2018 తెలుగు చిత్రసీమ విహంగ వీక్షణం

2018 తెలుగు చిత్రసీమ విహంగ వీక్షణం

చూస్తూ చూస్తూ నూతన ఆంగ్ల సంవత్సరాదిలోకి అడుగు పెట్టేశాం. గడిచిన ఏడాదిలో తెలుగు చిత్రసీమలో ఎన్నో వింతలు, ఎన్నో విచిత్రాలు, మరెన్నో వివాదాలు. అగ్రకథానాయకులకు ఈ యేడాది చుక్కలు కనిపించాయి. సరికొత్త కథానాయకులకు విజయాలు దక్కాయి. ఊహించని వివాదాలు కొన్ని చెలరేగగా, ఊహకందని మరణాలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

గడిచిన సంవత్సరంలో దాదాపు 170 స్ట్రయిట్‌ సినిమాలు, 60 వరకూ అనువాద చిత్రాలు తెలుగు వారిని పలకరించాయి. అయితే సీనియర్‌ హీరోలు చిరంజీవి, వెంకటేశ్‌ నటించిన సినిమాలేవీ ఈ యేడాది విడుదల కాలేదు. బాలకృష్ణ ‘జైసింహ’తో ఫర్వాలేదనిపించగా, నాగార్జున నటించిన ‘ఆఫీసర్‌, దేవదాస్‌’ చిత్రాలు పెద్దంతగా మెప్పించలేదు. పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ బాక్సాఫీస్‌ దగ్గర ఘోరప రాజయం పాలు కాగా, మహేశ్‌ నటించిన ‘భరత్‌ అనే నేను’ మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. జూ. ఎన్టీయార్‌ సైతం ‘అరవింద సమేత’తో జయకేతనం ఎగరేశాడు. అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’తో మెప్పించలేకపోయాడు. ఇక రవితేజ, నాని, నితిన్‌, తరుణ్‌, సుమంత్‌, నారా రోహిత్‌, సాయిధరమ్‌ తేజ్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సందీప్‌ కిషన్‌, రాజ్‌ తరుణ్‌, రాహుల్‌ రవీంద్రన్‌ వంటి వారికి చెప్పుకోదగ్గ విజయాలేవీ దక్కలేదు. అయితే ఊహించని విధంగా తెలుగు చలన చిత్రసీమలో ‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ ఈసారి ఏకంగా ఐదు సినిమాలలో నటించాడు. అందులో ‘మహానటి, గీతగోవిందం, టాక్సీవాలా’ విజయం సాధించి, అతన్ని స్టార్‌ హీరోని చేసేశాయి. ‘మహానటి, నోటా’ చిత్రాలతో విజయ్‌ దేవరకొండ కోలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. అలానే ‘తొలిప్రేమ’తో విజయం సాధించిన వరుణ్‌ తేజ్‌, ‘అంతరిక్షం’తో నిరాశపరిచాడు. నాగశౌర్య ఈ యేడాది నాలుగు సినిమాలలో నటించినా ‘ఛలో’ మాత్రమే ఆకట్టుకుంది. ఇక సుధీర్‌బాబు నటించిన ‘సమ్మోహనం’ మంచి విజయాన్ని అందుకుంది, కానీ ఆయన నిర్మించి, నటించిన ‘నన్ను దోచుకొందువటే’ ప్రేక్షకుల మనుసును దోచుకోలేకపోయింది.

కళ్యాణ్‌రామ్‌ ‘ఎం.ఎల్‌.ఎ.’ సినిమా కమర్షి యల్‌గా సక్సెస్‌ సాధించింది. అయితే… ‘నా నువ్వే’ తీవ్ర నిరాశకు గురిచేసింది. నాగచైతన్యకూ ఈ యేడాది సాలిడ్‌ హిట్‌ పడలేదు. నిఖిల్‌, గోపీచంద్‌, రామ్‌, శర్వానంద్‌ వంటి వారు ఒక్కో చిత్రంలోనే నటించారు. వారికీ విజయం ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. ఊహించని విజయాన్ని అందుకున్న మరో వ్యక్తి కార్తికేయ, ‘ఆర్‌.ఎక్స్‌. 100’తో ఓవర్‌ నైట్‌ డిమాండ్‌ ఉన్న హీరోగా మారిపోయాడు. ఇప్పుడు మూడు తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలోనూ కార్తికేయ నటిస్తున్నాడు. అలానే అడివి శేష్‌ సైతం ‘గూఢచారి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. సుశాంత్‌కు ‘చి.ల.సౌ.’ నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ‘భాగమతి’తో అనుష్క, ‘మహానటి’తో కీర్తిసురేశ్‌, ‘రంగస్థలం, మహానటి, యూ టర్న్‌’ చిత్రాలతో సమంత తెలుగు తెరపై తనదైన ముద్రవేశారు. ఈసారి కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, సూర్య, విశాల్‌, విక్రమ్‌, కార్తీ, విజయ్‌… వంటి తమిళ హీరోలు నటించిన సినిమాలు తెలుగులో అనువాదమైనా… ఏదీ సూపర్‌ హిట్‌ను అందుకోలేకపోయింది. రజనీకాంత్‌ ‘2.ఓ’ సైతం పరాజయం పాలైంది.

2018లో తెలుగు చిత్రసీమను వివాదాలు సైతం బాగానే పలకరించాయి. కాస్టింగ్‌ కౌచ్‌, మీ టూ వంటి అంశాలు ఎలక్ట్రానిక్‌ మీడియా కారణంగా అవసరమైన దానికంటే కూడా ఎక్కువ చర్చనీయాంశమయ్యాయి. ఇక మూవీ ఆరిస్ట్‌ అసోసియేషన్‌లోనూ ముసలం మొదలైంది. చాలా కాలం తర్వాత డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌తో వచ్చిన గొడవతో థియేటర్లు వారం పాటు మూత పడ్డాయి. శ్రీరెడ్డి వంటి వారి తీవ్ర నిరసనలతో చలన చిత్రసీమ ఒక్కసారి ఉలిక్కి పడింది. పైరసీ భూతం కూడా కొన్ని సినిమాలను కాటేసింది.

ఇదిలా ఉంటే… చిత్రసీమకు చెందిన పలువురు పెద్దలు కనుమరుగయ్యారు. అందాలతార శ్రీదేవి హఠాన్మరణం ఎందరినో నిశ్చేష్ఠులను చేసింది. నటీనటులు కృష్ణకుమారి, హరికృష్ణ, మాదాల రంగా రావు, గుండు హనుమంతరావు, వైజాగ్‌ ప్రసాద్‌, వినోద్‌ చనిపోయారు. సుప్రసిద్ధ దర్శకులు మృణాల్‌సేన్‌, ఈరంకి శర్మ, దుర్గా నాగేశ్వరరావు, కె.యన్‌.టి. శాస్త్రి, బి. జయ; రచయితలు యద్దన పూడి సులోచనారాణి, బాలాంత్రపు రజనీకాంతరావు, నాయుని కృష్ణమూర్తి, మునిపల్లె రాజు; నిర్మాతలు కె. రాఘవ, డి. శివప్రసాద్‌; గాయని కె.రాణి; కూర్పరి అనిల్‌ మన్నాడ్‌ వంటి వారినీ 2018 కోల్పోయింది. ఇదే సమయంలో ఎంతో కాలంగా చిత్రసీమలో ఉన్న శ్రియా, ‘కలర్స్‌’ స్వాతి, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, సోనమ్‌ కపూర్‌, భావన, నేహాధూపియా వంటి వారు పెళ్లి చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఆ రకంగా చేదు జ్ఞాపకాలతోపాటు తీపి సంఘటన లనూ 2018 తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ వెళ్లిపోయింది.

–  చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *