ముగ్గురమ్మల మూలపుటమ్మ

ముగ్గురమ్మల మూలపుటమ్మ

దసరా నవరాత్రుల ప్రత్యేకం

అమ్మలగన్మయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలపె

ద్దమ్మ సురాసులమ్మ కడుపారెడిపుచ్చినయమ్మ తన్నులో

నమ్మిన వేల్పులటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ది యీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌

పద్యంలో దుర్గమ్మ గొప్పదనాన్ని పోతపొసినట్లు చెప్పాడు పోతనామాత్యుడు.

దుర్గమ్మ పేరులో ‘ద’కారం దైత్యనాశకం, ‘ఉ’ కారం విఘ్ననాశకం, ‘ర్‌’ కారం రోగనాశకం, ‘గ’కారం పాపనాశకం, ‘ఆ’ భయనాశకం. అందుకే ఆ అమ్మ నామాన్ని పలికినా, స్మరించినా సర్వపాపాలు నశిస్తాయని సాక్షాత్తూ పరమ శివుడు చెప్పినమాట.

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానది లేక కృష్ణవేణీ నది తీరంలో కృష్ణా జిల్లాలో విజయవాడ వద్ద ఇంద్రకీ లాద్రిపై వెలసింది శ్రీకనకదుర్గ అమ్మ. నిరంతరం ఎందరో భక్తులు ఈ తల్లిని దర్శించి తరిస్తున్నారు.

ఆవిర్భావం

దుష్టులు వరబల గర్వితులై లోకాలను బాధిస్తూ, లోకకంటకులుగా మారారు. వారిలో దుర్గమాసురుడు ఒకడు. దేవతలపై దండయాత్ర చేసి అమరావతిని స్వాధీనం చేసుకొని యజ్ఞయాగాది క్రతువులు, వైదిక కర్మలు నిర్వహించే ఋషులను, హరినామస్మరులను, భక్తులను బాధిస్తున్నాడు. ఆ బాధలు భరించలేక వారందరూ జగన్మాతను ప్రార్థించగా, ఆ దేవి దుర్గామాసురుడిని, అతని అసురగణాన్ని అంతం చేసింది.

ఒక పురాణ గాధ ప్రకారం పూర్వం కీలుడనే యక్షుడు దుర్గాదేవిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. అతని కఠోర తపస్సుకు మెచ్చిన అమ్మ వరం కోరుకో మనగా అమ్మ తన హృదయంలో కొలువై ఉండాలని కోరాడు. వరం సఫలం కావటానికి కీలుడు పర్వతంగా మారాడు. మహిషాసురవధ అనంతరం మహిషాసురమర్దిని రూపంలో కీలాద్రి మీద వెలసింది దుర్గమ్మ. ఇంద్రాదులు వేంచేసిన పర్వతం కనుక కీలాద్రికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది.

మార్కండేయ, దేవీభాగవత పురాణాలలో దుర్గమ్మ వైభవం గురించి కళ్లకు కట్టినట్టు వర్ణన ఉంటుంది.

ఇంద్రకీలాద్రి కృష్ణానదికి ఉత్తర దిక్కున ఉంది. ఆ పర్వతం మంగళగిరి దాకా వ్యాపించి ఉంది. మంగళగిరి కొండ మీద పానకాల నరసింహస్వామి కోలువుదీరి ఉన్నాడు. ఒకే పర్వతం ఇలా రెండు భాగాలుగా విడిపోవటానికి కారణం ఏమిటో చెప్పే ఒక కథ ప్రచారంలో ఉంది. కృష్ణమ్మ తన ప్రవాహానికి అడ్డు తొలగి, దారిమ్మని ఆ పర్వతాన్ని కోరితే, అది మాట వినలేదు. దాంతో ఆ నదీమతల్లి ఆ పర్వతాన్ని గట్టిగా ఢీకొట్టింది. దాంతో మధ్యలో దారి ఏర్పడింది. అలా ఢీ కొట్టినప్పుడు ఆ పర్వతంలోని కొంతభాగం నదిలో కోట్టుకుపోయి ఆ దగ్గరలో కల యనమల కుదురు దగ్గర తేలింది. తేలిన కొండ కావడంతో తేలుకొండలని పేరొచ్చింది. పార్వతీ రామలింగేశ్వర ఆలయం యనమలకుదురు కొండమీద ఉన్నది. మునులందరు ఇక్కడ తపస్సు చేసినందున వేయి మునులకుదురు అని పేరొచ్చింది. పూర్వం పరశురాముడు యనమలకుదురు కొండమీద స్వయంగా శివుని లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. ఈ ఆలయం విజయవాడ బస్సుస్టేషన్‌కు 4 కి.మీ.ల దూరంలోనూ, రైల్వేస్టేషన్‌కు 3 కి.మీ.ల దూరంలోనూ ఉంది. కనకదుర్గమ్మ గుడి నుండి ఈ రెండు ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.

మహాభారతంలోని కిరాతార్జున యుద్ధ గాధ బెజవాడతో ముడిపడి ఉన్నది. అర్జునుడు ఈ పర్వతంపై శివుని కోసం గొప్ప తపస్సు చేసి, ఆయనను ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రం సాధించ డంలో విజయం పొందాడు. కాబట్టి విజయవాడ అని పేరొచ్చిందని కూడా పురాణ వాక్యం.

కృష్ణానది ఆవిర్భావం కూడా దైవసంకల్పమే. ఇంద్రకీలాద్రి సమీపం నుండి పారే కృష్ణానది సహ్యాద్రి నుంచి ప్రవహిస్తూ వస్తుంది. ఆ నది తనతోపాటు ఎన్నో దివ్య ఔషధాలను, బీజాలనూ తెచ్చేది. అవన్నీ ఇంద్రకీలాద్రి సమీపంలో మొలకెత్తుతూ ఉండేవి. దాంతో ఆ నేల సస్యశ్యామలమైంది. అందుకే తొలినాళ్లలో ఈ ప్రాంతాన్ని ‘బీజపురి’ అని పిలిచేవారట. కాలాంతరమున బీజవాడగా, బెజవాడగా మారిందంటారు.

మరో పురాణ కథ కూడా ఉంది. పూర్వం విష్ణు కుండినులు బెజవాడను పాలించిన కాలంలో మాధవవర్మ అనే రాజు ఉన్నాడు. ఆయన కుమారుడు రథం నడుపుతూ ఓ పేదరాలి బిడ్డను బలిగొన్నాడు. ఆ పేదరాలు రాజుకు ఫిర్యాదు చేసింది. రాజు నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపి, ఆమె కుమారుడి మరణానికి కారణమైన తన కుమారునికి మరణశిక్ష విధించాడు. ఆ రాజు చూపించిన నిస్పాక్షికతకు మెచ్చుకోలుగా కొండమీద కొంతసేపు కనకవర్షం కురిసిందట. మరికొంత సేపటికి మరణించిన రాకుమారుడు, పేదరాలి కుమారుడు ఇద్దరూ సజీవులయ్యారు. ఇంతేకాక దుర్గమ్మ అనేక రూపాలలో అనేకమందికి దర్శనమిచ్చినట్లు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

బ్రహ్మవైవర్త పురాణానన్నుసరించి దుర్గాదేవి మేలిమి బంగారు రంగులో దివ్యకాంతులను ప్రసరిస్తూ చిరునవ్వుల ముఖ పద్మంతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఆమె నేత్రాలు మీనాల్లా ఉంటాయి. ఎర్రని వస్త్రం ధరించి, రత్నఖచిత త్రిశూలం, శక్తి, సారంగ ధనస్సు, ఖడ్గం, బాణం, శంఖం, చక్రం, గద, పద్మం, స్పటికమాల, కమండలం, వజ్రం, అంకుశం, తదితర అస్త్రాలు కలిగిన చేతులతో దర్శనమిస్తుంది.

ప్రతి సంవత్సరం అశ్వియుజ మాసంలో మొదటి 10 రోజులపాటు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలలో అమ్మను ఒక్కొక్కరోజు ఒక్కొక్క రూపంలో అలంకరిస్తారు. అందులో మొదటి రోజు జగజ్జనని, 2వ రోజు కనకదుర్గ, 3వ రోజు త్రిపుర సుందరి, 4వ రోజు గాయత్రి, 5వ రోజు అన్నపూర్ణ, 6వ రోజు సరస్వతీదేవి, 7వ రోజు మహాలక్ష్మి, 8వ రోజు దుర్గ, 9వ రోజు మహిషాసుర మర్దని, 10వ రోజు రాజరాజేశ్వరి దేవతగా అమ్మ దర్శనమిస్తుంది. తిథుల హెచ్చు తగ్గుల సమయంలో ఒకొక్కసారి 11వ అలంకారం కూడా చేస్తారు. ఆ అలంకారాన్ని మంగళచండి దేవి అని అంటారు.

ఈ క్షేత్రాన్ని దర్శించిన ఆదిశంకరాచార్యుల వారు ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింప జేసేందుకు మహోగ్రశక్తులను శ్రీచక్రంలో నిక్షిప్తం చేసి, అమ్మవారి పాదాల చెంత స్థాపన చేశారు. అప్పటినుండి దుర్గమ్మ శాంతి స్వరూపిణిగా మారి, భక్తులకు దర్శనమిస్తున్నది. అప్పటి నుంచి లలితా సహస్రనామాలు, అష్టోత్తరాలు, నిత్య కుంకు మార్చనలు అమ్మవారి మూలవిరాట్టుకు కాకుండా, శ్రీచక్రానికే జరుగుతున్నాయి. కారణం శ్రీచక్రాన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావించడమే. కనకదుర్గా లయంలో మూల విరాట్టు పక్కనే పీఠం మీద ఎనిమిది భుజాలతో దుర్గాదేవి ఉత్సవ మూర్తి దర్శనమిస్తుంది. పంచలోహ నిర్మితమైన ఈ మూలవిరాట్టుకు నిత్యం పూజలు చేస్తారు. తంత్రశాస్త్రం, మార్కండేయ, సప్తశతి, తీర్థ ప్రబంధం, మహాభాగవత పురాణాలను పఠించి అమ్మవారిని వారాహి, ఐన్ద్రి, వైష్ణవి, మహావీర్య, శివధూతి, మాహేశ్వరి, వారుణి, మృగవాసిని, కేబేరీ, శూలధారిణి, బ్రహ్మణి, జయ, విజయ, అజిత, అపరాజిత, ద్యోతిని, ఉమ, మాలధారి, యశస్విని, త్రినేత్ర, యమఘంట, జలదుర్గ, గిరిదుర్గ, స్థలదుర్గ ఇలాంటి ఎన్నో పేర్లతో భక్తులు పిలుస్తున్నారు.

దుర్గమ్మకు గాజులు సమర్పించే ఆచారం ఇక్కడ ఉంది. దిగువ కృష్ణానదిలో స్నానమాచరించి, అమ్మవారిని దర్శించాలి. అప్పుడు అమ్మ మకర తోరణంలో స్వర్ణ కవచాలంకృత అయి, అటూ, ఇటూ సూర్య చంద్రులు, నవరత్న ఖచిత, సువర్ణ కిరీటంతో దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిస్తుంది.

ఆలయంలో మూలవిరాట్టు పక్కనే పీఠం మీద 8 భుజాలతో దుర్గాదేవి ఉత్సవ మూర్తి దర్శన మిస్తుంది. ముగురమ్మల మూల పుటమ్మ రూపాన్ని కళ్లనిండా నింపుకొని బయటకు రాగానే ఉత్తరం వైపున నాగేంద్రుడి పుట్ట ఉంటుంది. దగ్గరలోనే వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఇంకా ముందుకు వెళితే అమ్మవారి ఆలయానికి ఎడమవైపు విఘ్నేశ్వర, నటరాజ, శివకామ సుందరదేవి ఆలయాలు ఉన్నాయి. ఉత్తర దిక్కున మల్లేశ్వర స్వామి ఆలయం, చండీశ్వరాలయం ఉన్నాయి. క్షేత్రపాలకుడైన కాలభైరవ విగ్రహం ఉంది. మల్లేశ్వరస్వామి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. పరిసరాల్లో ఉన్న జమ్మిదొడ్డి, పార్థీశ్వరాలయం, అక్కన్న మాదన్న గుహలు చూడగలిగితే బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ సందర్శన పూర్తి అయినట్లే.

– ఎస్‌.వి.ఎస్‌.భగవానులు, విశ్రాంత డివిజనల్‌ ఇంజనీరు, ఎ.పి. ట్రాన్స్‌కో, ఒంగోలు 9441010622

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *