ఫ్యాక్షన్‌ కథలో ఫ్యామిలీ సెంటిమెంట్‌ ‘అరవింద సమేత’

ఫ్యాక్షన్‌ కథలో ఫ్యామిలీ సెంటిమెంట్‌ ‘అరవింద సమేత’

పేరున్న వ్యక్తుల తొలి కలయికలో వచ్చే సినిమా లపై భారీ అంచనాలు ఏర్పడటం కొత్తేమీ కాదు. అయితే దాదాపు పన్నెండు సంవత్సరాలుగా ఎన్టీయార్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు మాత్రం అది పండగే. చిత్రం ఏమంటే ఇద్దరూ కూడా పరాజయాలలో ఉన్న సమయంలో ఈ కలయిక జరగడం చాలామందిని అనేక సందేహాలకు గురిచేసింది. ఎలాగైనా విజయం సాధించాలనే ఒత్తిడిలో తప్పటడుగులు వేస్తారేమోననే భయాన్నీ కలిగించింది. మొత్తానికి దసరా పండగకు వారం ముందే వచ్చిన ‘అరవింద సమేత… వీర రాఘవ’ వీరిద్దరి అభిమానుల్లో పండగ సంబరాలను ద్విగుణీకృతం చేసింది.

రాయలసీమలోని నల్లగుడి, కొమ్మద్ది పక్క పక్క గ్రామాలు. పేకాటలో ఐదు రూపాయల కారణంగా ఏర్పడిన వైరం రెండు గ్రామాల మధ్య మూడు దశాబ్దాల పాటు రావణ కాష్టంలా మారిపోతుంది. అటు బసిరెడ్డి (జగపతిబాబు), ఇటు నారపరెడ్డి (నాగబాబు) వర్గీయులు తలలు నరుక్కుంటూ ఫ్యాక్షన్‌కు ప్రాణం పోస్తారు. అప్పటి వరకూ రాజకీయాల్లో ఉన్న బసిరెడ్డికి పోటీగా నారపరెడ్డి కూడా ఎన్నికల బరిలోకి దిగాలని భావించడంతో ఆ పోరు తీవ్రమౌతుంది. విదేశాల నుండి సొంతూరుకు వస్తున్న వీర రాఘవరెడ్డి (ఎన్టీయార్‌) ఎదుటే అతని తండ్రిని బసిరెడ్డి, అతని మనుషులు చంపేస్తారు. కళ్లముందే తండ్రి హత్యకు గురికావడం చూసి తట్టుకోలేకపోయిన వీర రాఘవ రెడ్డి కత్తిదూసి బసిరెడ్డి వర్గీయులపై దాడిచేసి మారణ ¬మం సృష్టిస్తాడు. ఆవేశం చల్లారిన తర్వాత తమని నమ్ముకున్న కుటుంబాలకు జరిగిన అన్యాయంతో తల్లడిల్లుతాడు. అదే సమయంలో నానమ్మ (సుప్రియ పాఠక్‌) కూడా ఈ కక్షలకు స్వస్తిపలకమని, వచ్చే తరమైనా ప్రశాంతంగా ఉండేలా చూడమని కోరుతుంది. ఆమె మాటలను గౌరవించి, కొంత కాలం ఊరికి దూరంగా ఉండాలని హైదరాబాద్‌ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా అరవింద (పూజాహెగ్డే)తో పరిచయం అవుతుంది. ఫ్యాక్షన్‌ రాజకీయాలపై అధ్యయనం చేస్తున్న అరవిందతో మాటలు పెరిగిన తర్వాత తన సమస్యకు ఆమె నుండి పరిష్కారం దొరుకుతుందనే భావన వీర రాఘవ రెడ్డికి కలుగు తుంది. వీర రాఘవ రెడ్డిని అంతం చేయాలని చూస్తున్న బసిరెడ్డి మనుషులకు ఓ చిన్న ఆధారం దొరకడంతో అరవింద తమ్ముడిని ట్రాప్‌ చేసే ప్రయత్నం చేస్తారు. విషయం తెలుసుకుని అతన్ని రక్షించిన వీర రాఘవకు బసిరెడ్డి చనిపోలేదని, తనను చంపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భావించిన వీర రాఘవ మనసు మార్చుకున్నాడా? బసిరెడ్డిని చంపి తన పగ తీర్చుకు న్నాడా? తాను ప్రేమించిన అరవిందను సొంతం చేసుకో గలిగాడా? అనేది మిగతా కథ.

ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాలు బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచిన చరిత్ర మనది. ‘సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, ఆది, ఇంద్ర’ ఇలాంటివన్నీ ఒకే తాను ముక్కలు. ఇందులోనూ కథానాయకులు ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో పుట్టి పెరిగినా వాటిని విడనాడి సాధారణ జీవితం గడపాలని భావిస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి కత్తిపట్టి శత్రునాశనం చేసినట్టుగానే దర్శకులు చూపించారు. కథగా చూసుకుంటే ఇది కూడా అలాంటిదే. ఎంతో నలిగిన కథే. అయితే ఇందులో కథానాయకుడు ఫ్యాక్షన్‌కు తిలోదకాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అతని నానమ్మ, అమ్మ, ప్రియురాలు. ఈ ముగ్గురు అతని జీవితంపై చూపించిన ప్రభావంతో కథ సాగుతుంది. ఇది గతంలో ఎవరూ స్పృశించని అంశం. తన భర్తను ఎదుటివ్యక్తి చంపినా అవతలి స్త్రీ తాళిబొట్టు తెగిపోవాలని ఏ మహిళా కోరుకోదు అంటూ ఓ గొప్పతనాన్ని వారికి ఆపాదించారు త్రివిక్రమ్‌. అంతేకాదు దానిని చాలా కన్వెన్సింగ్‌గా తెరపైకి ఎక్కించారు. నానమ్మగా నటించిన సుప్రియా పాఠక్‌, అమ్మగా నటించిన దేవయాని, ప్రియురాలిగా నటించిన పూజా హెగ్డే అంతా ఒక ఎత్తుకాగా, పతాక సన్నివేశంలో బసిరెడ్డి భార్యగా నటించిన ఈశ్వరీరావు నటన మరో ఎత్తు. ఇలా ఫ్యాక్షన్‌ కథను ఓ కొత్త కోణంలో చూపించడం వల్లే ‘అరవింద సమేత’ను అందరూ అభిమానిస్తున్నారు.

ఇక ఎన్టీయార్‌ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది. అతన్ని దర్శకుడు ఉపయోగించుకోగలిగితే చాలు. ఆ విషయంలో త్రివిక్రమ్‌ నూరు శాతం సఫలీకృతుడయ్యాడు. సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. పెనిమిటీ పాట టేకాఫ్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఎప్పటిలానే త్రివిక్రమ్‌ తాను మాటల మాంత్రికుడినని మరోసారి నిరూపించు కున్నారు. సునీల్‌ రీ-ఎంట్రీ అదిరిపోయింది. అతనితో బలవంతపు కామెడీ చేయించకుండా ఓ సహాయకుడి పాత్రగానే మలచడం బాగుంది. ‘లెజెండ్‌’ తర్వాత మరోసారి జగపతిబాబు తన నట విశ్వరూపం చూపించారు. అలానే ఆయన కొడుకుగా నవీన్‌ చంద్ర కూడా అద్భుతమైన నటన కనబరి చాడు. అరవింద తండ్రిగా నరేశ్‌, చెల్లిగా ఈషా రెబ్బ, కాటికాపరిగా అయ్యప్ప పి.శర్మ, రాజకీయ నేతలుగా రావు రమేశ్‌, శుభలేఖ సుధాకర్‌… ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. తమన్‌ నేపథ్య సంగీతం, పి.ఎస్‌. వినోద్‌ సినిమాటో గ్రఫీ బాగున్నాయి. ఎన్టీయార్‌ సినిమాలో మూడు నాలుగన్నా డ్యుయేట్స్‌ లేకపోతే ఎలా అంటూ విడుద లకు ముందు సన్నాయి నొక్కులు నొక్కిన వారందరికీ త్రివిక్రమ్‌ తన కథనంతో సమాధానం చెప్పాడు. తన ‘అజ్ఞాతవాసి’తో దెబ్బతిన్న నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణకు వెంటనే ఈ ఘనవిజయాన్ని అందించి, త్రివిక్రమ్‌ లెక్క సరిచేశారు!

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *