ఎర్రచందనం పెట్టె !

ఎర్రచందనం పెట్టె !

‘పోయినోళ్లందరూ మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు’ అన్నాడు కవి ఆచార్య ఆత్రేయ. పోయినోళ్లందరూ మంచోళ్లు అన్న మాట అచ్చంగా సరిపోతుంది మా అమ్మమ్మకు. నెల రోజులయింది ఆమె మమ్మల్నందరినీ వదిలి వెళ్లిపోయి. మరిచిపోలేని వ్యక్తిత్వం, ఆత్మీయమైన చిక్కని పలకరింపు, మమతానురాగాలకు ప్రతీక. ఆమెను ఒక్కసారి పలకరిస్తే వదిలి పెట్టే వాళ్లు కాదు ఎవరూ.

”అరేయ్‌ పెద్దోడా! అమ్మ బొట్టుపెట్టెలో ఈ ఉత్తరం పెట్టింది రా!” అంటూ నీళ్లు నిండిన కళ్లతో అమ్మ నా చేతిలో పెట్టింది కవరు. మేమే మర్చిపోలేక పోతున్నామే అమ్మమ్మను, అలాంటిది అనుక్షణం ఆమెను కనిపెట్టుకునే వుండి, సపర్యలు చేసి, కంటి పాపలా చూసుకున్న తల్లి తనను వదిలి వెళ్లిపోతే, అమ్మకు ఎంత బాధగా వుంటుంది! మేమందరం టిఫినుకూ, భోజనానికీ కూర్చునప్పుడు అమ్మను కూర్చోపెట్టుకుని బలవంతంగా తినిపిస్తున్నాం. లేకపోతే ‘పచ్చి మంచినీళ్లు కూడా తాగలేనురా, మా అమ్మ దేవతరా కన్నా–” అంటూ బొట బొటా కన్నీళ్లు కారుస్తుంది అమ్మ తన తల్లి తలపుల్లోకి వచ్చినపుడల్లా.

లేతాకుపచ్చ రంగు కవరు. దాని మీద ”నా చిన్నారి మునిమనుమరాలు డాక్టర్‌ రంజనికి, మామ్మ ఇచ్చే అపురూపమైన కానుక” అని వంకర టింకర అక్షరాలలో రాసి వుంది. అది అమ్మమ్మ చేతిరాత. తొంభై సంవత్సరాల వయసులో కూడా తను ఎవరికైనా ఉత్తరాలు రాయాలన్నా, ఏ వస్తువు మీదనైనా పేరు రాయాలన్నా ఆమే స్వయంగా రాయాలి. అప్పుడే ఆమెకు తృప్తి. నేను ఆ కవరు ముట్టుకోగానే అమ్మమ్మ నన్ను భుజం మీద అప్యాయంగా తట్టిన అనుభూతి కలిగి, ఒళ్లంతా ఝల్లుమంది. సజలనయనాలయ్యాయి. యాంత్రికంగా కవరు తెరిచాను. ఇత్తడి మీద బంగారు తీగెలతో నగిషీ చేసిన కళాత్మకమైన తాళం చెవి నా ఒడిలో పడింది. దాన్ని తీసి జేబులో వేసుకుని ఉత్తరం చదవసాగేను.

”అమ్మడూ– (మా అమ్మను ఇలాగే పిలుస్తుంది.)

మీ నాన్నగారు నన్ను వదిలి వెళ్లిపోయేక, నన్ను కూడా ఆయన వొడిలోకే తొందరగా చేర్చమని అనునిత్యం ఏడు కొండలస్వామిని ప్రార్ధిస్తూనే ఉన్నాను. కాని క్రిందటి జన్మలో నేను చేసిన పాపపుణ్యాల ఫలాలు ఇంకా మిగిలి ఉండడం చేత, ఇంకా బ్రతికే ఉండి, మిమ్మల్ని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా జీవించాను. మనిషి జీవితంలో చిట్ట చివరి ఘటన మరణం. దాన్ని ఎవరైనా ఎదుర్కో వలసిందే కదా! ఒక పక్క భవబంధాల నుండి విముక్తి జరుగుతోందనే ఆనందం, మరో పక్కన ఆత్మీయు లందరినీ వదిలేసి వెళ్లిపోతున్నాననే ఆవేదన ముప్పిరిగొంటున్నా మీ నాన్నగారి దగ్గరకు వెళ్లిపోతున్నాను. నేను బ్రతికుండగా మన కుటుంబంలో అందరికీ నాకు తోచినవి ఇచ్చేశాను, ఎవరినీ బాధపెట్టకుండా.

కాని నా మునిమనుమరాలు పిచ్చిముండ రాబోయే కాలంలో కాబోయే గుండె జబ్బుల డాక్టరు రంజనికి ఏమీ ఇవ్వలేకపోయాను. మనుషుల గుండెలు చీల్చి, అందులో లోపాలు సరిచేసి మళ్లీ గుండెలని యథావిధిగా కుట్టేసే దేవతకు మనమేం కానుక ఇవ్వగలం? అందుకని నేను మా అమ్మ పోయినప్పటి నుండీ అపురూపంగా దాచుకుంటున్న ఎర్రచందనం పెట్టెని దానికి బహుమతిగా ఇవ్వాలను కున్నాను.

మా అమ్మ వొట్టి పిచ్చిదే బాబూ. తన దాపుడు పట్టు చీరలూ, తన నగలూ, తనకిష్టమైన కొన్ని చిన్నచిన్న వెండి సామాన్లూ, దేవుళ్ల బొమ్మలూ ఈ పెట్టెలో జాగర్తపెట్టుకునేది. ఈ పెట్టె తాళాలు ఎవరికీ ఇవ్వకుండా తన మంగళసూత్రాల గొలుసులో పిన్నీసుతో పెట్టుకునేది. మా అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను ఈ పెట్టె మీద వాలి అమ్మను ముట్టుకున్నంతగా అనిపించి ఏడ్చేదాన్ని. ఈ భూ మండలంలో అమ్మను మించిన దేవత లేనేలేదు.

అందుకని ఈ అపురూపమైన మా అమ్మ భాండాగారం ఎర్రచందనం పెట్టె ఎవరూ తెరవకుండా డాక్టర్‌ రంజనికి ఇవ్వండి. ఇదే నా చివరి కోరిక.

నాకోసం దినాలూ, సంవత్సరీకాలూ, తద్దినాలూ అని వొహటే మనోళ్లందరికీ భోజనాలు పెట్టేయకండి. ఆయా రోజుల్లో తిండికి మొహం వాచిపోయి వున్న బీదోళ్ళని పిలిచి నాకు నచ్చిన పిండివంటలు చేసి వాళ్లకి కడుపు నిండా భోజనాలు పెట్టండి. — మీ అమ్మ. ”

చివరి వాక్యాలు చదువుతోంటే నా కనుల నిండా మళ్లీ నీరు. ఆ పొరలో మా అమ్మమ్మ రూపం నన్ను ఆప్యాయంగా చూస్తూ, లీలగా గోచరించింది. వెంటనే వెళ్లి వంటింట్లో ఉన్న అమ్మకు విషయం చెప్పాను.

”మా అమ్మ పిచ్చిమొఖం రా. అందులో ఉన్న చీరలూ, బంగారం, చిన్న చిన్న వెండి సామానూ కుటుంబంలో అందరికీ పంచేవరకూ నన్ను కూడా ముట్టుకోనివ్వలేదు. ”లోపల ఎలా ఉంటుందో చూడాలని వుందే ఒక్క సారి చూపించవూ” అని నేను అడిగితే ”పిచ్చి మొఖమా, పెట్టె తెరిస్తే ఏం వుంటుందే– ఖాళీ అయిపోయిందిగా ఇప్పుడు” అంది కాని ఆ పెట్టె ముట్టుకోనివ్వనే లేదు. చివరికి రంజనికి ఇవ్వాలనుకుందన్నమాట. మా అమ్మకి రంజని అంటే ఎంతిష్టమో మాటల్లో చెప్పలేను రా. సరే అమ్మమ్మ పడుకునే గదిలోనే ఆ పెట్టె ఉంచేయండి. మీ అక్క అమ్మమ్మ త్రిపక్షాలకు వచ్చినప్పుడు రంజనికి ఇవ్వమని అప్పచెప్పేద్దాం !” అంది అమ్మ.

మా తాతగారు పదవీ విరమణ చేశాక కొన్ని సంవత్సరాలు అమ్మమ్మతో సుఖసంతోషాలతో జీవించారు. పల్లెటూరిలో లంకంత కొంప, చుట్టూ మామిడి, వేప, నేరేడు, జామ, పనస, బత్తాయి వంటి చెట్లూ, అనేక రకాల పూలమొక్కలూ దాదాపు యకరం స్థలంలో మండువా లోగిలి. నందనవనంలో కుటీరంలా గోచరించేది. హఠాత్తుగా ఒక రోజున పూజ చేసుకోగానే– ” ఏమిటోలా వుంది నన్ను బయటకు తీసుకెళ్ళు ” అని మా అమ్మమ్మకు చెబితే, వాకిట్లోకి అరుగు దగ్గరకు వెళ్లగానే వెల్లకిలా పడుకుని, శ్రీరామ– శ్రీరామ– అనుకుంటూ ” నువ్వు ఇక్కడ ఉండొద్దు. అమ్మాయి ఇంటికి వెళ్లిపో. నా మీద ఒట్టు ” అని కన్ను మూశారుట తాతగారు.

అప్పటి నుండి మా అమ్మమ్మ మా ఇంట్లోనే ఉంది. మా అమ్మమ్మ సుమారు ఐదున్నర అడుగుల ఎత్తులో దబ్బపండు రంగులో పుష్టిగా ఉండేది. తాతగారు పోయేరని బొట్టు, గాజులు తీసేయడం వంటివి చేయనివ్వ లేదు. బొట్టు మీద అడ్డంగా విభూది గీత పెట్టుకునేది. సన్నంచు కాషాయరంగు చీరలు కొనిపించింది. వాటిని కాసె పోసి కట్టుకునేది. పెద్దావిడ అని ఎవరూ పట్టించుకోలేదు.

ఈ మధ్యనే మా అమ్మమ్మకు తొంభై సంవత్స రాలు నిండాయి. ఆమె ఒక్కగానొక్క కూతురు మా అమ్మే. నాకు ఒక అక్కా, ఒక తమ్ముడు, మాది చిన్న కుటుంబం.

” ఒరేయ్‌! మొదటిగా మీ అమ్మ పుట్టింది. నేనేమో మీ తాతగారిని మనకు ఒక అబ్బాయి కూడా ఉంటే బావుంటుంది కదా అని అంటే ” మహాలక్ష్మి లాంటి అమ్మాయి ఉండగా మన వేరే పిల్లలెందుకూ ” అంటూ ఆయన నా మాట విననే లేదనుకో ” అనేదిట అమ్మమ్మ అస్తమానూ.

రోజూ ఉదయాన్నే బ్రష్‌ చేసుకోగానే, కాస్తంత కాఫీ తాగి, కాసె పోసి కట్టుకున్న కాషాయరంగు చీరలో భుజం నిండా కప్పుకుని తల వంచుకుని భగవధ్యానం చేసుకుంటూ నెమ్మదిగా గోదావరి నది పుష్కరాల రేవుకు వెళ్లి స్నానం చేసి, అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి, రామాలయాలలో దర్శనం చేసుకుని రావడం అమ్మమ్మ నిత్యకృత్యం.

ఆ వేళ గోదావరి నుండి వచ్చేక హడావిడిగా మా అమ్మా నాన్నలను తన గదికి రమ్మన్నదట.

”నాకు ఇవ్వాళ తొంభై సంవత్పరాలు నిండేయి. ఇంకా బ్రతకాలని వుంది. చెప్పొద్దూ నాకైతే నా మునిమనవరాలు డాక్టర్‌ రంజని క్లినిక్‌లో వైద్యం చేయించుకోవాలని వుందనుకోండి! నాకూతురూ, ఆమె కుటుంబంలో పిల్లలందరూ జీవితాల్లో స్థిరపడి సిరిసంపదలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ఉంటే, ఆ పండంటి సంసారం తృప్తిగా చూసుకుంటూ మహదానందంతో జీవిస్తున్నాను. అయితే రేపు ఏం జరుగుతుందో తెలియదు కదా ! అందుకని కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాను.

ఊళ్లో మా ఇంటి స్థలం, ఇంటితో సహా మన ఊళ్లో హైస్కూలు కట్టడం కోసం పంచాయితీకి దానపట్టా రాసేశాను. ఆయన కోరిక కూడా అదే. ఇకపోతే ఐదెకరాల పొలం మా అమ్మాయికీ, అల్లుడికీ, పెద్ద మనుమరాలికీ, మిగతా ఇద్దరి మనవలకూ తలా ఒక యకరం రాసేశాను. బంగారు నగలూ, వెండి సామానూ అందరికీ సమానంగా పంచేశాను. ఆయన వేసుకునే బంగారపు గొలుసు, రోజూ ఆయన జపం చేసుకునే రుద్రాక్ష మాల… బంగారు బిళ్లలతో చేయించినది.. అల్లుడిగారికి ఇచ్చేస్తున్నాను. ఈ నెల నుండి ప్రతీ నెలా నీకూ, మీ ఆయనకూ, మనవరాలికీ, ఇద్దరి మనవళ్లకూ తలా ఒక వెయ్యి రూపాయలు పెన్షను రాగానే ఇస్తాను. చివరగా నా వడ్డాణం మాత్రం నీకే ఇచ్చేస్తున్నాను. దానిని మాత్రం ముక్కలు చేయకుండా నీ తదనంతరం ఏర్పాటు చేయాలి తెలిసిందా? ఇవన్నీ తీసుకుని మీరు అందరూ ఆనందంగా ఉండండి.” అని చెప్పేసి ఆ రోజంతా చాలా సంతోషంగా ఉందిట అమ్మమ్మ.

ఈ సంఘటన జరిగి సంవత్సరం పైనే అయింది. ఇప్పుడు అమ్మమ్మ లేదు. అయితే అమ్మమ్మ గదిలో ఒకే ఒక వస్తువు ఉండిపోయింది. అది ఎర్ర చందనం పెట్టె. మూడు అడుగుల వెడల్పూ, రెండు అడుగుల ఎత్తూ వుండి, పై భాగంలో వెండి పువ్వులు తాపడం చేసి, తాళం చెవి పెట్టే రంధ్రం చుట్టూ బంగారు తీగెతో డిజైన్‌ చేసిన పువ్వూ చాలా కళాత్మకంగా వుంటుందా పెట్టె.

తాతగారు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసినప్పుడు, ఆయన కింద పనిచేసే ఓ ఉద్యోగి చేత ఆ పెట్టెను చాలా రహస్యంగా చేయించిందిట అమ్మమ్మ. ఎందుకంటే ఆమెకు ఆ పెట్టె అంటే అంత భ్రమ, ఇష్టమూను. రెండేళ్లకోసారి వడ్రంగిని పిలిపించి ప్రత్యేకంగా వార్నిష్‌ మెరుపులూ, వెండి బిళ్లలకు, తాళం చెవికీ కూడా మెరుగులు పెట్టించి, ఎప్పుడూ నిత్యనూతనంగా వుంచేదిట.

నాన్నగారైతే ”ఏమిటీ? మీ అమ్మకు అంత భ్రమ ఆ పెట్టె అంటే? పోయేటప్పుడు కూడా పట్టుకు పోతుందా ఏమిటి ఖర్మ ? పెట్టెతో పాటు దహనం అంటావా ?” అనేవారుట వ్యంగ్యంగా. ”చాల్లెండి బావుండదు ఎవరైనా వింటే” అనేదిట అమ్మ.

ఆ పెట్టెలో ఏం వుంటుంది? అందరికీ అన్నీ పంచేసిందిగా అమ్మమ్మ. మరి ఇంకేం వుంది?

ఎంతో తెలివితేటలు ప్రదర్శించి మొదటి ప్రయత్నంలో ఎంట్రన్స్‌లో చాలా మంచి ర్యాంక్‌ సంపాదించి మెడిసిన్‌ చదువుతున్నందుకుగాను ఆ మధ్యన డాక్టర్‌ రంజనికి అక్కడక్కడ వజ్రాలతో, వజ్రం లాకెట్‌తో సన్నని గొలుసు చేయిస్తానని చెప్పిందిట అమ్మమ్మ. ఒకవేళ ఆ గొలుసు చేయించి పెట్టెలో పెట్టిందేమో! లేక ఇంకా ఎవరికీ ఇవ్వకుండా దాచేసిన బంగారు నగ ఏదైనా ఇస్తోందా? ఏది ఏమైనా ఎవరికీ తెలియకుండా ఈ పెట్టె తెరిచేసి అందులో ఏముందో చూసేయాలి– నా మనసుకు చాలా ఆతృతగా ఉంది. మా కుటుంబంలో ఎవరికీ ఇవ్వని ఖరీదైన వస్తువేదో ఆ పెట్టెలో ఉండి ఉంటుంది దానిని చూడాలి.

పైగా అమ్మమేమో ఆ పెట్టె ఎవరూ తెరవకుండా మునిమనవరాలికి ఇవ్వమంటోంది అంటే; రంజని అంటే ఆమెకు ఏర్పడిన అపారమైన ప్రేమాభిమానాలూ, ముద్దుముచ్చటలకు, అమ్మమ్మ ఎంత ఖరీదు కట్టి వుంటుందో చూడాల్సిందే. లేకపోతే ఎవరూ చూడకుండా పెట్టెను ఇవ్వాలి అని కండిషన్‌ ఎందుకు పెడుతుంది?

నిజానికి ఆ పెట్టెలో ఏం వుందో చూడాల్సిన అవసరం తనకు లేదు. తనకూ, తమ్ముడికీ హైదరాబాదులో లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి, బావగారు విజయవాడలో పెద్ద మేడ కట్టేరు. అదనంగా సైట్స్‌ కూడా ఉన్నాయి. మా ఇద్దరికీ కూడా ఇళ్లస్థలాలు ఉన్నాయి. అందరి పిల్లలూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లూ ఇంకా ఉన్నత స్థానాలలో ఉన్నారు. ఎవరికీ డబ్బు విషయంలో గాని, వెండి బంగారం విషయంలో గాని ఏ లోటూ లేదు.

కాని మాయదారిది ఏమిటో తెలియని ఆరాటం. అమ్మమ్మ అక్క కూతురికే పెట్టెలో కానుక పెట్టి ఎందుకు ఇవ్వడం? పోనీ మిగిలిన వాళ్లలో ఎవరో ఒకరి పిల్లలకి ఎందుకు ఇవ్వలేదు? ఏది ఏమైనా పెట్టె నేను తెరిచి రంజనికి ఇచ్చేదాంట్లో కొంత నొక్కేసినా ఎవరు చూడొచ్చారు? ఈ ఆలోచనలన్నీ నా మెదడులో దూరి దొలిచేస్తున్నాయి. పోనీ రహస్యంగా తమ్ముడితో సంప్రదించి ఇద్దరం కలిసి తెరిచి చూస్తేనో! అలా కాదు, రహస్యం ఎప్పుడూ ఒక్క తలకాయలోనే ఉండాలి, రెండో తలకాయ ప్రవేశిస్తే అతి రహస్యం బట్ట బయలు అయిపోతుంది.

అంతా బాగానే ఉందయ్యా! ఇప్పుడు నేను ఈ పెట్టె తెరిచి, అందులో ఏముందో చూసేసి మళ్లీ ఎప్పటిలాగే తాళం వేసేసేననుకో, ఎవరు చూస్తారు ? ఎవరికి తెలుస్తుంది?

వెంటనే నా చిన్న మెదడు నుండి ఉత్తర్వులు వచ్చేశాయి, తక్షణం పెట్టె తెరువమని. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లున్నారు. అమ్మ వంట పనిలో బిజీగా వుంది. నేను ఉన్న గది లోంచి అమ్మమ్మ పడుకునే గదిలోకి వెళ్లాను, వణికే చేతులతో తాళం చెవి ఎర్ర చందనం పెట్టెకు తగిలించాను. జానపద సినిమాల్లో తన రహస్యపు పెట్టె తెరవకూడదని చెబితే, వాడి మాట వినకుండా మంత్రగాడు మాంచి నిద్రలో ఉండగా హీరో రహస్యంగా తెరచినప్పుడు ఉండే ఫీలింగ్‌ నాలో. నా గుండె వేగంగా కొట్టుకోవడం నాకే వినిపిస్తోంది.

ఎలాగైతేనేం, తాళం తీసి ఎంతో బరువుగా ఉన్న పెట్టె మూత తెరిచాను. చిత్రం! ఆ పెట్టెలో ఏమీ లేదు, ఓ చిన్న కాగితం తప్ప. దాని మీద అమ్మమ్మ వంకర టింకర అక్షరాలు —

”మమతానుబంధాలను, పెద్దల మాటల మీద నమ్మకాలను ‘సిరిసంపదలు’ అనే మహమ్మారి కబళించేస్తున్న ఈ కలికాలంలో నా మనవలు వాటిని నిలబెడతారని అనుకున్నాను– కాని–?” అని వుంది. పోలీస్‌ కస్టడీలో వున్న రిమాండ్‌ ఖైదీని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ నిజం చెప్పమని వాడిని ఊపిరి తీసుకోనియ్యకుండా, అవిశ్రాంతంగా ఫెడీ ఫెడీ మని ఆ లెంపా ఈ లెంపా వాయిస్తోంటే కళ్లల్లో నక్షత్రాలు కనిపించినట్లుగా, నా మైండ్‌ బ్లాంక్‌ అయిపోయి, కనుల నిండా నీరు చేరి, ఆ అక్షరాలు కనుపించకుండా పోయాయి.

ఇంతలో తలుపు తెరుచుకుని అమ్మ ప్రవేశించింది గదిలోకి —

తెరచి ఉన్న ఎర్ర చందనం పెట్టె—

ఎదురుగా కంటి నిండా నీళ్లతో నేను —

”అవ్వ– అవ్వ– నేను అనుకుంటూనే ఉన్నాను. ఎవరో ఒకళ్లు ఈ పెట్టె తెరుస్తారని. నీ అసాధ్యం కూలా ? అందులో ఏమీ లేవురా పెద్దోడా! రంజని డాక్టరు చదువుతోందనీ, అదంటే అమ్మమ్మకి అతి గారాబం, ఎంతో ఇష్టంరా. ఒక నెల క్రితం దానికి అక్కడక్కడ వజ్రాలు పొదిగిన గొలుసు చేయించుకోమని రెండు లక్షలు దాని బ్యాంకు అకౌంట్‌లో నాన్నగారి చేత వేయించింది కూడాను. మా అమ్మ నాకు ఈ కవరు ఇస్తూ చెప్పింది నేను పోయాక నీ పిల్లలకు ఒక పరీక్ష పెడుతున్నానే. వాళ్లు ఈ పరీక్షలో ఫెయిలయిపోతారే పిచ్చిదానా అంది పకపకా నవ్వుతూ. కోపంతో వాళ్లు నీ మనవలే అమ్మా! అన్నాన్నేను. చివరకు ఇలా అయిందా?” అంటూ కొంగు నోటికి అడ్డం పెట్టుకుని విలపించసాగింది అమ్మ.

నేను వెంటనే బట్టలు విప్పేసి పంచె కట్టుకుని, పైన కండువా వేసుకుని రోదిస్తున్న అమ్మ దగ్గరకు వెళ్లి, అమ్మ చేతులు గట్టిగా పట్టేసుకుని, ”అమ్మా– నేను అమ్మమ్మకు క్షమాపణ చెప్పి వస్తానే– ” అంటూ ఆటోలో కోటిలింగాల రేవుకు చేరుకుని, అమ్మమ్మను దహనం చేసిన చోట సాష్టాంగ పడి–

”అమ్మమ్మా– నిన్ను క్షమించమని వేడుకోడానికి వీలులేని తప్పు చేశాను. మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడు– ” అంటూ ఏడుస్తూనే ఉన్నాను.

నా భుజం మీద చేయి పడింది. లేచి చూద్దును గదా–ఒంటి నిండా విభూదితో, కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు. ”బాబూ పోయినవాళ్ల కోసం అలా శోకించకూడదు. బ్రతికున్నవారు వారి లక్ష్యాలు సాధించాలి, ఇంటికి వెళ్లు బాబూ — జీవితం శాశ్వతం కాదు, వొట్టి నీటి బుడగ బాబూ. కాని మనం నీటి బుడగ మెరుపులను చూసి అబ్బో చాలా బావుందే అని పట్టుకుంటాం. వెంటనే అది మాయమయిపోతుంది. అన్నీ మాయమైపోతాయి. అంతా మాయ. పద బాబూ– ” అంటూ ఆయన నిర్మలంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. అవును నేను ఆ నీటి బుడగనే పట్టుకున్నాను. నాకు ఏం లోటు? అమ్మమ్మా నన్ను క్షమించవూ ?! — అంటూ నా మనసు రోదిస్తోంది.

పగలంతా తీవ్రమైన ఎండా వేడిమితో ప్రజలను ఇబ్బంది పెట్టిన సూర్యభగవానుడు ఎరుపూ కనకాంబరం రంగు కలగలిపిన రంగులోకి మారి వాతావరణాన్ని చల్లబరుస్తున్నాడు. గోదావరిలో ఆ రంగు ప్రతిబింబించి ఆ రమణీయ దృశ్యం అంతవరకూ మంటలలో దహించుకుపోయిన నా మనసునూ శరీరాన్నే శాంతింపచేస్తోంది.

–  కె.బి. కృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *