గూగుల్లో దొరకనిది

గూగుల్లో దొరకనిది

”పిల్లల్ని నీతో తీసుకెళ్లు?” సఫారీ సూట్‌లోని తన నిండు సుందర విగ్రహాన్ని నిలువుటద్దంలో చూసుకుంటూ చెప్పాడు భార్గవ.

”నాకెక్కడ వీలౌతుంది? మా బ్యాచ్‌లోని ఇరవై మంది ఫ్రెండ్స్‌కీ నేనే మెంటర్‌ కమ్‌ గైడ్‌ కమ్‌ ఫిలాసఫర్‌ని. పానకంలో పుడకల్లా నా దారికడ్డుపడుతారు పిల్లలు. కావాలంటే మీరే తీసుకెళ్లండి” తన కంచి పట్టు చీరకు మ్యాచయ్యే జువెలరీ కోసం వెతుకుతూ ఉన్న సునంద భర్తతో అంది.

తల్లిదండ్రులిద్దరూ తమ గురించి ఎందుకిలా కీచులాడుకుంటూన్నారో తెలియని పన్నెండేళ్ల గ్రీష్మ, పదేళ్ల మనోజ్‌ బిక్కుబిక్కుమంటూ డ్రైవరు మాణిక్యం వంక చూశారు. తెల్లటి యూనిఫామ్‌లోని మాణిక్యం ఏం చేయాలో తోచక తమ డిపార్ట్‌మెంట్‌ అధికారి భార్గవ వంక చూశాడు.

”నీకేమైనా తెలివుండే మాట్లాడుతున్నావా? నేను విజయవాడకు వెళ్లేది శాఖాపరమైన కాన్ఫరెన్సుకు హాజరవడానికి. ఒక రోజంతా నాకు మీటింగుతోనే సరిపోతుంది. మరుసటి రోజు మా ఆఫీసుకు సంబంధించిన ఎస్టిమేట్లకు అప్రూవల్‌ తీసుకోవడానికి రెండు, మూడు ఆఫీసుల చుట్టూ తిరగాలి! ఈ పిల్లలను నేనెక్కడ గమనించుకొనేది?” భార్యపైన చిందులు తొక్కాడు భార్గవ.

ఎక్సైజ్‌ శాఖలో భార్గవ సీనియర్‌ అధికారిగా ఉద్యోగం చేస్తూ ఉంటే సునంద పట్టణ లేడీస్‌ క్లబ్‌ సెక్రటరీగా ఉంది. పిల్లలు చదివే స్కూలుకు పది రోజులపాటు సంక్రాంతికి సెలవులు ఇచ్చారు. ఆ సమయంలోనే భార్గవకు శాఖాపరమైన మీటింగు నిమిత్తం విజయవాడకు వెళ్లే అవసరం వచ్చింది. ఆ రోజుల్లోనే లేడీస్‌క్లబ్‌ వారు బెంగళూరులో జరిగే కాన్ఫరెన్సుకు వెళ్లాల్సి వచ్చింది. దానితో ”సెలవుల్లో పిల్లలను ఎక్కడ ఉంచాలి? వారిని చూసుకొనే వారెవరు?” అన్న సమస్య ఎదురైంది వారికి.

మామూలు రోజుల్లోనే భార్గవకు ఆఫీసు పని ఒత్తిడి మీద రోజూ ఇంటికి రావడం ఆలస్యమైతే, సునందకు తన క్లబ్‌ పని మీద తరచూ బయటకు వెళ్లాల్సి వచ్చేది. పిల్లలు స్కూలు నుండి వచ్చి హోమ్‌వర్క్‌ చేసుకొని డైనింగ్‌ టేబుల్‌పై వంట మనిషి ఉంచిన వంటకాలను తామే వడ్డించుకొని తిని, కాసేపు టీవీ చూసుకొని పడుకోవడం అలవాటయ్యింది. పిల్లలతో కాసేపు కూర్చుని కబుర్లు చెప్పడం ఆ దంపతులిద్దరికీ గగనమే.

”పోనీ, ఒక పని చేద్దాం. మా అమ్మా నాన్నలిద్దరూ పిల్లల్ని తమ దగ్గరికి కొన్ని రోజులు పంపాలని చాలా రోజులుగా అడుగుతున్నారు. వాళ్ల దగ్గరకు మాణిక్యంతో పాటు పంపిద్దాం. మాణిక్యం ఎలాగూ చాలా కాలం నుండి రెండు రోజులు వాళ్ల స్వంత ఊరికి వెళ్లి రావాలని లీవు అడుగుతున్నాడు. పిల్లల్ని మా పల్లెలో దింపేసి, అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న వాళ్ల పల్లెకు వెళ్లి రెండు, మూడు రోజుల తరువాత తిరిగి వచ్చేటప్పుడు తనతోనే తీసుకొస్తాడు” అన్నాడు భార్గవ.

”మీ పల్లెకా, అసలే అది మారుమూల ఎడారి ప్రాంతం. అక్కడ ఒక సినిమా ఉండదు, షాపింగ్‌ ఉండదు.. షికారూ ఉండదు. పిల్లలకక్కడ ఏం పొద్దుపోతుంది? పైగా మీ అమ్మ చాదస్తపు కబుర్లతో వాళ్లకు పిచ్చి పడ్తుంది” కోపంగా భర్తపై చిందులు తొక్కింది సునంద.

”సరే, అయితే నీతోనే తీసుకెళ్లి చూసుకో” వెటకారంగా అన్నాడు భార్గవ.

”వద్దొద్దు.. మీ వాళ్ల దగ్గరికే పంపు” కంగారుగా అన్నది సునంద.

భార్గవది రాయచోటి దగ్గర తొగటపల్లె అనే ఊరు. అతడి కారు డ్రైవరు మాణిక్యంది కూడా ఆ ప్రాంతమే. కాబట్టి పిల్లలను తీసుకొని ఆనందంగా బయలుదేరాడు.

ళి ళి ళి

రెండేళ్ల తరువాత ఇంటికి వచ్చిన మనవడు, మనవరాలిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు భార్గవ తండ్రి సుందరయ్య, అతని తల్లి శారదమ్మ.

పిల్లలిద్దరూ ఆ పెద్ద మండువా లోగిలిలో ఆనందంగా కలియదిరిగారు. శారదమ్మ వేడి వేడిగా చేసిన ఉగ్గాని (బొరుగుల ఉప్మా) తిన్న తరువాత మాణిక్యం సుందరయ్యగారికి నమస్కరించి సమీపంలోనే ఉన్న తమ గ్రామానికి వెళ్లిపోయాడు.

పిల్లలు ఇంటినీ, పెరట్లోని దానిమ్మ, సపోటా, జామ చెట్లనూ, పూల మొక్కలను అబ్బురంగా చూసి, పశువుల పాకలో నల్లమచ్చల ఆవు దగ్గర ఆత్రంగా పాలు తాగుతూ ఉన్న లేగదూడను ఆనందంగా చూశారు. గ్రీష్మ దూడ పాలు తాగుతున్న దృశ్యాన్ని తన ఫోన్‌లో వీడియో తీసింది. మనోజ్‌ జామ

చెట్టెక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే తాతయ్య కేకలు వేసి, పిల్లలిద్దరినీ తన దగ్గరకు పిలిచాడు. కాసేపు వారి చదువు గురించి ప్రశ్నలు వేశారు సుందరయ్య గారు.

”మనోజ్‌, నువ్వు ఫిఫ్త్‌ క్లాస్‌ కాన్వెంటులో చదువుతున్నావు గదా, నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను” అని సుందరయ్యగారు కొన్ని దేశాల రాజధానుల గురించీ, కరెన్సీల గురించీ, క్రీడలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలన్నింటికీ టకటకా జవాబులు చెప్పేశాడు మనోజ్‌.

”సంతోషం మనోజ్‌. నువ్వింత తెలివైన వాడివని అనుకోలేదురా నేను” ఆనందంగా అన్నారు సుందరయ్య.

”తాతయ్యా, వాడు తొండి ఆట ఆడుతున్నాడు. మీ క్వశ్చన్సన్నింటికీ వాడు ఆన్సర్స్‌ను గూగుల్‌లో సెర్చి చేసి చెప్పాడు” నవ్వుతూ చెప్పింది గ్రీష్మ.

”గూగుల్‌ సెర్చి అంటే ఏంటమ్మా” తికమక పడుతూ అడిగాడు సుందరయ్య. గ్రీష్మ కాసేపు ఆ విధానం గురించి తాతయ్యకు వివరించింది.

”నువ్వు చిచ్చర పిడుగువిరా” అని మనోజ్‌ను సుతారంగా కోప్పడ్డాడు సుందరయ్య.

తరువాత పిల్లలిద్దరూ పాలేరు కోటయ్యతో వెళ్లి తమ మామిడితోట, వరి మడి చూసొచ్చారు. పొలం గట్లపై నడవలేక బురదలోకి జారి బట్టలకంతా మురికి అంటించుకొని వచ్చారు. శారదమ్మ వారిని సున్నితంగా కోప్పడి, స్నానం చేయమని, వేసుకోవ డానికి వారి బ్యాగ్‌ నుండి కొత్త బట్టలు తీసి ఇచ్చింది.

పిల్లలిద్దరూ తిరిగి తిరిగి అలసిపోయి, మంచి ఆకలి మీద ఉన్నారు. శారదమ్మగారు చేసిన మునగాకు పొడికూర, బండపచ్చడి, కసూరి మేతి, జీలకర్రతో చేసిన మినప్పప్పు, గడ్డ గేదె పెరుగుతో ఆవురావురుమని భోంచేశారు.

”నానమ్మా, నువ్వు వండిన వంటకాల గురించి గూగుల్‌లో వెతికాను. కానీ అవి నాకు ఎక్కడా దొరకలేదు” ఆశ్చర్యంగా చెప్పింది గ్రీష్మ.

శారదమ్మ ముసిముసిగా నవ్వింది.

భోజనం తరువాత ఇద్దరూ గంటసేపు పడుకొని, సెలవులకు ఆ పల్లెకొచ్చిన పక్కింటి పిల్లలతో కాసేపు చింతపిక్కలు, వామన గుంటలు వంటి ఆటలు ఆడారు. క్యారమ్స్‌, చెస్‌ వంటి ఇండోర్‌ గేమ్స్‌ తప్ప ఇటువంటి గ్రామీణ క్రీడలు ఎన్నడూ ఆడని వారు.. చాలా తన్మయత్వంతో ఆ ఆటలు ఆడడం గమనించారు సందరయ్యగారు.

కొద్దిసేపటికి శారదమ్మ వారికి కోటయ్య మామిడితోట నుండి తెచ్చిన మామిడికాయలు కోసి ఇచ్చింది. ఉప్పు, కారంతో బాటు ఆ మామిడి ముక్కలను పిల్లలిద్దరూ ఇష్టంగా తిన్నారు.

సుందరయ్యగారు నిద్రలేచాక, కాసేపు పిల్లలు చెప్పిన వాళ్ల స్కూలు విషయాలు విన్నారు. తరువాత పిల్లలకు కొన్ని శతక పద్యాలనూ, పోతన భాగవతం లోని పద్యాలనూ వినిపించారు. సుందరయ్యగారు ఆ పద్యాలకు అర్థం విడమర్చి చెప్తూ ఉంటే పిల్లలు ఆసక్తిగా విన్నారు. మనోజ్‌ ఆ పద్యాల కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు కానీ అవి కనబడలేదు.

సాయంత్రం స్నానం చేశాక సుందరయ్యగారు తెల్లటి గ్లాస్కో పంచ, ఖద్దరు చొక్కా వేసుకొని పిల్లలిద్దరినీ తమ ఊరిలోని కోదండ రామస్వామి దేవాలయానికి తీసుకెళ్లారు. శారదమ్మ గ్రీష్మకు పట్టు పావడా, రవిక తొడిగి చక్కగా రెండు జడలు వేసింది. పిల్లలిద్దరూ తాతయ్య వెంట ఆ పల్లె వీధులను ఆసక్తిగా చూస్తూ నడిచారు.

ఆలయంలో స్వామివారిని దర్శించి, పూజారి శేషశర్మ ఇచ్చిన హారతి తీసుకున్నారు. సుందరయ్య గారు పిల్లలు, వారి తల్లిదండ్రుల పేరిట ప్రత్యేకంగా అర్చన చేయించారు. ప్రదక్షిణలు చేశాక ధ్వజస్తంభం దగ్గర కూర్చున్నారు. సుందరయ్యగారు గుడిలో ధ్వజస్తంభం ఎందుకు కడ్తారో వివరిస్తూ ఉంటే పిల్లలు ఆసక్తిగా విన్నారు. తరువాత ప్రసాదం తిని, కొళాయి దగ్గర చేతులు కడుక్కొని ఆలయ మండపం వద్దకు నడిచారు.

అప్పటికే ఆలయ మండపంలో ఎత్తుగా కట్టిన వేదిక పైన సంగీత కచేరి మొదలయ్యింది. టీటీడీ వారి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు నుండి వచ్చిన అరవింద్‌ కచేరీ చేస్తూ ఉన్నారు. అన్నమాచార్య కీర్తనలు, రామదాసు భక్తి గీతాలతో ఆ కచేరీ ఆసక్తిగా సాగింది. తరువాత స్థానిక కళాకారుడొకరు ‘కోదండ రామస్వామిని’ స్తుతిస్తూ ఒక జానపద గీతం పాడారు. ఆ జానపద గీతం గురించి గూగుల్‌ సెర్చిలో వెతికిన మనోజ్‌కు నిరాశే ఎదురయ్యింది.

స్వామివారి తిరణాలు కావడంతో గుడి ముందర ఉన్న వీధి అంతా చిల్లర దుకాణాలు వెలిశాయి. పిల్లల ఆట వస్తువులు, బొమ్మలు, బట్టలు, తినుబండారాలు, దేవుడి పటాలు, పూజ సామగ్రి వంటివి అమ్మే దుకాణాలతో పాటు చెరుకు గడలు, కొబ్బరికాయలు, రకరకాల పళ్లు తోపుడు బండ్లలో పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. అవికాక రంగుల రాట్నాలు, ఊయలలు, టాయ్‌ట్రైన్‌, మినీజెయింట్‌ వీల్‌ వంటివి కూడా పిల్లలను విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. పిల్లలిద్దరూ మిగిలిన పల్లెటూరి పిల్లలతో కలసి ఆనందంగా రంగులరాట్నం తిరిగి వచ్చారు. ఊయల, జారుడుబండల వంటి ఆటలు నవ్వులూ, కేరింతల మధ్య ఆడారు. ఇంటికి బయల్దేరుదామన్న సుందరయ్యగారి హెచ్చరికలు వారు పట్టించుకోనే లేదు. చివరకు రకరకాల ఆట వస్తువులు కొంటానన్న మిషతో మనోజ్‌నూ, క్లిప్పులూ, పాపిటబిళ్లలు వంటివి కొనిస్తానని గ్రీష్మనూ ఇంటికి తీసుకొచ్చారు సుందరయ్యగారు.

ఆటలతో బాగా అలిసిపోయిన పిల్లలు నానమ్మ పెట్టిన పెరుగన్నం కందిపొడితో నంజుకొని తిని, డాబా మీద పరచిన పక్కల్లో తాతయ్య పక్కన పడుకొని ఆకాశాన్ని, తారలనూ చూస్తూ, తాత చెప్తున్న చందమామ కథలు వింటూ తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారు.

అలసిపోయి గాఢంగా నిద్రపోయిన పిల్లలిద్దరూ మరుసటి రోజు ఆలస్యంగా నిద్రలేచారు. వారు స్నానం చేసి రెడీ అయ్యేసరికి, సొంత ఊరికి వెళ్లిన మాణిక్యం కూడా తన తల్లినీ, చెల్లినీ చూసి తిరిగొచ్చే శాడు. శారదమ్మ పీటలు వాల్చి పిల్లలిద్దరితోపాటు మాణిక్యానికి కూడా తపిలట్లు పెనంపై కాల్చి ఇచ్చింది. శనక్కాయపొడి, నెయ్యితో కలిపి ఆ అట్లను పిల్లలు ఆవురావురని తిన్నారు. ఆ తరువాత శారదమ్మ పిల్లలిద్దరికీ వేడి పాలు, మాణిక్యానికి కాఫీ ఇచ్చింది కంచుగ్లాసులలో.

పిల్లలిద్దరూ గుండాలకోనలో సిద్ధేశ్వరాలయం గురించి గుడిలో విని ఉండడంతో అక్కడకు వెళ్లాలని తొందరపడ్డారు. కోటయ్యతో పాటు మాణిక్యమూ పిల్లలకు తోడుగా ఆ ఆలయానికి బయల్దేరారు.

ఆ రోజు ఏకాదశి పర్వదినం కాబట్టి పల్లెవాసులు చాలా మంది సిద్ధేశ్వరాలయానికి నల్లబట్టలు కట్టుకొని ‘హరోంహర’ అని అంటూ చిట్టడవి మార్గంలో కాలినడకనలో వెళ్తున్నారు. వాళ్లను అబ్బురంగా చూస్తూ మనోజ్‌, గ్రీష్మలు కోటయ్యను దారిలోని చెట్ల పేర్లను అడుగుతూ నడవసాగారు. అక్కడక్కడా ఆగి, పారే సెలయేర్లనూ, కొండల నుండి జాలువారే జలపాతాలను చూసి ముచ్చటపడుతూ నడక సాగించారు. సిద్ధేశ్వరాలయంలో దర్శనం చేసుకున్న తరువాత, ఆలయం పక్కనే ఉన్న బదరికా వనంలో ఒక వేప చెట్టు కింద సిమెంటు బెంచీపై కూర్చుని సేదదీరారు. తరువాత కొళాయి నీళ్లతో కాళ్లు, చేతులు కడుక్కొని అందరూ శారదమ్మగారు కట్టించి ఇచ్చిన పులి¬ర, పెరుగన్నం ప్యాకెట్లను విప్పి తిన్నారు. ఎక్కువ పొట్లాలు కట్టివ్వడంతో మిగిలిన వాటిని యాచకులకు ఇచ్చేశారు. ఒక అర్ధగంట సేదతీరి తిరుగు ప్రయాణం ప్రారంభించి సాయంత్రం నాలుగవుతుండగా ఇల్లు చేరుకున్నారు.

అయిదు గంటలకు మాణిక్యం కారు ఇంటి ముందుకు తెచ్చాడు. తాతయ్య, నానమ్మల ఆశీర్వాదంతోపాటు వారిచ్చిన కొత్తబట్టలూ తీసుకున్నారు పిల్లలు.

”గూగుల్లో లేని వింతలెన్నో మన పల్లెలో చూశాము తాతయ్య” అన్నాడు మనోజ్‌ నవ్వుతూ.

”ప్రపంచాన్ని మన కళ్లతో చూడాలిగానీ, గూగుల్‌ కళ్లతో గుడ్లగూబలాగా చూడడం కాదురా, ప్రపంచ జ్ఞానం నాలుగు చోట్ల తిరిగి సంపాదించాలి గాని, గూగుల్‌ ద్వారానో, గుగ్గిలం ద్వారానో సంపాదించా లనుకోకూడదు” అన్నాడు సుందరయ్య.

”పిల్లలూ, ప్రతి ఆరునెలలకొకసారి ఇక్కడికొచ్చి, నాలుగు రోజులుండి వెళ్లండి” అన్నది శారదమ్మ నవ్వుతూ.

”తాతయ్యగారు చాలా విలువైన మాటలు చెప్పారు. ఎంతైనా పెద్దవాళ్లు కదా” నవ్వుతూ చెప్పి, కారు స్టార్ట్‌ చేశాడు మాణిక్యం.

– రాచపూడి రమేష్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *