వివాదాల ‘పురస్కారం’

వివాదాల ‘పురస్కారం’

భారత క్రీడారంగంలో అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న మరోసారి వివాదాస్పద మయ్యింది. 2018 సంవత్సరానికి గానూ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను, క్రికెటర్‌ విరాట్‌ కొహ్లీలను సంయు క్తంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినా వివాదం తప్పలేదు.

భారత్‌ క్రీడారంగంలో ఇప్పటికీ ఎంతగానో వెనుకబడి ఉంది. ఒలింపిక్స్‌లో 57, ఆసియాక్రీడల్లో ఎనిమిది, కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఐదు స్థానాలకే పరిమితం కావడమే దానికి నిదర్శనం.

దేశంలో క్రీడా ప్రమాణాలు పెంచడానికి ఎన్ని రకాల ప్రోత్సాహక పథకాలు ఉన్నాయో! క్రీడా కారులు సాధించిన అసాధారణ విజయాలను గుర్తిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న క్రీడా పురస్కారాలు, అవార్డులు సైతం అన్నే ఉన్నాయి. ఈ అవార్డులకే తలమానికంగా కనిపించే దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న వివాదాలకు అతీతం కాలేకపోతోంది. చివరకు ప్రపంచ చాంపియన్‌ మీరాబాయి చాను, ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు విరాట్‌ కొహ్లీలను ప్రతిభ ఆధారంగా అవార్డుకు ఎంపిక చేసినా వివాదమే చెలరేగింది.

రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారాన్ని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకార్థం 1990 దశకంలో ఏర్పాటు చేశారు. 1991-92 సీజన్‌ నుంచి ఏడాది ఏడాదికి విజేతలను ప్రకటిస్తూ వస్తున్నారు. 2015లో దీనికి నూతన మార్గదర్శకాలను సైతం ప్రవేశపెట్టారు.

పాయింట్ల పద్ధతిలో అవార్డులు

అంతర్జాతీయ స్థాయిలో నాలుగేళ్లపాటు అత్యుత్తమంగా, నిలకడగా రాణించిన క్రీడాకారులను విజయాలు, పతకాల ప్రాతిపదికన ఎంపిక చేసే విధానాన్ని అనుసరిస్తున్నారు. అంతేకాదు 204 దేశాలు తలపడే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే 80 పాయింట్లు, ప్రపంచ పోటీల్లో 40 పాయింట్లు, ఆసియాక్రీడల బంగారు విజేతలకు 30 పాయింట్లు, కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ విజేతలకు 25 పాయింట్లు ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు.

రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారం అందుకోవాలంటే నాలుగేళ్ల పాటు అంతర్జాతీయ స్థాయిలో అసాధార ణంగా రాణించాలి. ప్రపంచ స్థాయిలో రాణించిన స్వర్ణ, రజత, కాంస్య పతకాలకు సైతం పాయింట్లు ఇస్తూ వస్తున్నారు. అయితే, 2018 ఖేల్‌రత్న రేస్‌లో నిలిచిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను, మల్లయోధుడు భజరంగ్‌ పూనియాలకు 40 నుంచి 80 పాయింట్ల వరకూ వస్తే, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీకి సున్నా పాయింట్లు మాత్రమే వచ్చాయి. దీనికి కారణం క్రికెట్‌ నాన్‌ ఒలింపిక్‌ క్రీడ కావటమే. నిబంధనల ప్రకారం 80 పాయింట్లు సాధించిన భజరంగ్‌ పూనియాను కాదని ఒక్క పాయింటు లేని విరాట్‌ కొహ్లీకి, గాయంతో ఆసియా క్రీడలకు దూరమైన మీరాబాయి చానుకు అవార్డును ఇవ్వటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఒలింపిక్స్‌ క్రీడాంశాలతో పాటు నాన్‌ ఒలింపిక్‌ గేమ్‌ క్రికెట్లో సైతం అత్యుత్తమ క్రీడాకారులను భారత ప్రభుత్వం రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారంతో గౌరవిస్తూ వస్తోంది. అవార్డు విజేతలకు ఓ ప్రశంసాపత్రం, పతకంతో పాటు 7 లక్షల 50 వేల రూపాయలు నగదు బహుమతిని అందజేస్తున్నారు.

విశ్వనాథన్‌ ఆనంద్‌ టు విరాట్‌ కొహ్లీ

రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలకు 28 సంవత్సరాల చరిత్ర ఉంది. 1990 నుంచి 2018 వరకూ వివిధ క్రీడలకు చెందిన మొత్తం 30 మంది దిగ్గజ క్రీడాకారులు ఈ పురస్కారాన్ని అందుకొన్న వారిలో ఉన్నారు. ఖేల్‌రత్న అందుకొన్న తొలి క్రీడాకారుడి ఘనత భారత చదరంగ సామ్రాట్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌కు మాత్రమే దక్కింది. 1991-92 సీజన్‌కు ఆనంద్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

తొలిమహిళ కరణం మల్లీశ్వరి

రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారం అందుకొన్న తొలి భారత మహిళ గౌరవాన్ని తెలుగుతేజం కరణం మల్లీశ్వరి దక్కించుకొంది. ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలిపతకం అందించడం ద్వారా 1994-95 సంవత్సరానికి మల్లీశ్వరి ఈ పురస్కారా నికి ఎంపికయ్యింది.

తొలి క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌

భారత్‌లో అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్‌. ఒలింపిక్స్‌లో అసలు క్రీడాంశమే కాని క్రికెట్లో తన అసాధారణ ప్రతిభతో, అనితరసాధ్యమైన రికార్డులతో మాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారం అందుకొన్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సష్టించాడు. 1997-98 సంవత్సరానికి మాస్టర్‌ ఈ గౌరవాన్ని సంపాదించాడు.

అంతేకాదు, ఒకే క్రీడకు చెందిన క్రీడాకారుడికి మాత్రమే కాదు, సంయుక్త విజేతలను ప్రకటించే సాంప్రదాయానికి 1993-94 సీజన్‌ నుంచే శ్రీకారం చుట్టారు. తెరచాప పడవల క్రీడాకారులు హోమీ మోతీవాలా, పుష్పేంద్ర కుమార్‌ గార్గ్‌లకు ఖేల్‌రత్నను అందచేశారు.

ఆ తర్వాత 2002లో అథ్లెట్‌ బినామోల్‌, షూటర్‌ అంజలీ భగవత్‌లకు సంయుక్తంగా పురస్కరాన్ని ఇచ్చారు. 2016 సీజన్లో బ్యాడ్మింటన్‌, జిమ్నాస్టిక్స్‌, షూటింగ్‌, కుస్తీ క్రీడలకు చెందిన పీవీ సింధు, దీప కర్మాకర్‌, జీతూరాయ్‌, సాక్షీ మాలిక్‌ కలసి ఈ అవార్డును అందుకొన్నారు.

తెలుగు వెలుగుల ‘ఖేల్‌రత్నాలు’

ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులలో కరణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్‌, సైనా నెహ్వాల్‌, గగన్‌ నారంగ్‌, సానియా మీర్జా, పీవీ సింధు ఉన్నారు. రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు మరింత మంది రాజీవ్‌ ఖేల్‌రత్నాలుగా మిగిలిపోవాలని కోరుకుందాం.

వివాదాలకు అతీతంగా ఉంటేనే ఈ అవార్డు గౌరవం మరింత పెరుగుతుందని కేంద్రప్రభుత్వం, ఎంపిక సంఘాల పెద్దలు గ్రహిస్తే మంచిది.

రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అందుకున్న క్రీడాకారులు

1991-92 వి. ఆనంద్‌-చదరంగం; 1992-93 గీత్‌ సేథీ-బిలియర్డ్స్‌; 1993-94 మోతీవాలా- గర్గ్‌యాటింగ్‌; 1994-95 కరణం మల్లీశ్వరి- వెయిట్‌ లిఫ్టింగ్‌; 1995-96 కుంజరాణి దేవి-వెయిట్‌ లిఫ్టింగ్‌; 1996-97 లియాండర్‌ పేస్‌-టెన్నిస్‌; 1997-98 సచిన్‌ టెండుల్కర్‌-క్రికెట్‌; 1998-99 జ్యోతిర్మయ్‌ సిక్దర్‌- అథ్లెటిక్స్‌; 99-2000 ధన్‌ రాజ్‌ పిళ్లై-హాకీ; 2000-01 పుల్లెల గోపీచంద్‌ -బ్యాడ్మింటన్‌; 2001 అభినవ్‌ బింద్రా- షూటింగ్‌; 2002 బినామోల్‌, అంజలీ భగవత్‌- అథ్లెటిక్స్‌, షూటింగ్‌; 2003 అంజుబాబీ జార్జి- అథ్లెటిక్స్‌; 2004 రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌- షూటింగ్‌; 2005 పంకజ్‌ అద్వానీ-బిలియర్డ్స్‌; 2006 మానవజిత్‌ సింగ్‌ సంధు-షూటింగ్‌; 2007 మహేంద్రసింగ్‌ ధోనీ-క్రికెట్‌; 2009 మేరీకోమ్‌, విజేందర్‌, సుశీల్‌- బాక్సింగ్‌, కుస్తీ; 2010 సైనా నెహ్వాల్‌-బ్యాడ్మింటన్‌; 2011 గగన్‌ నారంగ్‌- షూటింగ్‌; 2012 విజయ్‌ కుమార్‌, యోగేశ్వర్‌దత్‌ -షూటింగ్‌, కుస్తీ; 2013 రంజన్‌సింగ్‌ సోథీ- షూటింగ్‌; 2015 సానియా మీర్జా-టెన్నిస్‌; 2016 సింధు, దీప, సాక్షి, జీతురాయ్‌-బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, కుస్తీ, జిమ్నాస్టిక్స్‌; 2017 సర్దార్‌సింగ్‌- హాకీ; 2018 చాను, విరాట్‌ కొహ్లీ-వెయిట్‌ లిప్టింగ్‌, క్రికెట్‌..

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *