జాగృతం

జాగృతం

‘ఈ వీకెండ్‌ మన ఊరు వెడదాం.. గుర్తుందిగా మరే ప్రోగ్రామ్స్‌ పెట్టుకోకు’ నాన్న ఆఫీసుకు వెడుతూ చెపుతున్న మాటలు ఒకక్షణం అర్ధంకాలేదు.

‘చెప్పింది మరిచిపోయావా? శని, ఆదివారాలు సెలవని ప్రతిసారి సినిమానో లేదా లాంగ్‌ డ్రైవ్‌ అనో ఫ్రెండ్స్‌తో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటావుగా. ఈ వారం అవి ప్రక్కనపెట్టి మాతో రా’ అభ్యర్ధనగా అడిగారు.

‘నాకు మూడ్‌ లేదు నాన్న. కొత్త ప్రాజెక్ట్‌కి మారిన దగ్గరనుండి నానా చికాకుగా ఉంది. ప్రాజెక్ట్‌ హెడ్‌తో పడలేకపోతున్నాను. నన్నే కాదు అందరినీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నాడు’ అని నోటి దాకా వచ్చిన మాటను మింగేసాను. నెల క్రితం తన కన్నతల్లి హఠాత్‌ మరణం నాన్నను బాగా కృంగ దీసింది. ఇప్పుడిప్పుడే ఆ షాక్‌ నుండి తేరు కుంటున్నారు. అలాంటి ఆయనకు నా ఆఫీసు సంగతి చెప్పటం అస్సలు ఇష్టం లేదు.

‘నాకు ఆ ఇంటికి వెళ్లాలంటేనే బెంగొస్తోంది. బాధ తట్టుకోగలనా అని భయమేస్తోంది. నువ్వు కూడా ఉంటే కాస్త ధైర్యం’ తను అలా అడగటానికి కారణం వివరిస్తున్నట్లుగా అన్నారు నాన్న.

బామ్మ లేని ఆ ఊరిలో అడుగు పెట్టాలంటేనే నా మనసుకు కూడా కష్టంగా ఉంది. కానీ నాన్నకు సపోర్ట్‌గా వెళ్లాలి.

వెళ్లక తప్పదు.

‘ధైర్యంగా ఉండండి నాన్న. తప్పక వస్తాను’ ఆఫీసులోని నా టెన్షన్‌ని, ఆ ఊరికి వెళ్లటంలో ఉన్న బెంగని మనసులోనే దాపెట్టి మొట్ట మొదటిసారిగా పెద్దరికాన్ని చూపెట్టాను.

‘అత్తయ్యగారు లేరనే విషయాన్ని ఇంకా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అప్పుడే నెల అయ్యిందా’ అంటూ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది తనకు, బామ్మకు ఉన్న ముప్ఫైయ్యేళ్ల బంధానికి ప్రతీకగా.

‘ఇట్స్‌ ఓకే.. కూల్‌ అమ్మా’ అన్నాను భుజం చుట్టూతా చెయ్యివేసి.

* * * *

ప్రొద్దున్నే కారులో బయలుదేరి ఐదారు గంటలు ప్రయాణం చేసి బామ్మ ఊరు చేరాం. ఎప్పుడు ఇంటికి వెళ్లినా, చిరునవ్వుతో ఎదురు వచ్చే బామ్మ లేకుండా ఆ ఇంటిలోకి ప్రవేశించటం వెలితనిపించింది. బామ్మకు ఆ ఊరంటే గాఢమైన మమకారం. చిన్నతనంలోనే తాతయ్య మరణించినా, తను ఒక్కతే వ్యవసాయాన్ని చూసుకుంటూ ముగ్గురు పిల్లలిని పెంచి పెద్ద చేసింది. తాతయ్య జ్ఞాపకాలు దూరమవ్వటం ఇష్టం లేకేనేమో కొడుకులు పిలిచినా ఆ ఊరు విడిచి రాలేదు. ఆరోగ్యంగా ఉండే బామ్మ కార్డియాక్‌ అరెస్ట్‌తో అనుకోకుండా అసువులు చాలించింది. బదిలీలు అయ్యే ఉద్యోగాలలో ఉన్న పెద నాన్నలు ఇద్దరూ దూరంగా ఇతర రాష్ట్రాలలో ఉన్నారు. నాన్నే బామ్మను ఎక్కువ కనిపెట్టుకుని ఉండేవారు. అందుకే ఈ ఇంటి సర్దుడు కూడా పెదనాన్నలు నాన్నకు అప్పగించారు.

ఇరుగు పొరుగు వచ్చి పలకరించి ఆ పూట భోజనానికి వద్దన్నా వినకుండా కారేజ్‌ ఇచ్చి వెళ్లారు. ఆ ఊరి వారందరికీ బామ్మంటే గౌరవం, అభిమానం.

ఏ వస్తువులు తీసుకువెళ్లాలి, ఏవి పని వాళ్లకు పంచి పెట్టెయ్యాలి అని అమ్మ, నాన్న చర్చలు మొదలెట్టారు. నేను బామ్మ గదిలోకి వెళ్లాను.

బామ్మకు చదివే అలవాటు చాలా ఎక్కువ. అలమారాల నిండా పుస్తకాలు. బామ్మ నాకు భారత, రామాయణాలతో పాటు ఎన్నో కథలు చెప్పింది. బామ్మ కథ చెపుతుంటే కళ్ల ముందు సినిమా చూసినట్లే ఉండేది.

అప్పుడప్పుడు నాకు పద్యాలు కూడా నేర్పేది. నేను చెప్పే పద్యాలు విని ‘యెంత చక్కగా ఉచ్చరిస్తున్నావు’ అని మురిసిపోయేది. అవన్నీ గుర్తుకొచ్చి మనసు బాధతో నిండిపోయింది. మనిషి మరణమే కాదు వారు మిగిల్చిన జ్ఞాపకాలు అంతకన్నా ఎక్కువ బాధిస్తాయని ఆ క్షణమే తెలిసింది.

బామ్మతో నా అనుభవాలు తలచుకుంటూ ఆమె వస్తువులు సర్దుతున్న నా దృష్టి ఓ మూలగా ఉన్న కృష్ణుని బొమ్మ మీద పడింది. బామ్మకు ఆ కృష్ణయ్య అంటే మహా ఇష్టం. కన్నయ్యా అని ప్రేమగా పిలుస్తూ ఆయన మెడలో మాలలు వేసేది. పాటలు పాడేది. తన్మయురాలయ్యేది. ఆ బొమ్మను చేతిలోకి తీసుకున్నాను. నాకు బామ్మను ముట్టుకున్నట్లు అనిపించింది.

ఆ బొమ్మని నాతో తప్పక తీసుకువెళ్లాలని డిసైడ్‌ అయిపోయి దానిని తీసుకెళ్లి నా సూట్‌కేస్‌ దగ్గర పెట్టాను. ఆ బొమ్మ కింద ఉన్న అందంగా ఎంబ్రాయిడరీ చేసిన మొఖమల్‌ బట్టను కూడా తీసుకెడదామని దాన్ని మడత పెట్టటానికి తీశాను. ఇన్నాళ్లు టేబుల్‌ మీద క్లాత్‌ వేసి కృష్ణుడిని పెట్టిందనుకున్న నాకు దానికింద ఉన్నది ఒక ట్రంకు పెట్టె అని అప్పుడే తెలిసింది.

‘ఏముందో చూద్దామని’ ఆ పెట్టెను తెరిచి చూసి ఆశ్చర్య పోయాను. ఎదురుగా డైరీలు. అవి బామ్మవేనా! బామ్మకు డైరీ రాసే అలవాటుందా? అన్నిటికన్నా పాత డైరీ 1960 లోది. చేతిలోకి తీసుకుని పేజీ తిప్పాను. మొదటి పేజీలో ముత్యాల కోవల్లాంటి అక్షరాలతో బామ్మ పేరు అందంగా అచ్చ తెలుగులో రాసి ఉంది. 1960లో డైరీ అంటే ఆమెకు సుమారుగా పదమూడు పద్నాలుగేళ్లు ఉండి ఉంటాయి. ఆ వయసులో ఆమె ఏమి రాసిందనే కుతూహలం నాలో. ఇతరుల డైరీలు చదవకూడదని మనసు హెచ్చరిస్తున్నా, ‘ఆ వయసులో రాసినవి ఇతరులు చదవకూడని స్థాయిలో ఏముంటాయిలే’ అని నా మనసుకు సర్ది చెప్పుకుని దాదాపు అరవై ఏళ్ల క్రితం రాసిన ఆ డైరీ తీసి పేజీలు తిరగేశాను. రావణుడు అని టైటిల్‌ రాసిన పేజీ దగ్గర ఆగి పోయాను. అందమైన అక్షరాల వెంట నా కళ్లు పరుగులు పెట్టాయి.

* * * *

‘తేదీ 3/10/1960,

దేవరపల్లి.

మూడు నెలల క్రితం ‘పెద్దదానివయ్యావు’ అంటూ నాలో వచ్చిన శారీరక మార్పులకు అమ్మ, బామ్మ హడావిడి చేసి పెద్దఎత్తున లంగా, ఓణీ వేడుక జరిపారు. దానికి పిన్ని, బాబాయి, మామయ్యలు, అత్తయ్యలు… బంధువులందరూ వచ్చారు. స్వీట్స్‌, పళ్లు, బట్టలు.. కాలికి పట్టీలు.. చెవులకు బుట్టీలు అలా రకరకాల బహుమతులిచ్చారు. చిన్న మామయ్య కొత్త బట్టలతో పాటు ఓ అందమైన డైరీని కూడా ఇచ్చాడు. ‘నీ జీవితంలో జరుగుతున్న విషయాలు రాయటం ఆరంభించు. ప్రతిరోజూ రాయాలని ఏమీ లేదు. ఏదన్నా నీకు నచ్చిన విషయాలు జరిగినపుడో లేదా ప్రత్యేక సంఘటనలో, పండగ పబ్బాల సందర్భాలలోనో, మనసు స్పందించినపుడో రాయి’ అంటూ చెప్పాడు.

అప్పటి నుండి చదువుతున్న కథలు, నా స్నేహితులతో ఆడుకునే ఆటలు, కొన్ని ప్రత్యేక సంఘటనల గురించి రాయటం ఆరంభించాను. అందమైన సూర్యోదయాల గురించి, కురుస్తున్న వెన్నెల, రంగు రంగుల సీతాకోకచిలుకలు, పచ్చని పైర్లు గురించి రాసుకున్నాను.

కానీ ఈ రోజు ఓ రావణాసురుడి గురించి రాయబోతున్నాను. అవును, రామాయణంలోని రావణాసురుడు లాంటి వాడే..

నాకు వరసకు బావ అయ్యే శీను బావ నుండి ఒకరోజు నాన్నకు ఉత్తరం వచ్చింది. ‘మా ఊరిలోని ప్రాథమిక పాఠశాలలో తనకు ఆంగ్ల అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చిందని, నాన్న అంగీకరిస్తే ఇల్లు దొరికే దాకా మా ఇంట్లో ఉంటానని’ ఆ ఉత్తర సారాంశం. మా ఇంట్లో ఎవరో ఒకరు ఉండటం, చదువుకోవటం అలవాటే. ఎప్పుడూ వచ్చి పోయే బంధువులకు, అమ్మ వండి పెట్టటం మామూలే. విశాలమైన ఆవరణలో ఉన్న మా పెద్ద ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇబ్బంది లేదు. నాన్న శీను బావని రమ్మని, తనకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలియచేస్తూ వెంటనే ఉత్తరం రాసారు.

శీను బావ మా ఇంట్లోనే ఉండి పోయి ఉద్యోగం చేసుకోవటానికి వస్తున్నాడంటే నాకు చాల సంతోషం వేసింది. బావకి ఆంగ్లం చాల బాగా వచ్చు. గతంలో అప్పుడప్పుడు వచ్చినపుడు నాకు పాఠాలు చాల బాగా చెప్పాడు. దాంతో నాకు ఆంగ్లం అంటే కాస్త భయం తగ్గింది. అలాగే ఇప్పుడు కూడా సహాయపడతాడని ఆశ.

రాగానే నన్ను చూసి ‘చాలా పెద్దదానివి అయిపోయావు’ అని ఆశ్చర్యంగా చూసాడు.

‘ఆడపిల్లలు అంతే, గబుక్కున ఎదిగిపోతారు’ అంటూ అమ్మ నవ్వింది.

బావ వచ్చినప్పటి నుండి నాకు ఆంగ్లం, లెక్కలు అంటే భయం తగ్గిపోయింది. నాకు అర్ధం కానివి, రానివి చక్కగా చెపుతున్నాడు. ఓ రోజు ఇంగ్లీష్‌ పాఠం చెప్పించుకోవటానికి అరటి తోటలో ఉన్న బావ దగ్గరకు వెళ్లాను.

‘నువ్వు చిన్న పిల్లవు కావు. అందమైన ఆడపిల్లవు’ అన్నాడు కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ. అది పొగడ్త అనిపించి నవ్వాను.

పాఠం చెపుతూ చెపుతూ ఆపేసి, జారిన నా పమిట కేసి చూసి ‘ఛా, ఇలాగా పమిట వేసుకునేది. నేను చెప్పనా ఎలాగో’ అంటూ పమిటను సర్దాడు. నాకు ఒళ్లంతా చీదర. విసురుగా తన చెయ్యి నెట్టేసి లేచి ఇంట్లోకి వెళ్లాను. అంతటితో అది ముగియ లేదు. ఆ తరువాత కూడా ఒంటరిగా చూసి అతి చనువుగా తాకటం మొదలెట్టాడు.

నాకు దుఃఖం వచ్చింది. అన్నయ్యలకి కాని, నాన్నగారికి గాని జరిగింది చెప్పాలంటే ఏదో తెలియని ఇబ్బందనిపించింది. అమ్మ పక్కన చేరి అసలు విషయం చెప్పాను. నన్ను చేతుల్లో దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకుంది. ‘ఎవరితో చెపుతాము. చెప్పినా మగవాళ్లు అర్ధం చేసుకుంటారో లేదా మీరే చనువిచ్చారని మనల్నే తప్పు పడతారో, నాకు తోచటం లేదు. అందరికీ తెలిస్తే మన పరువే పోవచ్చు. నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండు. బావని తప్పించుకు తిరుగు’ అంది కళ్లల్లో నీళ్లు పెట్టుకుని.

అమ్మ చెప్పింది నాకు సరిగా అర్ధం కాలేదు కానీ నా దుఃఖం మటుకు పెరిగింది. అమ్మ వాడిని ఇంకా బావ అని మన్ననగా సంబోధించటం కోపం తెప్పించింది. వాడు నా బావ కాదు. ఒట్టి వెధవ. వాడిని తలచుకుంటేనే ఒళ్లు మండిపోతోంది. కానీ ఏం చెయ్యగలను? సాధ్యమైనంత వరకు ఆ రావణుని కంట పడకుండా తిరుగుతున్నాను. అయినప్పటికీ అవకాశం వచ్చినపుడో… దొరకపుచ్చుకునో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు.

వాడి చర్యలకు రోజు రోజుకు నాలో దుఃఖం తగ్గి కసి పెరుగుతోంది. వాడికి శిక్ష వెయ్యాలనే కోరిక తీవ్ర రూపం దాలుస్తోంది. కానీ మార్గమే తెలియటం లేదు.

ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నపు భోజనాల కోసం అరటి ఆకులు కోసుకు తెమ్మంది అమ్మ. ఇంటికి కాస్త దూరంగా ఉన్న అరటి చెట్లలోకి దారి తీశాను. మరీ లేత ఆకులు కాకుండా జాగ్రత్తగా చూసి కోస్తున్నాను. ఓ డజను ఆకులు కోసి చివరిగా ఓ ఆకును వంచి కొత్త బ్లేడుతో కోస్తున్న నన్ను వెనకనుండి రెండు చేతులతో గట్టిగా బిగించి పట్టుకున్నాడు బావ. అరవబోయాను. చేత్తో నోరు మూసేసాడు. ఊపిరి ఆడలేదు.

‘అరవకు. అరిస్తే నువ్వే నా మీద పడ్డావని చెపుతాను. నిజం చెప్పటానికి ఇక్కడ ఎవరు లేరు’ అన్నాడు నా నోటి మీద చెయ్యి తీసి నన్ను వదిలి నా ముందుకు వచ్చి నిలబడుతూ.

నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. విదిలించి కొట్టాను. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు.

వాడి చెయ్యి లాగి, గట్టిగా పట్టుకుని చేతిలోని బ్లేడుతో సర్రున గీసాను. రక్తం చిమ్మింది. ఏమయ్యిందో అర్ధమవ్వక బిత్తర బోయి చూసాడు. మరోసారి గీసాను. చెయ్యి విదిలించుకుని చిన్నగా కేక పెట్టాడు. నా మొహంలోని తీవ్రతకనుకుంటా వాడి మొహం నిండా భయం. అడుగు ముందుకు వెయ్యలేదు. ఆ భయం నాకు బలాన్ని ఇచ్చింది.

ఆ బలమే ‘నువ్వు నన్ను చాటుగా పెట్టే హింసని నేను చెప్పుకోలేకపోతున్నాను.. కానీ నిన్ను ఇలా బాహ్యంగానే హింసిస్తాను. దీన్ని ఎవరికి, ఎలా, ఏమని చెప్పుకుంటావో నీ ఇష్టం’ అని నా నోట పలికించింది. కింద పడ్డ ఆకులు తీసుకుని విస విసా నడుచుకుంటూ వెళ్లిపోయాను.

నాలో ఆవేశం తగ్గి ఆలోచన మొదలయ్యింది. నాన్నతో, ఇంట్లో వారితో ఏమి చెపుతాడో అని నాలో ఒకటే ఆందోళన. అంతదాకా వస్తే ఏదైనా కానీ నేనే జరిగిందంతా నాన్నగారికి చెప్పేద్దామని డిసైడ్‌ అయిపోయాను.

ఇంతలో ‘అమ్మా, శీను బాబు తనకు ఒంట్లోబాగో లేదని, తన అమ్మానాన్నలను చూడాలని పిస్తోందని.. అందుకని అప్పటికప్పుడు ఊరు వెడుతున్నాని సెంటర్లో కనపడ్డ నాకు చెప్పి మీకు చెప్పమన్నారండి. పాపం, బాబుకు మరీ బాగుండనట్లుగా ఉంది. స్వెట్టర్‌ కూడా వేసుకుని ఉన్నారండి’ అంటూ మా పెద్ద పాలేరు అమ్మకు చెప్పివెళ్లిపోయాడు. బావకి ఒంట్లో బాగోలేక, బెంగవచ్చి వెళ్లి ఉంటాడని అమ్మ నమ్మింది.

ఈ చిన్న ఊరిలో ఏ విషయం జరిగినా అందరికీ తెలుస్తుంది. తనకు చేతి మీద అయిన గాయం గురించి అడిగితే ఏమి చెపుతాడు? ఒకవేళ నా పేరు చెపితే, ఎందుకు అంతలా గాయ పరిచానో కూడా చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈ మధ్యాహ్నం సమయంలో స్వెట్టర్‌ వేసుకుని, గాయమైన చెయ్యి కప్పుకుని ఊరు పారిపోయాడని ఆలోచించగా నా చిన్ని బుర్రకు విషయం అర్ధమయ్యింది. జరిగినది అమ్మకు చెప్పాలనిపించింది. కానీ తను కంగారు పడుతుందేమో అని నా ప్రియమైన డైరీకే ఇలా చెప్పుకుంటున్నాను.

పది రోజుల తరువాత వాడు తిరిగివచ్చాడు. నేను నా జామెట్రీ బాక్స్‌లో దాచుకున్న బ్లేడును రెండు మూడు సార్లు వాడి ముందే తీసి తుడిచి లోపల పెట్టుకున్నాను. నా చేతి వంక భయంగా చూడటం మొదలెట్టాడు. ఆ తరువాత ఏడాది కల్లా బదిలీ చేయించుకుని వాళ్ల ఊరు వెళ్లిపోయాడు.’

చదవటం ముగించి కాసేపు మరో ప్రపంచంలో ఉన్నట్లు ఉండి పోయాను.

‘బామ్మా, యు ఆర్‌ గ్రేట్‌ ‘ అంటూ ఆ డైరీని ముద్దు పెట్టుకుని సెల్యూట్‌ చేసాను.

* * * *

బామ్మ జ్ఞాపకాలను, కొన్ని వస్తువులను మూట కట్టుకుని తిరిగొచ్చాం. ఆఫీసుకి వెళ్లటానికి రెడీ అయ్యాను. కానీ మనసులో తెలియని గుబులు. కొత్త ప్రాజెక్ట్‌లోకి మారి నాలుగు నెలలు కూడా అవ్వకముందే బాస్‌తో అవస్థలు మొదలయ్యాయి. జీవితంలో ఎప్పుడూ తెలియని సెక్సువల్‌ హెరాస్మెంట్‌… చేదు అనుభవం ఆరంభమయ్యింది. భయంతో ముడుచుకుపోయి ఆలోచన స్తంభించిపోయింది.

ఆనాడు బామ్మ కాలంలో బయట ప్రపంచం తెలియని అమాయకులైన ఆడపిల్లలు అరాచకానికి గురయ్యారు అనుకుంటే ఈ రోజుల్లో కూడా ముక్కుపచ్చలారని పిల్లలే కాక చదువుకుని ఆకాశమే హద్దుగా ఎదిగిన స్త్రీలూ రావణాసురులు, కీచకుల బారీన పడక తప్పటం లేదు. అర్ధరాత్రి నడిచి వెళ్లటం కాదు ఆధునికమైన వాతావరణంలో కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

బామ్మ డైరీలో చదివిన ఆవిడ అనుభవం కళ్ల ముందు కదలాడింది. ఇంట్లో బంధువే చేసిన అరాచకపు దాడిపై అంతచిన్న వయసులో బామ్మ ఎదురు దాడి చెయ్యటం అద్భుతంగా అనిపించింది. బామ్మ చూపిన ధైర్యం నాలో పిరికితనాన్ని పారద్రోలి ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేసింది.

‘ఎవరో ఏదో అనుకుంటారనో, అంటారనో లేదా ఉద్యోగం పోతుందనో ఆలోచన ప్రక్కన పెట్టి ఆత్మగౌరవం కోసం పోరాడాలి. బాస్‌ దుష్ప్రవర్తన మీద దాడి మొదలు పెట్టాలి. ముందస్తుగా ఇంటర్నల్‌ కమిటీకి కంప్లైంట్‌ చెయ్యాలి’ అని స్థిర నిర్ణయం తీసుకున్నాను.

‘ఝాన్సీ లక్ష్మి’ అని బామ్మ పేరే కాదు ఆమె ధైర్యమూ నా తోనే.. నా లోనే ఉన్న భావన మనసంతా ఆక్రమించింది.

– సి.యమున

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *