అజ్ఞాత వ్యక్తి

అజ్ఞాత వ్యక్తి

ది కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కథ.

ఆ రోజు సత్యంగారింటికి అతను వచ్చాడు.

‘అయ్యా…. నన్ను గురవయ్య అంటారు. ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చాను. నేను వారాలు చెప్పుకుని బతుకుతుంటాను. ఈ రోజు తమ ఇంటికి భోజనానికి వస్తాను’ అన్నాడు.

‘అదెంత భాగ్యంలెండి. మీరు నిరభ్యంతరంగా మా ఇంట్లో భోజనం చేయవచ్చు’ అన్నాడు సత్యం.

సత్యంగారికి ఊళ్లో యాభై ఎకరాల భూమి ఉంది. పట్నంలో వ్యాపారాలు కూడా ఉన్నాయి. వాటిలో ఆయన భాగస్వామి. నిర్వహణలో భాగం పంచుకోడు.

రెండు సంవత్సరాల క్రితం మకాం పట్నానికి మార్చాడు. అందుకు ముఖ్య కారణం పిల్లల చదువులు. వారానికోసారి కారులో ఊరికి వెళ్లి వ్యవసాయం చూసుకుని వస్తుంటాడు.

పట్నంలో ఓ వెయ్యి గజాల స్థలం తీసుకుని అందులో ఇల్లు కట్టాడు. బంధుమిత్రుల కోసం అతిథి గృహం కూడా కట్టించాడు. డాబా మీద ఓ గది ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు.

ఆయన ఇంటి సభ్యులు కాకుండా నలుగురయిదుగురు బయటి వ్యక్తులు ఆ ఇంట్లో భోజనం చేస్తుంటారు. అలా గురవయ్య ప్రస్థానం మొదలయింది.

అదో కాలనీ లాంటిది. విశాలమైన మైదానం. చుట్టుపక్కల కొన్ని పూరిళ్లు.. ఒకటి, రెండు మేడలుంటాయి. అన్ని కులాల వారు, మతాల వారు, వివిధ వృత్తుల వారు అక్కడ వుంటారు. అది పేరుకు పట్నం అయినా అక్కడ పల్లెటూరి వాతావరణం వుంటుంది. నాగరికత ఇంకా అక్కడికి ప్రవేశించని రోజులవి.

సత్యంగారి ఇంటి తర్వాత మరికొందరి దగ్గరకు వెళ్లి భోజనానికి వస్తాను అనేవాడు గురవయ్య. అప్పట్లో మంచినీళ్లకి, మజ్జిగకి, భోజనానికి కూడా వెనకాడే వారు కాదు. తమ ఇంటికి ఎవరన్నా భోజనానికి వస్తే సంతోషపడేవారు. అలా అందరికీ పరిచయం అయ్యాడు గురవయ్య. రాత్రిపూట ఎవరి ఇంటి బయటో నిద్రపోయేవాడు. అప్పటికి ఆయనకు అరవై సంవత్సరాలు దాటిపోయాయి.

ఎలా వచ్చిందోగాని గురవయ్యకి భోజనం పెడితే ఆ ఇంటివారికి మంచి జరుగుతుందనే ప్రచారం మొదలయింది. నమ్మకం పెరిగింది. గురవయ్యలో ఓ ప్రత్యేకత వుంది. ఏ భోజన సమయంలోనో వచ్చి నాకు అన్నం పెట్టండి అని అడగడు. ముందుగా చెబుతాడు. అలాగే ఎవరన్నా ఈ రోజు మా ఇంటికి భోజనానికి రండి అంటే రాడు.

‘నేను వారం చెబుతాను’ అనేవాడు.

పేదవారు కూడా ఆయనకి భోజనం పెట్టటం అంటే అది తమ అదృష్టం అనుకునేవారు. అతను శాకాహారి. ‘నా కోసం మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవద్దు. మీరు వండుకున్న దాంట్లో నాలుగు ముద్దలు నాకు పెట్టండి చాలు’ అనేవాడు ముందుగానే.

ఓ రోజు సత్యంగారు అన్నారు,

‘మీరు రోజుకొకరిని అడగటం ఎందుకు. మనింట్లోనే భోజనం చేయండి’ అని.

‘అలా కాదు. అందర్నీ కలవాలి. అందరి ఇళ్లలో భోజనం చేయాలి. నేను కొందరికే పరిమితం కావాలనుకోను. అంత అవసరం అనుకుంటే మీ ఇంట్లోనే భోజనం’ అన్నాడు. అలానే ఎక్కువసార్లు అక్కడే భోజనం చేసేవాడు.

‘రాత్రిపూట అక్కడా ఇక్కడా పడుకోవటానికి ఇబ్బందిగా వుంటోంది కదా… మీరో పని చేయండి. మీరు ఎవరింట్లో అయినా భోజనం చేయండి. రాత్రి మన గెస్ట్‌హౌస్‌ గదిలో వుండండి’ అన్నాడు సత్యం.

అందుకు గురవయ్య అంగీకరించాడు.

సత్యంగారు మంచం మీద పడుకోమన్నా ఒప్పుకోలేదు. చాప, చిన్న దిండు రెండు దుప్పట్లు మాత్రం అతని దగ్గరుంటాయి. వాటిని, తన బట్టల్ని స్వయంగా తానే ఉతుక్కుంటాడు. అప్పుడప్పుడు కాషాయ బట్టలు ధరిస్తాడు.

అతని ఆస్తి అంతా ఓ ముల్లె. అందులో పాతకాలం నాటి పుస్తకాలుంటాయి. ఏవేవో మందులు వుంటాయి. తర్వాతి కాలంలో తెలిసిందేమిటంటే అతను అమృతాంజనం లాంటి బామ్‌ తయారు చేస్తాడు. ఆయుర్వేద వైద్యం తెలుసు.

– – – – – – – –

గురవయ్యని తమ ఇంట్లో వుండమన్నప్పుడు సత్యంగారి ఇంట్లో చర్చ జరిగింది. అతను ఎవరో తెలియదు. ఓ పూట భోజనం చేసాక వెళ్లిపోతాడనుకున్నాం. సాంతం ఇక్కడే వుండిపోయేలా వున్నాడు అని సత్యంగారి శ్రీమతి వాదన.

‘అతను ఎవరనేది మనకు అనవసరం. మనం ఏది పెడితే అది తింటాడు. గది ఖాళీగా వుంది. అందుకే వుండమన్నాను’

‘కొత్తవారిని ఎలా నమ్ముతాం. రేపు దొంగతనం చేయవచ్చు. ఆ తర్వాత కనిపించకుండా మాయం కావచ్చు’

‘గురవయ్యగారు దొంగలా కనిపిస్తున్నారా?’ అన్నాడు సత్యం.

‘నల్లగా వుండేవారు. ఒంటికి నూనె పూసుకుని, రాత్రులు కన్నాలు వేసేవారే దొంగలంటారా? ఇప్పుడు దొంగలు ఎన్నో అవతారాల్లో వున్నారు’

‘మన దగ్గర దొంగతనం చేయటానికి ఇంట్లో ఏమీ దాచుకోలేదు’

‘మీరు ఎన్నన్నా చెప్పండి. రేపు రోగం వస్తుంది. రొష్టు వస్తుంది. మంచాన పడితే సేవలు ఎవరు చేయాలి. ఆయన దారి ఆయన్ను చూసుకోమనండి’

‘ఇప్పట్లో ఆయన ఆరోగ్యానికి వచ్చే ముప్పు ఏమీ లేదు. కుర్రాళ్ల కంటే ఉత్సాహంగా నడుస్తున్నారు. యోగా చేస్తున్నారు. అంతగా ఆయనకు అలాంటి పరిస్థితి వస్తే ఆస్పత్రిలో చేర్పించుదాం. ఓ మనిషిని ఏర్పాటు చేద్దాం. నువ్వు కంగారు పడకు’ అన్నాడు సత్యం.

‘మీది అతి మంచితనం. మనది కాని పనిని భుజానికెత్తుకోకూడదు అంటారు. ఏదో రోజు మీరు చేసింది తప్పు అని బాధపడతారు. అయినా ముందు గురవయ్యగారి వివరాలు తెలుసుకోండి’ అంది సత్యంగారి భార్య.

ఆ తర్వాత కూడా గురవయ్యని తన వివరాలు చెప్పమని అడగలేదు సత్యం. ఆయన ఇంట్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు గురవయ్య ఇచ్చిన మందులు బాగా పని చేసాయి. ఆ రకంగా గురవయ్య మీద తీవ్రత కొంత తగ్గినా అనుమానం అలానే వుంది ఇంట్లో వారికి.

అప్పటికీ పిల్లలు ‘మీదే ఊరు?’ అని అడిగితే ‘నేను లోక సంచారిని’ అనేవాడు.

‘మీకు పిల్లలున్నారా?’

‘నాకు ఎవరూ లేరు’

‘ఎవరూ లేకుండా ఎలా వుంటారు ఏ మనిషి అయినా? మీరు పెళ్లి చేసుకోకపోవచ్చు. ఇంతకూ మీది ఏ కులం?’

‘నాకు కులాలు, మతాలు వుండవు’

‘ఉండకుండా ఎలా సాధ్యం?’

‘అలాంటివన్నీ అధిగమించాను. నాకు కోరికలు లేవు. ఆరోగ్యంగా వున్నంత వరకు ఇలానే బాటసారి జీవితం గడుపుతాను. ఏ జబ్బో చేస్తే మీలాంటి వారున్నారు. నేను చనిపోతే ఎవరో ఒకరు దహనక్రియలు చేస్తారు. అనాథ శవంలా వదిలేయరు. ఈ దేశంలో ఆ సంస్కారం ఇప్పటి వరకు వుంది’

‘ఓ వేళ అనాథ శవంలా వదిలేస్తే…!’

‘నేను చనిపోయాక నాకెలా తెలుస్తుంది. దహనం చేస్తే సంస్కారం. చేయకపోతే సంస్కారం దహనం అవుతుంది. నా విషయంలోనే కాదు- ఏ మనిషి విషయంలో అయినా అంతే’

ఆ కాలనీలో వుండే మరికొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గురవయ్య గురించి ఎలాంటి వివరాలు సంపాదించలేకపోయారు.

– – – – – – —

గురవయ్య అప్పుడప్పుడు ఆ ఊరి నుండి వెళ్లిపోయి రెండు, మూడు నెలలు వచ్చేవాడు కాదు. అప్పుడు కూడా తన ముల్లెని సత్యంగారి ఇంట్లోనే వుంచేవాడు. భుజానికి ఓ సంచి తగిలించుకునేవాడు. అందులో బట్టలు, అతనికి చెందిన చిన్న చిన్న సామాన్లు వుండేవి.

తను ఎక్కడికి వెళ్లేది సత్యానికి కూడా చెప్పేవాడు కాదు. మందుల విషయంలో ఎవరినీ డబ్బులు అడిగేవాడు కాదు. అవి తయారు చేయటానికి ఖర్చు అవుతుంది కాబట్టి ఎవరన్నా ఇస్తే తీసుకునేవాడు.

ఓ వ్యక్తి గురించి తెలియనప్పుడు రకరకాల ఊహాగానాలు మొదలవుతాయి. అతను బయటకు వెళ్లినప్పుడు అవి జోరు అందుకునేవి. అతను లక్షాధికారని, కుటుంబ నిరాదరణ వల్ల విరక్తి చెంది వుంటాడని కొందరు, అతను సన్యాసి, యోగి అని ఇంకొందరు, ఇలా రకరకాల ఊహల మధ్య గురవయ్య తిరిగి వచ్చేవాడు.

అయిదారు సంవత్సరాలు గడిచిపోయాయి.

ఆధునికత ఆ పట్నానికి, ఆ కాలనీలోకి పాకటం మొదలయింది. గురవయ్య ఎవరి ఇంటి దగ్గరయినా భోజనానికి చెబితే ఈ రోజు వీలు కుదరదు, ఇంకో చోట అడగండి. మాకు అవకాశం వున్నప్పుడు మేమే చెబుతాం అనటం మొదలుపెట్టారు. అలాంటి రోజున పస్తుండేవాడు తప్ప సత్యంగారి ఇంట్లో కూడా భోజనం చేసేవాడు కాదు.

మెల్లగా కొత్త వాదనలు వినిపించటం మొదలయింది. ‘గుడ్డి వారికో, కుంటి వారికో, అనాథ పిల్లలకో అన్నం పెట్టినా అందులో ధర్మం వుంది. దుక్కలా వున్నాడు. ఈ ముష్టి కార్యక్రమం ఏమిటి? ఆయన దగ్గర విద్య వుంది. సంపాదించే తెలివితేటలున్నాయి. ఆ పని చేస్తే గురవయ్య నలుగురికి పెట్టవచ్చు. అయినా ఏ సంబంధం వుందని, ఏ బంధుత్వం వుందని సిగ్గు లేకుండా భోజనానికి వస్తాను అంటాడు. గురవయ్య భగవంతుడా! భగవంతుని పుత్రుడా! ఇంతకాలం అందరూ కలిసి అతన్ని మేపారు. ఈ కథ వింటే ఊరికి పదిమంది ఇలాంటి వారు తయారవుతారు. పనీపాటా లేకుండా తిండి దొరికితే ఎవరికయినా ఏం కావాలి!’

ఇలాంటివన్నీ సత్యంగారి భార్యకి చేరుతున్నాయి.

‘అయినా ఆ సత్యంగారేంటి… ముక్కూ మొహం తెలియని మనిషిని ఇంట్లో వుంచుకుంటాడు. అదాయన ఇష్టం. గురవయ్యని దేశం మీదకు తోలటం ఏంటి అచ్చోసిన ఆంబోతులా’ అన్న వారున్నారు.

అది సత్యంగారి భార్యను బాధ పెట్టింది. సత్యంగారి చెవులకి కూడా ఇవన్నీ చేరాయి.

‘మీరు ఎవరింటికీ వారాలకు వెళ్లవద్దు. మనింట్లో రెండు పూట్లా భోజనం చేయండి. మనుషులు గతంలోలా లేరు. మీకు అవమానం జరిగితే ఆ అవమానం నాది’ అంటూ గట్టిగా చెప్పాడు.

‘నాకు అవమానం అంటూ వుండదు. అన్నింటికీ ఆ భగవంతుడున్నాడు. ఈ బతుకు ఎలా గడిచిపోవాలో పైవాడు నిర్ణయిస్తాడు’ అన్నాడు.

ఇలాంటి సమయంలో ఇంకో వార్త తెలిసింది.

గురవయ్య లాటరీ టిక్కెట్లు కొంటాడని!

నాకు ఎలాంటి కోరికలు లేవు. బాటసారిని, సన్యాసిని అనే మనిషికి ఈ లాటరీ టిక్కెట్లు ఏమిటి? ఇతని వెనకాల భయంకరమైన లేదా విషాదకరమైన గతం వుందా…? అది ఏదో ఒక రోజు ఒక్కొక్కటిగా వీడిపోనుందా అనుకుంటున్న సమయంలో మళ్లీ సత్యంగారింట్లో చర్చ….

‘ఇంతకుముందు దొంగతనం చేస్తాడేమో అన్నావు. ఇప్పుడు లాటరీ టిక్కెట్లు కొంటున్నా డంటావు. కొనుక్కొనీ… ఆయన మాత్రం మనిషి కాదా- కోరికలు వుండవా? భయాలు వుండవా? అందరికీ కుటుంబాలు వున్నాయి. పిల్లలు రేపు డబ్బు లేకపోతే మనల్ని చూస్తారా అనే ఆందోళన వుంది. మరి గురవయ్య గారికి వుండదా! ఏ లాటరీలోనన్నా డబ్బులు వస్తే తన చివరి రోజుల్లో ఎవరో ఒకరు సేవలు చేస్తారని ఆయన అనుకోవచ్చు. అయినా ఆయనకి నేను మాట ఇచ్చాను. గురవయ్యగారు ఇష్టం వున్నంతకాలం మన దగ్గర వుంటాడు. ఇంతకు మించి మనింట్లో వాదనలు నాకు ఇష్టం వుండదు’

ఆమె మాట్లాడలేకపోయింది.

అలాంటి సమయంలోనే సత్యంగారి జాతకం తిరగబడింది.

వ్యాపారాలు కుదేలయ్యాయి. నమ్మిన వారు మోసం చేసారు. లెక్కల్లో లక్షలు అప్పు చూపిస్తున్నారు.

అప్పుడు సత్యంగారి భార్య మాట్లాడింది.

‘మీది అతి మంచితనం అని ముందు నుంచి అంటున్నాను. ఏ రోజూ మీరు నా మాట వినలేదు. ఆ గురవయ్య మన ఇంటిలోనికి అడుగుపెట్టినప్పటి నుండి మన ఇంట్లో సర్వ అనర్ధాలు మొదలయ్యాయి. ఇప్పటికయినా అతన్ని మన ఇంటి నుంచి బయటకు పంపండి. ఆయనకు మీరు అవసరం లేదు. ఎక్కడయినా బతకగలడు’ అంది.

‘అలాగే చేద్దాం. అప్పుడు మన అప్పులు తీరతాయా?’

‘అలా అంటే నేనేం మాట్లాడగలను’

‘ఏమన్నా అనాలంటే నన్నను. నేను అతి మంచి తనానికి పోతాను. అది నిజమే. అందర్నీ నమ్మాను. వ్యాపారాల్లో భాగస్వామిగా వున్నాను. అక్కడ ఏం జరుగుతుందో నేను పట్టించుకోలేదు. అది నా తప్పు. అయిన వాళ్లే కదా మోసం చేసింది. సైలెంట్‌ పార్ట్నర్‌గా వుంటానంటే కుదరదని ఈ అనుభవం పాఠం నేర్పింది. దీనికీ గురవయ్యగారికి సంబంధం ఏమిటి? అతనికి మనం తిండి పెట్టాం. ఆ విశ్వాసం ఆయనకుంది’

‘ఇప్పుడు నష్టాల్లో వున్నాం. ఓ మనిషి ఖర్చు తగ్గినా తగ్గినట్లే. అతన్ని ఏదో దారి చూసుకోమనండి’

‘పోనీ మనం కూడా తిండి మానేద్దామా?’

హతాశురాలయింది.

‘ఇలా మాట్లాడితేనే బాధగా వుంటుంది. గురవయ్యగారు మన ఇంటిలో సభ్యుడు అను కున్నాను. నష్టాలు వచ్చాయని అమ్మా నాన్నలకు అన్నం పెట్టటం మానేస్తామా?’

‘మీ ఇష్టం.. మీకో దండం. మీరు ఏం చేయా లనుకుంటే అది చెయ్యండి’ అని అతని ముందు నుండి వెళ్లిపోయింది. కొద్ది క్షణాలు ఆగి ఆమె దగ్గరకు వెళ్లాడు.

‘లాభాలు వచ్చినప్పుడు తీసుకున్నాం. నష్టాలు వచ్చినప్పుడు తీర్చాలి. ఆస్తులు అమ్మటమా, తాకట్టు పెట్టటమా అనేది చూస్తాను. ఇలాంటి సమయంలో ఇంట్లో వారు సహకరించాలి. ఇది కావాలని చేసింది కాదు. గురవయ్యగారి ప్రస్థావన ఇంకోసారి తీసుకు రావద్దు. ఓ మనిషికి నాలుగు మెతుకులు పెట్టలేనంత స్థితి ఇంకా రాలేదనుకుంటాను’ అని బయటకి వెళ్లిపోయాడు.

ఆ రాత్రి గెస్ట్‌హౌస్‌కి వెళ్లాడు.

గదిలో గురవయ్య లేడు. మంచం మీద వాలి పోయాడు. అతనికి గతం గుర్తొస్తోంది.

సత్యంగారికి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం ఇష్టం. అందులోనూ బెంగాలీ సాహిత్య అనువాదాలు ఎక్కువ చదివాడు. కొన్ని తెలుగు, హిందీ పాత సినిమాలంటే ఇప్పటికీ ప్రాణం.

ఆ కథల్లో ఎక్కడినుండో ఓ బాటసారి వస్తాడు. కొంతకాలం ఆ ఊర్లో వుంటాడు. అక్కడ కథానాయిక ప్రేమలో పడుతుంది. ఓ రోజు అతను వెళ్లిపోతాడు. అలాంటి కథలు సుఖాంతమైనా, దుఃఖాంతమైనా అనేక భావాలతో గుండెలు బరువెక్కుతాయి.

‘ఓ బాటసారీ…. నను మరువకోయి’

‘రాకోయీ అనుకోని అతిథి’ ఇలాంటి పాటలంటే ఎంతో ఇష్టం. గురవయ్యది కూడా ఇలాంటి కథే.

ఎందుకు వచ్చాడో తెలియదు. మధ్యలో కొంతకాలం ఎక్కడికి వెళ్తాడో తెలియదు.

అప్పుడాయనకి తన ముత్తాత గుర్తుకొచ్చాడు.

ఆయన కూడా ఇలానే ఇల్లు వదిలి విశాల ప్రపంచంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని చెప్పేవారు. ఇలాంటి వారు ఎక్కడో పుడతారు. ఎక్కడికో వెళ్తారు. ఇందులో రకరకాల వారున్నారు. ప్రపంచాన్ని మార్చటానికి ఇళ్లు వదిలి వెళ్లినవారున్నారు. కుటుంబం మీద, సమాజం మీద అసంతృప్తితో వెళ్లిన వారు, భౌతిక సుఖాలకు అతీతంగా హిమాలయాలకు వెళ్లిన వారు, యోగు లయిన వారున్నారు. వారు అలానే ప్రకృతిలో కలిసిపోయారు.

‘మా తాత విపరీతంగా చదివాడు. ఎప్పుడూ పండితులతో చర్చలు జరిపేవాడు. కాశీ లాంటి చోట్లకు వెళ్లేవాడు. ఓ రోజున ఆయన కనిపించలేదు. అందరూ దుఃఖపడ్డారు. అంతకుమించి ఏం చేయగలరు’ అనోసారి సత్యం తండ్రి అన్నాడు.

యవ్వనంలో వుండగా సత్యానికి కూడా ఇంటి నుండి వెళ్లిపోవాలని అప్పుడప్పుడు అనిపించేది. బాటసారిగా బతకటంలో రొమాంటిసిజం వుంది అనిపించేది. ఎందుకనో అది ఆలోచనగానే మిగిలిపోయింది.

ఇప్పుడు మళ్లీ అలాంటి ఆలోచన వచ్చింది.

బాకీలన్నీ తీర్చేసి, మిగిలిన ఆస్తులు అందరికీ పంచేసి, భార్యకు ఓ భాగం ఇచ్చి నేను ఒక్క పైసా తీసుకోకుండా వెళ్లిపోతేనో అని…

గురవయ్యలా తను బతకగలడా! ఈ రోజు మీ ఇంటికి భోజనానికి వస్తాను అని అడగగలడా! పదిమందికి పెట్టిన చెయ్యి… ఇంకొకరి ముందు చాచగలడా! భౌతిక బంధాలను, కుటుంబ బాంధవ్యాలను తెంచుకోవటం సాధ్యం అవుతుందా!

ఇలాంటి పనులను గురవయ్య లాంటివారు, తన ముత్తాత లాంటివారు మాత్రమే చేయగలరు. వారు సిగ్గుని జయించారు. అభిమానాన్ని జయించారు. అది తన వల్ల కాదు. ఏదో అనుబంధం వుంటే తప్ప ఇలాంటి వ్యక్తులు మన జీవితాల్లోకి రారు అనుకున్నాడు. ఎప్పటికో నిద్ర పట్టింది.

– – – – – – —

వారం రోజులు గడిచిపోయాయి. గురవయ్య ముల్లె గదిలోనే వుంది. అప్పుడు అనుమానం వచ్చింది.

ఇంట్లో తన మీద చర్చ జరుగుతోందని తెలిసిందా?

ఇంట్లోవారే తను లేనప్పుడు మాటలతో గాయ పరిచారా?

ఇప్పుడు మనుషులు మారిపోవటం అతన్ని ఇబ్బంది పెట్టిందా?

పిల్లల్నీ, భార్యని ఎదురుగా వుంచుకుని అడగాలనిపించింది. అందువల్ల మనసుల్ని బాధ పెట్టుకోవటం మించి ఉపయోగం వుండదను కున్నాడు.

రెండు నెలలు గడిచిపోయాయి. గురవయ్య తమ ఇంటి నుంచేకాదు ఊరి నుంచి కూడా వెళ్లిపోయాడు. జీవితంలో అతను తిరిగి రాకపోవచ్చు. ఎందుకు వచ్చినా, ఎందుకు వెళ్లినా అతనో గొప్ప అనుభవం, మరపురాని జ్ఞాపకం.

అప్పులవారు మూడు రూపాయల వడ్డీ ఇవ్వ మంటున్నారు. అవన్నీ లెక్కలు చూస్తే మోయలేని భారం అవుతుంది. అందుకే భూముల్లో కొంత భాగం అమ్మాలనుకున్నాడు. బేరం పెట్టాడు.

ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. తాతల నాటి భూములవి. అవంటే సత్యానికి ప్రాణం. ఆ నేలతల్లి మీద ప్రేమే కొన్ని పనులు చేయటానికి సత్యానికి అడ్డుగా నిలిచింది. ఇప్పటికిప్పుడు అమ్మాలంటే సహజంగానే తక్కువకి అడుగుతున్నారు. రెండుమూడు రోజుల్లో తన నిర్ణయం చెబుతాను అన్నాడు సత్యం.

– – – – – – —

ఉదయం పదకొండు గంటలకి భోజనం చేసాడు. కారు సిద్ధంగా వుంది. అప్పటికే తను ఓ నిర్ణయం తీసుకున్నాడు. ధర ఎంతయినా ఫర్వాలేదు. అమ్మి ముందు బాకీలు తీర్చేయాలి. భూమి మీద, బతుకు మీద కూడా మమకారాన్ని తగ్గించుకోవాలి. పిల్లలకి నిజంగా భూమి మీద ప్రేమ వుంటే ఎప్పటికయినా కొనుక్కుంటారు. రేపు వాళ్లే భూములన్నీ అమ్మేసి నగరాలకో, విదేశాలకో వలసలు వెళ్లవచ్చు అనుకుంటూ పై పంచె అందుకున్నాడు.

అదే సమయంలో ‘పోస్ట్‌’ అని వినిపించింది.

సంతకం చేసి కవర్‌ అందుకున్నాడు. అది చించాడు. అందులో లేఖతో పాటు ఓ డిమాండ్‌ డ్రాఫ్ట్‌ వుంది.

‘సత్యంగారూ….

నమస్కారం. ఈ లేఖతోపాటు మీకు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ పంపుతున్నాను. భోజనానికి ఇంటింటికీ తిరిగే గురవయ్యకి ఇంత డబ్బు ఎలా వచ్చింది అని మీరు అనుకోవచ్చు. ఇది లాటరీలో వచ్చింది కావచ్చు. ఆస్తులు అమ్మి ఇస్తున్నది కావచ్చు. ఇంకేదయినా కావచ్చు. మీరు అప్పుల్లో వున్నారని నాకు తెలుసు. ఈ డబ్బుని మీరు ఎలా ఉపయోగించుకుంటారో మీ ఇష్టం.

నాకు అన్నం పెట్టినవారు ఎందరో వున్నారు. ఈ డబ్బులో ఏదన్నా మిగిలితే, ఎవరన్నా సమస్యల్లో వుంటే వారికి సాయం చేయండి.

నా గురించి అనేక కథలు ప్రచారంలో వున్నాయని నాకు తెలుసు. మీరు నా గురించి ఎలాంటి ఆందోళన పడవద్దు. నాకు ఎవరో ఒకరు ఈ దేశపు బిడ్డలు నాలుగు ముద్దలు పెడతారు. ఇప్పటివరకు అలానే జరిగింది. ఇకముందూ అలానే జరుగుతుంది.

ఇంక నా గురించి తెలుసుకోవాలని అందరికీ వుంటుంది. గతం లేని వారంటూ ఎవరూ వుండరు. నాకూ ఓ గతం వుండేది. అది మరిచిపోయాను అని చెబితే బాగుండదు. ఆ విషయం నేను ఆలోచించను. మీలాంటి వారికి చెప్పటం వలన ప్రమాదం ఏం వుండదు.

కొన్ని విషయాలు గుప్పిట్లో వుంటేనే అందం.

మళ్లీ ఎప్పుడయినా నేను మిమ్మల్ని కలవొచ్చు. ఏదీ మన చేతుల్లో లేదు. నా జీవితానుభవం అది. నన్ను అనుసరించమని ఎవరికీ చెప్పను. ఈ దేశంలో నేనూ ఒకడ్ని అంతే….

మీ… గురవయ్య’

సత్యం ఆ లేఖను పదే పదే చదువుతున్నాడు. అప్పుడు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ కేసి చూసాడు.

పది లక్షల రూపాయలు!

– – – – – – —

సత్యంగారి జీవితం మారిపోయింది.

అప్పులు తీరాయి. పిల్లలు ఎదిగి వచ్చారు. వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. ఆయన తన గ్రామంలో ఎక్కువ కాలం వుంటున్నాడు. ఆయన గదిలో ఓ చిత్రకారుడికి పోలికలు చెప్పి గీయించిన చిత్రం వుంటుంది. అందులో గురవయ్యగారి కొన్ని పోలికలు వుంటాయి.

సత్యంగారు గురవయ్య కోసం కొన్ని తీర్థ యాత్రలు చేసాడు. వెళ్లిన ప్రతి చోటా అతను కనిపిస్తాడేమోనని చూస్తుంటాడు.

పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. కొత్త తరం వచ్చింది.

సత్యంగారు తన భూముల్లో గురవయ్య పేరుతో కమ్యూనిటీ హాల్‌ కట్టించాడు. అందులో జరిపే ఏ కార్యక్రమానికయినా ఉచితంగానే ఇస్తారు. సంవత్సరానికోసారి వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమాలుంటాయి. ఆ హాల్లో ఓ అద్దాల గదిని నిర్మించారు. అందులో గురవయ్యగారి ‘ముల్లె’ వుంటుంది.

సత్యంగారి భార్య ‘గురవయ్యగారి గురించి ఏదో అనుకునేదాన్ని. ఆయన శని కాదు. భగవంతుడు మా కోసం పంపించాడు’ అనేది.

ఈ కథ విన్నవారిలో కొందరు నమ్మరు.

ఇంకొందరు అప్పుడప్పుడు ఇలాంటి మిరాకిల్స్‌ చరిత్రలో జరుగుతుంటాయి అంటారు.

గురవయ్యగానీ, అలాంటి వ్యక్తిగాని సత్యంగారికి మళ్లీ తారసపడలేదు. అతనికి నివాళిగా సంవత్స రానికోసారి పేదల ఇంటికి వెళ్లి ఈ రోజు మీ ఇంట్లో భోజనానికి వస్తాను అని అడుగుతాడు.

గురవయ్య మళ్లీ కనిపించలేదనే అసంతృప్తితోనే తన ఎనభైవ ఏట సత్యంగారు చనిపోయారు.

– పి. చంద్రశేఖర అజాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *