కొడుకులు

కొడుకులు

సమయం ఉదయం 9 గంటల 36 నిమిషాలు. మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంగణమంతా ప్రయాణికులతో సందడిగా ఉంది. కాజీపేట్‌ వెళ్ళవలసిన నేను గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు టికెట్‌ తీసుకొని రెండవ నంబరు ప్లాట్‌ఫామ్‌ మీదకు చేరుకున్నాను. రాత్రి వర్షం కురిసినప్పటికీ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఒక చెట్టు నీడన నిలబడి తెలిసిన వారెవరైనా కనిపిస్తారేమోనని అటూ, ఇటూ చూడసాగాను.

అలా ఓ పది నిమిషాల నిరీక్షణ తరువాత రైలు నెమ్మదిగా 2వ నంబరు ప్లాట్‌ఫామ్‌ మీదకు చేరుకుంది. ప్రయాణికులంతా హడావుడిగా బోగీల్లోకి ఎక్కి, కూర్చునేందుకు సీట్లు చూసుకొని మెల్లగా సర్దుకుంటున్నారు.

నేను కూడా ఓ చివరి సీటు చూసుకొని కూర్చు న్నాను. ఒక నిమిషం తర్వాత రైలు కూతపెడుతూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. రెండు నిమిషాల్లో ప్రయాణికుల హడావుడి అంతా తగ్గి పల్లీలు, సమోసాలు అమ్మేవారి సందడి పెరిగింది.

రాత్రి ఇంటి దగ్గర సరిగా నిద్రపట్టకపోయేసరికి అలా తలను వెనక్కి వాల్చి నిద్రాదేవిని ఆహ్వానిస్తు న్నాను. మధ్య మధ్యలో టీ, సమోసాలు అమ్మేవారు బోగీలో అటూ, ఇటూ తిరుగుతున్నారు. వారిని అనుసరిస్తూ ‘రెండు కళ్లు లేని గుడ్డివాడిని నాయనా. ఒక్క రూపాయి దానం చెయ్యండి’ అంటూ ఓ నడి వయసు వ్యక్తి తన చేతిలోని రాతెండి పాత్రలోని చిల్లరతో చప్పుడు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎవరికి తోచినంత వారు ఆ గిన్నెలో వేస్తున్నారు. నేను కూడా నాకు తోచినంత వేసి మళ్లీ కళ్లు మూసుకున్నాను.

రైలు తాళ్లపూసలపల్లి స్టేషన్‌ దాటుతోంది. బోగిలో ఆ చివర నుండి ‘అయ్యా ఎవరూ లేని అనాథలం బాబయ్య. ఇంత సాయం చెయ్యండి’ అంటూ దీనంగా అడుగుతున్న గొంతొకటి లీలగా వినపడింది. ఆ గొంతుక నన్ను సమీపిస్తున్నకొద్దీ నా మనసులో ఏదో చిన్న అలజడితో కూడిన భావన స్పష్టంగా తెలుస్తోంది. మూసిన కళ్లు తెరవకుండానే నా మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్న వేల గొంతుకలతో ఆ స్వరాన్ని సరిపోల్చసాగింది నా మనసు. వెంటనే మూసిన కళ్ళెదురుగా ఓ రూపం లీలగా కదులుతోంది. అవునని నా మస్తిష్కం. కాదని నా మనస్సు. రెండు పరస్పరం ఘర్షించుకుంటుండగా ‘బాబు ఇంత సాయం చెయ్యండి’ అంటూ నా ఎడమ చేతి పిడికిలిని తాకింది ఓ ఆత్మీయ స్పర్శ.

ఎన్‌.ఐ.టి. వరంగల్‌లో న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ కాన్సెప్ట్‌పై పి.హెచ్‌.డి. చేస్తున్న నాకు వర్చువల్‌ టెక్నాలజీలో లాగా నా కళ్ళ ముందు ఆ రూపం ప్రస్ఫుటంగా కనిపించి, కళ్లు తెరిచి చూశాను.

అవును. ఆయనే పళ్ళల ఆగారెడ్డి గారు. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, అక్కడక్కడ చిరిగి, బాగా మాసిపోయిన పంచె, అసలు జీవమే లేని కళ్ళు, బక్క చిక్కిన శరీరంతో జీవచ్ఛవంలా నా ముందు నిలబడి ‘ఇంత సాయం చెయ్యండి బాబు’ అంటూ దీనంగా అడుగుతున్నాడు.

ఒక్కసారిగా లేచి నిలబడి ఏంది ఆగారెడ్డి గారు. మీరేనా ? ఇలా అయిపోయారేంటి ? అంటూ అతని రెండు చేతులని నా చేతుల్లోకి తీసుకున్నాను. అప్పటివరకు డిగ్నిఫైడ్‌గా ఉన్న నన్ను గౌరవ భావంతో చూసిన తోటి ప్రయాణికులంతా నా చర్యను చూసి అసహ్యంతో తలతిప్పి కూర్చున్నారు.

ఇంత కాలానికి తన ఉనికి బయటపడిందన్న బాధను తెలియనీయకుండా నేను ఆగారెడ్డిని కాదు. నా పేరు యాదయ్య అంటూ ముందుకు కదిలాడు. అయినా నేను వదలకుండా లేదు మీరు ఆగారెడ్డి గారే. మీరు అబద్ధం చెప్పినా మీ కళ్ళు నిజాన్ని దాచలేకపోతున్నాయి. ఊళ్ళో నలుగురికి అన్నం పెట్టిన మీరు ఇవాళ నలుగురి ముందు చేయి చాచి అభ్యర్థించడం ఏమిటి ? అమ్మ ఎలా ఉంది. ఎక్కడ ఉందంటూ ఆత్రంగా అడిగాను నేను.

పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నారు ఆగారెడ్డి గారు. ఇంతలో రైలు కేసముద్రం స్టేషన్‌ చేరుకుంది. నా పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికులు ఇద్దరూ నన్ను అదోరకంగా చూసుకుంటూ రైలు దిగి వెళ్ళిపోయారు. ఆ ఖాళీ సీట్లో ఆగారెడ్డి గారిని కూర్చోబెట్టి మంచినీళ్ళ సీసా ఇచ్చి తాగమన్నట్లు సైగ చేశాను. నేనిచ్చిన నీళ్ల సీసా తీసుకుంటూ నన్నింతగా ఎరుక చేసి అడుగుతున్నావు. ఎవరు బాబూ నువ్వు ? అంటూ అడిగారు ఆగారెడ్డి గారు.

నేనయ్యా మీ దగ్గర పనిచేసిన నర్సయ్య కొడుకు రామకష్ణను అన్నాను. చిన్నప్పుడెప్పుడో మేం ఊరొదిలి వెళ్లక ముందు చూసాన్నేనంటూ మీ నాయనెట్లండు. ఎవుసాయం చేస్తుండా ఇంకా ? అని అడిగారు ఆగారెడ్డి గారు.

నాయనకి ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదయ్యా. అందుకే మన ఊరెళ్ళి నాయన్ని చూసొస్తున్నాను. ఇందాక అమ్మ గురించి అడిగితే మీరేమి చెప్పలేదు అన్నాను నేను.

అగో గాడ కూకున్నది అంటూ వెదురు కర్రను అటువైపు చూపిస్తూ చెప్పాడు. వెంటనే లేచి అటు వైపు కదిలాన్నేను. పాత సంచీని దిండుగా చేసుకొని చీరకొంగును దుప్పటిలా కప్పుకొని వణుకుతూ పడుకుందావిడ. మెళ్ళగా లేపి నాతో పాటు తీసుకువచ్చి ఆగారెడ్డి గారి పక్కన కూర్చోబెట్టి, అమ్మకు జ్వరం వచ్చినట్లుందయ్యా అని అడిగాను ఆగారెడ్డి గారిని.

అవునయ్యా. రాత్రంతా వాన పడింది. పడుకోడానికి ఇంత తావు కూడా లేదు. తడుస్తూనే ఉన్నాం. పొద్దటికల్లా ముసలిదానికి చలిజ్వరం వచ్చి వణుకుతోంది. అప్పటికీ నా దగ్గరున్న జ్వరం గోళి ఒకటి వేసి, రెండు ఇడ్లీ ముక్కలు కూడా తినిపించానయ్యా అంటూ చెప్పారు ఆగారెడ్డి గారు.

ఆ దేవుని గుళ్లింత మన్నుపడ. ఎప్పుడు పిలుస్తాడా ? అని ఎదురు చూస్తున్నామయ్యా. ఎప్పటికి దయతలుస్తాడో మా మీద అంటూ కన్నీళ్ళు పెట్టుకొంది అమ్మ.

మన మీద దయలేనిది ఆ దేవుడికి కాదే. మన కొడుకులకి. ఆళ్ళకే గనుక మన మీద దయుంటే మనమిట్టా రైలు బండిలో తిరుగుతూ నలుగురి ముందు చేయి సాపి అడుక్కునే రాతుండేదా ? అంటూ తన బాధను వివరించాడు. రైలు కూడా వీరి బాధను వింటూ ఇంటికన్నె స్టేషన్‌ దాటుతోంది.

నేను ఇంటర్మీడిట్‌లో చేరేటప్పటికే ఆగారెడ్డి గారి కొడుకులిద్దరూ గవర్నమెంట్‌ జాబ్‌లు సంపాదించి, పెళ్ళిళ్ళు కూడా చేసుకొని జీవితంలో స్థిరపడ్డారు.

పదో తరగతి ఫలితాల్లో మా మండలంలోనే ఫస్ట్‌ ర్యాంకు సాధించిన నన్ను మా నాన్న ఆగారెడ్డి గారి పొలంలో పనికి తీసుకెళ్తే, ఏంది నర్సయ్య ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చినోన్ని కాలేజీకి పంపియ్యక, ఇట్టా పనిలోకి తీసుకొస్తావా అంటూ కసిరాడు ఆగారెడ్డి గారు.

రోజూ కూలీ చేసుకుంటేగాని పూట గడవనోళ్ళం. అంతంత ఫీజులు యాడ్నుంచి తీసుకొస్తామయ్యా అన్నాడు మా నాన్న.

సర్లేగానీ. రేపు ఉదయం నీ కొడుకును తీసుకొని ఖమ్మం పోయి మా వోళ్ళ కాలేజీలో చేర్పించు. అన్నీ ఆళ్ళే చూసుకుంటారంటూ నా జీవితానికి ఒక దారి చూపించారు ఆగారెడ్డి గారు.

అలా ఆయన చూపిన దారిలో నడుస్తూ ఎమ్‌సెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించి, ఎం.టెక్‌. పూర్తిచేసి, రెండేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేసి, మళ్లీ చదువుకోవాలనిపించి ఎన్‌.ఐ.టి.లో రీసెర్చ్‌ కొరకు జాయిన్‌ అయ్యాను.

నాటి జ్ఞాపకాలన్నీ సినిమా రీళ్ళలాగా గిరగిరా తిరుగుతున్నాయి.

కొడుకులిద్దరూ గవర్నమెంట్‌ ఉద్యోగస్తులేనాయే. ఇంకా ఎవుసాయం ఏం చేస్తావ్‌ ఆగారెడ్డి అంటూ వాళ్ళు, వీళ్ళు అంటూంటే ఎంతో గర్వంగా ఉందేది గాని, ఊళ్ళో ఉన్నదంతా అమ్మించి, పట్నం తీసుకుపోయి నట్టేట్లో ముంచు తారనుకోలేదయ్యా అంటూ కొడుకులు చేసిన మోసాన్ని ఏకరువు పెట్టారు ఆగారెడ్డి.

అయినా వాళ్లలా చేస్తుంటే మీరు మళ్లీ మనూరొచ్చి ఉండాల్సింది గదా ? అన్నాను నేను.

ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళకొస్తాం బిడ్డా. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం చేయలేం కదయ్యా అంది అమ్మ. నేనెప్పుడు ఊరొచ్చినా నాన్నను మీ గురించి అడిగితే ఆయనకేంది పట్నంలో మారాజులాగ బతుకుతున్నాడు అనేవాడు. కాని మీరిలా అందరూ ఉండి అనాథల్లాగా మిగిలి పోయారు అంటూ ఆలోచనల్లో పడ్డాన్నేను.

నా ఆలోచనలకు బ్రేకులు వేస్తూ, రైలు నెక్కొండ స్టేషన్‌లో ఆగింది. దిగ వలిసిన వారిని దింపి, ఎక్కవలసిన వారిని ఎక్కించుకొని రైలు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది.

అమ్మా ఆకలిగా ఉందా ? ఏమైనా తింటారా ? అని అడిగాన్నేను. మాకిప్పుడేమొద్దు బిడ్డా. బండి వరంగల్‌లో ఆగినంక ఏమైనా తింటాం అంది అమ్మ.

ఆగారెడ్డి గారు శూన్యంలోకి చూస్తూ ఆలోచించసాగారు. ఆ ఆలోచనలకు భంగం కలిగిస్తూ ఈ వయసులో మీకు వద్ధాప్య పింఛను వస్తుంది కదా అని అడిగాన్నేను.

‘నీ కొడుకులిద్దరూ గవర్నమెంట్‌ ఉద్యోగస్తులే. నీకింకా పెన్షనెట్లోస్తుంది’ అంటూ తహసీల్దార్‌ ఆఫీసుకెళ్తే వాళ్లు వెళ్లగొట్టిండ్రు అని తన బాధను వెళ్లగక్కాడు.

ఆ పక్క సీట్లో కూర్చున్న పెద్దావిడ ‘బండెక్కినప్పటి నుంచి సూస్తున్న ఎవలు బిడ్డా ఆళ్ళు. మీ సుట్టపొళ్లా ?’ అంటూ ఆరా తీసింది.

చుట్టపోళ్ళు కాదు కాని, అంతకంటే ఎక్కువే అమ్మా. మా ఊరోళ్ళే. ఊళ్ళో బాగా బతికినోళ్ళు. పరిస్థితులు మారి ఇప్పుడు ఇలా అయ్యారు అని చెప్పాను ఆ పెద్దావిడకు.

ఈ ముసలోడు చెప్తాంటే ఇన్నాడా. కొడుకులు చెప్పింది విని ఊళ్ళో ఉన్నదంతా అమ్మిండు. ఇయ్యాల తల దాచుకోడానికి మూరెడు చెక్క కూడా లేకుండా చేసిండమ్మా అంటూ ఆగారెడ్డి గారు చేసిన నిర్వాకాన్ని పెద్దావిడకు చెప్పింది అమ్మ.

‘కొడుకులు ఇంట్లో కెళ్ళి ఎల్లగొట్టిండ్రా అమ్మా ?’ అని అడిగింది పెద్దావిడ. బదులు చెప్పడానికి నోట మాటరాక అలాగే చూస్తూ కూర్చుంది అమ్మ.

‘వాళ్లకేం పుట్టింది మాయరోగం. పండ్లసొంటి ముసలోళ్ళిద్దరిని ఇంట్లో కెళ్ళి ఎల్లగొట్టడానికి చేతులెట్లోచ్చినయి’ అంటూ శాపనార్థాలు పెట్టసాగింది పెద్దావిడ.

మరోవైపు నా మస్తిష్కంలోని వేల నాడులు ఈ సమస్యకు పరిష్కారమేంటని ఆలోచించసాగాయి. రైలు కూత పెడుతూ వరంగల్‌ స్టేషన్‌ను సమీపిస్తోంది.

‘కన్నోల్లెట్లాగు వదిలేసిండ్రు. ఆళ్ళకి నువ్వే ఏదన్నా దారి చూపించు కొడకా’ అంటూ వచ్చే స్టేషన్‌లో దిగడానికి లేచి నిలబడింది ఆ పెద్దావిడ.

రైలు వరంగల్‌ స్టేషన్‌కు చేరుకొని మూడో నంబరు ప్లాట్‌ఫామ్‌పై ఆగుతోంది. అమ్మా కిందకెళ్లి మీకు టిఫిన్‌ పట్టుకొస్తాను. ఇక్కడే కూర్చోండంటూ రైలు దిగి ప్లాట్‌ఫామ్‌ మీదకు వెళ్ళాను నేను. రెండు ప్లేట్ల ఇడ్లీ పార్శిల్‌ కట్టించుకొని, కదులుతున్న రైలెక్కాను.

తీసుకొచ్చిన టిఫిన్‌ వాళ్ళిద్దరికి ఇస్తూ జేబులోంచి ఫోన్‌ తీసి, నాన్నకు రింగ్‌ చేసి రైలులో జరుగుతున్న విషయం మొత్తాన్ని చెప్పి, నేను తీసుకొన్న నిర్ణయాన్ని కూడా తెలియజేశాను నాన్న సమ్మతి కోసం.

సరే కష్ణ మనకు తోవ చూపి బతుకునిచ్చినోళ్ళకు మనం కూడా చాతనైనంత సాయం చెయ్యాలె. నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యంటూ మార్గనిర్దేశం చేశాడు నాన్న.

నేనిచ్చిన టిఫిన్‌ తింటూ నువ్వెక్కడదాకా పోతున్నవు కొడుకా అంటూ అడిగారు ఆగారెడ్డి గారు. కాజీపేట్‌ వరకు అంటూ బదులిచ్చాను నేను.

ఉద్యోగమేమైనా చేస్తున్నావా అంటూ మళ్ళీ అడిగారు. వచ్చింది కాని, మానేసి మళ్ళీ చదువుకో డానికి ఇక్కడ కాలేజీలో చేరానని చెప్పాను.

రైలు కాజీపేట్‌ స్టేషనుకు దగ్గరవుతోంది. లేచి నిలబడి లగేజీ క్యారియర్‌పై నుంచి బ్యాగ్‌ తీసి సీటు మీద పెట్టాన్నేను.

ఎరుకున్నోలెవరికీ కనబడకుండా ఇన్ని రోజులు గుంజుకొచ్చినం. ఇయ్యాల నువ్వు గుర్తు పట్టి ఇంత సేపు మాకాడనే ఉండి మాకింత సాయం చేసినవ్‌. నువ్వు చల్లగుండు బిడ్డా అని దీవించింది అమ్మ.

రైలు స్టేషనుకు చేరుకొని రెండవ నంబరు ప్లాట్‌ఫామ్‌పై ఆగుతోంది. దిగవలసిన ప్రయాణికు లందరూ తమ తమ లగేజీని సర్దుకొని డోర్‌ వైపు కదులు తున్నారు.

సీటు కిందున్న చేతికర్రను తీసుకుంటూ బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించి అమ్మా, నాయన్ను మంచిగా చూసుకో. మేం ఈ జనగాం దాకా పోయి మళ్ళా ఇటోస్తం అన్నారు ఆగారెడ్డి గారు.

మీరు చేసిన మేలును మర్చిపోయి మిమ్మల్నిలాగే వదిలేసి వెళ్లిపోడానికి కాదు ఇంతసేపు మీతోనే ఉండి మీకు సపర్యలు చేసింది. మిమ్మల్ని కూడా నాతో పాటే తీసుకుపోయి మీకొక ఆశ్రయం కల్పిద్దామని. నాన్నతో కూడా మాట్లాడాను అంటూ మనసులో మాటను చెప్పాను వాళ్ళకు.

ఒద్దు బిడ్డా. కన్నోల్లే కాదనుకొని కాలదన్నిండ్రు. ఇప్పుడు నీతో వచ్చి ఏం చేయగలం మేము అంటూ కన్నీళ్లు పెట్టుకొంది అమ్మ.

మీలాంటి వాళ్లకెందరికో సహదయంతో ఆశ్రయం కల్పిస్తున్న సహదయ ఆనాథ ఆశ్రమంలో చేర్చించి నెల నెల డబ్బులు కూడా పంపించి మీ బాగోగులన్ని ఇక నుంచి నేనే చూసుకుంటాను అని చెప్పాన్నేను. నాకు మీరు చేసిన ఉపకారానికి మీ రుణానుబంధాన్ని నన్నిలా తీర్చుకోనివ్వండి అంటూ ఇద్దరిని కాజీపేట్‌ స్టేషన్లో దించాను.

రైలు మా ముగ్గురికి వీడ్కోలు చెబుతూ స్టేషన్‌ దాటి వెళుతోంది నెమ్మదిగా. ఇద్దరిని మెల్లగా స్టేషన్‌ బయటకు తీసుకువచ్చి అక్కడే నిలబడి ఉన్న ఆటో డైవర్‌ను పిలిచి సహదయ ఆనాథాశ్రమానికొస్తావా అని అడిగాన్నేను. ‘తప్పకుండా సార్‌ అంటూ’ ఆటో స్టార్ట్‌ చేశాడు డ్రైవర్‌. మెల్లగా ఆగారెడ్డిగారిని, అమ్మను ఆటోలో కూర్చోబెట్టి పక్కనే నేను కూడా కూర్చుని ఆటోను పోనిమ్మన్నాను. ఆటో 100 ఫీట్ల రోడోలో సహదయ ఆశ్రమం వైపు సాగిపోతోంది.

– కాలసాని రవికుమార్‌రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *