అతిథి

అతిథి

శ్రావణమాసం.. వర్షాలు పుంజుకొంటు న్నాయి. పాడేరు లోయ ఆకర్షణీయంగా అలరారు తోంది. ఘాట్‌రోడ్‌ అప్పుడే, కొత్తగా చిగుళ్లేస్తున్న ఆకుపచ్చని వృక్ష సంపదతో శోభాయమానంగా ఉంది. కొన్ని చోట్ల మైదాన ప్రాంతాలలో పచ్చని తివాసీపై కురిసిన మంచు బిందువుల మీద పడిన ప్రభాత కిరణాలు రంగు రంగుల కాంతులు వెదజల్లుతున్నాయి. మనోహరంగా ఉన్న ఆ ప్రకృతిని ఆరాధనాభావంతో వీక్షిస్తూ కొత్తగా కొనుకున్న ఆడికార్‌ను డ్రైవ్‌ చేస్తూ ఆనంద డోలికలలో తేలి ఆడుతున్నారు బంధూ, బంధూ ప్రక్కనే కూర్చున్న అతని భార్య అన్నపూర్ణ. ఇద్దరిదీ ఈడైన జంట. ముప్ఫై ఏళ్లలోపే వాళ్ల వయసులు.. ఆకర్షణీయమైన జంటగా అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు.

విశాఖ నుంచి ఉదయం ఐదు గంటలకు బయలుదేరారు పాడేరు లోయ అందచందాలు కనులార చూడడానికి. తెలుగు వారి దేశ భాషలు, సంస్కారం, సౌజన్యంతోపాటు ఆహారపు అలవాట్లు అంటే బంధూకు ప్రాణం. కాలిఫోర్నియా నుంచి రెండు సంవత్సరాల తరువాత విశాఖ వచ్చారు. ఒక్కతే అమ్మాయి వాళ్లకి. జాహ్నవి. ఎనిమిది సంవత్సరాలలోపే జాహ్నవి వయస్సు. వెనక సీట్లో శాలువ కప్పుకొని నిద్రపోతోంది.

”బంధూ… ఆ గ్రామదేవత మోదుకొండ అమ్మవారు, చాలా మహిమాన్వితులు. ఆ దేవి దర్శనం చేసుకుందాం.. ఈ ఆహ్లాదకర వాతా వరణంలో. అమ్మవారి ఆశీస్సులు నాకు కావాలి” అని పలికింది అన్నపూర్ణ, ”ఈరోజు శ్రావణమాసం మొదటి శుక్రవారం కూడానూ” అంటూ.

బంధూ ‘ఆడి’ని ఒక పక్కగా ఆపాడు. బాట పక్కనే కూడలిలో ఉన్నది మోదుకొండమ్మ తల్లి ఆలయం. ఆలయం పెద్దది కాదు, కాని ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది. తల్లి ఎర్రని వస్త్రాలతో దర్శనీయంగా ఉంది. ఆ మాత నేత్రద్వయం నుండి కరుణమయమైన కాంతి పుంజాలు, ఉదయ కాంతులతో మేళవించి, ఆమె నుదుటిపై తీర్చిదిద్దిన గుండ్రని కుంకుమ బొట్టు పైనుండి.. నాశికను అలంకరించిన రత్నాలు పొదిగిన బంగారు ముక్కెరపై పడి.. పరావర్తనం చెంది.. ఆ పరిసర ప్రాంతాలను దీవిస్తున్నాయా! అన్నట్లుగా శోభిస్తున్నాయి. ఆ తల్లి ప్రశాంత, కమనీయ వదనానికి తల్లి చెవులపై పొదగబడిన దుద్దులు, హస్త ద్వయాలకు అలంకరింపబడిన రంగు రంగుల గాజులు వినూత్న శోభను కల్గిస్తున్నాయి.

”ఈ పండగ రోజున తల్లి దీవెనలు పొందడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నానో…” అని పలుకుతూ లలితా సహస్రనామం కమనీయంగా గానం చేసింది, కూతురిని ప్రక్కనే కూర్చుండబెట్టుకొని.. ఒక గంటసేపు ఆ చిన్న మంటపంలో కూర్చొని పూజా కార్యక్రమం ఆరాధనా భావంతో ఆచరిస్తూ. బంధూ ఆమె ప్రక్కనే రెండు చేతులూ ముకుళించి పరవశుడై నిలబడ్డాడు. ప్రసాదం స్వీకరించి, హుండీలో కానుకలు సమర్పించి మరలా బయలుదేరారు ఆ యాత్రికులు.

*  *  *

ఉదయం ఎనిమిది గంటలవుతుంది. ప్రకృతి అందచందాలు ఆస్వాదిస్తూ బంధూ, జాహ్నవి తన్మయులవుతున్నారు. బాట అంతా మోదుగుపూలు ఎవరో పరచినట్లు రాలుతున్నాయి. అన్నపూర్ణ మౌనంగా దేవిని ధ్యానిస్తోంది. బాట ప్రక్కనే ఉన్న చిన్న టీ దుకాణం వద్ద కారు ఆపాడు బంధూ. ముగ్గురూ కారులోంచి దిగి కొట్టు దగ్గరికి వెళ్లారు. వీళ్లని చూడగానే టీ దుకాణం ఆసామీ నవ్వుతూ బల్ల తుడిచాడు. ముగ్గురూ బల్లమీద కూర్చొని వేడివేడి టీ.. బిస్కెట్లు తింటూ త్రాగారు. కాసేపు కూర్చొని ఏభై రూపాయల నోటు ఇచ్చాడు దుకాణం యజమానికి బంధూ. దుకాణం యజమాని బంధూకు గళ్లా పెట్టలోంచి ఇరవై తొమ్మిది రూపాయల చిల్లర ఇచ్చి ”నా బిల్లు ఇరవై ఒక్క రూపాయలయ్యా! మూడు టీలకు పన్నెండు రూపాయలు, బిస్కెట్లకు తొమ్మిది. ఈ రోజు మీదే బోణీ” అంటూ నవ్వాడు సంతృప్తిగా. కొద్దిసేపు అతనితో కాలక్షేపం చేసి తిరిగి బయల్దేరారు.

*  *  *

కారు మెత్తగా ముందుకు సాగుతోంది. ”ఏవండీ! ఆ చెట్టు కింద చూసారా? కాకరకాయలు అమ్ముతున్నారు.. కొనుక్కుందాం కారాపండి” అంది అన్నపూర్ణ. కారులోంచి ముగ్గురూ దిగారు. ఒక చింతచెట్టు కింద ఒక అవ్వ కాకరకాయలు, అరటికాయలు, వంకాయలు నేలమీద పోసి కూర్చుంది. అన్నీ లేతగా ఉన్నాయి, నవనవలాడు తున్నాయ్‌, చూస్తేనే తినాలనిపించేట్లుగా.

”అవ్వా! ఎలా ఇస్తున్నావ్‌” అడిగాడు బంధూ.

”వంకాయలు కేజీ పదిరూపాయలు బాబూ, అరటికాయలు పది రూపాయలకి నాలుగు, ఇప్పుడే తెచ్చింది నా మనవరాలు పొలం నుండి. పోగులుగా పోసిన ఆ కాకరకాయల్ని ముడతలు పడిన తన చేతులతో నిమురుతూ.

”మరి వాటి రేటు..”

”కేజీ ఇరవై ఐదు రూపాయలమ్మా. ఇంకా అరగంట కూడా కాలేదు, కోసిన వెంటనే పరుగున తెచ్చింది పిల్ల. ఈయాల కొట్టు పెట్టడం ఒకింత ఆలేసం అయింది. నా తోటోళ్లందరూ బస్సులో టౌన్‌కి ఎల్లిపోయారు. ఈయాల అమ్మకం ఇక్కడే చేద్దామని ఉండిపోయా. పండక్కదా, ఎవరైనా అమ్మగుడి కొత్తారేమోనని చూత్తున్నా. మీరొచ్చారు”

”అవ్వా, మాకు ఆ కాకరకాయలు మొత్తం కావాలి.. ఎంతున్నాయ్‌?”

”మూడు కేజీలు ఉండచ్చొమ్మా. అన్నీ తీసుకుంటే డెభ్బై రూపాయలకిత్తా” అవ్వ మాటలలో ఆశ ధ్వనించింది, ”మీదే బోణీ అవుతాది…”

”ఏభై రూపాయలకియ్యి. ఒక కేజీ వంకాయలు కూడా తీసుకుంటా” అన్నాడు బంధూ.

”లేదయ్యా, గిట్టదయ్యా, ఈ పాలు కాకరకాయల పంట తక్కువగా ఉందయ్యా. ఇసకపట్నంలో వందపైనే పలుకుతోంది రేటు. డెభ్భై ఇప్పించండి బాబూ పిల్లకు పుత్తకాలు కొనాలంట. కూసిన్ని వంకాయలు కూడా ఇత్తా”…

బంధూ ఏం బదులివ్వకుండానే కారులోకి ఎక్కాడు. అతనితో పాటే జ్నాహవి, అన్నపూర్ణ కూడా. అన్నపూర్ణ మొహంలో నిరాశ చోటు చేసుకుంది.

”పూర్ణా! సాయంకాలానికి ఈ ముసల్ది దిగివస్తుంది. అప్పుడు తీసుకుందాం, సరేనా. ఎందుకు తగ్గదో చూస్తాను” అన్నాడు బంధూ గేర్‌ మారుస్తూ, గర్వంతో.

ఏమీ కొనకుండా వెళ్లిపోతున్న వాళ్లని చూస్తూన్న గంగ మొహంలో దుఃఖం చోటు చేసుకొంది. ”మామ్మ మరి నా పుస్తకాలకి డబ్బులు” అంటున్న గంగ మాటలు జాహ్నవికి వినిపించాయి. జాహ్నవి అసహాయంగా తలవంచుకొంది, తండ్రికి ఏమీ చెప్పలేక.

*  *  *

మధ్యాహ్నం పన్నెండు దాటింది పాడేరు చేరేటప్పటికి. పాడేరు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు రమేష్‌. బంధూ, రమేష్‌లు మంచి స్నేహితులు. స్టేట్స్‌ నుంచి వచ్చిన ప్రతిసారి రమేష్‌ను కలుసుకుంటాడు బంధూ తప్పకుండా. ఈసారి కూడా స్నేహితుడిని చూడాలని కుటుంబ సమేతంగా వచ్చాడు ఈరోజు. రమేష్‌కు బంధూ తన రాకను ముందుగా తెలియపరచలేదు, రమేష్‌కు థ్రిల్‌ కలిగించాలని. కాలేజీలో రమేష్‌ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లిన వెంటనే తెలిసింది, రమేష్‌ సెలవుపెట్టి వాళ్ల స్వగ్రామం అమలాపురం వెళ్లాడని, నాలుగు రోజుల వరకు రాడని.. బంధూకు తన ప్లాన్‌ విఫలమైనందుకు ఆందోళన కలిగింది. అప్పటి వరకు – ఆ క్షణం వరకు ఆహ్లాదకరంగా కనిపించిన వాతావరణం ఒక్కసారిగా అతనిలో నిరాశ, నిస్పృహలను నింపివేసింది.

”ఇప్పుడేం చేద్దాం – నేను ముందే చెప్పాను మనం వస్తున్నట్లు రమేష్‌కి తెలియచేద్దామని. ఆ విధంగా చేసి ఉంటే ఇప్పుడు ఈ ఇబ్బంది కలిగేది కాదు. మీరు నా మాట వింటేగా. ‘అతిథి అతిథిగానే వెళ్లాలి.. తిథి, వార, నక్షత్రాలు లెక్కపెట్టకుండా. చెప్పి వెళితే థ్రిల్‌ ఏం ఉంటుంది?’ అంటూ పెద్ద ఉపన్యాసం చెప్పి మనకు ఈ అవస్థ తెచ్చారు” విసుక్కుంది అన్నపూర్ణ.

”అమ్మా! ఇప్పుడేమైంది అంకుల్‌ లేరు అంతే కదా! మనం పిక్నిక్‌ వచ్చాం అనుకుందాం. ఈ ప్రాంతం అంతా చూసి సెల్ఫీలు తీసుకొని సాయం కాలం వరకు సరదాగా గడుపుదాం. నీ మూడ్‌ పాడు చేసుకొని మా బుర్రలు తినకు, నాన్నగారికి తెలుసు ఏం చెయ్యాలో” అంది జాహ్నవి.

”ఆ తండ్రి కూతురువి కదా! అంతా మీ ఇష్టం తల్లీ” కోపాన్ని సంబాళించుకొంటూ అంది అన్నపూర్ణ.

బంధూ కారు వెనక్కి తిప్పాడు. రోడ్‌పైకి వచ్చాడు. పాడేరులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్ని చూపిస్తూ నెమ్మదిగా కారు డ్రైవ్‌ చేస్తున్నాడు. గిరిజన కార్పొరేషన్‌ సేల్స్‌ డిపో కన్పించింది. ముగ్గురూ కారు దిగి లోపలికి వెళ్లారు. కౌంటర్‌లో ఉన్న గిరిజన ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు పాకెట్లలో అందంగా అమర్చబడి ఉన్నాయి.

”కొన్ని వస్తువులు కొనుక్కుందామా!” అడిగింది అన్నపూర్ణ.

”నీకు కావలసినవి తీసుకో. విశాఖలో సూపర్‌ బజార్లలో కంటే మంచి వస్తువులు, తాజాగా ఉన్నాయి కదా ఇక్కడ! పైగా ఉత్పత్తి కేంద్రంలో ధరలు తక్కువగా కూడా ఉంటాయి” అన్నాడు బంధూ.

అన్నపూర్ణ బెల్లం, చింతపండు, పసుపు – ఇతర వస్తువులు కొన్నది.

”అమ్మా! కుంకుడుకాయ పొడి, శీకాయపొడి కూడా తీసుకో, వేపపొడి ఉంటే అది కూడా – ప్రకృతి ప్రసాదించిన కానుకలు కదా అవి” అంది జాహ్నవి.

అన్నపూర్ణ అవి కూడా తీసుకొంది. ముగ్గురూ బయటకు వచ్చారు, డిపోలొంచి.

బంధూ కొద్దిగా కుదురుకున్నాడు. మొహంలో చిటపటలు తగ్గాయి.

డిపో ఎదురుగా ఉన్న దుకాణం వైపు అప్రయత్నంగా నడిచాడు బంధూ. అతనిని అనుసరించారు అన్నపూర్ణ, జాహ్నవి.

”బాబూ కాకరకాయలు ఉన్నాయా” అడిగాడు బంధూ, కూరల అబ్బాయిని.

”లేవు సార్‌. ఈ సంవత్సరం ఆ కాకరకాయ పంట ఎందుకో చాలా తక్కువగా వచ్చింది. రేటు కూడా చుక్కలని చూపిస్తోంది. మార్కెట్లోకి వస్తే కేజీ నూట ఇరవై, నూట నలభై మధ్య ఉంటోంది” అన్నాడు కూరల అబ్బాయి.

”మనం ఆ ముసలమ్మ దగ్గర కొని ఉండ వలసింది. అనవసరంగా బేరం ఆడారు మీరు” అన్నపూర్ణ కారు ఎక్కుతూ అంది.

*  *  *

తిరుగు ప్రయాణం ఆరంభించారు. ”మనం ఈ రోజు టీ, కాఫీలతోటే తృప్తిపడాలి. అప్పుడే వర్షం కూడా మొదలైంది. ఈ ¬టల్స్‌లో తినడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. ¬టల్‌ లోపల తిన్నా నాకు రోడ్డుమీద తిన్నట్లుగానే అనిపిస్తుంది” అన్నాడు బంధూ. రోడ్డు ప్రక్కన ఉన్న టీ దుకాణంలో టీ తాగుతూ అన్నపూర్ణ, జాహ్నవి బొప్పాసకాయ ముక్కలు, జామకాయ ముక్కలు తిని కడుపు నింపుకున్నారు.

*  *  *

వర్షం క్రమేపీ పెరుగుతోంది. గూగుల్‌ చూసింది అన్నపూర్ణ. బంగాళాఖాతంలో వచ్చిన అల్పపీడనం విశాఖ, శ్రీకాకుళం తీరం దాటుతోంది. అందుచేత భారీ వర్షం, ఉరుములు, పిడుగులతో వస్తోంది అని తెలిసింది. స్మార్ట్‌ఫోన్‌ వల్ల అదే లాభం. మనకు చాలా విషయాలు వెంటవెంటనే తెలిసిపోతాయి. మనం జాగ్రత్తగా ఉండాలంతే. ”ఈ వర్షం తుఫానుగా మారే అవకాశం ఎక్కువగా ఉందట. మనం తుఫానులో చిక్కుకొని పోయాం అనుకోకుండా” అంది అన్నపూర్ణ.

వాగులు పొంగుతున్నాయి. జలప్రవాహం రోడ్డుమీదకు వచ్చి రోడ్డును ముంచేసింది. పెద్దపెద్ద చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయ్‌, అక్కడక్కడ కారు నీళ్లలో కొట్టుకు పోతుందేమోనని బంధూకు కూడా భయం వేస్తోంది. కానీ తప్పలేదు. నెమ్మదిగా డ్రైవ్‌ చేస్తున్నాడు.

వాతావరణం భయం కలిగిస్తోంది ముగ్గురికీ. మేఘాలు చీకట్లను ఆకాశం అంతా దట్టంగా కమ్ముకున్నాయి. కాలం తెలియడం లేదు. చీకటి ఆవరించింది. విండ్‌ స్క్రీన్‌ ఎన్నిసార్లు తుడిచినా మార్గం కనపడడం లేదు బంధూకి. పెద్ద పోరుతో జలప్రవాహం వెనక నుండి తరుముకు వస్తోందని పించింది బంధూను. ”ఇక లాభం లేదు. మనం ముందరకు వెళితే ప్రమాదం. ఇక్కడే ఆగిపోదాం. వర్షం తగ్గిన తరువాత మళ్లా బయల్దేరదాం” అన్నాడు బంధూ కారును కొద్దిగా పక్కకు ఆపుతూ…

వర్షం తగ్గే సూచనలేమీ కనపడడం లేదు. వాచ్‌లో టైం ఏడు గంటలు చూపిస్తోంది. చుట్టూ చీకటి. కారు డోర్‌లు మూసుకొని లోపలే కూర్చున్నారు ముగ్గురూ. డోర్‌ గ్లాసెస్‌ కూడా తేరవకుండా భయం భయంతో..

*  *  *

కారు ముందర డోర్‌పై గట్టిగా కొట్టిన చప్పుడైంది. బంధూ నెమ్మదిగా డోర్‌ తెరిచి చూసాడు. వర్షంలో తడిసిపోతూ ”సార్‌! మిమ్మల్ని మా మామ్మ తీసుకురమ్మని నన్ను పంపింది. మా గుడిసె ఈ పక్కనే ఉంది. గబగబా రండి. తడిసిపోతున్నా” అంటూ ఒక పదేళ్ల అమ్మాయి బంధూ చెయ్యి పట్టుకొని కిందకు లాగుతోంది.. చేసేందుకేం లేక బంధూ కారులోంచి కిందకు దిగి ఆ అమ్మాయి వెనకాలే నడిచాడు. అతని వెనకనే అన్నపూర్ణ, జాహ్నవీలు కూడా. హడావుడిగా పరుగెత్తారు, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా.

*  *  *

”గంగా! తుడుచుకోడానికి పొడిబట్ట ఈయవే, ఆ అయ్యకూ, అమ్మకూ” అంటూ జాహ్నవిని దగ్గరకు తీసుకొని తన చీర చెంగులతో తల, ఒళ్లు తుడిచింది అవ్వ. గంగ వాళ్లకు చేరొక పొడి బట్ట ఇచ్చింది తుడుచుకోడానికి.

”మా గుడిసెలో సోపాలేముంటాయమ్మా.. ఈ నులక మంచాలు తప్ప” అంటూ రెండు నులకమంచాలు వార్చింది అవ్వ. ముగ్గురూ మంచం మీద కూర్చున్నారు. గంగ అవ్వ మనవరాలు. జాహ్నవి ఈడుదే. పీటమీద కూర్చుంది.

”ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారో. కరెంటు కూడా లేదు” అనుకొంటూ మిణుకు మిణుకు మంటున్న గుడ్డి దీపం వెలుతురులో గదిని పరీక్షగా చూసింది అన్నపూర్ణ. గదిలో సామాను ఏమీ లేదు. ఒక చిన్న చెక్కపెట్టె. మట్టిగోడకు మూడు నాలుగు మేకులు. వాటికి చిన్న సంచులు వేలాడుతున్నాయి. ఒక రెండు వెదురు బుట్టలు. ఆ గదిని ఆనుకునే ఇంకొక చావడి ఉంది. గదికి చావడికి మధ్య తలుపేమీ లేదు.

”చావడి మీదే మామ్మ వంట చేస్తుంది. నీళ్లు పడకుండా పైన తాటాకులు కప్పాం. ఆ బయట ఉన్న తడికెల గదిలో స్నానం చేత్తాం. నేను ఆరవ తరగతి చదువుతున్నా, ఈ ఊరి స్కూల్లోనే. ఇంకా పుస్తకాలు కొనుక్కోవాలి. క్లాసులో అందరూ కొనేసుకున్నారు, నేను తప్ప. మామ్మ రేపు డబ్బు లిస్తుందట. మరి నువ్వేం చదువుతున్నావు?” గంగ అడిగింది.

”నేను సెవెంత్‌లో ఉన్నా. ఇక్కడ కాదు స్టేట్స్‌లో”

”అంటే”

”అమెరికాలో అన్నమాట”

”ఓ¬.. చాలా దూరం కదా” ఆశ్చర్యంతో కన్నులు పెద్దవి చేస్తూ, చేతులుపైకెత్తి అంది గంగ, మెచ్చుకోలుగా చూస్తూ.

జాహ్నవి చిన్నగా నవ్వింది.

*  *  *

అలసిపోయిన బంధూ, అన్నపూర్ణలు నులక మంచాల మీద నిద్రలోకి జారిపోయారు, అవ్వ ఇచ్చిన ముతక దుప్పట్లు కప్పుకొని.

గంగకు, జాహ్నవికి మామ్మ రెండు పళ్లేలలో వేడివేడి అన్నం, కొద్ది వంకాయకూర కలిపి ఇచ్చింది. నేలమీద కూర్చొని వాళ్లు అన్నం తినడం ప్రారంభిం చారు. పెరుగు లేదమ్మా, మజ్జిగే మీకు అంటూ మళ్లా కంచాలలో అన్నం వేసి మజ్జిగ పోసింది మామ్మ. నంచుకోవడానికి పండుమిరప పచ్చడి కంచాలలో వేసింది. కొద్దిగా కాకరకాయల కూర కూడా తినండి అంటూ ఆ అది కూడా వేసింది. వేడిగా ఉన్న అన్నం, రుచిగా ఉన్న కూరలూ, పచ్చడి తిని పిల్లలిద్దరూ కంచాలలోనే చేతులు కడుక్కున్నారు. ”బైటకెళ్లకండి పిడుగులు పడుతున్నాయి. అజ్జునా, పల్గునా అంటూ పద్యం చదువుకుంటూ పడుకోండి” చాప నేలమీద వేస్తూ మామ్మ వాళ్లని హెచ్చరించింది.

”మామ్మ, ‘అజ్జునా’ కాదు ‘అర్జునా’ అనాలి. ఎన్నిసార్లు చెప్పినా ‘అజ్జునా’ అనే అంటావు అంది గట్టిగా నవ్వుతూ గంగ. జాహ్నవి కూడా గంగలా నవ్వింది. పిల్లలిద్దరూ తమ వోణిలు కొప్పుకొని నిద్రలోకి జారిపోయారు, కొద్ది క్షణాలలోనే, ఒకరిమీద ఒకరు చేతులు వేసుకొని.

”అయ్యా, కొద్ది మజ్జిగ అన్నం తిని పడుకుందరుగాని” అంటూ లేపింది అవ్వ బంధూని, అన్నపూర్ణను, అరిటాకులు నేలమీద వేస్తూ.

పాకమట్టిదే అయినా కొద్ది ఎత్తుమీద ఉంది. అంచేత లోపలికి వర్షం నీరు రాలేదు. చెక్క పెట్టెలోంచి తన తెల్లని చీరను పరచి దానిమీద అరటాకులు వేసింది. ఇద్దరు ఆకలిమీద ఉన్నారు. అవ్వ తప్పేళాలోంచి వేడి అన్నం చెక్క గంటెతో తీసి ఆకుల్లో వేసింది. కూరను చూసి అన్నపూర్ణ ఆశ్చర్యపోయింది. కాకరకాయ ముద్దకూర. ఉదయం దొరకని ఆ కాకరకాయలు రాత్రికి ఊర రూపంలో తమ విస్తళ్లలో అన్నపూర్ణ కళ్లల్లో నీళ్లు. బంధూ సిగ్గుపడుతూ అన్నం తిన్నాడు.

”భోజనం బావుంది మామ్మా” మెచ్చుకున్నాడు బంధూ.

”కూర చాలా బాగా చేసేవు మామ్మా, నాకు కూడా చెప్పు ఎలా చెయ్యాలో” అంది అన్నపూర్ణ చేయి కడుక్కొంటూ.

”పచ్చడి మెతుకులు పెట్టాను బాబూ. ఏం అనుకోండి” అంది అవ్వ చేతులు తుడుచుకొంటూ చావడి లోంచి వాళ్లు తిన్న రెండు ఆకులూ బయటపడేస్తూ..

”మరి నీ భోజనం?” అన్నపూర్ణ అడిగింది.

”ఈయాల పండగ కదమ్మా. నేను ఉపాసం…” అంటూ అవ్వ గోడవారగా చాపమీద పిల్లల దగ్గర చేరింది.

*  *  *

ఉదయం అందరూ నిద్రలేచారు. వర్షం తెరిపిచ్చింది. వేపపుల్లలు ఇచ్చింది అవ్వ. ముగ్గురూ మొహం, కాళ్లూ చేతులూ కడుక్కున్నారు. అవ్వ చిన్న గాజు గ్లాసులతో టీ ఇచ్చింది. ”పాలు ఇంకా దొరకలేదు బాబు. వేడి నీళ్లతో టీ చేసా” నొచ్చుకుంటూ అంది అవ్వ. ”వర్షం ఆగింది అవ్వా. మేం బయలుదేరతాం, రాత్రి నీకు చాలా శ్రమ ఇచ్చాం” అంది అన్నపూర్ణ. ”నాకేం కట్టమమ్మా ఏవైనా బరువులెత్తానా ఏంటి?” అవ్వ నవ్వింది. ”అవ్వా ఈ రెండొందలు ఉంచు” అన్నాడు బంధూ కారెక్కుతూ. ”నీ మనవరాలికి ఏదైనా కొనిపెట్టు” అని కూడా.

”పండగయాల మీకు కొద్ది అన్నం పెట్టడం నా అదురుట్టం. ఆ తల్లి నాకు ఆ అదురుట్టం ఇచ్చింది. కూసింత బువ్వకు డబ్బులు తీసుకుంటానా? అవ్వ.. ఏరైనా ఇంటే నా ముఖాన ఊస్తారు” రెండు చేతులతో కన్నులూ మూసుకొంటూ అంది అవ్వ.

కారు ఎక్కుతూ ”మామ్మ,. ఆ కాకరకాయల రేటు నవ్వు తగ్గించలేదు. మేం బేరం చేసిన ధరకు అమ్మలేదు. మరి మాకు వండి పెట్టావు. నీకు నష్టం కదా!” అడిగాడు బంధూ.

”అబ్బాయిగారూ. అది యాపారం. అన్నం పెట్టడం ఇంటి యాచారం. యాపారంలో లాభనట్టాలు చూసుకుంటాం. అంతేకాని ఇంటికొచ్చిన బంధుగులకు అన్నం పెట్టినందుకు లెక్క కడతానా ఏంటి?” అంది అవ్వ నవ్వుతూ.

”భగవంతుడు ఇచ్చింది పెట్టాను. అంతేకదా ఏమంటావ్‌ పిల్లా” అంది మనవరాలిని దగ్గరగా తీసుకొంటూ.

”అవును మామ్మ. మాకు స్కూల్లో చెప్పారు. ఇంటికి భోజనానికి వచ్చిన వాళ్లు అతిథులంట. వాళ్లని ప్రేమతో చూడాలని” అంది గంగ.

”నాన్న కారు ఒక్కసారి ఆపు” అంటూ కారు దిగింది జాహ్నవి.

”మామ్మ, గంగా ఇల్లా రండి” గంగ చెయ్యి పట్టుకొని మామ్మ భుజం మీద తలపెట్టి సెల్ఫీ తీసుకుంది.

”గంగా! మన ఫోటో నా దగ్గర ఉంటుంది. సరేనా” అంది జాహ్నవి. కారులోకి ఎక్కుతూ.

కారు ముందరకు దూసుకుపోయింది, అరుణకాంతుల మధ్య.

*  *  *

కాలగమనంలో మరో రెండు సంవత్సరాలు గడచిపోయాయి. బంధూ తన పనులు చక్కబెట్టుకోడానికి, డాలర్ల వేట నుంచి అలసట తీర్చుకోడానికి కుటుంబ సమేతంగా మళ్లా విశాఖ వచ్చాడు. విశాఖపట్నంలో పనులన్నీ పూర్తి అయ్యాయి. మరలా కాలిఫోర్నియా వెళ్లే రోజు దగ్గర పడుతోంది.

ఒక సాయంకాలం జాహ్నవి ”నాన్నా ఒకసారి పాడేరు వెళ్లి వద్దామా” అడిగింది.

”రమేష్‌ ఇప్పుడు పాడేరులో లేడు కదమ్మా. మనం వెళ్లి ఏం చేస్తాం?”

”పాడేరంటే పాడేరు కాదు నాన్నా, అదే ఆ రోజు మనం ఒక మామ్మ ఇంట్లో ఉన్నాం కదా, ఆ మామ్మకు ఒక మనవరాలు కూడానూ.. వాళ్లను చూద్దామని..” జాహ్నవి నెమ్మదిగా పలికింది.

”తప్పకుండా. రేపే వెళ్దాం. ఆ రోజు నాకింకా గుర్తే. ఆ పెద్దావిడ మనకు సాయం చేయకపోతే ఆ రోజు ఆ తుఫానులో మనం ఏమైపోయుండే వాళ్లమో” అన్నాడు బంధూ.

”అవునండీ మోదుకొండమ్మ తల్లి దయ వల్ల ప్రమాదం నుండి బైటపడ్డాం. ఆ తల్లి దయ వల్లే ఆ మామ్మ మనకు కనపడింది. గుడి దగ్గరే కదా మామ్మ కూరలు అమ్ముకొనే చోటు..” అన్నపూర్ణ కూడా తలవూపింది.

*  *  *

కారు గుడి ముందర ఆపాడు బంధూ. దేవిని దర్శించుకొని అవ్వ పూరింటి వైపు సాగారు ముగ్గురూ. అవ్వ ఇంటి ముందు చాలామంది జనం మూగి ఉన్నారు. ”ఏమైంది! మామ్మ ఏదీ?” ఆందోళనతో ప్రశ్నించింది అన్నపూర్ణ.

”మామ్మ రాత్రి పోయింది. ఇప్పుడే పంపించి వస్తున్నాం” అన్నారు ఎవరో జనంలోంచి.

”గంగ ఏదీ!” ఆందోళనతో జాహ్నవి.. ”గంగా” అని గట్టిగా పిలిచింది.

చుట్టూ మూగిన జనాలను తోసుకొంటూ ఒక్క పరుగులో వచ్చింది గంగ.

”అక్కా, నాకు మామ్మ లేదు” బావురుమంది గంగ, జాహ్నవిని గట్టిగా కౌగిలించుకొని. జాహ్నవి కూడా ”గంగా” అంటూ నేలమీద కూర్చుండిపోయింది. కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్న పిల్లలిద్దర్నీ అన్నపూర్ణ తన ఒళ్లో పొదువుకుంది, అందరూ ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోతూ ఉండగా.

*  *  *

ఒక అరగంట కాలం భారంగా గడిచింది. ఉదయం పదకొండు దాటుతోంది. కారు విశాఖవైపు దూసుకుపోతోంది. వెనక సీట్లో జాహ్నవి, జాహ్నవి ప్రక్కనే గంగ కూర్చొని ఉండగా.

– శాంతి ప్రభాకర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *