హాస్యం హద్దులు దాటుతోంది

హాస్యం హద్దులు దాటుతోంది

‘నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అని పెద్దలు చెబుతారు. నవ్వు ఆరోగ్యానికి మంచిది. ప్రేక్షకులకు కామెడీని అందించాలనే ఉద్దేశంతో జీ తెలుగు ఛానల్‌ ‘కామెడీ నైట్స్‌’ అనే కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తోంది. దీనిపై ఓ పరిశీలన.

ఆటాడుకుంటారు

సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో టి.వి., సినీ రంగాల్లోని ప్రముఖులు అథితులుగా రావడం, వాళ్లని ప్రోగ్రాం నిర్వహిస్తున్న వ్యాఖ్యాతలు ప్రశ్నలడగడం, ఏవో చిన్న చిన్న గేమ్స్‌ నిర్వహించడం జరుగుతుంది. కాని ఇందులో మాత్రం యాంకర్లుగా ఉన్న శ్రీముఖి, రవి షోలో పాల్గొనే సెలబ్రిటీలతో ఆడుకుంటామని ముందుగానే చెబుతారు. ఆ ప్రకారంగానే జనవరి 21న ఆ కార్యక్రమంలో పాల్గొన్న నటి నమిత, ఆమె భర్త వీరను, జనవరి 28న అందులో పాల్గొన్న నటి రష్మీ గౌతమ్‌, డాన్స్‌ మాస్టర్‌ శేఖర్‌లను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

ఆ ఆట వినోదాన్ని అందించిన మాట పక్కనపెడితే అది కాస్త హద్దులు దాటి సాగిపోయి కుటుంబ సభ్యులతో కలిసి చూడడానికి తెగ ఇబ్బంది పెట్టేసింది. ముఖ్యంగా జనవరి 28న ప్రసారమైన షో మరీ విచ్చల విడిగా సాగి పోయింది. ఉదా హరణకు రష్మి ఒక ఫోటోకు వ్యాఖ్యానంగా ‘చాలు రవి’ అని కొంత విరామం ఇస్తే ‘ఏం చాలు’ అని వ్యాఖ్యాత అడిగితే ‘జోక్స్‌ చాలు’ అని ఆమె జవాబు చెప్తారు. ‘అంతేనా నేనింకేంటో అనుకున్నా’ అని కొనసాగింపుగా సదరు యాంకర్‌ ఒత్తి పలుకుతాడు.

అంటే వీటన్నిటి కేంద్ర లక్ష్యం మాటల్లో కావల్సినంత అభ్యంతరకర పదాల్ని వాడి అసభ్యకర కామెడీని అందించడం. ఇటువంటి షోల వల్ల నిర్వాహకులకు టి.ఆర్‌.పి. రేట్లు పెరిగినా, అవి సమాజానికి ఏ రీతి సంకేతాలు అందిస్తాయన్నది తలుచుకుంటే బాధకరం. అలాగే ఇంకో చోట లేడి సెలబ్రిటీ పక్కనున్న డాన్స్‌ మాస్టర్‌ను ఉద్దేశించి ‘మేమిలా పక్క పక్కన ఉన్నా నన్ను ఆయన వేలితో కూడా టచ్‌ చేయడు తెలుసా?’ అంటుంది. దానికి ప్రతిగా అక్కడున్న మేల్‌ యాంకర్‌ ‘చెయ్యేం కర్మా !’ అని విపరీత అర్థానిచ్చే వివిధ భంగిమలను చేసి చూపిస్తాడు. తర్వాత కెమెరాను షోలో పాల్గొన్న యువ ప్రేక్షకులు పడి పడి నవ్వడం వైపు తిప్పుతారు. దీని అర్థం టి.వి. చూస్తున్న ప్రజలందరూ ఆ లెవెల్‌లోనే నవ్వుతారనా? లేదా నవ్వులన్న ధీమానా ? అర్థం కాదు. ఒకవేళ వాళ్లనుకున్నట్లే నవ్వినా, అది ఏ రకం ‘కామెడీ’ గా దాన్ని వర్గీకరించవచ్చో ఈ ప్రోగ్రాం సృష్టికర్తలే చెప్పాలి.

డబుల్‌ మీనింగ్‌ కామెంట్స్‌

కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీల ఫోటోలను చూపించి వాటిపై వ్యాఖ్యానాలు చెయ్యమని ప్రేక్షకులను అడుగుతారు. వారు కూడా ప్రోగ్రాం సరళికి తగ్గట్లు ‘ఘాటైన’ వ్యాఖ్యానాలే చేశారు. అయితే తొలి ఎపిసోడ్‌లో నమితకు చెందిన ఓ ఫోటోకు ఓ ప్రేక్షకుడు ఇటీవల ప్రజల నోట్లో బాగా నానుతున్న ‘ఈ నగరానికేమైంది’ అన్న కాప్షన్‌ జోడించి చెప్పడం సరదాగా ఉంది. దానికి కొనసాగింపుగా ఆ ప్రకటనలో ఉన్నట్లు ‘రెండు గాజులు అమ్ముకున్నా’ అంటూ పేరడీగా వ్యాఖ్యాత రవి చెప్పడం అలరించింది. అలాగే వచ్చిన సెలబ్రిటీల గురించి వాయిస్‌ ఇమిటేషన్‌తో నటులు నారాయణమూర్తి, మైఖేల్‌ జాక్సన్‌, ప్రభుదేవా, దర్శకుడు రాంగోపాల్‌ వర్మలతో చెప్పించింది తమాషాగా అని పించింది. కానీ షోలో భాగంగా రష్మికి పెళ్లి యోగం ఎప్పుడో తెలుసుకునేందుకు వచ్చిన పండితుడు ‘పండితుడు’ అన్న పదాన్ని ‘పందితుడు’ అని మాటి మాటికి అనడం, ఆ పాత్ర ద్వారా చేయించిన యాక్షన్‌ ఏమాత్రం బాగోలేదు. అలాగే తొలి భాగంలో నమితకు తెలుగు నేర్పించడానికి వచ్చిన తెలుగు మాష్టారు పాత్రను అగౌరవ రీతిలో చూపించారు.

పిల్లలతో చేయించిన స్కిట్‌ బాగుంది

ఆఖరులో చిన్న రష్మి, చిన్న శేఖర్‌ మాస్టర్‌ అంటూ పిల్లలతో చేయించిన డాన్స్‌ బాగుంది. ముఖ్యంగా డాన్సులో వివిధ వేగవంతమైన భంగిమల్ని ఎంత సులభంగా చేయొచ్చో ఆ చిన్న డాన్సర్‌ బాగా చేసి చూపించాడు.

వాస్తవానికి గతంలో యాంకర్లకు స్వచ్ఛమైన ఉచ్ఛారణ ఉంటే సరిపోయేది. కాని ఇప్పుడు వ్యాఖ్యాతలుగా వ్యవహరించాలకున్న వారికి కేవలం మాటకారితనం ఉంటే సరిపోదు. దాంతోపాటు డాన్స్‌ స్కిల్స్‌ వగైరా తప్పని సరిగా ఉండితీరాలి. అలా నృత్యంలో గణించదగ్గ ప్రవేశం, సమయానికి తగిన సంభాషణా మాడ్యులేషన్‌తో స్పందించగల నేర్పు పుష్కలంగా ఉన్న రవి, శ్రీముఖిలు తమ టాలెంట్‌ను అర్థవంతంగా ఉపయోగిస్తే కార్యక్రమం అందంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న జీ తెలుగు ఛానల్‌ ముందు ముందు అర్థవంతమైన కామెడీని అందించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *