషయాల్లో మనిషిని పెడదారి పట్టించేది మనసేనమ్మా! మనసే మన ఆలోచనల్ని ప్రేరేపించి మన కళ్ళకు దయ్యాలను కనిపించేలా కూడా చెయ్యగలదు. ముందుగా మనం మన మనసుకి నచ్చజెప్పుకోగలిగితే చాలు, ఆ తరువాత ఇక ఏ భయాలు ఉండవు’ అన్నాడు జీవన్‌.

అలా అన్నాడన్న మాటేగాని జీవన్‌ మనసులో ఆరాటం మొదలయ్యింది. ‘ఈవేళ అమ్మ లాగే రేపు తక్కిన వాళ్లు కూడా ఆలోచిస్తే !.. అందుకే, ముందుగా నేనే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ సమస్యనుండి బయట పడడం చాలా అవసరం’ అనుకున్నాడు.

అతని మస్తిష్కం వేగంగా పనిచెయ్యడం మొదలుపెట్టింది. ‘ఆ ఇల్లు అందరికీ సమ్మతం అయ్యేలా ఉండాలంటే తను ఏమి చెయ్యాలి – అని ఆలోచించ సాగాడు. అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అతనికి గాలిలోని ప్రాణవాయువును గ్రహించి తనకి తానై మండే భాస్వరం గుర్తొచ్చిరది.

ఎంత తక్కువలో వచ్చినా, కొడుకు ఆ ఇల్లు కొనడర మీనాక్షికి ఎంతమాత్రం నచ్చలేదు. ‘అవి మామూలు దయ్యాలు కావు కదురా, నా బాధ నాదే గాని, నువ్వవేమీ నమ్మవు కదా! నువ్వు కాదూ, కూడదు అంటే ‘సరే’ అనక తప్పదు కదా నాకు. తీరా ఆ ఇంట్లో ప్రవేశిస్తే ఏమేం అవాంతరాలు వస్తాయో ఏమో..? ఆంజనేయ స్వామివారి కోవెలకు వెళ్లి, పూజారిని అడిగి, ఆంజనేయ రక్షాకవచం చేయించి తెస్తా, సింహద్వారానికి పైభాగంలో తాపడం చేయిద్దాము. ఆ తరవాత ఇక ఏ దెయ్యాలూ గడపదాటి ఇంట్లోకి రాలేవు, కనీసం అదైనా ఒప్పుకో’ అంది మీనాక్షి భయంతో వణుకుతూ..

జీవన్‌కి నవ్వొచ్చింది, కాని బలవంతంగా ఆ నవ్వుని ఆపుకున్నాడు, తల్లి బాధపడుతుందని. నెమ్మదిగా అన్నాడు..

‘నువ్వేం కంగారు పడకమ్మా! నేను అన్నీ ఆలోచించే ఉంచాను. అన్నీ నువ్వు కోరుకున్నట్లే చేద్దాం, సరా! నామాట సరిగా అర్థం చేసుకో.. గ్రహాలు ఉన్నాయి కదా! అవి ఈ దయ్యాలకంటే ఎక్కువ శక్తివంతమైనవని ఒప్పుకురటావుకదా. అంత గొప్పవి కూడా శాంతి చేయిస్తే మనలను పీడించ కుండా ఉరటాయి, ఔను కదా! అలాగే దయ్యాలకి కూడా ఏదో ఒక శాంతి ఉండకపోదు. ముందుగా ఆ దయ్యాలను వెళ్లగొట్టిస్తా. ఆ తరవాతే మనం ఆ ఇంటికి వెళదాములే’ అన్నాడు జీవన్‌.

‘శ్రీ ఆంజనేయ రక్షాకవచం కూడా వీధి గుమ్మానికి తగిలిద్దాము, మంచిదౌతుంది’ అంది మీనాక్షి.

‘సరేనమ్మా! మనం ఇన్ని అంగరక్షలు పెట్టిస్తే ఇక ఆ దయ్యాలు మననేం చెయ్యగలవు! ఠారుకుని దౌడోదౌడుగా పారిపోవాల్సిందే’ అంటూ నవ్వేశాడు జీవన్‌.

మీనాక్షి ఉడుక్కురది, ‘పోరా బడుద్ధాయీ! నీకన్నీ హాస్యాలుగానే కనిపిస్తాయి’ అంది జీవన్‌ వీపుమీద చిన్న దెబ్బ కొట్టి. తన తల్లి నిశ్చింతగా ఆ ఇంట్లో ఉండాలంటే, తను నమ్మినా, నమ్మకపోయినా, తగిన ప్రక్షాళన ఆ ఇంటికి చాలా అవసరమనుకున్నాడు జీవన్‌.

———

ఇల్లు తల్లిపేర రిజిస్టర్‌ అవ్వగానే ఆ ఇంటిని బాగు చేయించే పని మొదలుపెట్టాలనుకున్నాడు. కాని ఆ ఇంట్లో పని అనగానే ఎవరూ అక్కడ పని చెయ్యడానికి ఒప్పుకోలేదు. అందుకే పక్క ఊరిలో ఉండే మంత్రగాడిని పిలిచాడు జీవన్‌. ఆ మంత్రగాడు రావడం చూసి కొందరు అతని వెంట వచ్చారు, ఏం జరుగుతుందో చూడాలన్న కుతూహలంతో.

వస్తూనే మంత్రగాడు ఏవేవో మంత్రాలు చదువుతూ, ప్రతి గదిలో మూలమూలలా దండిగా సాంబ్రాణి పొగ వేసి, తన వెంట తెచ్చిన వేపాకు మండతో గోడలపై కొట్టి, పెద్దపెద్ద కేకలుపెట్టాడు.

ఆ తరవాత ఒక గాజుసీసాని తీసి దేవుడిని ప్రార్ధించి, దానిలో సాంబ్రాణి వేసి, దయ్యాలుగా మారిన జాగీర్దారుని, అతని భార్యను గొంతెత్తి పిలుస్తూ, ఆ సీసాలోకి రమ్మని ఆహ్వానించసాగాడు. అక్కడ చూస్తూ నిలబడివున్న వాళ్లకు సీసాలో చిన్న కదలిక కనిపించింది. ఆపై నెమ్మదిగా సీసాలోంచి పొగరావడం మొదలయ్యింది. వెంటనే ఆ మంత్రగాడు ‘దయ్యాలు రెండూ ఈ సీసాలోకి వచ్చేశాయి’ అంటూ సీసాకి మూత గట్టిగా బిగించి, కంగారు పడుతూ ఆ సీసా తీసుకుని, వేగంగా కష్ణానది వైపుగా పరుగుపెట్టాడు. జనంకూడా అతని వెంట పరుగెత్తారు. నది ఒడ్డున నిలబడి ఆ మంత్రగాడు తన భుజశక్తినంతటినీ ఉపయోగించి దూరంగా, ప్రవాహంలోకి వెళ్లి పడేలా ఆ సీసాని విసిరేసి చేతులు దులుపుకున్నాడు. ఆ సీసా నీటిలో తేలుతూ దూరంగా వెళ్లిపోయి కనుమరుగయ్యింది.

మంత్రగాడు తిరిగివచ్చి, ఇంటిలో అన్నివైపులా పసుపు, కుంకుమ చల్లి, ఇక ఈ ఇంటివైపు ఏ దెయ్యమూ కన్నెత్తి చూడలేదని హామీ ఇచ్చి, అక్కడకు వచ్చిన అందరినీ వేప మండతో తడుతూ, మంత్రాలు చదువుతూ, ఆశీర్వదించి, తనకు రావలసిన డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు.

ఆ మరునాటినుండీ పనివాళ్లు యధేచ్చగా వచ్చి ఇల్లు బాగుచెయ్యడం మొదలు పెట్టారు. ఎక్కువమంది పనివాళ్లను పిలిచి పని తొందరగా పూర్తయ్యేలా ఏర్పాటు చేశాడు జీవన్‌. చూస్తూండగా ఆ ఇంటికి పూర్వపు అందం వచ్చినట్లయ్యిరది. పనులన్నీ పూర్తయ్యి, ద్వారబంధాలకు, కిటికీలకు రంగులూ, గోడలకు వెల్ల కూడా వేయించాక పురోహితునిచేత పుణ్యఃవచనం, ఉదకశాంతి కూడా చేయించి గాని మీనాక్షి తృప్తిపడలేదు. జీవన్‌ స్నేహితుడైన కిరణ్‌ తండ్రి రామసోమయాజులు గారు గృహప్రవేశానికి ఒక మంచి ముహూర్తం పెట్టారు.

మామిడాకుల తోరణాలతో, ఆరుతూ వెలుగు తుండే చిన్నచిన్న కరెంట్‌ బల్బులతో, బంతిపూల దండలతో ఇంటిని చక్కగా అలంకరించి గృహప్రవేశ ముహూర్తం వేళకు ఇల్లు సిద్ధం అయ్యేలా చేశాడు జీవన్‌. తల్లిని సంతృప్తిపరచడం కోసం బీజాక్షరాలతో, ఆంజనేయస్వామి బొమ్మతో ఉన్న ‘శ్రీ ఆంజనేయ రక్షాకవచం’ అనబడే రక్షరేకును తెచ్చి, పూజించి సింహద్వారం పైకమ్మీకి స్వయంగా మేకుకొట్టి తగిలించి, తల్లి కోరిక తీర్చాడు. ఇంటి సింహ ద్వారానికి ఎదురుగా ఉన్న గోడకు, గేటుకి పక్కన, ‘శ్రీ జననీ ఫుడ్‌ ప్రోడక్ట్సు’ అని అందంగా పెయింట్‌ చేయబడిన సైన్‌ బోర్డుని తగిలించారు.

అంగరంగ వైభోగంగా గృహప్రవేశపు తంతు జరిపించి, శ్రీజననీ కుటుంబమంతా రామసోమ యాజులుగారు పెట్టిన సుముహూర్తానికి ఆ ఇంటిలో ప్రవేశించారు. మీనాక్షి ఈశాన్యదిశలో దేవుని మందిరం ఉంచి, దైవాన్ని పూజించింది. ఇంటి మధ్యలో కుంపటి పెట్టి పాలు పొంగించి, ఆ పాలతో పరమాన్నం వండి అందరికీ ప్రసాదంగా పెట్టింది. ఆ తరువాత ఆ ఇంటి ఆవరణలో పేదలకు అన్నదానం చేశారు. పిలుపందుకుని వచ్చినవారిని పండు, తాంబూలం, బహుమానం ఇచ్చి సత్కరించి సాగనంపారు. శ్రీజననిలో పనిచేసే పనివారికి విందుభోజనం, కొత్తబట్టలు, మిఠాయి పెట్టారు.

———

ఆ భవనం క్రింది భాగాన్ని ‘శ్రీ జననీ ఫుడ్సు’ వారి వాడకానికి వదలి, పైభాగం తమ ఉపయోగానికి ఉంచుకున్నారు ఆ తల్లీ కొడుకులు. పెద్ద ఇంటిలోకి మారాక పనివాళ్లను మరింత పెంచి కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా రకరకాల మసాలాలు తయారు చేసే పనికూడా పెట్టుకుంది మీనాక్షి. వాటి తయారీని పర్యవేక్షిస్తూ మీనాక్షీ, జమా ఖర్చులు లాంటి వ్యాపార లావాదేవీలతో జీవన్‌ పూర్తిగా బిజీ అయిపోయారు.

అది మీనాక్షి చేసిన ప్రార్ధనల ఫలమో లేక ఆ ఇంటిలో ప్రవేశించిన వేళావిశేషమోగాని చూస్తూండ గానే వ్యాపారం మంచి వృద్ధిలోకి వచ్చింది. రకరకాల ఎలక్ట్రికల్‌ మిషన్లు కొనడంతో పని మరింత సులువయ్యింది. చేతినిండా పని, జేబు నిండా డబ్బు! ఇన్నాళ్లకు తమ జీవితం గాడిలో పడిందని సంతోషించింది మీనాక్షి.

———

పురోగామియైన మనిషికి సంతృప్తి అన్నది ఉండదు! కొన్ని పర్వతాలు ఎక్కి అతడు ‘ఇక చాలు’ అని అక్కడ చతికిలబడిపోడు. శిఖరాగ్రాన్ని చేరుకున్నాకే తిరిగి వెనక్కి చూసేది!

ఆ సాయంకాలం డాబామీద పిట్టగోడ పక్కన, గూళ్లను చేరే పిట్టల కలరవాలు వింటూ, గలగలా ప్రవహిస్తున్న కృష్ణానదినీ, చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతి అందాలనీ చూస్తూ నిలబడిన జీవన్‌కి ఒక గొప్ప ఆలోచన వచ్చింది, ఆ ఊరిలో కొత్తగా తెరిచిన నైట్‌ కాలేజీలో చేరి పై చదువు చదువుకోవాలని! గుబురుగా పెరిగి డాబా మీదంతా వ్యాపించి ఉన్న తంగేడు చెట్టు నీడలో కుర్చీ వేసుకు కూర్చుని, బంగారు రంగులో మెరిసే తంగేడుపూలు పూజగా పుస్తకం మీద రాలుతూ ఉంటే, ఏకాగ్రతతో తన్మయంగా చదువుకోవాలన్న కోరిక పుట్టింది అతనికి.

(ఇంకా ఉంది)

–  వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *