‘ఏషియాడ్‌’ కు సర్వం సిద్ధం

‘ఏషియాడ్‌’ కు సర్వం సిద్ధం

ఆసియా దేశాల క్రీడల పండగ ‘ఏషియాడ్‌’కు ఇండొనేషియా రాజధాని జకార్తా, పాలెంబాంగ్‌ నగరాలు సిద్ధమయ్యాయి. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు జరిగే ఈ క్రీడా సంరంభంలో 45 దేశాలకు చెందిన 15వేల మంది అథ్లెట్లు పాల్గొంటారు. ఈ పోటీల్లో 524 మంది సభ్యుల అథ్లెట్ల బృందంతో భారత్‌ సైతం పతకాల వేటకు దిగుతోంది.

మొత్తం 40 రకాల క్రీడలకు చెందిన 462 అంశాలలో పోటీలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో 28 ఒలింపిక్‌ క్రీడలు, 12 నాన్‌ ఒలింపిక్‌ క్రీడలున్నాయి.

తొలిసారిగా బ్రిడ్జ్‌ కురాష్‌, పెన్‌ కాక్‌ సిలాట్‌, రోలర్‌ స్కేటింగ్‌, సాంబో, సెపక్‌ తక్రావ్‌, సాఫ్ట్‌ టెన్నిస్‌, స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌ క్రీడలను ప్రవేశపెట్టారు. కానోపోలో, ఈ-స్పోర్ట్స్‌ అంశాలను ప్రదర్శన క్రీడలుగా నిర్వహిస్తున్నారు.

ఇండొనేషియా ఒలింపిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో రెండు వారాలపాటు జరిగే ఈ క్రీడల కోసం అత్యాధునిక హంగులతో ఓ క్రీడాగ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 7వేల 424 అపార్ట్‌మెంట్లతో కూడిన 10 ఆకాశహార్మ్యాలను నిర్మించారు. 22వేల 272 మంది అథ్లెట్లు, అధికారులు విడిది చేసేలా ఏర్పాట్లు చేశారు. 1962లో నాలుగో ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఇండొనేషియా 56 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి ఏషియాడ్‌కు వేదికగా నిలిచింది.

క్రీడాంశాలు

ఏషియాడ్‌లో నిర్వహించే క్రీడాంశాలు టోర్నీ టోర్నీకి మారుతూ ఉంటాయి. 18వ ఏషియాడ్‌లో నిర్వహించే క్రీడల్లో అక్వాటిక్స్‌, డైవింగ్‌, స్విమ్మింగ్‌, ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌, వాటర్‌ పోలో, ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, బౌలింగ్‌, బాక్సింగ్‌, బ్రిడ్జి, కనోయింగ్‌, డ్రాగన్‌ బోట్‌, స్లాలోమ్‌, సైక్లింగ్‌, మౌంట్‌ బైక్‌, రోడ్‌, ట్రాక్‌, ఈక్వెష్ట్రియన్‌, డ్రెసాజ్‌, ఈవెంటింగ్‌, జంపింగ్‌, ఫెన్సింగ్‌, ఫీల్డ్‌ హాకీ, ఫుట్‌బాల్‌, గోల్ఫ్‌, జమ్నాస్టిక్స్‌, హ్యాండ్‌బాల్‌, జెట్‌ స్కీ, జూడో, కబడ్డీ, కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌, మోడ్రన్‌ పెంటాథ్లాన్‌, పారా గ్లైడింగ్‌, రోలర్‌ స్పోర్ట్స్‌, రోయింగ్‌, రగ్బీ సెవెన్స్‌, సెయిలింగ్‌, సెపక్‌ తక్రా, షూటింగ్‌, స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌, స్క్వాష్‌,టేబుల్‌ టెన్నిస్‌, టైక్వాండో, టెన్నిస్‌, సాఫ్ట్‌ టెన్నిస్‌, ట్రయాథ్లాన్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, కుస్తీ ఉన్నాయి.

భారతజట్టు

ఈ పోటీల్లో భారత్‌ 575 మంది సభ్యుల భారీ బృందంతో పతకాల వేటకు దిగుతోంది. జాతీయ క్రీడ హాకీ నుంచి తైక్వాండో, డ్రాగన్‌బోట్‌ అంశాల్లో భారత అథ్లెట్లు పోటీకి దిగుతున్నారు.

నాలుగేళ్ల క్రితం ముగిసిన ‘ఏషియాడ్‌’ పట్టికలో భారత్‌ 8వ స్థానం మాత్రమే దక్కించుకుంది. 11 స్వర్ణాలతో సహా మొత్తం 57 పతకాలు సాధించింది. చైనా 151 స్వర్ణాలతో సహా 345 పతకాలు; దక్షిణ కొరియా 79 స్వర్ణాలతో సహా 228 పతకాలు; జపాన్‌ 47 స్వర్ణాలతో సహా 200 పతకాలు సాధించి పతకాల పట్టిక మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌ మాత్రం తనకంటే ఎంతో చిన్నదేశాలు కజకిస్థాన్‌, ఇరాన్‌, థాయ్‌లాండ్‌, ఉత్తర కొరియా తర్వాతి స్థానాలలో నిలిచింది.

పతాకధారిగా నీరజ్‌ చోప్రా

ఈ పోటీల్లో భారత బృందానికి ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా పతాకధారిగా వ్యవహరిస్తాడు. పాలెంబాంగ్‌ స్టేడియంలో నిర్వహించే ప్రారంభ వేడుకల కవాతులో జాతీయ పతాకం ధరించి నీరజ్‌ భారత బృందానికి నాయకత్వం వహించనున్నాడు. ప్రపంచ జూనియర్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల జావెలిన్‌ త్రోలో రికార్డుల మోతతో పాటు బంగారు పతకాలు పండించిన నీరజ్‌ చోప్రాను ఫ్లాగ్‌ బేరర్‌గా భారత ఒలింపిక్‌ సంఘం ఎంపిక చేసింది. ఆసియా క్రీడల ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ జావెలిన్‌ త్రోలో భారత్‌కు కచ్చితంగా బంగారు పతకం అందించే తొలి అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రాకు గుర్తింపు ఉంది.

1951 నుంచి 2014 వరకూ జరిగిన మొత్తం 17 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత్‌ 139 స్వర్ణాలతో సహా 616 పతకాలు మాత్రమే సాధించింది. భారత్‌ తర్వాత ఆసియా క్రీడల్లో ప్రవేశించిన చైనా 1342 స్వర్ణాలతో సహా 2 వేల 895 పతకాలు సాధిస్తే, జపాన్‌ 257 స్వర్ణాలతో సహా 2 వేల 850 పతకాలు, దక్షిణ కొరియా 696 స్వర్ణాలతో సహా 2వేల 63 పతకాలు సాధించి ఆసియా మొదటి మూడు అగ్రశ్రేణి దేశాలుగా నిలిచాయి.

‘బంగారు’ ఆశలు

ఈ క్రీడల్లో భారత్‌కు అత్యధిక బంగారు పతకాలు ‘షూటింగ్‌’ లో లభించే అవకాశం ఉంది. రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ షూటింగ్‌ విభాగంలో 25 మంది సభ్యులతో పోటీకి దిగుతున్న భారత్‌కు యువ షూటర్లు అనీష్‌ బాన్‌వాలా, మనుబాకర్‌ బంగారు పంట పండించే అవకాశం ఉంది.

జాతీయ క్రీడ హాకీ పురుషుల విభాగంలో భారతజట్టు మరోసారి బంగారు పతకం సాధించగలనన్న ధీమాతో ఉంది. మహిళల విభాగంలో సైతం రాణి రాంపాల్‌ నాయకత్వంలోని జట్టు టైటిల్‌ ఫేవరెట్‌గా పోటీకి దిగుతోంది. బ్యాడ్మింటన్‌ పురుషుల, మహిళల విభాగాలలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిడాంబీ శ్రీకాంత్‌, ప్రణవ్‌, సాయి ప్రణీత్‌ పతకాలు సాధించే అవకాశాలున్నాయి.

విలువిద్య, కుస్తీ, బాక్సింగ్‌, కబడ్డీ లాంటి సాంప్రదాయ అంశాలలో సైతం భారత్‌ బంగారు పతకాలు సాధించే అవకాశం ఉంది. పురుషుల కుస్తీ 74 కిలోల విభాగంలో సుశీల్‌ కుమార్‌ బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

గత ఆసియా క్రీడల్లో పతకాల పట్టికలో 8వ స్థానంలో నిలిచిన భారత్‌ ఈసారి మరింతగా రాణించి మొదటి ఐదు స్థానాల్లో నిలవాలని కోరుకుందాం.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *