సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘118’

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘118’

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ మొదటి నుండి కాస్తంత కొత్తదనం ఉన్న కథలను ఎంపిక చేసుకుంటున్నారు. బయటి నిర్మాతలు దానిని రిస్క్‌గా భావిస్తారనిపించి నప్పుడు తానే నిర్మాణ బాధ్యతలను భుజానికెత్తుకుంటున్నాడు. ఈ ప్రయాణంలో ఎదురు దెబ్బలు తగిలిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ప్రయోగాన్ని తన మిత్రుడు కోనేరు మహేశ్‌ సహకారంతో చేశారు కళ్యాణ్‌ రామ్‌. లూసిడ్‌ డ్రీమింగ్‌ నేపథ్యంలో, సినిమాటోగ్రాఫర్‌ కె.వి. గుహన్‌ దర్శకత్వంలో ‘118’ అనే సస్పెన్స్‌, థ్రిల్లర్‌ మూవీలో నటించాడు.

గౌతమ్‌ (కళ్యాణ్‌రామ్‌) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా ఓ ఛానెల్‌లో పనిచేస్తుంటాడు. అతని దృష్టిలో పడిన ఏ అసాధారణమైన విషయాన్ని కూడా వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. దాని చివరి అంచుదాక చూడటం అతని నైజం. హైదరాబాద్‌ శివార్లలోని ఓ రిసార్ట్‌లోని రూమ్‌ నంబర్‌ 118లో గౌతమ్‌ ఉన్నప్పుడు అతనికో కల వస్తుంది. ఓ అమ్మాయిని అదే రూమ్‌లో కొందరు వ్యక్తులు బలంగా కొట్టి గాయపరిచిన దృశ్యాలు అతనికి కలలో కనిపిస్తాయి. ఆ కల ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అయితే ఆ కలలోని వస్తువులు అతనికి ప్రత్యక్షం గానూ కనిపిస్తుంటాయి. ఈలోగా గౌతమ్‌కు తన ప్రియురాలు మేఘ (షాలినీపాండే)తో వివాహం నిశ్చయమవుతుంది. ఆ పనుల్లో బిజీగా ఉంటున్న సమయంలోనే అదే రిసార్ట్‌లో మరోసారి అదే రూమ్‌లో ఉన్నప్పుడు పాత కల తిరిగి వస్తుంది. ఆ కలలో కనిపించిన అమ్మాయి తనకేదో చెప్పాలను కుంటోందని గౌతమ్‌ భావిస్తాడు. డాక్టర్‌ను కలిస్తే ఇది లూసిడ్‌ డ్రీమింగ్‌ అని, పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని చెబుతాడు. అయితే తనకు కలలో వచ్చినట్టుగానే కారు ఓ లోయలోని నీటిలో మునిగిపోయి ఉండటాన్ని గౌతమ్‌ గుర్తిస్తాడు. అతనికి ఉన్న సహజమైన ఉత్సుకతతో పరిశోధన మొదలు పెడతాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రత్యర్థులు గౌతమ్‌పై దాడికి దిగుతారు.

గౌతమ్‌ కలలో కనిపించిన అమ్మాయి ఎవరు? గౌతమ్‌ కలలోకే ఆమె ఎందుకు వచ్చింది? ఆమెపై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? తన కలలో కనిపించిన సంఘటనలను ప్రత్యక్ష సాక్షిలా గౌతమ్‌ ఎలా తిరిగి చూడగలిగాడు? అనేదే మిగతా కథ.

ఛాయాగ్రాహకుడిగా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన కె.వి. గుహన్‌ గతంలో తమిళంలో ‘హ్యాపీడేస్‌’ సినిమా రీమేక్‌కు దర్శకత్వం వహించాడు. కానీ తొలిసారి తానే తయారు చేసుకున్న ఈ కథతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇలాంటి కథలను ఎంపిక చేసుకోవడం, విజయం సాధించడం కాస్తంత కష్టసాధ్యమైనదే. అన్ని వర్గాలను అలరించే అంశాలను ఇందులో ఇమడ్చలేరు. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ మల్టీప్లెక్స్‌ ఆడియెన్స్‌కే నచ్చే ఆస్కారం ఉంది. నటుడిగా కళ్యాణ్‌రామ్‌లో ఓ కొత్త కోణాన్ని ‘118’లో చూడొచ్చు. బాడీ లాంగ్వేజ్‌లోనూ ఈజ్‌ కనిపించింది. అయితే…. అతను పోషించింది ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ పాత్ర అయినా అండర్‌ కాప్‌ ఎక్కువగా కనిపించాడు. షాలినీ పాండే పాత్రోచితంగా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఆధ్య పాత్ర పోషించిన నివేదా థామస్‌ గురించి. ఆ పాత్రకు నివేద సంపూర్ణ న్యాయం చేకూర్చింది. రాజీవ్‌ కనకాల, ప్రభాస్‌ శ్రీను, చమ్మక్‌ చంద్ర, నాజర్‌, హరితేజ ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. ‘మిర్చి’ కిరణ్‌, శ్రీనివాస్‌ రాసిన సంభాషణలు సందర్భోచితంగా ఉన్నాయి. ఈ చిత్రానికి దర్శకుడిగా కంటే కె.వి. గుహన్‌ సినిమాటోగ్రాఫర్‌గానే ఎక్కువ న్యాయం చేకూర్చాడని చెప్పాలి. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, శేఖర్‌ చంద్ర సమకూర్చిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

ప్రధమార్థం ఆసక్తికరంగా సాగిపోయినా… ద్వితీయార్థం కథనంలో పట్టుసడలిపోయింది. ముఖ్యంగా మందులను తయారు చేసే మల్టీనేషనల్‌ కంపెనీలు ప్రయోగాల పేరుతో చేసే అరాచకాలను చాలా సినిమాల్లోనే మనం ఇప్పటికే చూశాం. ఈ సినిమా అదే నేపథ్యంలో ఉండటంతో ప్రేక్షకులలో ఆసక్తి సన్నగిల్లుతుంది. లూసిడ్‌ డ్రీమింగ్‌ అనే పాయింట్‌ మాత్రమే తెలుగు వాళ్లు కాస్తంత కొత్తగా భావిస్తారు. ఏదేమైనా… దర్శక నిర్మాతలు కె.వి. గుహన్‌, మహేశ్‌ కోనేరు ఓ కొత్త కథను తెలుగువారికి అందించాలని చేసిన ప్రయత్నాన్ని అభినందించ వచ్చు. థ్రిల్లర్‌ జానర్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే ఆస్కారం ఉంది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *