గోదావరి సుడులు

గోదావరి సుడులు

వరదలు కట్టి ప్రవహిస్తున్న గోదావరిలో సుడి గుండాలు తిరుగుతూన్నట్లు రామమూర్తి హృదయం లోనూ ఆవేదనలు సుడులు చుట్టుతున్నాయి. 15 ఆగస్టు 1947న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దేశపు అవతార పురుషుడు. తేజ స్వరూపుడు, ప్రేమమూర్తి విశ్వంలో లీనమై పోయినాడు. 15 ఆగస్టు 1948లో స్వతంత్రోత్సవం కూడా జరిగిపోయింది. కాని ఈ దుర్భరావేదన మాత్రం తప్పటం లేదు, తాను రాజమహేంద్రవరం నుంచి అయిదేండ్లు క్రిందట హైదరాబాద్‌ రాష్ట్రంపోయి నిజాం ప్రభుత్వం వారి పబ్లిక్‌ వర్క్సు శాఖలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం ఖాయమైంది. ప్రభుత్వం వారు జీతం కూడా హెచ్చించారు. తాను శక్తి వంచన లేకుండా ప్రభుత్వానికీ, ప్రజలకూ సేవ చేస్తున్నాడు.

ఆ జిల్లాల్లో తిరిగేటప్పుడు రామమూర్తి ఆనందం వర్ణింప అలవి కాకుండా ఉండేది. ఇంకా మొగలు కాలం నాటి ఆచారాలే సంస్థానంలో ఉండడం చేత అతడు ఉన్న ప్రదేశంలో అతడే మహారాజులా గుండేవాడు. తనకు గవర్నరంత హోదా, ప్రజల బ్రతుకు, పంటల బ్రతుకు తనచేతిలో ఉండెను. దేశముఖులు, వతందార్లు మక్తాదార్లు, కౌలుదార్లు, పెద్దరైతులు, షావుకార్లు, పఠేలు – పట్వారీలు, పోలీసు ముంతజింలు – అందరూ తనకు ‘ఆదాబర్జ్‌’ చేస్తూ, తన్ను గౌరవిస్తూ అందలం ఎక్కించేవారు. పుష్కలంగా సప్లయిలు, జేబుల నిండా బహుమతులు, తన జీవితం హాయిగా జరిగి పోయింది.

రామమూర్తి ఓవర్సీర్‌ పరీక్ష ప్యాసయినా కొంచెం రసజ్ఞుడు, హైదరాబాదు సంస్థానంలోని కొండలు, నదులు, సెలయేర్లు, చెరువులు అతని కెంతో ఆనందం కలుగజేసేవి; జీవితాలు ప్రవహించి పోవడం నదుల నడకలలో, జీవిత సత్యస్థిరత్వం కొండల స్థాణుత్వంలో, బ్రతుకులోని ఆనందనృత్యం సెలయేటి జలజలలో, మనుష్యుడు కల్పించుకున్న సౌఖ్యాలు తెలంగాణపు చెరువులలో అతనికి గోచరించేవి.

సాధారణ ప్రజలు గర్భదారిద్య్రంలో ఉండి దేశముఖులకు బానిసలులా మెలుగుతూ ఉన్నా- వారా కష్టాలలో నుండి జీవితం శుచిగా ఉంచు కుంటూ బురద నుండి పైకి ప్రసరించి వికసించే నీలికలువ పూవును చేసికుంటూ, పాటలు పాడుకుంటూ, తమకు తెలియని ఏదో ఒక స్వర్ణ యుగం కోసం ఎదురు చూస్తూ ఉదయాస్తమానాలు ఒక దివ్యరాగంతో కలుపుకుంటూపోతున్నారు. ఆ తెలంగాణా, మరాఠ్వాడా, కర్ణాటక ప్రజలు స్వాతంత్య్రం అంటే ఎరుగరు. ‘దొరా! నీ పాదాలకి మొక్కుతా’ అంటారు. అన్నా, ఆ మాటలు వెనక తాము ఆహుతిచ్చే ఆత్మార్పణ అతనికి దృశ్యమయ్యేది. అతడు నిట్టూర్పు విడుస్తూనే గుఱ్రం స్వారీ చేసుకుంటూ అవతలి మకాంకు వెళ్లిపోయేవాడు.

ఈ ఆలోచనలు రాజమహేంద్రవరపు గోదావరి గట్టుమీద కూర్చున్న రామమూర్తి హృదయంలో నుంచి ప్రవహించి గోదావరి వరదల సుడులలో లీనమై పోతున్నవి.

2

రామమూర్తి ప్రభుత్వోద్యోగి అని తెలిసి ఉండి కూడా రాక్షసుల లాంటి రజాకార్లు అతని ఇంటిమీద పడి దోచుకున్నారు. అందాల ప్రోగైన అతని భార్యను వాళ్లు పట్టుకోబోయే సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో ఒక కమ్యూనిస్టుల గుంపు ఆ రజాకార్లపై విరుచుకుపడింది. రజాకార్లు రామమూర్తి ఇల్లు దోచడం మాని కమ్యూనిస్టులను ఎదుర్కోడానికి పరిగెత్తారు. వృశ్చిక రోముడుకూ – సర్వరోముడుకూ యుద్ధం జరిగినట్లు జరిగింది. రామమూర్తి ఆ గడబిడ సమయంలో, కొందరి గ్రామ ప్రజల సహాయంతో, ఊరుదాటి అడవి రుప్పలంబట బడి గ్రామాల అంచలు చాటుకుంటూ, గోదావరి యెడ్డుకు వచ్చి ఓ కోయ జుట్టు సహాయంతో భద్రాచలం చేరుకున్నాడు.

దారిలో అతడూ – అతని భార్య పడిన పాట్లు రామాయణంలోని అరణ్యకాండ అంత గాధ అయింది. ఎలాగో నానా కడగండ్లుపడి రాజమండ్రి చేరుకున్నాడు. ఇంటిదగ్గర పెద్ద సంసారం. తాను హైద్రాబాదులో ఓవర్సీరై బాగా సంపాదిస్తూ ఇంటి దగ్గర తమ్ముళ్లకు చదువు చెప్పిస్తూ, తల్లిదండ్రులను పోషిస్తూ, తన అక్క చెల్లెండ్రను పురుడూ – పుణ్యాలకు ఆదరిస్తూ డబ్బు పంపించేవాడు. ఇంతటితో ఆటవిడుపు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా, హైద్రాబాదుకు స్వాతంత్య్రం లేదు; తనకు దిక్కులేదు. తాను తిరిగి హైద్రాబాదు వెళ్లడానికి వీలులేదు. తనకు స్వతంత్ర భారతంలో ఉద్యోగం లేదు. తాను ఓవర్సీర్‌ ఉద్యోగం చేస్తూ సంపాదించిన పెళ్లాం మెళ్లో నగలూ, వెండి సామానూ ఖర్చయిపోయింది. భారత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు; మద్రాసు ప్రభుత్వానికి గూడ దరఖాస్తు పెట్టుకున్నాడు. తన దరఖాస్తులు శుష్కంగా తిరిగి వచ్చాయి. గోదావరి సుళ్లు చుట్టుకుంటూ ప్రవహించిపోతోంది.

3

గోదావరి చల్లని తల్లి. తాను చిన్నతనంలో, రాజమహేంద్రవరంలో చదువుకొనే రోజుల్లో వేసవి కాలపు గోదావరిని ఆవలికీ ఈవలికీ ఈదుతూ దాటేవాడు. కరుణామయి అయిన ఆమె హృదయం పైన తేలిపోయేవాడు. ఆమె నీలనేర గంభీరాలలో మునిగితెలుతూ ఉండేవాడు. ఈ గోదావరి తల్లి నీటిని ఉపయోగించుకునేందుకు తనకు భూమన్నా లేదు. తాను పరీక్ష ప్యాసయిన కొత్తదినాలల్లో మద్రాసు రాష్ట్రంలో ఉద్యోగమే దొరక్కపోయింది. తాను బ్రాహ్మణుడై పుట్టడం దౌర్భగ్యమైంది. తెలంగాణాలో కులం తేడాలు లేవు. గోదావరి తల్లికి కులం తేడాలు లేవు. హీనుడైన మనుష్యునికే కులం తేడాలు; మతం తేడాలును.

అవమానదగ్ధులైన వారిని, అహంకారులను ఆనందమయులను, విచార మేఘావృత జీవులను, కోటీశ్వరులను, నిరుపేదలను, భూఖామందులను, నిరుపేద పొలం కూలీని సరిసమాన ప్రేమతో ఈ కన్నతల్లి తన గర్భాన దాచుకొని ఊరడించగలదు.

అతడు ఎత్తయిన ఆ గట్టుపైన నిలబడి నెమ్మదిగా నీటి దగ్గరకు పోయాడు. చొక్కా, కండువా తీసి పైనబెట్టాడు. వరదకు కొట్టుకువచ్చే పుల్లలను పోగుజేసుకొనే ముసలమ్మనూ, పిల్లలను వత్తిగించు కుంటూ నీటిలో దిగాడు. మహాత్ముని తలచుకుంటూ ఒక్క ఉరుకు ఉరికాడు. ఆ వేగంతో చాలాదూరం నీళ్లల్లోకి పోయిన అతని మూర్తిని గోదావరి తల్లి తన చేతులతో కప్పింది కాని ఈత ఎరిగిన యువకడవడం చేత ఆమె కూడా తనలో లీనం చేసుకోలేకపోయింది. ఆ మునుగులో గర్భవతియైన అతని భార్యా, ముదుసలులైన తల్లిదండ్రులూ అతని హృదంతరాల ప్రత్యక్షమయినారు. బాపూజీ! క్షమించమంటూ ఈదుకుంటూ వడ్డుకువచ్చి, మెట్లెక్కి తన కండువా తీసుకొని తలతుడుచుకుంటున్నాడు. ఇంతల్లో గబగబా పరుగెత్తుకుంటూ తన తమ్ముడక్కడకు వచ్చాడు. ‘నీవు గోదావరి గట్టున ఉంటావని వదిన చెప్పడం వల్ల, నీవు సాధారణంగా కూర్చుంటావని ఇక్కడకు వచ్చాను. ఇప్పుడే టెలిగ్రామ్‌ వచ్చింది. నిన్ను రామపాదసాగరం ప్రాజెక్టులో ఓవర్సీర్‌గా చేయించగలిగేనని శొంఠి రామమూర్తి గారు నీకు టెలిగ్రాం ఇచ్చారు. నీకు రేపో, ఎల్లుండో ఆర్డర్లు వస్తాయట. ఇదిగో టెలిగ్రాం.’

రామమూర్తికి కళ్లనీళ్లు తిరిగాయి. గోదావరి వరద ప్రవాహాలు సుడిగుండాలు తిరుగుతూ వెళ్లిపోతున్నవి.

– అడివి బాపిరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *