సెల్‌ఫోన్‌ రామాయణం

సెల్‌ఫోన్‌ రామాయణం

‘బన్నీ… చిన్నీ ! ఏదో శబ్దం వినపడుతోంది… ఏమిటీ గొడవ’ వంటగదిలోంచే గట్టిగా అరిచింది రాధిక.

‘నాన్న చెప్పినట్లు అమ్మవి పాము చెవులే… ఎంత మెల్లగా కొట్టుకుంటున్నా కనిపెట్టేస్తుంది…’ అని మెల్లగా అన్నాడు ఆరో తరగతి చదువుతున్న బన్నీ.

‘ఒరే బన్నీ ఇంకోసారి నీ పని పడతాను’ కోపంగా అన్నాడు నాలుగో తరగతి చదువుతున్న చిన్నీ.

‘నేను నీ కన్నా పెద్దవాడిని.. ఎప్పుడో ఎందుకు నీ పని ఇప్పుడే పడతాను చూసుకో’ అని చెప్పి, ‘అమ్మా…’ ఇల్లు ఎగిరిపోయేలా బిగ్గరగా అరిచాడు బన్నీ.

రాధిక వంటగదిలోంచి వేగంగా వస్తే… తుండుగుడ్డ కట్టుకొని అదే వేగంతో స్నానాల గది నుండి వచ్చాడు పద్మనాభం.

‘ఏమిట్రా.. ఏమైంది’ ఆందోళనగా అడిగింది రాధిక.

‘అమ్మా… వాడు నా కడుపు మీద గట్టిగా కొట్టాడు’ కడుపు పట్టుకొని బాధతో తాళలేక పోతున్నట్లు.. మెలికలు తిరుగుతూ చక్కగా నటిస్తూ తమ్ముడి వైపు తిరిగి కన్నుకొట్టాడు బన్నీ.

‘రేయ్‌ చిన్నీ అన్నయ్యను ఏం చేసావు…’ కోపంగా అడిగాడు పద్మనాభం.

‘ఒట్టు నాన్నా… వాడ్ని నేను కడుపు మీద కొట్టనేలేదు. అసలు వాడే ముందు నన్ను కొట్టాడు’ అంటూ తాను చెప్పేదంతా నిజమన్నట్టుగా తలపైన చేయి పెట్టుకొన్నాడు చిన్నీ.

‘నాన్నా వాడు అబద్ధం చెపుతున్నాడు. వాడే మొదట నన్ను కొట్టాడు. ఆ తరువాత నేను మెల్లగా కొట్టాను. దానికి వాడు బలమంతా ఉపయోగించి నా కడుపులో గట్టిగా కొట్టాడు.. ఒట్టు నాన్న’ అంటూ ఒక చేతిని తలపైన పెట్టుకొన్నాడు బన్నీ.

ఒకే సంఘటనను ఒకడు కాదని, మరొకడు అవునని ఒట్టు పెట్టి మరీ చెప్పడంతో పద్మనాభం నిర్గాంతపోయాడు.

‘చూసావా రాధికా ఒకడు కొట్టాడని, ఇంకొకడు కొట్టలేదని…’ అంటూ పిల్లల వైపు చూసి ‘మొత్తం మీద అబద్ధాన్ని నిజం చెయ్యడం కోసం ఒట్టు పెట్టి మరీ చెబుతున్నారు. ఒరేయ్‌ మీ ఒట్టుతోనే మా ప్రాణాలు పోతాయి.. అప్పుడు తెలుస్తుంది మీకు ఒట్టు విలువ…’ కోపంతో అన్నాడు పద్మనాభం.

‘ఇంతకూ గొడవ ఎందుకు జరిగింది… ఒట్టు పెట్టకుండా నిజం చెప్పారంటే వదిలేస్తాను. లేదంటే వాతలు పెడతాను’ అంది రాధిక.

ఇద్దరూ ఒక్కసారిగా చెప్పడానికి ముందుకు రావడం చూసి ‘ఒరే బన్నీ పెద్దవాడివి నువ్వు ముందు చెప్పారా…’ అంది.

‘నాన్న స్నానాల గదికి వెళ్లగానే ఎప్పటిలా సెల్‌ఫోన్‌ తీసుకోడానికి ఇద్దరం వేగంగా వచ్చినా, మొదట నేను తీసుకొని వీడియో గేమ్‌ ఆడటం ప్రారంభించాను. నేను ఒక ఆట ఆడి వాడికిచ్చాను’ అన్నాడు బన్నీ.

‘నేను కూడా ఒక గేమ్‌ ఆడి బన్నీకి ఇచ్చాను. వాడు గేమ్‌ ఆడకుండా సెల్‌లో ఉన్న నా పాత ఫోటో తీసి దానికి మీసం, గడ్డం పెట్టి ఎగతాళి చేశాడు. నాకు కోపం వచ్చి వీపు మీద ఒక దెబ్బ వేసాను’ అన్నాడు చిన్నీ.

‘అమ్మా అసలు వాడి ఫోటో తీసుకొని ఎటువంటి బొమ్మా గీయలేదు.. కావాలంటే చూడండి’ అంటూ బన్నీ సెల్‌ఫోన్‌ రాధిక చేతికి ఇచ్చాడు.

‘అమ్మా వాడు అబద్ధం చెబుతున్నాడు. నిజంగానే వాడు నన్ను ఏడిపించాడు. ఇప్పుడు డిలీట్‌ చేసినట్లున్నాడు. నేను నిజమే చెబుతున్నాను’ అలవాటు ప్రకారం చేతిని తల మీద పెట్టుకోబోయి వెనక్కి తీసాడు.

‘మీలో ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో… ప్చ్‌… ఆ బ్రహ్మదేవుడు దిగివచ్చినా కనిపెట్టలేడు’ అని రాధిక అంటుంటే..

‘ఇద్దరినీ బెల్ట్‌తో నాలుగు బాదితే నిజం తెలుస్తుంది’ అన్నాడు పద్మనాభం.

‘ఇందులో తప్పు మనదీ ఉంది…’ అంది రాధిక.

ఆ మాటలకు భార్యవైపు కోపంగా చూస్తూ ‘ఏమిటీ మనలోనూ తప్పు వుందా…?’ అనడిగాడు పద్మనాభం.

‘సెల్‌ఫోన్‌ పిల్లలకు అందుబాటులో ఉంచడం మన పొరపాటు.. ఇక మీదట మీరు స్నానాల గదికి వెళ్లడానికి ముందు సెల్‌ఫోన్‌ వంట గదిలో పెట్టి వెళ్లండి’ అంది రాధిక.

‘మీ అతితెలివి నా దగ్గరే ప్రదర్శిస్తారా. ఈ రోజు అబద్ధం చెప్పినదెవరో తెలిసిన రోజు నేను నా తెలివితో శిక్షిస్తాను’ అంటూ బెడ్‌రూమ్‌ వైపు వెళ్లాడు పద్మనాభం.

‘చేసిన నిర్వాకం చాలు కానీ, బడికి వెళ్లే సమయం కావస్తుంది తయారుకండి’ అంటూ రాధిక వంట గదిలోనికి వెళ్లింది.

———

‘ఏవండీ పండగ ఈ వారమేనన్న సంగతి మరిచారా…’ అంది రాధిక.

‘ఏం పండగ’

‘అన్నీ వివరించి చెప్పాలా? దీపావళి అని తెలీదా’ అంటూ చిలిపిగా పద్మనాభం బుగ్గ గిల్లింది రాధిక. ఉగాదికి ముందు పట్టుచీర కోసం తన చెంప గిల్లిన రాధిక మరలా ఈ రోజు గిల్లుతోంది. ఎక్కడ పట్టుచీర అడుగుతుందోనని బిక్కు బిక్కు మంటున్న గుండెతో ‘అవును ఏమిటి చెప్పు’ అన్నాడు.

‘పిల్లలు రెడీమేడ్‌ డ్రెస్‌లు అడుగుతున్నారు’ అంటూ రాగం తీసింది.

‘ఆగష్టు పదిహేనవ తేదీన జరిగిన కార్యక్రమం కోసం పిల్లలిద్దరూ కొత్త బట్టలు కొనుక్కున్నారుగా. ఇక ఈ దీపావళికి ఎందుకు… పిల్లలు కాల్చడానికి టపాకాయలు కొనాలన్నా సంగతి మరిచావా?’ అన్నాడు.

‘దీపావళికి కొత్త దుస్తులు, టపా కాయలు కొనక తప్పదండీ’

సరేనన్నట్టుగా తలాడించాడు పద్మనాభం.

‘అలాగే నేను ఒక …’

‘చీర అడుగుతుందో, లేక పట్టుచీర అడుగుతుందో’ అని మనసులో చిరాగ్గా అనుకొన్నాడు పద్మనాభం.

‘దీపావళికి ఆఫర్‌ ధరలో సెల్‌ఫోన్‌ దొరుకుతోంది. ఎలాగూ నాకు ఇంతవరకు సెల్‌ఫోన్‌ లేదు’ అంది రాధిక.

ఇంతకాలం అడగకుండా ఉండటమే పెద్ద విషయం అనుకుంటూ.. సరేనని తలూపాడు పద్మనాభం.

‘ఈ సెల్‌ఫోన్‌ కూడా పిల్లల చేతికి అందకుండా చూసుకొంటాను’ ఆయన అడగకుండానే హామీ ఇచ్చింది.

‘ఈ రోజు రెండు గంటలు ముందుగా పర్మిషన్‌ తీసుకొని వస్తాను.. సాయంత్రం అయితే చాలా రద్దీగా ఉంటుంది’ అన్నాడు పద్మనాభం.

‘అలాగే త్రివేణి థియేటర్‌కు వెళ్దామా… చాలా రోజులయింది సినిమా చూసి. పిల్లలు కూడా ఆ సినిమా చూడాలని ముచ్చట పడుతున్నారు. మన వీధిలో చాలామంది చూసేసారు’ అంది రాధిక.

‘ఆ సినిమా బాగుందని చాలామంది చెప్పడం విన్నాను. నేను పోదామనుకొంటే రాధిక కోప్పడుతుందని చెప్పలేదు. ఇప్పుడు రాధికే అడిగింది’ అని మనసులో అనుకొన్నాడు పద్మనాభం. సరేనని చెబుతూ ‘ఈ రోజు నేను మధ్యాహ్నం వచ్చే లోపు బన్నీని గోవిందు హెయిర్‌ కటింగ్‌ షాప్‌కెళ్లి వెంట్రుకలు కత్తిరించుకొని రమ్మని చెప్పు. డబ్బులు నేను మళ్లా ఇస్తాను, వెంట్రుకలు ఎంత పొడుగ్గా పెరిగాయో చూడు… అన్నీ మనమే చెప్పాలి’ అన్నాడు.

చిన్నీ, బన్నీలు జరుగుతున్న సంభాషణ విని పొంగిపోయారు.

తండ్రి ఆఫీసుకు బయల్దేరగానే ‘ఒరే బన్నీ… ఆ రోజు నీవు అబద్ధం చెప్పిన సంగతి నాన్నకు చెప్పాను..’ అన్నాడు చిన్నీ.

‘నాన్న ఏం చెప్పారు’ అడిగాడు బన్నీ.

‘నువ్వు మరచిపోలేని విధంగా శిక్షిస్తానని చెప్పారు’ అన్నాడు.

ఆ మాటల్ని నిర్లక్ష్యంగా తీసుకొంటూ ‘నాన్నకు మన ఇద్దరి మీదా సందేహమే… ఏదో నీ తప్తికోసం చెప్పి ఉంటారు.. పోరా’ అన్నాడు బన్నీ.

———

ఖాళీగానే ఉన్న గోవిందు హెయిర్‌ కటింగ్‌ షాప్‌లోనికి వెళ్లాడు బన్నీ.

‘రా.. బన్నీ’ అంటూ కుర్చీ చూపించాడు.

కుర్చీలో కూర్చొని ‘కాస్త చిన్నగా…’ అంటుంటే బన్నీ మాటలకు అడ్డు పడుతూ ‘మీ నాన్న గారు నాకు చెప్పారులే…’ అంటూ కటింగ్‌ మొదలుపెట్టాడు గోవిందు.

‘అవునూ నీ తలలో చుండ్రు, దురద ఉందటగా…’ అంటూ బన్నీ తల వంచాడు గోవిందు.

ఈ విషయం గోవిందుకెలా తెలిసింది అనుకొంటూ ‘కొద్దిగా అంకుల్‌’ తల ఎత్తకుండానే అన్నాడు బన్నీ.

ఉన్నట్లుండి తన జుట్టు ఎక్కువగా పడటం చూసి అనుమానంతో అద్దం వైపు చూసాడు, అప్పటికే కాస్త గుండు ‘అ.. అ.. అదేమిటి అంకుల్‌’ ఏడుపు గొంతుతో అన్నాడు.

‘మీ నాన్న నీకు గుండు కొట్టమని చెప్పారు’ అంటూ గుండు కొట్టసాగాడు. పూర్తి కాగానే ఏడుస్తూ వేగంగా పరుగెత్తి రాధిక ఒడిలో పడి భోరుమని విలపించసాగాడు.

———

మధ్యాహ్నం రెండు గంటలకు పర్మిషన్‌ తీసుకొని హుషారుగా ఇంటికి వచ్చాడు పద్మనాభం.

‘అసలు మీకు తెలివి అంటూ ఏమైనా ఉందా… ఏదో పనిష్మెంట్‌ ఇస్తాను ఇస్తాను అంటే, ఏమిటో అనుకొన్నాను. బాగుంది మీ బోడి పనిష్మెంట్‌…’ గావుకేక పెట్టింది రాధిక.

‘ఏమిటే ఆ గావుకేక’ అయోమయంగా అడిగాడు.

‘సెల్‌ఫోన్‌ ఉన్న ఇండ్లలో జరిగే రామాయణమే… మన ఇంట్లో కొత్తగా జరగడం లేదు. చిన్నపిల్లలు అబద్ధం చెప్పడం అందరిండ్లలో జరిగేదే… మనమే నిదానంగా అర్థమయ్యేలా చెబితే వింటారు. వాళ్లు ఒక్కొక్కరికి సెల్‌ఫోన్‌ కావాలని అడిగారా… కొందరిండ్లలో వెళ్లి చూస్తే తెలుస్తుంది… ఆ పిల్లలు సెల్‌ఫోన్‌ వాడే విధానం చూస్తే తొందరలోనే బ్రెయిన్‌ క్యాన్సర్‌ వస్తుందన్న అనుమానం కలుగుతుంది. ఇతరులతో పోలిస్తే మన పిల్లలు ఎన్నో రెట్లు నయం. ఆ రోజు సెల్‌ఫోన్‌ గొడవలో బన్నీ అబద్ధం చెప్పాడని పనిష్మెంట్‌ పేరుతో గుండు కొట్టిస్తారా… అప్పట్నుంచి ఒకటే ఏడుపు… ఎలా సముదాయించాలో అర్థం కావడం లేదు. ఇంకా అన్నం కూడా తినలేదు’ అంటూ తన వెనుకనున్న బన్నీని ముందుకు నిలబెట్టింది.

”దీపావళికి గుండు కొట్టించావా?’ అని నా స్నేహితులు ఎగతాళి చేస్తూంటే నేను ఏం సమాధానం చెప్పాలి?’ అంటూ ఏడుపు, కోపం కలగలసిన గొంతుతో అన్నాడు బన్నీ.

గుండుతో ఉన్న బన్నీని చూడగానే కళ్ల్లు బైర్లు కమ్మినట్టనిపించింది.. నోట మాటరాక చేతితోనే నేను కాదన్నట్టుగా సైగ చేసాడు. కొన్నిక్షణాల తరువాత మామూలు స్థితికి వచ్చాడు. ‘అసలు ఈ రోజు నేను గోవిందుతో చెప్పనే లేదు…’ మెల్లగా అన్నాడు పద్మనాభం.

‘ఈ రోజు ఉదయం చిన్నీ దగ్గర బన్నీ చేసిన పనికి సమయం చూసి శిక్షిస్తాను అని చెప్పారటగా…’ అంది రాధిక.

‘చెప్పాను… కానీ వెంటనే మరచిపోయాను. ఆ గోవిందును అడిగి వస్తాను’ అంటూ వెనక్కి తిరుగుతుంటే అంతవరకు బయట చాటుగా నిలబడి జరుగుతున్నదంతా చూస్తున్న చిన్నీ ఒక్కసారిగా సైరెన్‌ మోతలా ఏడుస్తూ లోనికి వచ్చాడు.

‘నీకేమైందిరా…’

‘ఆ రోజు వాడి కడుపు మీద నేను కొట్టానని ఒట్టు పెట్టి అబద్ధం చెప్పాడు. నిన్న కూడా ఆ విషయం చెప్పి నన్ను వెక్కిరించాడు’

‘ఇప్పుడు ఆ విషయం ఎందుకురా… అదంతా తరువాత మాట్లాడుకుందాం ముందు ఆ గోవిందు విషయం తేల్చాలి’ చిరాగ్గా అన్నాడు పద్మనాభం.

‘ఎలాగైనా బన్నీకి బుద్ధి చెప్పాలని ఉదయం ఆ గోవిందుకు నేనే ఫోన్‌ చేసి చెప్పాను’ అంటూ మరలా ఏడవడం ప్రారంభించాడు చిన్నీ.

‘ఏమని చెప్పావు’ అంది రాధిక.

‘పోయిన వారం నా ముందే ఫోన్‌ చేసి, ఓరే గోవిందూ మా చిన్నీ వస్తాడు కటింగ్‌ చేసి పంపు డబ్బు నేను వచ్చి ఇస్తాను అని చెప్పారుగా, ఈ రోజు నేను కూడా ఓరే గోవిందూ మా బన్నీ వస్తాడు గుండు చేసి పంపు తలలో చుండ్రు, దురద ఉందిరా డబ్బు నేను వచ్చి ఇస్తాను.. అని మీ ఫోన్‌ ద్వారా గోవిందుకు చెప్పాను’ అంటూ మరలా ఏడవసాగాడు.

‘అయినా మీ గొంతు, వాడి గొంతుకు.. నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటే వాడెలా విన్నాడు’ కోపంగా భర్త వైపు చూస్తూ అంది రాధిక.

‘అవునే ఈ గొడవలో నా మతి పూర్తిగా పని చెయ్యడం నిలిచిపోయింది ఇప్పుడే వెళ్లి తిట్టి వస్తాను.. అంటూ వెళ్లబోతుంటే ‘నాన్న’ అంటూ మరలా తండ్రి కాళ్లు పట్టుకొని మరింత బిగ్గరగా ఏడవసాగాడు చిన్నీ.

‘నీ కథ తరువాత చూస్తాను ఇప్పుడు అడ్డుపడద్దు’ అన్నాడు పద్మనాభం.

‘నాన్న మీ సెల్‌ఫోన్‌లో పులిగాండ్రిపు పిల్లి కూతలా, పిల్లి కూతను పులిగాండ్రిపులా మార్చే వాయిస్‌ చేంజ్‌ వసతి ఉంది. నా గొంతును పెద్దవారి గొంతు వచ్చేలా సెల్‌ఫోన్‌లో సెట్‌ చేసి చెప్పాను’ అంటూ మరింత గట్టిగా కాళ్లు పట్టుకొన్నాడు.

‘రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో వీళ్లు ఎన్ని రకాల యుద్ధాలు చేస్తారో’ అనుకొంటూ, ఏం చెయ్యాలో అర్థంకాక నిలబడిపోయాడు. సెల్‌ఫోన్‌ మ్రోగుతున్న శబ్దం గమనించక మతి భ్రమించిన వాడిలా అలాగే ఉండి పోయాడు పద్మనాభం.

– ఓట్ర ప్రకాశరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *