ఆశీస్సులు అందుకొనే చి||ల||సౌ||

ఆశీస్సులు అందుకొనే చి||ల||సౌ||

కొందరికి కొన్ని పాత్రలు నప్పవు. కానీ మాస్‌ ఇమేజ్‌ను సంపాదిస్తేనే కమర్షియల్‌ సక్సెస్‌ లభిస్తుందనే దురభిప్రాయంతో తగదునమ్మా అంటూ అలాంటి పాత్రలే చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు సుశాంత్‌ మొన్నటి వరకూ అదే పనిచేశాడు. తొలి చిత్రం ‘కాళిదాస్‌’ నుండి మొన్నటి ‘ఆటాడుకుందాం రా’ వరకూ పక్కా కమర్షియల్‌ సినిమాల్లో నటించాడు. వాటిని సొంత బ్యానర్‌లోనే నిర్మించడంతో నష్టాలూ చవిచూశాడు. అయితే ఇంతకాలానికి అతనికి జ్ఞానోదయం అయిందని అనుకోవాలి. తొలిసారి ఓ భిన్నమైన కథకు పచ్చజండా ఊపాడు. అంతేకాదు… సొంతంగా తీయకుండా దానిని బయటి బ్యానర్‌లో చేశాడు. అదే ‘చి.ల.సౌ’ చిత్రం. తమిళ కుర్రాడైన రాహుల్‌ రవీంద్రన్‌ ‘అందాల రాక్షసి’తో హీరోగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఆరేడు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మారాడు. వీరిద్దరిపై నిర్మాతలు జస్వంత్‌, హరి, భరత్‌కుమార్‌ పెట్టుకున్న నమ్మకానికి ప్రేక్షకులు సైతం ఆమోద ముద్రవేయడం విశేషం.

కథగా చెప్పుకోవాలంటే చాలా చిన్నది. ఆరేడేళ్ల క్రితం ప్రేమ విఫలం కావడంతో కెరీర్‌ మీదే దృష్టి పెడతాడు అర్జున్‌ (సుశాంత్‌). ఓ లగ్జరీ కారు కొనుక్కోవాలి, ఒంటరిగా యూరప్‌ చుట్టి రావలన్నది అతని కోరిక. అందుకోసం డబ్బులు ఆదా చేస్తుంటాడు. ఇప్పటికే అర్జున్‌కు ఇరవై యేడేళ్లు. ఇంకో ఐదేళ్లు ఆగితే అరేంజ్డ్‌ మ్యారేజ్‌ అవకాశాలు ‘షింక్‌’ అయిపోతాయన్నది అతని తల్లి (అనుహాసన్‌) బాధ. ఆమె ఒత్తిడి మేరకు రెండు పెళ్లిచూపులకు ఇష్టం లేకపోయినా వెళతాడు. అక్కడి వాతావరణానికి చికాకు పడతాడు. దాంతో ఈసారి తమ ఇంటికే అమ్మాయిని రప్పించి, ఇద్దరూ కలిసి ఒంటరిగా మాట్లాడుకునే ఏర్పాట్లు చేస్తుంది అర్జున్‌ తల్లి. ఆమె చేసిన ఈ అరేంజ్‌మెంట్‌కి అర్జున్‌కు పిచ్చి కోపం వస్తుంది. వచ్చే అమ్మాయి రకుల్‌ ప్రీత్‌ అంత అందంగా ఉన్నా పెళ్లికి మాత్రం ఒప్పుకోనని ముందే చెప్పేస్తాడు. ఇదిలా ఉంటే తనకు వ్యక్తిగతంగా పెళ్లంటే ఇష్టలేకపోయినా తల్లి అనారోగ్యం కారణంగా పెళ్లికి సిద్దపడుతుంది అంజలి (రుహనీశర్మ). గతంలో రెండు పెళ్లిసంబంధాలు తల్లికి ఉన్న బైపోలార్‌ సమస్య వల్ల చెడిపోతాయి. దాంతో తల్లి మరింత డిప్రషన్‌కు వెళ్లకూడదని అర్జున్‌ను కలవడానికి వస్తుంది అంజలి. మరి భిన్నమైన అభిరుచులు, మనస్తత్వాలు, లక్ష్యాలు ఉన్న వీరిద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇష్టపడ్డారా? లేక ఎవరి దారి వారు చూసుకున్నారా? రాత్రి ఏడు గంటల నుండి మర్నాడు ఉదయం ఏడు గంటలలోపు వారి జీవితంలో ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథ.

కేవలం ఇరవై నాలుగు గంటల్లో జరిగే కథను రెండు గంటల పది నిమిషాల చిత్రంగా తెర కెక్కించడం అనేది కష్టసాధ్యమైన పని. గతంలో ఇలా టైమ్‌ బౌండ్‌తో వచ్చిన చాలా సినిమాలు పరాజయం పాలైనాయి. పైగా ఆరేడు పాత్రలతో కథనంతా నడిపించడం అంటే కత్తిమీద సాములాంటిది. దానికి తోడు దర్శకుడికి అది తొలి చిత్రం అయితే… నమ్మకం సడలిపోతుంది. అయినా… రాహుల్‌ రవీంద్రన్‌ చెప్పిన కథను నమ్మి ఇటు సుశాంత్‌, అటు నిర్మాతలు పచ్చజెండా ఊపారంటే గొప్పవిషయమే. వారు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నూరుశాతం నిలబెట్టుకున్నాడు రాహుల్‌. ఈ సినిమా విజయంలో అగ్రతాంబూలం అతనికే దక్కాలి. సుశాంత్‌ను సైతం చాలా కొత్తగా చూపించాడు. ఇంతకాలం అతనిలో ఇంత ప్రతిభ ఏమూల దాగి ఉంది అనుకునేలా చేశాడు. మొదటి సినిమానే అయినా రుహానీ శర్మ అనుభవం ఉన్న నటిలా అంజలి పాత్రలో లీనమై పోయింది. సుశాంత్‌ తల్లిగా అనుహాసన్‌ బాగా చేసింది. బైపోలార్‌ లక్షణాలు ఉన్న తల్లిగా రోహిణితో కాస్తంత ఓవర్‌ యాక్షన్‌ చేయించారనిపిస్తుంది. ఆ మోతాదు కాస్తంత తగ్గించాల్సింది. హీరోయిన్‌ మావయ్యగా జయప్రకాశ్‌ పాత్రోచితంగా నటించారు. చాలా కాలం తర్వాత ‘వెన్నెల’ కిశోర్‌ కామెడీని ఆద్యంతంగా ఆస్వాదించే అవకాశం కలిగింది. అతను కనిపించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. అలానే రాహుల్‌ రామకృష్ణపై చిత్రీకరించిన పోలీస్‌ స్టేషన్‌ ఎపిసోడ్‌ కూడా బాగుంది.

ప్రశాంత్‌ విహారి ఇచ్చిన బాణీల కంటే నేపథ్య సంగీతం బాగుంది. సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఎం. సుకుమార్‌ ఫోటోగ్రఫీ చక్కగా ఉంది. సుశాంత్‌, రుహానీ శర్మ మీద క్లోజప్‌ షాట్స్‌ పెట్టి భావోద్వేగాలను పలికించమనడం అంత సులువైన విషయం కాదు. ఎంతో హోమ్‌వర్క్‌ చేస్తే తప్పితే అది కుదరదు. అయినా ఈ విషయంలో దర్శకుడు రాజీ పడలేదనిపిస్తుంది. వీరిద్దరిపై చాలా వరకూ క్లోజప్‌ షాట్సే ఉన్నాయి. అయినా ప్రతి ఫ్రేమ్‌లోనూ అందంగా కనిపించారు. ఆ పాత్రలను సొంతం చేసుకోవడం వల్ల కూడా అది జరిగి ఉండొచ్చు. సినిమా విడుదలకు ముందు దీనిని చూసి, మెచ్చి నాగార్జున నిర్మాణ భాగస్వామి కావడం ‘చి.ల.సౌ.’కు బాగా కలిసొచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి రోమ్‌-కామ్‌ మూవీస్‌ జాబితాలో ‘చి.ల.సౌ’ కూడా చేరిపోయింది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కు వెళితే మాత్రం నచ్చుతుంది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *