కొత్త అనుభూతిని అందించే ‘అంతరిక్షం’

కొత్త అనుభూతిని అందించే ‘అంతరిక్షం’

తొలి చిత్రం ‘ఘాజీ’తో జాతీయ స్థాయిలో గుర్తింపునే కాదు, అవార్డులనూ సొంతం చేసుకున్నారు యువ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి. భారత్‌-పాక్‌ యుద్ధ నేపథ్యంలో, జలాంతర్గామి కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో ‘ఘాజీ’పై అందరిలో ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్టుగానే ఆసక్తిని కలిగించే కథ, కథనాలతో దానిని రూపొందించి అందరి ప్రశంసలూ అందుకున్నారు సంకల్ప్‌. ఆయన ద్వితీయ చిత్రం ‘అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్‌.’ ఇటీవల విడుదలైంది. ఈసారి స్పేస్‌ సెంటర్‌ను తన కథా వస్తువుగా సంకల్ప్‌ ఎంచు కున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్‌ సమర్పణలో రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు.

దేవ్‌ (వరుణ్‌ తేజ్‌) ఇండియన్‌ స్పేస్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌. ఆస్ట్రోనాట్‌గానూ కొంత శిక్షణ తీసుకుని ఉంటాడు. అతని బ్రెయిన్‌ చైల్డ్‌ అయిన విప్రియాన్‌ అనే శాటిలైట్‌ను మూన్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశ పెడతారు. కానీ కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత అందు లోనే కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో అహోరాత్రులు కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ కోసం పనిచేసిన దేవ్‌ ఖిన్నుడవుతాడు. ఆ శాటిలైట్‌ లాంచ్‌ సమయం లోని అతను ప్రేమించిన పార్వతి (లావణ్య త్రిపాఠి) యాక్సిడెంట్‌కు గురయ్యి మరణిస్తుంది. ఆ ప్రమాదా నికి దేవ్‌ కూడా పరోక్షంగా కారణం కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, ఉద్యోగానికి రాజీనామా చేసి, రామేశ్వరం వెళ్లిపోయి, అక్కడో స్కూల్‌ టీచర్‌గా స్థిరపడతాడు. ఆ తర్వాత కొంతకాలానికి భారత్‌ ‘మిహిర’ అనే శాటిలైట్‌ను ప్రయోగిస్తుంది. అయితే… కొన్ని సంవత్సరాల తర్వాత అది పనిచేయడం మానేస్తుంది. అంతేకాదు… కక్ష్యలోంచి బయటకు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. అదే జరిగితే, ప్రపంచ దేశాల శాటిలైట్స్‌ను అది ఢీ కొని, తద్వారా మొత్తం కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బ తినే ఉపద్రవం ఏర్పడుతుంది. ఈ గండాన్ని గట్టెక్కించగలిగే వ్యక్తి ఒక్క దేవ్‌ మాత్రమే అని స్పేస్‌ సెంటర్‌ టీమ్‌ అభిప్రాయపడుతుంది. అతన్ని రామేశ్వరం నుండి తిరిగి తీసుకొచ్చే బాధ్యతను అతని ఒకప్పటి సహ ఉద్యోగి రియా (అదితీరావ్‌ హైదరీ) స్వీకరిస్తుంది. మరి దేవ్‌ తన మనసు మార్చుకుని స్పేస్‌ సెంటర్‌కు వచ్చాడా? అంతరిక్షంలోకి వెళ్లి మిహిరా శాటిలైట్‌ లోని లోపాలను సవరించాడా? ఇదే కాకుండా అతని హిడెన్‌ ఎజెండాను అమలు చేయడానికి ఏం చేశాడు? అన్నది మిగతా కథ.

ఆరు పాటలు, నాలుగు పోరాట దృశ్యాలు, కొన్ని కామెడీ, మరికొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌ను సినిమాల్లో చూడాలనుకునే వారికి ‘అంతరిక్షం’ ఏ మాత్రం ఎక్కదు. అదే విధంగా కాస్తంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికేమో ‘స్పేస్‌ రిలేటెడ్‌ సబ్జెక్ట్స్‌ను ఇంత స్వేచ్ఛ తీసుకుని చేయొచ్చా!’ అనే అనుమానం కలుగుతుంది. అయితే… సంకల్ప్‌ చెప్పాలనుకున్న కథను కాస్తంత లిబర్టీ తీసుకునే చెప్పాడు. సాధ్యా సాధ్యాల సంగతి పక్కన పెట్టి… విషయం మీద ఫోకస్‌ చేశాడు. ఆ యాంగిల్‌లో సినిమాను చూసిన వారికి ఇది నచ్చుతుంది. స్పేస్‌ సెంటర్‌లో వ్యక్తుల మనో భావాలు ఎలా ఉంటాయి? సరిహద్దుల్లోని సైనికుల మాదిరిగానే ఇక్కడ కూడా ఇల్లూ వాకిలీ పట్టకుండా శాస్త్రవేత్తలు పనిలో ఎంతగా నిమగ్నమై పోతారు అనేది అర్థం అవుతుంది. ఓ శాటిలైట్‌ లాంచ్‌ వెనుక ఎంత మేధోమథనం జరుగుతుంది? అది ఒకవేళ సక్సెస్‌ కాకపోతే… ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనేదీ అవగతం అవుతుంది. కాబట్టి ఇలాంటి సినిమా ఒకటి తెలుగులో వచ్చినందుకు సంతోషించాలి. అలాంటి ప్రయత్నం చేసిన వారిని అభినందించాలి.

ఇక నటీనటుల విషయానికి వస్తే వరుణ్‌ తేజ్‌ వీలైనంత వరకూ భిన్నమైన చిత్రాలే చేస్తున్నాడు. ఇదీ అదే కోవకు చెందింది. నటుడిగానూ సెటిల్డ్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. లావణ్య త్రిపాఠి, అదితీరావ్‌ హైదరీ, అవసరాల శ్రీనివాస్‌, రాజా చెంబోలు, రెహ్మాన్‌, సత్యదేవ్‌… తదితరులంతా పాత్రోచితంగా నటించారు. సంకల్ప్‌ రాసిన సంభాషణలు క్లుప్తంగా ఉండి ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రశాంత్‌ విహారి సంగీతం, జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలిచాయి. భావోద్వేగ సన్నివేశాలను తెరకెక్కించడం లోనూ, కథను మరింత పకడ్బందీగా తయారు చేయడంలోనూ సంకల్ప్‌ ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ‘ఘాజీ’ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సహజంగానే అంచనాలూ భారీగా ఉంటాయి. ఆ రకంగా చూసినప్పుడు ‘అంతరిక్షం’ ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఏదేమైనా సంకల్ప్‌ బృందం చేసిన సాహ సాన్ని స్వాగతించాలి. అతని నుండి మేలైన మరిన్ని మంచి చిత్రాలను రావాలని కోరుకుందాం.

–  చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *