దారి ఎటు?

దారి ఎటు?

వీధి లైట్ల వెలుగు మిరుమిట్లు గొలిపే కొండచిలువలా వెన్నెలను మింగేస్తున్న క్షణం. సావధానంగా నడిచి నడిచి సిమెంట్‌ బెంచీ మీద కూచున్నాను. పూర్ణ చంద్రుడు సరిగ్గా నడి నెత్తిన ఉన్నాడు.

అసలు ఎన్నాళ్లైందో ఇలా సావకాశంగా రెండడుగులు నడిచి. కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలితో కనురెప్పలపై సుతారంగా వత్తుకున్నాను.

ఎందుకో ఉన్నట్టుండి మనసులో దుఃఖం పొంగి వచ్చింది. ఈ నిశ్శబ్దపు నడి రాత్రి నగరం రోడ్ల మీద నదిలా పారుతున్న వెలుగు వెల్లువలో దిగులు మేఘం ఒకటి చటుక్కున మొలిచి, అంతై ఇంతై నిలువెల్లా ఆక్రమించుకుంది. ఎందుకో తలుచుకోకుండానే చిన్నతనం గుర్తుకు వచ్చింది. అమ్మ గుర్తుకు వచ్చింది. జానకి గుర్తుకు వచ్చింది.

అప్రయత్నంగానే కళ్ల నుండి రెండు వెచ్చని నదులు ధారలై ప్రవహించాయి. వాటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు.

నలుగురి తరువాత పుట్టిన వాడని అమ్మ అపురూపంగా చూసేది. అమ్మ బాగా చూస్తుందని అక్కలందరికీ కుళ్లుగా ఉండేది. తను మాత్రం, వారినేం మర్యాదగా చూసాడు గనుక. తన చిన్నప్పుడే పెద్దక్క పెళ్లై పోయింది. తూ తూ మంత్రంగా జరిగిన పెళ్లి అది.

అది లేదని, ఇది లేదని, పిల్లాడు నచ్చలేదని, వచ్చిన సంబంధాలన్నీ ఎత్తగొట్టి, జంపు నడిపి చివరికి పెళ్లి ఈడు దాటిపోయాక, ఒక పదేళ్లపాటు ఇంట్లో అమ్మకూ అక్కకూ ¬రా¬రీ యుద్ధాలు నడిచాక ఎవ్వరితోనైనా లేచి పోతుందేమో! అన్న భయంతో వదిలించుకునేందుకు చేసిన పెళ్లి అది.

ఆ యుద్ధాలకి ఒక కారణం అంటూ ఉండేది కాదు. వాకిలి ఊడవటం దగ్గర నుండి ఎవరెక్కువ సార్లు కాఫీ తాగారు అనే వరకూ వేలాది కారణాలు. అమ్మ గెలవలేకపోతే తల గోడకేసి కొట్టుకుని నేను ఉరి పెట్టుకు చస్తా అంటూ పరుగెత్తుకు వెళ్లి తలుపులు వేసుకునేది. వెనకాల ‘అమ్మా వద్దే.. అమ్మా వద్దే..’ అని ఏడుస్తూ పిల్లలందరి పరుగులు. అది నాన్న లేనప్పుడు. నాన్న ఇంట్లో ఉంటే ఆ స్థాయి రాకముందే ఒక్క అరుపు అరిచేవారు, ‘వెధవ గోల.. వెధవ గోల.. నోరు మూసుకు చావండి’ అని. ఇంటిల్లిపాదీ కుక్కిన పేలయ్యేవాళ్లు. ఇప్పుడు ఆలోచిస్తే అర్ధం అవుతుంది. ఆడపిల్ల తండ్రిగా నాన్న చేసిన పెద్ద పొరబాటు. ఎంతసేపూ తన జల్సాలు, తన తిరుగుళ్లు.. అంతే తప్ప బాధ్యత అనేది పడితే కదా?

గడప దాటని అమ్మకు మొగుడి మాట వేదవాక్కు. గడప దాటకుండానే, ఇంటి అధికారమైనా దక్కించుకోలేదు. మెట్రిక్‌ ఫెయిలై ఇక చదవను అని మొండికేసిన అక్కకు పెళ్లి చెయ్యాలని నాన్నను ఎందుకు పోరలేదు.

మొగుడి మాటకు తలవంచి రెండేళ్లకు ఒకరిని కనడమే బాధ్యతగా పెట్టుకున్నట్టు.. అన్నట్టు పోయిన వారు పోగా మిగిలినది నలుగురు అక్కలు. ఒక్కొక్కరి మధ్య ఒకరిద్దరు పుట్టి పోయారట. పెద్దక్కకూ నాకూ పదహారేళ్ల తేడా.

ఎరుపు తిరిగిన గులాబీ రంగులో ఉన్న అక్క పక్కన నీలం తిరిగిన నలుపులో బావ దిష్టి బొమ్మే. అయినా అక్క గత్యంతరం లేకే చేసుకుంది. ఇక రెండో అక్క అదో రకం. తన చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం చూసుకుని అందరి మీదా అజమాయిషీ చలాయించేది. చాలా సీక్రెటివ్‌.

మిగతా ఇద్దరూ కొంచం రివల్యూషనరీ. కొడుకే ఎందుకు ఎక్కువ? మేమెందుకు తక్కువ? అనేవారు.

‘పొండి.. మహా అడగొచ్చారు. ఏం చేసినా! చెయ్యకున్నా! చచ్చాక కొరివి పెడతాడు’ అనేది అమ్మ.

‘చచ్చాక ఎందుకు ఇప్పుడు పెట్టమన్నా పెడతాడు’ అనేవారు.

ఆ రోజుల్లోనే ఇంట్లో కష్టసుఖాలు నాకు అంటరాదన్న ఉద్దేశ్యంతో నాన్న నన్ను హాస్టల్‌లో చేర్పించాడు. అమ్మ అపురూపానికి దూరమైనా నాకూ హాస్టల్‌ బాగానే ఉండేది. ఎప్పుడో ఒకసారి సెలవులకు వెళ్లినా ఇంటి విషయాలు నా వరకూ పెద్దగా వచ్చేవి కాదు. అమ్మా నాన్నా నా మీద ఈగనైనా వాలనిచ్చే వారు కాదు.

మొత్తానికి ఎవరి దారిన వారు.. ఎవరి కుటుంబం వారిది.. చాలా జ్ఞాపకాలు మరుపులోకి జారిపోయాయి.

మంచి ఉద్యోగం..

అన్నట్టు జానకి గురించి చెప్పలేదు కదూ..

జానకి నా చిన్ననాటి దోస్త్‌.

ఎంతో ప్రేమగా ఉండేది. చిన్నపిల్ల కదా అని ఎవరేం ఇచ్చినా దాచి మరీ నాకు పెట్టేది. హాస్టల్‌కి వెళ్లినా.. వచ్చినప్పుడల్లా మా స్నేహానికేం అడ్డం ఉండేది కాదు.

ఎమ్మెస్సీ చదివే రోజుల్లో కాబోలు ఒకసారి మాట్లాడాలి అంటే ఊరవతల ఆంజనేయ స్వామి గుళ్లో కలుసుకున్నాం.

చాలా సేపు నిశ్శబ్దంగా కూచుంది జానకి పొడవాటి జడ చివరలు అల్లుతూ.. విప్పుతూ..

నేను ఎప్పటిలా మా హాస్టల్‌ గురించీ నా చదువు గురించి కాజువల్‌గా మాట్లాడుతున్నాను.

‘శివా.. ఇదివరకులా ఇక మనం కలవలేక పోవచ్చు’

‘అదేం జానకీ మనం ఎప్పటికీ ఇలాగే కలుసు కుందాం’

‘కాదు శివా విను. మన గురించి ఏమైనా ఆలోచించావా?’

‘ఆలోచనా? దేనికి?’

‘శివ నాకు పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు. రెండు మూడు సంబంధాలు కూడా చూసారు’

అప్పుడు నాకు తట్టింది.

‘సారీ జానకీ. ఇంకా నా చదువు పూర్తి కాలేదు. ఆపైన పి.హెచ్‌డి చెయ్యాలి. నేను స్థిరపడే వరకూ ఏమీ ఆలోచించలేను’

‘పోనీ స్థిరపడే వరకూ ఎదురు చూడనా?’ ఎంత ఆశ ఆమె ప్రశ్నలో.

‘అప్పటి సంగతి ఇప్పుడు ఎలా చెప్పను జానకీ’

చాలా సేపు తల వంచుకుని కూచున్న జానకి ఉన్నట్టుండి లేచి పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా వెళ్లిపోయింది.

అప్పట్లో ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు కూడా.

నాతో పాటు పి.హెచ్‌డి చేసి కాలేజీ ప్రొఫెసర్‌గా చేరిన ధనలక్ష్మితో పెళ్లి నా ఇష్టంతోనే జరిగింది.

కానీ పట్టుమని అయిదారేళ్లు కూడా పని చెయ్యలేదు ధనలక్ష్మి. ఇద్దరు అబ్బాయిలు. పిల్లలకు అమ్మ ప్రేమ అవసరం అంటూ..

పాతికేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే..

ఉదయం లేచినది మొదలు అర్ధరాత్రి వరకు నా సైన్స్‌ కౌన్సిల్‌ మీటింగ్స్‌, అభినందనలు, అవార్డ్‌లు, విదేశీ గౌరవాలు.. అర్ధరాత్రి ఇల్లు చేరే సరికి ధనలక్ష్మి, పిల్లలు సగం నిద్రలో ఉంటారు. ఉదయం లేచేసరికి నా డైలీ ప్లానర్‌ ఎదురుగా ఉంటుంది.

ఈ ఉదయం శంకర్‌ ఫోన్‌ వచ్చే వరకూ నాదైన ఒక మిధ్యా లోకంలోనే గడిపాను.

శంకర్‌ కూడా చిన్నప్పుడు నాతో చదువుకున్న మిత్రుడు. నిజానికి మా ఇద్దరికీ ఎమ్మెస్సీలో గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. అయితే అక్కడితో చదువు ఆపి కాలేజీలో లెక్చరర్‌గా స్థిరపడ్డాడు.

అడపా దడపా పలకరింపులే గాని నా హోదా వల్ల తీరిక లేక.. కాదు ఉన్న తీరిక సమయం నయనతో గడపడానికే చాలదు.

నయన నా పీఏ.

అలసిపోయిన ఏ క్షణాల్లోనో నాకు దగ్గరైంది. పది పదిహేనేళ్లుగా తనే నా ఓదార్పు, నా రిలాక్సేషన్‌.

ఉదయం శంకర్‌ ఫోన్‌..

సాయంత్రం హోటల్‌ తాజ్‌ బంజారాలో ఒక సర్‌ప్రైజ్‌ పార్టీ అనీ.. తప్పక రమ్మని…

ముందు ఏదో వంక చెప్పి తప్పించుకోవాలని చూసాను.

‘నయనకు మాట ఇచ్చావా? ఈ ఒక్కసారికీ తప్పినా సరే రావాలి. రాకపోతే తరువాత బాధ పడతావు’

నయన సంగతి తనకు తెలుసా? ఆశ్చర్య పోయాను. ఈ లెక్కన నా గురించి ఎంత మందికి తెలుసో!

రోజంతా అదే ఆలోచన.

వాట్సప్‌లో ఇన్విటేషన్‌ పంపాడు.

తన పేరెంట్స్‌ యాభై ఏళ్ల వెడ్డింగ్‌ ఆనివర్సరీ. వారికి సర్‌ప్రైజ్‌ పార్టీ. ధనలక్ష్మికి ఫోన్‌ చేసాను. వీలుకాదట. ఏదో వంక.

ఈ మధ్య కావాలనే నన్ను అవాయిడ్‌ చేస్తోందా?

ఏమో!

అవును.

మొదట్లో దెబ్బలాడేది. తనని, పిల్లలను పట్టించుకోవడం లేదని.

ఆపైన అలగటం. అప్పట్లో అలసి సొలసి ఇంటికి వస్తే ఆమె అలకలు చిరాకనిపించేవి.

ఆ సమయంలోనే నయన దగ్గరవుతా.

తొలిసారిగా నా మైండ్‌ బ్లాంక్‌ అయింది. పనులన్నీ వాయిదా వేసి ఇంటికి వెళ్దామనుకున్నాను.

ఈలోగా ధనలక్ష్మే కాల్‌ చేసింది. పిల్లలు కాలేజీ పిక్నిక్‌కి నాలుగు రోజులు వెళ్లారట. తను తల్లిదండ్రులను చూడటానికి వరంగల్‌ వెళ్తున్నానని.

సాయంత్రం ఐదున్నరకే కాల్‌ చేసి శంకర్‌ దగ్గరకు వెళ్లాను. ఏమైనా హెల్ప్‌ చెయ్యాలా? అని.

అప్పటికే, తాజ్‌ బంజారాలో హాల్‌కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు శంకర్‌.

కారు అతని భార్య, కూతుళ్లను తీసుకుని వెళ్లిందట. నా కారులో ఇద్దరం బయలుదేరాం.

పార్టీ హాల్‌లో కాదు. ఓపెన్‌ ఏరియాలో.

మధ్యన పెద్ద వేదిక ఒకవైపు. దాని ఎదురుగా మరొక వేదిక అప్పటికే పూలతో అలంకరించారు.

వేదిక చుట్టూ రౌండ్‌ టేబుల్స్‌, చెయిర్స్‌ ఏర్పాటు చేసారు.

శంకర్‌ తనతో తెచ్చిన ఫోటో ప్రింటవుట్స్‌ స్టేజీ వెనకాల వైట్‌ షీట్‌ మీద పిన్‌ చేసాడు. అవి అతని పేరెంట్స్‌ పెళ్లి రోజు నుండీ ఈ ఉదయం వరకూ ముఖ్య ఘట్టాలు.

మధ్య మధ్య విరిసీ విరియని ఎర్ర గులాబీలు.

ఆ పూలమధ్య అత్తరులో ముంచిన వెల్వెట్‌ పూలు. అరగంటలో అలంకరణ ముగించి శైల, అదే అతని భార్య, పిల్లలు ఇంటికి వెళ్లారు.

కొసమెరుపు అలంకరణ చూస్తూ శంకర్‌ మాట్లాడుతున్నాడు.

‘పిల్లల్ని చూసావుగా, పెద్దది రమ్యకు సాహిత్యం అంటే ఆసక్తి. ఎమ్మే తెలుగు చదువుతోంది. చిన్నది ఇంకా చురుకు. అది వాళ్లమ్మలా వీణ విద్వాంసురాలు కావాలని..’

విస్మయంగా చూసాను.

‘సారీ ఎప్పుడూ చెప్పలేదు కదూ శైల వీణ ఏ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌’

‘శంకర్‌ గోల్డ్‌ మెడల్‌ వచ్చి పి.హెచ్‌డికి వెళ్లనందుకు ఎప్పుడూ రిగ్రేట్‌ అవలేదా?’

ఒక్క క్షణం ఆగాడు శంకర్‌.

‘లేదు శివా.. నన్ను అంతవరకు చదివించటమే ఎక్కువ. నాన్నకు చేదోడు వాదోడుగా ఉండాలి. ఏదైనా కావాలనుకునే ముందు నేను నా మూలాలను గుర్తుంచుకోవాలి. నా తరువాత ముగ్గురు చెల్లెళ్లు. వారి పెళ్లి పేరంటాలు.. అవన్నింటి ముందు నేను ఒక్కడినే ముఖ్యం కాదుగా.. అనుకున్నది చేసాను. అమ్మా నాన్నకు కొడుకుగా ఇవ్వగలిగినంత ఇవ్వాలి. ఎప్పుడో సంగతి ఎలా చెప్పగలను. ఒక కొడుకుగా, ఒక సోదరుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా నా బాధ్యతలు నిర్వహించటం, నా వత్తికి న్యాయం చేకూర్చటం ఇవే కదా .. ఇదే కదా భగవద్గీత అయినా మరొకటైనా! మరొకటైనా!’

ఇద్దరం వాళ్లింటికి వెళ్లి ఫ్రెష్‌ అయి శంకర్‌ అమ్మ గారు ఇచ్చిన కాఫీ తాగాం.

అప్పటికే అతని పేరెంట్స్‌ రెడీ అయి ఉన్నారు.

‘ఎందుకురా ప్రతి పార్టీకి మమ్మల్ని రమ్మని..’ నసిగింది ఆవిడ.

‘నానమ్మా పార్టీలు సకుటుంబ సమేతంగా.. మా ఒక్కరికే కాదు’

జవాబు ఇచ్చింది శంకర్‌ పెద్ద కూతురు.

వాళ్లంతా ఒక కారులో.. నేను, శంకర్‌ మరో కారులో వెళ్లాం. లౌంజ్‌లో అడుగుపెడుతూనే ఇద్దరి మీద మల్లెల జల్లు సర్‌ప్రైజ్‌.. ‘వెడ్డింగ్‌ ఆనివర్సరీ’ అంటూ శుభాకాంక్షలు.

లోపల పార్టీ ఏరియా చేరకముందే చెవులకు చేరిన సంగీతం.

ఆ తరువాత అయిదారు గంటలు ఎలా గడిచి పోయాయో. శైల కుడా వీణ వాయించింది. శంకర్‌ వీలైనంత వరకూ నాతోనే ఉన్నాడు.

మరికొందరు మిత్రులు కూడా.

మాటల మధ్యలో శంకర్‌ అడిగాడు.

‘అసలు నువ్వు నీ జీవితాశయం ఏమిటని అనుకుంటున్నావు? నీ కలో, నీ స్వప్నమో మరొకటో మరొకటో ఏదైనా…’

జవాబు లేక వెర్రి నవ్వు నవ్వాను.

ఆ ప్రశ్న నన్ను ఒక పులిలా వెన్నాడుతూనే ఉంది.

‘నాకు ఒక స్వప్నం అనేది తెలుసా? ఒక ఆశయం … కలలు ప్చ్‌ !’

చదువుకునే రోజుల్లో నా కన్నా ఎవరూ బాగా చదవకూడదు. నేనే ద గ్రేటెస్ట్‌ అవాలి అన్న ఒక అహం. నిజం అహమే సరైన పదం. ఆ అహం నిలువెల్లా పాకి ఎప్పటికప్పుడు ఊడలు పాతు కుంటూ.. ఇంటా బయటా వెర్రితలలు వేసిన అహం.

అందుకే వాడి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు. ఇది వరకు ఇలాంటి సమయాల్లో నయన ఫ్లాట్‌కి వెళ్లే వాడిని. ఇప్పడు మాత్రం ఏదో ఒక ప్రశ్న నాలో ఒక అంతర్దహనాన్ని రగిల్చింది.

ఏం సాధించాను?

నా ¬దా, నా పేరు ప్రఖ్యాతలు ఏ మాత్రం ఆనందాన్నిచ్చాయి? నా పిల్లలకు, నా భార్యకు అవి అవసరం లేదు. అమ్మా నాన్న ఎక్కడో ఊర్లో ఉన్నారు.

అక్కలతో అంత సఖ్యత లేదు.

ఇందాక శంకర్‌ పార్టీలో అతని చెల్లెళ్లు అతనితో ఎంత ప్రేమగా ఉన్నారు.

ఎంత సరదాగా ఉన్నారు? చిన్న చెల్లెలు వీపు తట్టి ఒక తండ్రిలా అతను మాట్లాడటం చూసాను.

ఎక్కడ పోగొట్టుకున్నాను ఈ జీవితాన్ని. ఇంతదూరం నడిచి వచ్చాక వెనక్కు వెళ్లగలనా?

పాలుపోని అయోమయంలో ఎంత సేపలా కూర్చున్నానో.

ప్యాట్రోలింగ్‌ పోలీసులు వచ్చి తట్టి లేపారు.

‘రాత్రి రెండు దాటింది. ఎందుకిలా కూచున్నారు?’ అనుమానంగా చూసారు.

నా విజిటింగ్‌ కార్డ్‌ ఇచ్చాను.

‘కారు ఎక్కడ? ఈఫ్‌ యు డోంట్‌ మైండ్‌.. తాగారా?’

లేదన్నట్టు తలూపి కారు పార్క్‌ చేసిన చోటు చూపించాను.

‘ఇంటికి వెళ్లండి’ ముందుకు నడిచి అక్కడ ఆగారు.

వాళ్లకి అనుమానంగా వుంది ఎక్కడ సూసైడ్‌ చేసుకుంటానో అని.

నవ్వొచ్చింది.

అశోకుడికి ఇలాగే బోధి వక్షం కింద జ్ఞానోదయమై..

ఓటమి అంగీకరించి వెనక్కు నడవాలా? లేదూ ఎదురుగా ఉన్న హుస్సేన్‌ సాగర్‌..

ఒళ్లు జలదరించింది.

నా జీవితాశయం ఏమిటి? పెద్ద ప్రశ్నార్ధకం?

నా దారి ఎటు?

ఈ అహాన్ని, నిలువెల్లా నాతో పాటు పెరిగిన అహాన్ని ఏ రకంగా వదిలించుకోగలను?

నా కంటూ నా దారిని ఎలా వెతుక్కోను?

అయినా ఏదీ ఒక్క రోజులో మారిపోవడం అసాధ్యం. ఇంటికి వెళ్లి నిద్రపోగానే ఆ ఆలోచనల్ని ఇక్కడే వదిలేసి నా రొటీన్‌లో దూరిపోతానేమో.

నిజమే ఎవరినో చూసి నేను అలా లేనని ఎందుకు అనుకోవాలి?

ఏమీ జరగనట్టు మనసుల మధ్య పెరిగిన దూరాలు తొలగించగలనా? కష్టతరమేమో కాని అసాధ్యం కాదు.

మళ్లీ అక్షరాలు దిద్దుకున్నట్టు. ఒక దారిన ఇంతదూరం నడిచి వచ్చాక మళ్లీ వెనక్కు వెళ్లగలనా?

లేచి కారు వైపు నడిచాను.

నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలిగా!

ఇంటికి కాదు నేరుగా ధనలక్ష్మి దగ్గరకు. ఆపైన దూరాలు దగ్గర చేసుకునే ప్రతి ఒక్కరి దగ్గరకూ.. న

– స్వాతీ శ్రీపాద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *